gopal krishna

Classics Fantasy Others

4.3  

gopal krishna

Classics Fantasy Others

ఓ నాన్న కథ

ఓ నాన్న కథ

10 mins
335


                                   

     "నువ్వెన్నైనా చెప్పు అతణ్ణి మనతో కలిసి ఉండడానికి ఇంకెంతమాత్రం అంగీకరించనుగాక అంగీకరించను . అసలు ఆ మనిషి మొహం చూడ్డానికే నాకు అసహ్యం వేస్తోంది. తక్షణమే ఇల్లొదిలి వెళ్ళిపోతాను" విసురుగా బట్టలు సద్దుకుంటూ అరుస్తోంది రజని. "గట్టిగా మాట్లాడకు. ఆయన వింటే బాధపడతారు" చాల నెమ్మదిగా కూతుర్ని బతిమాలుతోంది సీత.

      "ఛీ... అసలు నువ్వు మనిషివేనా, ఎన్నిసార్లు చెప్పాలి ఆ చీడపురుగుని ఇంట్లో చూస్తుంటే ఒంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్లుంది" తల్లివైపు అసహ్యంగా చూస్తూ సూట్ కేసు మూత పెడుతోంది రజని. అసలు అంత తప్పేం చేసారని నీ దృష్టిలో ఆయన చీడ పురుగైపోయారు. ఎవరో ఏదో అంటే, నిన్ను చిన్నప్పటినుండి భుజాలమీద మోసి, నీకోసం నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ పెద్దమనిషిని ఇంట్లోంచీ ఎందుకు పంపించాలి. ఇన్నాళ్ళూ మనకోసం ఎంతో త్యాగం చేసిన ఆయన్ని నేను విడిచిపెట్టుకోలేను." నెమ్మది స్వరంతో అయినా రజనికి అర్థమయ్యేలాగా చెప్పాలని వాళ్ళమ్మ సీత తాపత్రయపడుతోంది.

    “అసలు అమ్మమ్మ చెప్పకపోతే నాకీ పచ్చి నిజాలు చచ్చినా తెలిసేవి కాదు. ఆ దరిద్రుణ్ణి ఇన్నాళ్లుగా మనతో ఉండనిచ్చినందుకు కళ్ళు పీక్కొని గుడ్డిదానిలా బతకాలనిపిస్తోంది." అరుస్తోంది రజని. “అసలు అంత తప్పు ఏంచేసారని అతణ్ణి నోటికొచ్చిన మాటలు అలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు ఉద్యోగం వచ్చిందికాబట్టి అందరికీ మనం కావాలి . ఒక్కొక్కరూ ఇప్పుడు మనదగ్గరకి చేరడానికి వస్తారు. ఆయన అడ్డుగా వాళ్ళకి కనిపించవచ్చు. కానీ ఒకరోజు ఏంజరిగిందో నువ్వు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం భావ్యంకాదు. పోనీ అదీ విడిచిపెడదాం. అసలు ఈ పెద్దమనిషి మన జీవితంలోకి ఎందుకు వచ్చారో మీ అమ్మమ్మ నీకు చెప్పారా?" తల్లి కంఠంలో తీవ్రత అర్థమవుతోంది రజనికి.

     "ఒక నీచుడి గురించి చెప్పడానికి అతడేమీ చరిత్ర కారుడూ, గొప్పమనిషి కూడా కాదు. నిన్ను, నన్ను మా నాన్న నుండి విడదీసి, మన కుటుంబాన్ని ముక్కలు ముక్కలు అయ్యేలా చేసిన అలాంటి నీచుడు నీకు గొప్పవాడేమో కానీ నా దృష్టిలో మనిషి కూడా కాదు" కూతురు నోట్లోంచి ఒక్కోమాట పదునైన బాణాల్లా దూసుకువస్తుంటే కోపం పట్టలేకపోయింది సీత. చాచి కూతురు చెంప ఛెళ్ళు మనిపించి విసురుగా కళ్ళు తుడుచుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

