STORYMIRROR

gopal krishna

Comedy Classics Fantasy

4  

gopal krishna

Comedy Classics Fantasy

అదిగదిగో బస్సు

అదిగదిగో బస్సు

7 mins
358


“పట్నం లో బస్సు కొన్నారంట దొరగారు” సంబరంగా చెప్పాడు కొండయ్య. 

“ఎప్పుడూ” అడిగింది నరసమ్మ. 

“నిన్ననే కొన్నారంట, కొత్త బస్సు” ఆ బస్సు తనదే అన్నంత గొప్పగా ఇంటి ఎదురుగా ఉన్న రాయి మీద కూర్చుని చెవి వెనకాల దాచుకున్న చుట్ట ముక్క తీసి వెలిగించాడు. 

“ఏట్రా ,కొండోడా, ఏటి ఇసేశాలు” నాగలి భుజాన వేసుకుని ఎద్దుల్ని పొలం లోంచి తోలుకొస్తున్న రాజారావు తీరిగ్గా కూర్చొన్న కొండయ్యని అడిగాడు. 

“దొరగారు బస్సు కొన్నారట, రాజారావు సిన్నాన్నా”తన్మయత్వం తో పొగ గాలిలోకి వదుల్తూ చెప్పాడు కొండయ్య. 

“ఒరేయ్ కొండగా,సెప్పానని మరోలా అనుకోకురా, నువ్వు వయసులో ఉన్నోడివి, ఇలా దొరగారి ఎనకాల తిరిగి ఏం సాధిస్తావు సెప్పు, ఏదైనా కూలో నాలో సేసుకుంటే నాలుగు రూపాయలు ఎనకాల ఏసుకోవచ్చు. రేపు పిల్లాడో , పిల్లో పుడితే ఆళ్ళని బాగా సూసుకోవాల కదరా” భుజంమీద కాడిని ఇంకో భుజంమీదికి మార్చుకుంటూ చెప్పాడు రాజారావు. 

“అలా సెప్పు మావయ్యా, ఈడికి బుద్దెప్పుడొత్తాదో, పనిలోకి ఎల్లు అంటే కొట్టిపారెత్తాడు” నిష్టూరంగా మొగుడి మొహం లోకి చూసింది నరసమ్మ. 

“సస్, నువ్వూరుకోయే .. ఇప్పుడేటయినాది, దొరగోరు ఉండబట్టే కదే ఇయ్యాల ఇలా నాలుగు ముద్దలు తింతున్నాము” చిరాగ్గా మొహం పెట్టి భార్య వైపు తిరస్కారంగా చూశాడు కొండయ్య. 

    కొండయ్య మొహం చూశాక అనవసరంగా ఇదంతా కదిపాను అనుకుంటూ అక్కడినుండి నెమ్మదిగా ఇంటివైపు మళ్ళాడు రాజారావు. రాజారావు ఒకప్పుడు దొరగారి కొలువే సర్వస్వం అనుకుంటూ కుటుంబాన్ని అశ్రద్ధ చేయడంతో విసుగుపుట్టిన అతని పెళ్ళాం రంగమ్మ కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. చేసేది లేక రాజారావు దొరగారి కొలువు మానుకొని మూడెకరాలు పొలం కౌలుకి తీసుకుని బుద్ధిగా వ్యవసాయం చేస్తూ తన కాపురం చక్కదిద్దుకుంటూ ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్నాడు. 

   రాఘవరెడ్డి దొర ఒక మారుమూల ఊరు కొత్తపల్లి కి జమీందారు లాంటి వాడు. చుట్టుపక్కలా పాతిక పైగా ఊళ్ళల్లో రెండువేల ఎకరాలకు పైగా భూమి ఉన్న అసామీ. స్వతహాగా ధనవంతుడు కావడంతో చిన్నతనం నుండి కష్టం అంటే ఏంటో తెలియకుండానే పట్నవాసం లో చదువుకుంటూ పై చదువులకోసం మద్రాసు లాంటి పట్నాలు తిరిగి వచ్చి, చివరికి ఉరిమీద మక్కువతో, ఆస్తులు కాపాడుకోవడం కోసం తిరిగి కొత్తపల్లి చేరుకున్నాడు. తన పూర్వీకుల్లా కేవలం వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా మునిగిపోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి, వ్యాపారం లో కొంత పెట్టుబడి పెట్టి లాభాల దిశగా వ్యాపారాన్ని పరుగులు పెట్టించాడు. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే కోరిక మనసులో తలెత్తడంతో సమితి ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కొన్నాళ్ళు రాజకీయాలు వెలగబెట్టి, వ్యాపారం మూత పడిపోవడంతో పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఆస్తిని కొంత మేరకు కరిగించాడు. 

    ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తి కరిగించాడు తప్ప ప్రయోజనం లేకపోవడంతో ఊళ్ళో ఆవారాగా తిరిగే కొందర్ని చేరదీసి తన మాటలతో వాళ్ళని తన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు. అప్పుడప్పుడు వాళ్లకోసం చిన్న చిన్న పనులు చేస్తూ తన వ్యవసాయ అవసరాలకు వాళ్ళని వాడుకునేవాడు. ప్రతిఫలంగా వాళ్ళకి తిండికి కావలసిన ఏర్పాట్లు తన ఇంటి దగ్గరే చేసి వాళ్ళ దగ్గర మంచి పేరే సంపాదించాడు. 

    ఒకసారి దొరగారి ఇలాగా లోకి అడుగు పెట్టినవాడు తొందరగా అందులోంచి బయటపడలేడు . వాళ్ళకి కావలసిన రుచికరమైన ఆహారం, మందు లాంటివి పోసి, తనతో సమానంగా వాళ్ళని చూస్తున్నట్లు భ్రమింపచేస్తూ వాళ్ళని పూర్తి గా వాడుకునేవాడు. రాజారావు దొరగారి కొలువు మానేసి ఊళ్ళో షావుకారు పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండడంతో దొరగారికి కుడి భుజం తెగిపడినంత పనైంది. విధి లేని పరిస్థితిలో తన పంచన చేరిన కొండయ్య ని రాజారావు స్థానం లో పెట్టాడు దొరగారు. 

    కొండయ్య తెల్లని పంచె , తెల్లని చొక్కా, తెల్లని ఉత్తరీయం ధరించి ఠీవిగా వీధుల్లో నడుస్తూ తానే దొరగారినైనంత గొప్పగా ఉలలోవాళ్ళముందు మసిలే వాడు. దొరతో ఏ అవసరం పడ్డా కొండయ్య ని ప్రసన్నం చేసుకోవాల్సిందే అనే పరిస్థితికి చేరుకున్నాడు కొండయ్య. దొరగారు బస్సు కొంటె తానే బస్సు కొన్నంత గొప్పగా సంతోషపడ్డాడు కొండయ్య.  

“ఇదిగో రావులు పిన్నమ్మా, దొరగోరు బస్సు కొన్నారు తెలుసా” నెత్తిమీద పెసలు చేను మూటతో వెళ్తున్న రావులమ్మని పలకరించాడు కొండయ్యా. 

“ఏట్రా.. దొరగోరు బస్సు కొన్నారా.. నిజవైన బస్సేనా .. ఓరి .. ఓరి .. ఎంత సక్కని మాట సెప్పావురా కొండన్నా” అంటూ కొండయ్య కేసి సంతోషంగా చూసింది రావులమ్మ. 

క్షణాల్లో దొరగారి బస్సు గురించి ఊరంతా తెలిసిపోయింది. “ఓలమ్మ.. ఓలమ్మా నిజ్జెం బస్సేనట్రా కొండయ్యా” అడిగాడు లింగయ్య. “అవున్రా లింగా.. నిజ్జెం బస్సే” అంటూ లింగయ్య అనుమానం తీర్చాడు కొండయ్య. 

“మరే.. కొండగా .. బస్సేలా వత్తదిరా మనూరు” ఆసక్తిగా చెరువు నుండి నీళ్ళ బిందె నెత్తిమీద పెట్టుకొని ఊళ్ళోకి వస్తున్న పోస్టుమాష్టారి భార్య రాణమ్మఅడిగింది. 

“బస్సు ఎలా ఉంటాదిరా కొండయ్యా” అడిగింది ఊళ్ళో సారా వ్యాపారం చేసుకుంటున్న సూరమ్మ. 

