gopal krishna

Classics Fantasy Inspirational

4.5  

gopal krishna

Classics Fantasy Inspirational

ఆమె

ఆమె

6 mins
519



   మధ్యాహ్నం ఒంటిగంట అవుతుందేమో టైమ్. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ బస్ ఎప్పుడొస్తుందో? బస్సు ఎక్కితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చేమో. ఎండ మండిపోతోంది. ఎండవేడికి తారు రోడ్ ఉడికిపోతున్నట్లు ఒకటే ఆవిర్లు వస్తున్నాయి. అసలు బస్ ఈ టైమ్ లో ఉందో లేదో. వసంత రమ్మని ఫోన్ చెయ్యడంతో ఈ టైమ్ లో ఒక పూట సెలవు పెట్టుకొని ఏ‌సి రూమ్ లోంచి బస్ కోసం మండు టెండ లో రోడ్డు మీద బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. 

 “అసలే ఎండ మండిపోతోంది. ఏంటో మే నెల రాకుండానే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. దేనికైనా మంచిది, బైక్ మీద కాకుండా బస్ ఎక్కు” అప్పటికి పది సార్లైన చెప్పి ఉంటాడు పార్థు. వాడికి నేనంటే ఎంత ప్రాణమో! నాకోసం తన మంచి ఉద్యోగం వదిలేసి, అక్కౌంట్స్ ఆఫీసర్ గా ఈ కంపెనీలోకి వచ్చాడు. అప్రయత్నంగా తల పక్కకి తిప్పి చూశాను. సన్నగా, తెల్లగా చూడ్డానికి పరవాలేదన్నట్లుంది ఆమె. వయసు ఇంచుమించు నా లాగే ఉంటుందేమో. చీర పమిటను వేళ్ళతో చుట్టలు చూడుతూ విసుగ్గా బస్ కోసం చూస్తోంది. తారు రోడ్డు నల్ల తాచులా మెలికలు తిరుగుతూ కొండ మలుపులో మాయమైంది.

    "కమలాపురం వెళ్లడానికి బస్ ఏమైనా ఉంటుందా"? అప్రయత్నంగా అడిగినట్లుంది. "నాకు తెలియదండీ, నేను ఈ ఏరియా కి కొత్త. కమలాపురం ఎంత దూరముంటుంది ఇక్కడికి"? అడిగాను. ఆమె నావైపుఅదోలా చూస్తూ, సమాధానం చెప్పకుండానే బుర్ర పక్కకి తిప్పుకుంది. బహుశా మనిషికి కొంచెం పొగరేమో, తను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదని నా ప్రశ్నకి జవాబివ్వదేమో అనుకుని పట్టించుకో కుండా కూర్చున్నాను. 

   వేడి గాలి ముఖాన్ని తాకుతుంటే జ్వరం వచ్చినవాడికి లాగా ఉంది నా పరిస్థితి. దూరంగా చెట్టు మీద కాకి దాహనికేమో నోరు తెరిచి అటూ ఇటూ దీనంగా చూస్తోంది. ఆమె మరోసారి నావైపు చూసింది. "నేను రాజంపేట వెళ్ళాలండీ" చెప్పాను. "కమలాపురం వెళ్ళి బస్సు మారండి" చెప్పిందామె. "మీరు సిమెంట్ ఫ్యాక్టరీ లోనేగా చేసేది" అడిగింది. "నేను మీకు తెలుసా?" ఆశ్చర్యంగా చూసాను. తన హ్యాండ్ బాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి, "తాగుతారా?" అంటూ ఇచ్చింది చేతికి. 

  అప్రయత్నంగా అందుకున్నాను. మెత్తగా తగిలాయి వేళ్ళు. జివ్వుమన్నాయి నరాలు. అందమైన వేళ్ళు. గోళ్లు నీట్ గా పోలిష్ తో ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. "మీరేం చేస్తారు?" అడిగాను గొంతు తడుపుకుని. ఆమె బాటిల్ లో కొన్ని నీళ్లు తాగి, బాగ్ లో పెడుతూ, "మీ ఫ్యాక్టరీ లోనే క్వాలిటీ కంట్రోల్ లో చేస్తుంటా. నా పేరు రజని" చెప్పింది. "అవునా, నా పేరు సారధి" చెప్పాను. నా మాట విందో లేదో తెలియదు. "బస్సు వస్తోంది. ఈ బస్సు తప్పిపోతే మళ్ళీ సాయంత్రం వరకూ బస్సు ఉండదు" అని చెప్తూ బస్సు ఆపడానికన్నట్లు ముందుకు కదిలింది. ఆమెను అనుసరించాను మౌనంగా. 