     “ఒక నీతిమాలిన మనిషికోసం, కన్నకూతుర్ని కొడతావా? మా నాన్న ఉంటే నన్నిలా కొట్టగలిగేదానివా”? కళ్ళల్లో సుడులు తిరుగుతున్న నీటిని, కోపాన్ని అదిమిపెడుతూ వంటగది బయటే నిలబడి గట్టిగా అరిచింది. “అసలు ఆ దరిద్రుడో, నేనో ఎవరో ఒకరు మాత్రమే ఇంట్లో ఉండాలి. అదీ ఈ క్షణమే తేలిపోవాలి. వాణ్ణి గదిలోంచి నువ్వు పిలుచుకొస్తావా ? నేనే వెళ్ళి గదిలోంచి బయటికి ఈడ్చి మెడపట్టుకొని ఇంట్లోంచి బయటికి గెంటెయ్యాలో తేల్చుకో”. అరిచి అరిచి ఆయాసం వచ్చిందేమో గ్లాసుడు మంచి నీళ్ళు తాగింది రజని.

     “సీతా, అమ్మాయి కోపంగా ఉంది. నువ్వు నెమ్మదిగా చెప్పాల్సింది పోయి, చెయ్యి చేసుకోవడం తప్పు కదూ!" అన్నారు అప్పుడే తన గదిలోంచి కిచెన్ దగ్గరకి వచ్చిన మాధవరావు గారు. "ఏమండీ, అది మిమ్మల్ని ఎన్నెన్ని మాటలంటోందో విన్నారా”? భోరున ఏడుస్తూ అతని కాళ్ళని చుట్టేసి, "నన్ను క్షమించండి, నేనిలాంటి దుర్మార్గురాల్ని కన్నానని అనుకోలేదు అంటూ ఏడుస్తోంది సీత. "ఛీ, నిన్ను చూస్తే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది" అంటూ విసురుగా అక్కడినుండి బయటికి వెళ్ళిపోయింది రజని. మాధవరావు గారు చిన్నగా నిట్టూర్చి, “అమ్మా, రజనీ” అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది.

    "ఏమైంది సీతా, అమ్మాయికి ఎందుకంత కోపం వచ్చింది"? అడిగారు ఆయన. “ఉద్యోగం వచ్చిన ఆనందంతో అమ్మమ్మ ఇంటికి వెళ్తానంటే వద్దు అనలేక పంపించి తప్పు చేసానండీ. నన్ను క్షమించండి” అంటూ మాధవరావు గారి కాళ్ళు పట్టుకుంది ఆవిడ . "ఛ , ఇదేంటి సీతా కాళ్ళు పట్టుకోవడం ఏంటి చెప్పు. చిన్నపిల్ల ఏదో తెలియక నాలుగు మాటలంది. దానికోసం అమ్మాయిని అలా కొట్టొచ్చా చెప్పు. ఇప్పుడు ఉద్యోగం కూడా వచ్చింది. ఆత్మగౌరవం ఉండదూ," సీతను పైకి లేపి, అలా కూర్చో అంటూ గ్లాసుడు మంచి నీళ్లిచ్చి, ఏడ్చి ఏడ్చి నీకళ్ళు ఎలా వాచిపోయాయో చూడు, వెళ్ళి ముఖం కడుక్కొని రా" అంటూ ఆమెను బలవంతంగా అక్కడినుండి పంపించి తన గదిలోకి వెళ్ళి కూర్చున్నారు.

    సాయంత్రం ఆరుదాటుతుండగా ఇంటికి వచ్చింది రజని. "ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావమ్మా?" అడిగింది వాళ్ళమ్మ. "ఈఇంట్లో ఉంటే నాకు ఒంటిమీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లున్నాయని చెప్పానుగా. అయినా అంత మంచి నాన్నని వదిలేసి, వీడితో ఉండాలి నీకెలా అనిపించింది?" అడిగింది రజని. "రజనీ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అసలు నీకు ఈ చెత్త అంతా నేర్పించింది ఎవరు? నువ్వు ఎవరికైతే జీవితాంతం ఋణపడి ఉండాలో, ఆ గొప్పమనిషిని నువ్వు అవమానిస్తున్నావని అర్థమవుతోందా? ఎవరి దయతో మనం బతుకుతున్నామో, ఆ గొప్ప మనిషిని నోటికొచ్చినట్లు మాట్లాడి నువ్వు ఘోరమైన పాపం మూటకట్టుకుంటున్నావని అర్థమవుతోందా”? సీత అరుస్తూనే ఉంది.