“ఇదిగో సూరమ్మా, ముందే సేప్తన్నా, బస్సొచ్చే ఏళకి నువ్వు దుకాణం కట్టేయాల. మనందరం బస్సు కి ఎల్కమ్ పలకాల అంటే సాగతం పలకాలన్నమాట” చెప్పాడు కొండయ్య. 

“ఓలమ్మ.. మనూరు దొరకోరు ఇంజీను బస్సు కొన్నారట” ఇంట్లోపలకి అడుగు పెట్టకుండానే గావు కేకపెట్టాడు సావిత్రమ్మ కొడుకు వెంకటరమణ. 

వెంకటరమణ ఒక్కడే దొరగారి తర్వాత పెద్ద చదువు చదువుకున్నోడు ఆ ఊళ్ళో. కాలు అవిటి తనం వలన పెద్ద చదువులు చదువుకోలేదు కానీ, తాను కలెక్టర్ కోర్సు చేద్దామనుకున్నాడని ఇంట్లో సాగుబాటు లేక ఏడో తరగతి తప్పడంతో చదువు ఆపేయాల్సి వచ్చిందని గొప్పగా చెప్పుకుంటాడు వెంకటరమణ. 

ఊళ్ళో తనకున్న చిన్న దుకాణాన్ని ఒక పెద్ద దుకాణం లా తీర్చి దిద్ది, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇలాంటి దుకాణం లేదనిపించుకోవాలని వెంకటరమణ ఆశ. పోస్టు కార్డు లు నుండి తాగే మందు వరకు, జ్వరం టాబ్లెట్లు నుండి బలం టానిక్కుల వరకు వెంకట రమణ కొట్లో దొరుకుతుంది.    

   దొరగారి బస్సుకి ఊళ్ళో ఎంత ప్రచారం ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ప్రచారం ఇచ్చాడు కొండయ్య. తన ప్రమేయం లేకుండానే చుట్టు పక్కల ఊళ్ళల్లో కూడా దొరగారి బస్సు కోసం ప్రచారం చేశాడు. బస్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూడడం ఊళ్ళో వాళ్ళ వంతైంది. కారణం ఆ ఊరికి కరెంట్, రోడ్డు లాంటి సదుపాయాలనేవి లేదు. బడి తప్ప చెప్పుకోడానికి ఇంకేమీ సదుపాయాలు లేవు. కనీసం వీధి కుళాయిలు కూడా లేని దీనస్థితి లో ఉంది కొత్తపల్లి. 

 “అయ్యగోరూ, ఊళ్ళోకి బస్సు అడుగెట్టే రోజు ఊరంతా పండగలా అదిరిపోవాల” సంతోషం లో ఏదేదో చెప్తున్నాడు కొండయ్య దొరకాళ్లు నొక్కుతూ. పక్కనే కుర్చీలో కూర్చొని భర్తకి గ్లాస్ లో మందు పోస్తోంది రాఘవరెడ్డి దొర భార్య దేవి. ఆవిడ ఎప్పుడూ ఇల్లు విడిచి బయటికి రావడం ఎవరూ చూడలేదు. కేవలం దొరగారికి బాగా కావలసిన అనుచర గణానికి మాత్రమే అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది ఆవిడ. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు దొరగారి కాళ్ళు నొక్కుతూ కూర్చోడం కొండయ్యకి సరదా . ఒరేయ్ కొండయ్యా మందు తాగుతావేంట్రా అడిగారు దొరగారు. ఆయనకి అలా అడగడం సరదా. 

    తమరి ముందు తాగే ధైర్యం ఈ సుట్టు పక్కల ఎవడికి ఉందయ్యగోరూ” లౌక్యంగా మందు వద్దని చెప్పలేదు. ఒరేయ్ కొండయ్యా ఈ వందా ఉంచుకో అంటూ చొక్కా జేబులోంచి వంద కాగితం తీసి కొండయ్యకి ఇచ్చాడు దొరగారు. 