   ఎండ మండిపోతూ ఉండడంతో పెద్దగా జనాలు లేరు బస్సు లో. అన్ని సీట్లలో ఒక్కొక్కరు ఉండడంతో ఒక సీట్లో కూర్చోబోయాను. అప్పటికే ఆమె కండక్టర్ కి "కమలాపురం కి రెండు టికెట్స్" అంటూ డబ్బులిచ్చింది. "సారధిగారూ, నేను ఇచ్చేసా. మళ్ళీ టికెట్ కొనకండి" అందామె. ఈలోగా ఆమె పక్క సీటు ఖాళీకావడంతో "ఇక్కడికి రండి" అంటూ పిలిచింది. నేనేమీ మాట్లాడకుండా ఆమె పక్కన కూర్చున్నా ను. సెంట్ వాసన తో కలిసిపోయిన చెమట వాసన గమ్మత్తుగా ఉంది. "ఏంటండీ అలా చూస్తున్నారు" హఠాత్తుగా అడిగింది. నా చూపులు ఎక్కడున్నాయో తనకి తెలిసి పోయిందని అర్థమైంది.

  చిన్నగా నవ్వేసి "ఏమీ లేదండీ" అన్నాను చూపులు తిప్పుకుంటూ. "మీకు పెళ్లవ్వలేదు కదా ఇంకా"? అడిగింది. "నా గురించి చాలానే తెలుసుకున్నారే" అన్నాను నవ్వుతూ. "మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా"? అడిగింది. నేను ఆమె వైపు చూసాను. "ఏంలేదు, టైం పాస్ కి ఎప్పుడైనా పిలిస్తే వస్తాను". నెమ్మదిగా చెప్పింది. ఆమె చెప్పిన మాటలకి క్షణకాలం మతిపోయినవాడిలా నోరు తెరుచుకొని ఉండిపోయాను. ఆమె చిరునవ్వుతో నా ముఖం లోకి చూసి, "మీరు విన్నది నిజమే. ఎప్పుడైనా అవసరం పడితే పిలవండి" అంది. అప్పటివరకూ ఆమె పట్ల ఉన్న గౌరవం పోయి, ఆమె అంటే చిన్నచూపు ఏర్పడింది.

   "ఒక ఆడది ఇలా అడిగితే ఆమెకు విలువేం ఉంటుంది సారధిగారూ! కానీ అదే ఆడది ఓరచూపులు విసిరి, చిలిపి నవ్వులు నవ్వితే ఆమెకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్". ఆమె మాటలు సూటిగా అర్థమవుతున్నాయి. "ఏంచేయను? అమ్మకి పక్షవాతం. అక్క భర్తనుండి విడిపోయి ఇద్దరు పిల్లల్తో ఇంట్లో ఉంటోంది. తనేమో ఏ పనీ చెయ్యదు. ఈ మధ్య తమ్ముడు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ పోయింది. వాడికి తాగుడుకు, విలాసాలకు డబ్బులు కావాలి. ఈ అవసరాలు తీర్చడానికి అంతో ఇంతో అందం ఇచ్చాడు దేవుడు". "కూలో నాలో చేసుకోవచ్చుగా అని అందామని అనుకున్నా, ఆమె మంచి ఉద్యోగంలోనే ఉందికదా"!అనిపించి ఊరుకున్నాను.

   కొంతసేపు నిశ్శబ్దం. "కమలాపురం బస్టాండ్ వస్తోంది. మీరు వెళ్లాల్సిన బస్సు ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది. నేను వెళ్ళొస్తా. ఎప్పుడు అవసరమైనా కాల్ చేయండి. ఇదిగో నా నంబర్" అంటూ చిన్న కాగితమ్ముక్క ఇచ్చి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. రాజంపేట బస్సు కనిపించినవెంటనే పరుగున వెళ్ళి ఎక్కేసి కూర్చున్నా. రజని విషయం వసంత కి చెప్పాలా?వద్దా?ఆలోచనలో పడ్డాను. ఇప్పటిదాకా ఏమీ దాచుకోలేదు మా మధ్య. అయినా ఎందుకో తనకు చెప్పాలనిపించలేదు. ముందు నెంబర్ మొబైల్ లో ఫీడ్ చేద్దామనిపించినా, ఆ స్లిప్ పర్సు లో దాచేసా.

                ****

  "వసంత ఊరెళ్ళింది. నాలుగురోజులు రాదు", చెప్పింది ఇంటిగలావిడ. "తాను రమ్మంటే వచ్చాను". అన్నాను నీరసంగా. కీస్ తీసుకొని ఉండడం అలవాటే. ఫోన్ చేసాను వసంతకి. "అమ్మకి బాగోలేదు అని ఫోన్ చేసింది. నేను రెండురోజుల్లో వస్తానుగా, ఉండు" అంది. వసంత నాకంటే మూడేళ్ళు పెద్దది. చిన్నప్పటినుండి కలిసి పెరిగాం. ఉద్యోగం కూడా కలిసే చేసాం. కొన్నాళ్ళు. తను జాబ్ మానేసి సొంతంగా ఏదో బిజినెస్ చేసుకుంటోంది. మా దారులు మారినా స్నేహం మారలేదు. ఎప్పుడూ మా మధ్య పరిధులు దాటిన స్నేహం లేదు.