  "హే, ఊరుకో అమ్మా, నేను అమ్మమ్మని, నాయనమ్మని నాన్నని కలిసి ఎంత మంచిపని చేసానో అర్థమవుతోంది. నా భ్రమలు పూర్తిగా చెల్లాచెదురైపోయి, నిజాలేంటో తెలిసాయి. ఆయన ఎంత మోసగాడో , నిన్ను తన తియ్యని మాటల్లో పడేసి, ఎలా లొంగదీసుకున్నాడో అమ్మమ్మ, నాయనమ్మ చెప్తే కానీ తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లూ ఈ మోసగాడినా నేను నాన్నా అని పిలిచింది. ఛీ... ఛీ... " రజని అరుస్తూ ఉంటే సీత నోరుతెరుచుకొని ఉండిపోయింది. “ఆయన నన్ను లొంగదీసుకున్నారా? ఇదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది. నీకు ఆరోగ్యం బాగోలేదంటే తనకే బాగోలేదన్నంత కంగారు పడి , భుజంమీద మోస్తూ హాస్పిటల్ కి తీసుకెళ్లిన మనిషిని, ఇలాగేనా అర్థం చేసుకున్నావు? నువ్వు అమ్మమ్మ ఇంటికి వెళ్తాను అనిచెప్పి వెళ్ళి , నాకు చెప్పకుండా వాళ్ళని కలిసావా? అసలు అది మోసం కాదా? అసలు నిన్ను వెళ్ళమన్నది ఎవరు”? అడిగింది సీత.

   “ఎవరో వెళ్ళమని ఎందుకు చెప్తారు? అమ్మమ్మ ఇంట్లో ఫొటోల్లో ఉన్న నాన్ననిచూసాను. ఆ ఫోటోలో ఉన్న నువ్వు నాన్నా చాలా బాగున్నారు. అమ్మపక్కన ఉన్న ఆయనెవరని అమ్మమ్మని అడిగాను. అమ్మమ్మ నాన్న గురించి, నీ గురించి, ఇదిగో ఇప్పుడు మనతో ఉంటున్న ఈ మనిషి నిన్నెలా మభ్యపెట్టి లొంగదీసుకున్నాడో, మన కుటుంబాన్ని బంధువులనుండి, చివరకు నీ కన్న తల్లిదండ్రుల నుండి ఎలా విడదీసాడో చెప్పి ఏడ్చింది. అమ్మమ్మ ఏడుస్తూ ఉంటే, నేనే నాన్నని, నానమ్మని, తాతయ్యని కలుస్తానని, వాళ్ళని నిన్ను కలుపుతానని చెప్పాను”.

    “అమ్మమ్మ చెప్పిన అడ్రస్ పట్టుకొని వాళ్ళింటికి వెళ్లాను. నాన్న నన్ను చూసి ఎంత సంతోషపడ్డారో, అచ్చం నీది మా అమ్మ పోలిక అంటూ క్షణం కూడా నన్ను వదిలిపెట్టకుండా మాట్లాడుతూనే ఉన్నారు. నాయనమ్మ కూడా చాలా మంచిది. తాతయ్య ఐతే నువ్వు ఇంటికి వచ్చాక లక్ష్మీకళ వచ్చిందంటే నమ్ము అంటూ ఊరూ వాడా అందర్నీ పిలిచి, మా మనవరాలు, మా సుబ్బు కూతురు అంటూ పరిచయం చేశారు. వాళ్ళందర్నీ పరిచయం చేసుకోడానికి నాకు మూడు రోజులు పట్టింది. అసలు ఇరవై రెండేళ్ళు ఇలా ఎలా బతికేసానో నాకే అర్థం కాలేదు. మనం తక్షణం ఈ బురదలోంచి బయటపడాలి. రేపే మనప్రయాణం" అంది రజని.

    “ఇంక నువ్వు నోరుమూసుకుంటే బావుంటుంది. ఇప్పటికే చాల ఎక్కువ మాట్లాడావు. నీకు అందంగా సుతిమెత్తగా కనిపించే ఆ మనుషుల వెనక ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలున్నాయో, మీ అత్తయ్య అదే ... ఇప్పుడు నువ్వు చెప్తున్న మీ నాన్న కి స్వయానా అక్కగారిని అడిగిచూడు. రేపుదయాన్నే వెళ్ళిరా అడ్రస్ ఇస్తాను. అక్కడినుండే మీ నాన్నకి, మీ నాయనమ్మకు, మీ అమ్మమ్మకి, మీ వాళ్లంటూన్నావు కదా, వాళ్లందరికీ ఫోన్ చేసి, నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్పు. వాళ్ళేం చెప్తారో విని, నీ నిర్ణయం నువ్వు తీసుకో. తల్లీ”! స్థిరంగా చెప్పారు, వాళ్ళమ్మ సీత. “నేను మాట్లాడుతున్న విషయానికి నువ్వు చెప్తున్న విషయానికి ఏమైనా సంబంధం ఉందా”? అడిగింది రజని.