             *****

    “రేపుదయాన్నే పట్నం నుండి బస్సు వత్తాది, గోల సెయ్యకుండా పడుకో” అంటూ తనని రెండో సారి చుట్టుకుపోతున్న భార్యని విదిలించాడు కొండయ్య. “అదేదో నీఇంట్లో పండగలాగా .. ఓ .. గొప్ప ఇదయిపోతన్నావే” మూతి ముప్పై వంకర్లు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంటూ పక్కకి తిరిగి పడుకుంది నరసమ్మ. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు బస్సుని చూస్తానా అని నిద్రపోకుండా ఆలోచిస్తున్నాడు కొండయ్య. ఎలాగైనా దొరగోరిని బతిమలాడో, బామాలో బస్సులో ఉద్యోగం సంపాదించాల” కొండయ్య కి ఈ ఆలోచన వచ్చేసరికి ఒళ్ళంతా పులకరింపు మొదలైంది. నెమ్మదిగా నరసమ్మ పక్కన చేరాడు. ఒక్కసారి తిరస్కరణకి గురైన నరసమ్మ విదిలించి కొట్టి, పక్కకి తిరిగి పడుకుంది. పాపం కొండయ్య, అంతులేని ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.  

ఊళ్ళో రామాలయం దగ్గర, సత్తెమ్మ తల్లి గుడి దగ్గర, ఇదే చర్చ తెల్లారేసరికి. ఉదయాన్నే చెరువులో బట్టలుతుకుతున్న అప్పన్న ఆ రోజుకి రేవు పని అర్థాంతరంగా కట్టేసి ఇంటిముఖం పట్టాడు. అసలు బస్సు ఎలా ఉంటుందో చూడాలి.. ఇదే ఆలోచన అందరిలో. బళ్ళో మాష్టారు బస్సు బొమ్మలు చూపించి ఇదే బస్సు అంటే.. అంత చిన్న బస్సులో జనాలు ఎలా ఎక్కుతారో పిల్లలకి అర్థమవ్వలేదు. ఆ రోజుకి స్కూల్ మానేసి రామాలయం అరుగుమీద పెద్దవాళ్ల మధ్య అల్లరి చేస్తూ హడావుడిగా ఉన్నారు పిల్లలు. 

ఇంట్లో ఆడవాళ్ళు ఆదరాబాదరాగా అన్నాలు వండేసి గుమ్మాలలో కూర్చొన్నారు. ఊరు ఊరంతా రామాలయం దగ్గర దానికి ఎదురుగా ఒంటరిగా ఉన్నా సత్తెమ్మ తల్లి గుడి దగ్గర గుంపులు గుంపులుగా చేరిపోయారు . అప్పుడే యుద్ధరంగంలోకి దిగినవాడిలా ఒకచేతిలో అరిటాకుల ముక్కలూ , మరో చేతిలో పెద్ద బుట్టలో పుణుకులూ, బజ్జీలు బుట్టలో ఒక మూల చిన్న గిన్నెలో చట్నీ, కారంపొడి వేసుకుని రెడీ ఐపోయాడు వెంకటరమణ. అష్టావధానం చేసేవాడిలా అడిగిన వాళ్ళకి అడిగినన్ని పుణుకులూ, కొందరికి బజ్జీలు అరిటాకు ముక్కల్లో ఇస్తూ, అదే చేత్తో డబ్బులు పుచ్చుకుని బుట్టలో వేసుకుంటూ, మధ్యమధ్య పొగరాయుళ్లకి చుట్టలూ, బీడీ లు అందిస్తూ అక్కడే ఆడుకుంటున్న పిల్లలకి చేగోడీలు, జంతికలు అమ్ముతూ ఒక అరగంటలో బుట్ట ఖాళీ చేశాడు. కుంటుకుంటూ ఇంటికి పరిగెత్తి వాళ్లమ్మ సావిత్రమ్మ వేసిన రెండో వాయ బజ్జీలు, పుణుకులుతో పాటు మిరపకాయ బజ్జీలతో మళ్ళీ ప్రత్యక్షమైపోయాడు. అక్కడంతా తిరణాల లాగా ఉంది. 