   రజనికి ఫోన్ చేసి పిలిపించుకుంటే అని మనసుకు అనిపించింది. ఛీ... తప్పు పైగా వసంత రూమ్ లో అలా చెయ్యకూడదు అనిపించింది. అక్కడే ఉంటే మనసు తప్పు చేయించొచ్చు అనిపించింది. అలంటి ఏ పనైనా పెళ్లయ్యాకే. అదీ భార్యతో మాత్రమే.గట్టిగా నాకు నేనే చెప్పుకున్నాను. ఇంటికి బయల్దేరాను ఇంటిగలావిడకి చెప్పేసి. మళ్ళీ బస్సు స్టాప్ కి వచ్చాక వేడిగా కాఫీ తాగుతూ అప్రయత్నంగా రజనికి కాల్ చేసాను. "ఏంటి బాస్ రమ్మంటారా. పదిహేను రోజులవు తోందేమో ఇన్ కం పోయింది. ఇంట్లో చాల అవసరాలే కనిపిస్తున్నాయి". ఆమె ఏదో అంటోంది కానీ అవేమీ వినాలనిపించలేదు. కాసేపు ఏవేవో మాట్లాడేశాక తిరిగి వెనక్కి వచ్చేస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసాను. 

   మర్నాడు ఆఫీస్ లోంచి బయటికి వస్తూ ఉంటే ఎదురైంది రజని. ముందురోజు బస్సు లో సంభాషణ విషయం ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాను. అసలేమీ జరగనట్లే పలకరించి, "ఫోన్ చేస్తూ ఉండండి" అని చెప్పి వెళ్ళిపో యింది. ఆమె వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయాను. అప్పటినుండి ఇద్దరిమధ్యా స్నేహసంబంధాలు పెరిగాయి. అప్పుడప్పుడు ఎదురుపడినప్పుడు కాంటీన్ లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మా కబుర్లలో ఎప్పుడూ ఆనాటి మాటలు వచ్చేవికాదు. ఒకరోజు కాఫీ తాగుతూ ఉండగా "పెళ్ళెప్పుడు బాస్" అంటూ అడిగింది. ఆమె నవ్వులో ఒక ఆకర్షణ. ఆమె చూపులో ఆప్యాయత ఇవి తప్ప నేనెప్పుడూ ఆమెను వేరే కోణంలో చూడలేదు.

   ఆమె ప్రశ్నకు నేను చిన్నగా నవ్వేసి ఊరుకున్నా. "పోనీ నన్నుంచుకో బాస్" అంటూ చిలిపిగా నవ్వింది. ఆ చిలిపి నవ్వు వెనక బాధ తో కూడిన బాధ్యతలు నాకు తెలుసు. కొంచెంసేపు కబుర్ల తరువాత "ఒకరాత్రికి ఎంత సంపాదిస్తావు ?" ఎప్పుడూ అడక్కూడదనుకున్న ప్రశ్న అడిగాను. వెంటనే సారీ కూడా చెప్పేశా. ఆమె నవ్వేసి, "నెలకి ఒకటిరెండు రోజులు బయటకి వెళ్తే నా జీతం అంత డబ్బొస్తుంది. అప్పుడప్పుడు డబ్బు సరిపోకపోతే మరుసటినెలకి అప్పు మిగులుతుంది". తలదించుకుని చెప్పింది. సాయంత్రం రూంలో అడుగుపెట్టేసరికి అమ్మ వచ్చి కూర్చుంది. అమ్మని చూసేసరికిచాలా సంతోషంగా అనిపించింది. "హఠాత్తుగా వచ్చేసి ఇబ్బందిపడ్డావేమో, ఫోన్ చెయ్యలేకపోయావా?" అడిగాను అమ్మని. 

   "ఇబ్బందేమీ లేదు నాన్నా, కొంచెం ఆరోగ్యం బాగోలేదు. నువ్వు అక్కడికి వచ్చేకంటే నేనే ఇక్కడికి వస్తే బావుంటుందని వచ్చేసాను" అంది అమ్మ. రాత్రి ఎప్పటిలాగా రజని ఫోన్ చేసింది డిన్నర్ అయ్యిందా అంటూ. అమ్మవచ్చిన విషయం చెప్పాను తనకి. "మీ అమ్మని నాకూ పరిచయం చెయ్యి బాస్" అంది. "సరే అమ్మకి కొంచెం నీరసంగా ఉంటోందిట రేపు చెకప్ అయ్యాక ఎల్లుండి కలుద్దాం" అన్నాను. "నాకు కొంచెం పనులున్నాయి బాస్, ఆదివారం ఉదయం ఎనిమిది అయ్యేసరికి మీ రూమ్ లో ఉంటా" అంటూ ఫోన్ పెట్టేసింది. 