    నువ్వు ఆవిడ ఇంటికి వెళ్తే నీ సందేహాలకి సమాధానం దొరుకుతుంది. రా డిన్నర్ చేద్దాం. ఆయన్ని పిలుచుకుని రా" అన్నారు వాళ్ళమ్మ. "ఎన్నిసార్లు చెప్పాలి ఆ మనిషికి నాకు ఏమీ సంబంధం లేదని. నేను అతని మొహం కూడా చూడదల్చుకోలేదు. అసలు ఇంతజరిగినా ఏమీ జరగనట్లుండే ఆ మనిషిని ఏమనాలో అర్థం కాలేదు నాకు" నిర్లక్ష్యంగా అంది రజని. వాళ్ళమ్మ మౌనంగా రజనికి భోజనం వడ్డించి కిచెన్ లోంచి బయటికి వచ్చారు. "నువ్వూ రా.. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం" అడిగింది రజని. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిను" అన్నారు ఆమె. "నేను ఆయన్ని అన్నానని నువ్వు భోజనం మానేస్తావా? ఆయనేమైనా నీకోసం త్యాగం చేసాడనుకున్నావా? అయినా నాకెందుకు" అంటూ భోజనం చేసింది రజని. కూతురి వైపు తిరస్కారంగా చూస్తూ తన గదిలోకి వెళ్లి పడుకున్నారు ఆవిడ.

                  *****

    ఎప్పటిలాగా ఉదయం 5 గంటలకు నిద్రలేచింది సీత. ఎప్పటిలా మాధవరావు గారి గదిలోకి వెళ్ళి నిద్రలేపాలని అనుకుంది. బెడ్ ఖాళీగా కనిపించేసరికి ఆవిడకి ఏదో కీడు శంకించింది. తలగడ మీద కనిపించేలా ఒక ఉత్తరం ఉంది. ఆమెకు ఏంజరిగిందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వణుకుతున్న వేళ్ళతో ఉత్తరం తెరిచి చూసింది.

"సీతా,

    రజని తెలివైనది, మనల్ని అర్థం చేసుకుందని అనుకున్నాను. కానీ కొన్నిసార్లు విధి మనల్ని వెక్కిరిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో అదే జరిగింది. అయినా ఇందులో అమ్మాయి తప్పు ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. కానీ నిజాలేమిటో ఆమెకు ఒకవైపు కోణంలో మాత్రమే తెలుసు. ఇప్పుడు తనని కన్నతండ్రి ఆమెకు గొప్పగా కనిపిస్తూ, తన కుటుంబంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను తప్పు పట్టలేను. ఒక అవకాశవాది తనకు అందివచ్చే ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడానికి ఇష్టపడడు. అతనూ అంతే. ఇప్పుడు మీకు నా అవసరం లేదనిపించింది. ఎందుకంటే, అమ్మాయి ప్రయోజకురాలైంది. తన కాళ్ళమీద తాను నిలబడి నిన్ను పోషించగలదని నాకు అర్థమైంది. ఈ పరిస్థితిలో మీ ఇద్దరిమధ్యా గొడవలు సృష్టించడం నాకు నచ్చలేదు. సీతా, నీ నుండి దూరంగా వెళ్తున్నా, నీ ఆలోచనలు ఎప్పుడూ నా మనసులో పదిలంగా ఉంటాయి. నీకు ఎప్పుడు ఏ అవసరం పడినా నేనున్నాను. సరేనా, అమ్మాయితో కలిసి సంతోషంగా మిగిలిన జీవితాన్ని గడుపు. మనం ఏమిటో మనిద్దరికీ తెలుసు. లోకం మనల్ని ఏమనుకుంటుందో అనే కోణం లో నేనెప్పుడూ ఆలోచించలేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త.ఉంటాను - మాధవరావు"