అదిగదిగో బస్సు అంటూ ఎవరో అరుస్తూ ఉంటే చెవులు రిక్కించి విని, ఆ వచ్చేస్తోంది అంటూ అందరూ దారికి రెండుపక్కలా నిలబడ్డారు స్వాగతం పలకడానికన్నట్లు. “అవును మన కొండగాడు కనపడడం లేదు, ఎక్కడా వాడు” ఊళ్ళో అందరికంటే పెద్దాయన రామయ్య గారు అడిగారు. కొండగాడు దగ్గరుండి బస్సుని ఊళ్ళోకి తెప్పిస్తానని నిన్న ఉదయమే వెళ్ళిపోయాడు. విషయం తెలియకపోయినా, తెలిసినట్లు చెప్పే చాకలి అప్పన్న చెప్పాడు. 

దూరంగా ఏదో గుర్రు.. గుర్రు మంటూ శబ్ధం వినిపించింది. మళ్ళీ కాసేపు శబ్ధం ఆగిపోయింది. బస్సు వచ్చేస్తోందిరోయ్అంటూ ఎవరో అరిచారు. ఆడా, మగా, మొసలీ ముతకా అందరూ పరుగులు పెడుతూ గుడి దగ్గరకి చెరిపోయారు. వెంకట రమణ సరుకు ఖాళీ ఐపోవడంతో రామాలయం గుమ్మంలో ఒక పక్కన కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటు న్నాడు. తాను తెచ్చిన ఒక చుట్టల కట్ట తప్ప అంత సరుకు అమ్ముడు అయిపోవడం వాడికి చాలా సంతోషంగా ఉంది. 

"అది బస్సు కాదు.. ఇంక పది నిమిషాల్లో దొరగారు బస్సుతో కలిసి వస్తారు" అంటూ కొండయ్య సత్తెమ్మ తల్లి గుడి దగ్గర ప్రకటించేశాడు.

"ఓరినీ.. నిన్నే ఊరెళ్ళావని ఎవరో అన్నార్రా" .. ఇంకోకరెవరో అరిచారు. వాళ్ళ అరుపులు కేకలు కొనసాగుతూనే ఉన్నాయి, మిట్టమధ్యానం దాటిపోతోందనగా సిగ్గుల మొగ్గయిన పెళ్ళికూతురిలా అందంగా అరిటిచెట్లు, పూలదండలు అలంకరించుకుని గుంతలు గుంతలుగా ఉన్న మట్టి రోడ్డు మీద వయ్యారాలు ఒలకబోస్తూ వచ్చి ఆగింది పచ్చని రంగులో మెరిసిపోతున్న దొరగారి స్వంత బస్సు. దాంట్లో నుండి దర్జాగా దిగారు దొరగారు. అతని వెనకాలే ఒకరిద్దరు అనుచరులు. హారతి ఇవ్వడానికి రెడీ చేసిన ఆడవాళ్ళతో హారతి ఇప్పించాడు కొండయ్య. బస్సు డ్రైవరు హారతి అయ్యాకా కిందికి దిగాడు దర్పంగా. 

సన్నగా రివటలాగా గట్టిగా ఊదేస్తే ఎగిరిపోయేలా ఉన్న ఇతగాడు ఇంత పెద్ద బస్సుని ఎలా తీసుకొచ్చాడబ్బా.. అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. అతనిది ఎముక బలం. అది కనపడదు బయటికి అంటూ ఆ డ్రైవరు వెనకాలే నడవసాగారు కొందరు. డ్రైవరు కి షేక్ హ్యాండ్ ఇస్తున్నవారు కొందరు. బస్సు లోపల ఎలా ఉంటుందో చూద్దామనుకున్నవాళ్ళని బస్సు ఎక్కకుండా అడ్డుకుంటున్నాడు క్లీనర్ సత్తి. దొరగారు రామాలయం అరుగుమీద నిలబడ్డారు. అంటే ఏదో చెప్పబోతున్నారు అని అర్థం. 