   మర్నాడు హాస్పిటల్ కి బయల్దేరే లోగా అమ్మకి పక్షవాతం వచ్చి ఎడమవైపు కాలు, చెయ్యి పనిచేయలేదు. ఏం చెయ్య డానికి తోచింది కాదు. కళ్ళంట ఆపుకుందామన్నా నీళ్ళు ఆగడంలేదు. ఫోన్ తీసి పార్ధుకి ఫోన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే స్విచాఫ్ వచ్చింది. రజనికి ఫోన్ చేసి విషయం చెప్పి, "హాస్పిటల్ కి రాగలవా"? అని అడిగాను. ఒక అర గంటలో హాస్పిటల్ కి వచ్చింది."నేను వచ్చానుగా కొంచెం స్థిమితంగా ఉండు" అంటూ ఓదార్చింది. 

   హార్ట్ ప్రాబ్లెమ్ వలన ఆఖరి స్టేజి లో ఇలా అవుతుందని డాక్టర్ చెప్పారు. నాతోపాటు రజనికూడా పదిరోజులు ఆఫీస్ కి లీవ్ పెట్టి అమ్మకి సేవలు చేసింది. "ఈవిడని ఇంటికి తీసుకెళ్లండి, ఇంక కొన్ని గంటలే టైం ఉంది"ఉంది, అని డాక్టర్ చెప్తూ ఉంటే కన్నీళ్లు ఆగలేదు నాకు. అమ్మ దీనంగా నావైపు చూస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. నాకేమీ అర్థం కాలేదు. అమ్మ లేచి కూర్చుందామని ప్రయత్నం చేసి, నీరసంగా వెనక్కివాలిపోయింది. "అంతా అయిపోయింది. మనం ఏడిస్తే వీళ్ళు లక్షలు గుంజడానికి ప్రయత్నం చేస్తారు. నేను డిశ్చార్జ్ రాయించి, ఆటో పిలిచాను. మీ అమ్మగారిని సాయం పట్టు బాస్ " అంటూ తొందరపెట్టి, ఎలాగో అమ్మని ఆటోలో చేర్చి, ఇంటికి రావడానికి సాయంచేసింది.  

            *****

   పదకొండు రోజులు రజని పక్కనే ఉండి కార్యక్రమాలను చేయించింది. నావైపు బంధువులు పెద్దగా లేకపోవడంతో ఖర్చులు అన్నీ అదుపుతప్పకుండా చేస్తూ అమ్మ ఋణాన్ని తీర్చుకున్నవాడిని అయ్యాను. "బాస్, నేనెళ్ళివస్తాను. ఇప్పటికే అమ్మా, అక్కా, తమ్ముడూ నేనేమైపోయానో అనుకుంటూ ఫోన్లు చేస్తున్నారు" చెప్పింది. రజని పక్కన ఉండడంతో నాకేమీ కష్టం తెలియలేదు. ఇప్పుడు తాను వెళతానని చెప్పేసరికి ఏమనాలో అర్థంకాలేదు. మౌనంగా లేచి బీరువాలోంచి కొంత డబ్బు తీసి, ఆమె చేతిలో పెట్టాను. 

  "రజనీ, డబ్బిచ్చి నీ సహాయాన్ని, మన స్నేహాన్ని అవమానిస్తున్నానని అనుకోకు. ఏమైనా అవసరాలుంటా యేమో ఇది ఉంచు" అని చేతిలో కొంత డబ్బు పెట్టబోయాను. ఎప్పటిలాగా ఆమె నవ్వేసి, "నేను బెంగళూర్ ఇంటర్వ్యూ కి వెళ్తూ ఉంటే నువ్వు పిలిచావు బాస్. నీ అవసరం కంటే ఇంటర్వ్యూ ఎక్కువ కాదనిపించింది. నువ్వంటే నాకు గౌరవం. నీమీద నమ్మకంతో ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నాను", చేతిలో డబ్బు తిరిగి టేబుల్ మీద పెట్టి, "వెళ్ళొస్తా, ఫోన్ చేస్తూ ఉండు బాస్" అంటూ బయల్దేరింది. ఆమె వెళ్తున్న వైపుకు చూస్తూ ఉండిపోయిన నాకు కర్తవ్యం అర్థమైంది. రజని ని శాశ్వతంగా ఈ ఇంటికి తెచ్చుకోవాలన్న నా ఆలోచన కార్యరూపంలో పెట్టడానికి నిర్ణయించుకున్నాను.


Rate this content
Log in

Similar telugu story from Classics