     చదవడం పూర్తిచేసిన సీత అక్కడే కూలబడిపోయింది. ఇలాంటి రోజు జీవితంలో రాకూడదని తాను ఎంతగా ప్రయత్నించిందో ఇప్పుడు అదే పరిస్థితి తనకు ఎదురైంది. "అమ్మా, అత్తయ్య ఎడ్రస్ ఇస్తానన్నావు కదా! నేను రెడీ అయిపోయా. అడ్రస్ ఇవ్వు అంటూ గదిలోకి వచ్చిన రజని, తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైందన్నట్లు కళ్ళతోనే అడిగింది. మాధవరావు గారు రాసిన కాగితాన్ని కూతురుచేతిలో పెట్టింది సీత. "హమ్మయ్య, మొత్తానికి ఈ ఇంటికి పట్టిన పీడా విరగడైందన్నమాట" కాగితాన్ని ఉండగా చేసి ఒక మూలకి విసిరేసింది.

   నువ్వు నా కళ్ళముందు కనిపించకు, ఇదిగో ఈ అడ్రస్ పట్టుకొని మీ అత్తయ్య ఇంటికి వెళ్ళి నీకు తెలిసిన నిజాలేంటో ఆవిడకి చెప్పు, ఆవిడ ఏం చెప్తారో విను. ఇంకోమాట నీకు ఈ ఇంట్లో స్థానం ఉందేమో కానీ నా మనసులో లేదు. వెళ్ళిపో ఇక్కడి నుండి" అంటూ ఆవిడ ఏడుస్తూ అక్కడే కూర్చుంది. అప్పటికప్పుడు దొరికిన బస్సు పట్టుకొని రజని అత్తయ్య ఇంటికి బయల్దేరింది.

   రంగాపురం కృష్ణ ఒడ్డున చిన్న అందమైన పల్లెటూరు. కృష్ణా నదీ డెల్టాలో సారవంతమైన ప్రాంతం అది. ఊళ్లోకి అడుగుపెట్టిన రజని ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండానే అత్తయ్య ఇల్లు తెలుసుకొని ఇంట్లో అడుగుపెట్టింది. ఆమెను చూసి ఒక్కసారి షాక్ అయ్యింది. అత్తయ్యలాగా తాను ఉండడంతో అయోమయంగా బుర్రగోక్కుంది. “ఎవరమ్మా నువ్వు" అన్న మాటలకి ఈలోకంలోకి వచ్చిపడిన రజని, “నేను....నేను.... నేను.. సీత కూతుర్ని" అంది పొడిగా. ఓరి....ఓరి.... నువ్వు మా సీతమ్మ కూతురివా, నీకెవరు చెప్పారు మా అడ్రస్" అడిగింది రజని మేనత్త రాజ్యం. మా అమ్మ మీ అడ్రస్ ఇచ్చిందండీ" అంది రజని. అండీ అని మర్యాద అక్కర్లేదు. నన్ను అత్తయ్య అని పిలవచ్చు అంటూ రజనీని దగ్గరగాతీసుకుని నుదిటిమీద ముద్దు పెట్టుకొని , ఒక రూమ్ చూపించి "బట్టలు మార్చుకునిరా. లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. మీ మావయ్య నిన్ను చూసి ఎంత ముచ్చటపడతారో" నవ్వుతూ చెప్పింది రాజ్యం.

   లంచ్ అయ్యాకా ఇంట్లో జరిగిన విషయాలు చెప్పింది రజని. ఇంటికి వచ్చిన భర్త సుందరరావు కి రజనిని పరిచయం చేసింది. నువ్వు మా సీతమ్మ కూతురివా. అచ్చం నీది మేనత్త పోలిక అంటూ ఆయన రజనికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. "అత్తయ్యా, ఆ మాధవరావు పేరు తలుచుకుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అయినా అమ్మకి ఇదేం బుద్ధి. చక్కగా నాన్నతో ఉండకుండా, ఎవరో దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఆయన కోసం తాను కష్టపడడం ఏంటి? లక్షణంగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోవలసిన పెద్దమనిషి, అందర్నీ వదిలి మా అమ్మని అంటిపెట్టుకొని బతికేస్తున్నాడు చూడు, ఒళ్ళు మండిపోతోంది. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని చాల మంచిపనే చేసానేమో" అంది రజని.