జనాలంతా కింద నిలబడి వారు చెప్పేది ఆసక్తిగా వినసాగారు. కొత్తపల్లి గ్రామస్తులందరికి నమస్కారం. మన ప్రాంతానికి బస్సు సదుపాయం లేక ఎంతో వెనకబడ్డాం మనందరం. ఇంక ఎవరికీ ఇబ్బంది ఉండకూడదని ఎంతో ఖర్చు అయినప్పటికీ వెనకాడకుండా బస్సు కొని మన గ్రామానికి అంకితం ఇస్తున్నాను. పెరిగిన ఆయిల్ ఖర్చులు, ఇతర ఖర్చులు లెక్కలోకి తీసుకొని మన ఊరి వారికి మాత్రం తక్కువ రేట్ కే టౌన్ కి తీసుకెళ్ళే విధంగా బస్సు ఛార్జీలు ఉంటాయి. కాబట్టి ఇన్కమీద ఏ అవసరం పడినా వెనకాడకుండా బస్సులో వెళ్ళవచ్చు మీరు. అంటూ స్పీచ్ ఇచ్చారు దొరగారు. దొరగారికి జై అంటూ కొండయ్య అరుస్తూ ఉంటే వంత పాడారు మిగిలినవాళ్ళు. 

                        *****

“అయ్యా, తమరు కొన్న బస్సు లో పని సెయ్యాలని శానా ఆశగా ఉందండీ” దొరగారి కాళ్ళు పిసుకుతూ చెప్పాడు కొండయ్య. అలాగేరా కొండయ్యా.. దర్జాగా రెండో కాలు పిసకమన్నట్లు పక్కకి తిరిగి ఆలోచనలో మునిగిపోయారు దొరగారు. కొండయ్య బస్సు ఎక్కి తానే డ్రైవరు అయిపోయి తోలుతున్నట్లు ఊహాలోకంలో విహరించసాగాడు. దొరగారు చిరునవ్వు నవ్వి, పొలం పనులు ఐపోయాక బస్సు మీద పనికి పోదువులే కొండయ్యా, అన్నారు. 

కానీ కొండయ్య ఆలోచన మరోలా ఉంది. “రేపటినుండే డూటీ ఎక్కుతాను దొరగారూ” అంటూ ప్రాధేయపడ్డాడు. దొరగారు చిన్నగా నవ్వేసి “సరే” అన్నారు. “ఇప్పటికీ అసిస్టెంట్ క్లీనర్ గా ఉండు. నెమ్మదిగా పని నేర్చుకున్నాక క్లీనర్ వి అవ్వాల. ఎనకాల డోర్ కాడ నిలబడి జనాల్ని ఎక్కించుకోవాల, జనాలు బస్ దిగాక రైట్ సెప్పాల. లగేజి లు బస్సు మీద ఎయ్యాల”. రూల్స్ అన్నీ చెప్పాడు డ్రైవరు. కొండయ్యకి ఆకాశంలో విమానం ఎక్కినంత ఆనందంగా ఉంది. ముందు డోర్ దగ్గర నిలబడ్డ క్లీనర్ సత్తిగాడు బస్సు రన్నింగ్ లో ఉండగానే దిగడం, ఎక్కడం చేస్తూ ఉంటే.. ఓస్ .. ఇదెంత పని అనుకున్నాడు. బస్సు పక్కూళ్ళో ఆగకుండానే సత్తిగాడిలాగా స్టైల్ గా దిగాలని అనుకున్నాడు. అంతే.. ఏమైందో తెలీదు కానీ మెలకువ వచ్చేసరికి హాస్పిటల్ లో తల కి కట్లుతో ఉన్నాడు. ఎదురుగా నరసమ్మ. 

“నువ్వేటే ఇక్కడున్నావు అని అడుగుదామని అనుకున్నాడు. కానీ నోట్లోంచి మాట సరిగా రాలేదు. ఇంకా నయం తలకి దెబ్బ తగిలి నాలుగు పళ్ళు ఉడిపోవడంతో సరిపోయింది. నాలుక తెగిపోతే మాట పడిపోయేది. డాక్టర్ గారు చెప్పిన మాటలు కొంచెం సేపు అర్థం కాకపోయినా జరిగింది గుర్తు తెచ్చుకుందికి ప్రయత్నించిన కొండగాడికి విషయం అర్థమైంది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కొండగాణ్ణి దొరగారు రమ్మని కబురు చేస్తే , “నేను పొలం కౌలుకు తీసుకుని పని చేసుకుంటాను ఇంక మీ కొలువుకు రాలేను” అని కబురు చేశాడు.


Rate this content
Log in

Similar telugu story from Comedy