    “అయిపోయిందా నీ ఉపన్యాసం. అసలు నీకు మా అమ్మా నాన్నలని, మా తమ్ముడు ని అదే మీ నాన్నని కలుసుకోమని ఎవరు చెప్పారు”? అడిగింది రాజ్యం. ఎప్పటిలాగే వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళదామని అనుకుంటూ ఉండగా జాబ్ రావడంతో కొంచెం ఆలస్యంగా వెళ్లాను. అమ్మమ్మ, పిన్ని నాకో నాన్న ఉన్నారని, వాళ్ళదొక అందమైన కుటుంబమని చెప్పడంతో నేనే అడిగాను, వాళ్ళని కలుసుకుంటానని. నాన్న ఎప్పటినుండో మా కోసం కలవరిస్తూ మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోకుండా ఎదురుచూస్తున్నారని తెలిసింది. అమ్మని నాన్నని ఎలాగైనా కలపాలని అనుకుని అక్కడికి వెళ్లాను. వాళ్ళని , నాన్నని చూసాక అర్థమైంది, అమ్మ చాల పొరపాటు చేసిందని" చెప్పింది రజని.

     "పొరపాటు చేసింది మీ అమ్మే. నీలాంటి కూతురుని కనీ పాపం చేసింది. ఏం తెలుసని నువ్వు మీ అమ్మని, ఆ పెద్దమనిషి మాధవరావు గారిని తప్పుపట్టావు. నువ్వు పుట్టి, పసిగుడ్డుగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా నాన్నా అని ఇప్పుడు పిలుస్తున్నావే .. వాడు ఆడపిల్ల పుట్టిందని మీ అమ్మని చూడ్డానికే రాలేదు. రోజుల వయసున్న నీలో పోలికలు వెతుక్కున్నారు. నువ్వు తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవేనా అనే అనుమానంతో టెస్టులు కూడా చేయించడానికి సిద్ధపడ్డాడు మీ నాన్న. అది తప్పని నేను, మీ మామయ్య గట్టిగా వాదించడంతో మా ఆయనకి, దేవతలాంటి మీ అమ్మతో అక్రమసంబంధం అంటగట్టారు. మాకే వాళ్ళమీద అసహ్యం వేసి ఇంట్లోంచి బయటికొచ్చేసాం. దాంతో అందరం కలిసి ఉన్న ఆ ఫామిలీ లో కలతలు మొదలయ్యాయి" .

    "మీ అమ్మని ఒకరాత్రి మీ అమ్మని నిన్ను ఇంట్లోంచి గెంటేసాడు. వర్షం పడుతుంటే మీ అమ్మకి ఎటుపోవాలో తెలియని పరిస్థితి. ఒంటరిగా రామాలయం అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే ఊళ్ళోకి కొత్తగా వచ్చిన మాధవరావు గారు తన ఇంటికి తీసుకెళ్లారు. తెల్లారేసరికి ఊరంతా పుకారు లేవదీశాడు మీ నాన్న. మీ అమ్మ ఒళ్ళు కొవ్వెక్కి మాధవరావు గారితో అక్రమసంబంధం పెట్టుకుందని, తన కుటుంబాన్నిబజార్లో పడేసాడని తనబ్రతుకు నాశనం అయ్యిందని , తమ పరువు పోయిందని ఊళ్ళో పంచాయతీ పెట్టించాడు".

    "జరిగిన దాంట్లో తన తప్పులేకపోయినా మాధవరావు గారు పల్లెత్తు మాట అనకుండా మీ అమ్మ బరువుబాధ్యతలు తన భుజాలమీద వేసుకున్నారు. విషయం తెలుసుకొని మేము అక్కడికి చేరుకునేసరికి మీ నాన్నా, మా అమ్మా నాన్నలు మా వల్ల ఇదంతా జరిగిందని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. కాలం ఎవరికోసం ఆగదు రజనీ. నీకు మూడేళ్లు వచ్చేసరికి ఏదో పెద్ద జబ్బు చేసి హాస్పిటల్ లో ఉంచారు. నిన్ను బతికించడం కోసం తనకి ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మేసి వైద్యం చేయించారు. తన రెక్కల కష్టంతో నిన్ను, మీ అమ్మని పోషించారు. మీ అమ్మని చదివించి ప్రయోజకురాల్ని చేశారు. ఎప్పుడూ ప్రతిఫలం ఏమీ ఆశించలేదు ఆయన. మీ అమ్మని పెళ్లిచేసుకోమని నేనూ మీ మమయ్యా ఆయనకు ఎన్నోసార్లు చెప్పాము. మీ అమ్మకి విడాకులు ఇప్పించి మేమే పెళ్ళిచేస్తామని చెప్పాము. దానివలన మీ అమ్మమ్మ తాతయ్య మా మీద విరుచుకుపడ్డారు. మీ నాన్న, మీ నాయనమ్మా, తాతయ్యలు మాతో సంబంధాన్ని తెంచుకున్నారు. అప్పటినుండి మేము వాళ్ళ మొహం చూసింది లేదు".

   "తను కష్టపడి కొనుక్కున్న ఇంటిని, ఆడపిల్ల ఉందనీ, ఎప్పుడైనా కష్టమొస్తే ఆసరాగా ఉంటుందని మీ అమ్మపేరు మీద ఎప్పుడో రాశారు ఆయన. తనకంటూ ఏమీ మిగుల్చుకోని గొప్పమనిషి. చివరకి తను తింటున్న భోజనానికి కూడా డబ్బులు ఇస్తారు ఆయన. అసలు మీ నాన్న నిజస్వరూపం ఏంటో నీకు తెలియదు. వ్యాపారం పేరు చెప్పి అందరి దగ్గరా అప్పులు చేసి, ఊరోదిలి పారిపోయాడు. మీ అమ్మ తన ఒంటిమీదున్న బంగారాన్ని అమ్మి, అప్పులు తీర్చింది. తనకి ఉద్యోగం దొరుకుతుందని అర్జెంట్ గా అయిదులక్షలు కావాలని మీ అమ్మని పుట్టింటికి పంపేస్తే పెద్దగొడవలయ్యాయి. ఎవరికీ తెలీకుండా తన భూమిని బ్యాంక్ లో తాకట్టుపెట్టి డబ్బు తెచ్చింది మీ అమ్మ. ఆ డబ్బు మొత్తం నాశనం చేశాడు".

   "అదేంటని అడిగిన పాపానికి నిన్ను మీ అమ్మని ఇంట్లోంచి గెంటేస్తే నువ్వు తిడుతున్న ఆ పెద్దమనిషి మాధవ రావు గారు మిమ్మల్ని చేరదీసి మీ అమ్మని, నిన్ను ప్రయోజకురాల్ని చేశారు. ఇన్నేళ్ల నీ వయసులో నీకు కష్టం తెలియకుండా పెంచారు. ఎప్పుడూ నిన్ను పల్లెత్తు మాట అనని ఆ పెద్దమనిషిని నానా మాటలు అంటున్నావు. అమ్మకోసం బెంగపెట్టుకొని పెళ్ళే చేసుకోలేదని నువ్వు మీ నాన్నని మెచ్చుకుంటున్నావే, ఆయనకి అడుగు కమల పిన్ని ఎలా ఉందని” అత్తయ్య చెప్తూ ఉంటే రజని కి నోటమాట రాలేదు. మౌనంగా ఫోన్ అందుకుని తండ్రికి ఫోన్ చేసింది.

     “నాన్నా, నేనొక విషయం అడగనా!” అంది. స్పీకర్ ఆన్ చేసి అత్తయ్య పక్కనే కూర్చుంది. “నాన్నా, మీరు నన్ను అమ్మని ఇంట్లోంచి ఎందుకు గెంటేశారో చెప్పండి” అడిగింది. అవతలివైపు నుండి కాసేపు నిశ్శబ్ధం. పోనీ అమ్మ ఒంటిమీద నగలు ఉండేవిట కదా, అవన్నీ ఏమయ్యాయి నాన్నా!” అడిగింది రజని. నువ్వు చిన్నపిల్లవి ఇవన్నీ చెప్పినా అర్థం కాదులే నాన్నా” అవతలినుండి ఏదో చెప్తున్నారు. నాన్నా, అన్నీ అత్తయ్యని అడిగి తెలుసుకున్నాను. కమల పిన్ని ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ పట్ల మీరు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అత్తయ్య చెప్పింది. పోనీ అత్తయ్యావాళ్లెందుకుమీకు దూరంగా ఉన్నారో చెప్పండి అడిగింది రజని.

    “చూడమ్మా, ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు.. వాళ్ళంతా స్వార్థపరులు. ఇలా అవసరం లేని మాటలు చెప్పి, కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకుంది తను” ఇంకా ఏదో చెప్పబోయాడు అతను. “ఒరేయ్, సుబ్బు, ఇన్నాళ్ళైనా నీలో మార్పు రాలేదంటే నిజంగా బాధగా ఉందిరా. నీ అంత స్వార్థపరుడు ఈ భూమ్మీద ఉండడు. ఇప్పుడు నీ కూతురికి ఉద్యోగం వచ్చిందని, కూతుర్ని తీసుకెళ్ళాలని మంచిగా మాట్లాడావు. ఈ ప్రేమ అప్పట్లోనే దానిమీద ఎందుకు చూపించలేదురా? పాపం ఆ పిచ్చిది నువ్వు చెప్పిన మాటలు నిజమని అనుకుంది ఛీ.. ఇంకెప్పటికీ మారవా నువ్వు” అంటూ గట్టిగా అడిగింది రాజ్యం.

    “అమ్మా, రజనీ మీ అమ్మ సీతమ్మ నిజంగా దేవత తల్లీ. ఎన్నెన్ని కష్టాలు పడి నిన్ను ఈ స్థితికి తెచ్చిందో ఎంత చెప్పినా తక్కువే. మాధవరావు గారు పెళ్ళి చేసుకోవలసిన వయసులో, మీ అమ్మని నిన్ను తన బాధ్యత అనుకోని ఇద్దర్నీ కన్నబిడ్డల్లా పెంచారు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే మీ అమ్మా, నువ్వూ ఎలా ఉండేవారో! ఆయన ఇల్లు ఒక్కటే కాదమ్మా, మీ క్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నువ్వెంత తప్పు చేసావో తలుచుకుంటే నీ మీద కోపం వస్తోంది. చేతనైతే ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు” చెప్పారు సుందరరావు.

     నన్ను క్షమించండి అత్తయ్యా, కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పుడే నాకు. నేనెంత తప్పు చేశానో ఇప్పుడే అర్థమైంది. మాధవరావు గారు ఇల్లొదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు”, కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది రజని. బహుశా మీ ఉరికి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఆయన ఉన్నారేమో. అక్కడే ప్రతి వారం ఆయన పెద్దవాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. మేమూ వస్తాం, రేపుదయం వెళ్ళి మనం వెతుకుదాం. అదృష్టం బాగుంటే కనిపించవచ్చు అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. మర్నాడు ఉదయం ముగ్గురు కలిసి నేరుగా వృద్ధాశ్రమం కి చేరుకున్నారు. మాధవరావుగారు అక్కడే ఉన్నారని తెలుసుకొని, పరుగు పరుగున ఆయన గదికి వెళ్లింది రజని. “నాన్నా నన్ను క్షమించండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకుంది”, “ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అడిగారు ఆయన. “నా కళ్ళకి కమ్మిన మబ్బు పొరలు తొలగిపోయాయి నాన్నా. ఈ క్షణం నుండీ మీరే నాకు అన్నీ. మిమ్మల్ని అమ్మని కలిసి చూడాలనేదే నా కోరిక. ఇప్పుడు నా కోరిక కాదనకండి. మీరు అమ్మని పెళ్ళి చేసుకోవాలి. నాకూ ఒక నాన్న ఉన్నారని ధైర్యంగా అందరికీ చెప్పుకోవాలి”, వెక్కి వెక్కి ఏడుస్తోంది రజని. పిచ్చిపిల్లా, నాకు నువ్వు కూతురితో సమానం. నువ్వు అమ్మ మీద అరుస్తూ ఉంటే నీ అమాయకత్వానికి జాలిపడాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు” అన్నారు మాధవరావు గారు.

      అన్నయ్యగారూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు సీతని పెళ్ళి చేసుకొని ఆమెకు ఒక జీవితాన్ని ఇవ్వండి. ఇప్పటికైనా మా మాటని గౌరవించండి” అంది రాజ్యం. ఇప్పటికైనా నాన్నని అర్థం చేసుకున్నావు రజనీ. అమ్మా, నన్నలని కలపవలసింది నువ్వే” నవ్వుతూ చెప్పారు సుందరరావు గారు. నాన్నా, మనం ఇంటికి వెళ్దాం పదండి అంటూ, ఆయన చేతిని పట్టుకొని ఆశ్రమం నుండి బయటకి నడిచింది రజని. (ఒక నిజసంఘటన ఆధారంగా)


Rate this content
Log in

Similar telugu story from Classics