STORYMIRROR

gopal krishna

Horror Romance Others

4  

gopal krishna

Horror Romance Others

కట్టమూరు జంక్షన్

కట్టమూరు జంక్షన్

8 mins
64

      సాయంత్రం అయిదు దాటి పది నిమిషాలవుతోంది. కట్టమూరు జంక్షన్ లో నిలబడ్డ రాజశేఖర్ అసహనంగా మాటిమాటికీ చేతి వాచీ వైపు చూసుకుంటున్నాడు. డ్యూటి పూర్తయ్యిందేమో, రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి, అలా జాలీ గా కాసేపు కాకినాడ రోడ్లన్నీ చుట్టేసి, తన బడ్జెట్ కి సరిపోయే ఏ భీమాస్ లోనో సీతామహాలక్ష్మి తో డిన్నర్ తినేసి రాత్రి జామ్,జామ్ అంటూ రూంలో ఆమెతో గడిపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇప్పుడేమో బస్ రావడం లేదు.అప్పటికీ పర్మిషన్ తీసుకొని గంట ముందే ఫ్యాక్టరీ లోంచి బయటపడ్డాడు. అయినా బస్ రావడం లేదు అనుకుంటూ జంక్షన్ లోనే ఉన్న గుడి ఆవరణలో ఉన్న రాతి బెంచీ మీద కూర్చొని కాసేపు, నిలబడి కాసేపు అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాడు. దిక్కుమాలిన రోడ్డు బాగోలేకపోవడం వలన ఆటో వాళ్ళు కూడా నాలుగో మనిషిని ఎక్కించుకోకుండా, ముగ్గురితోనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జగ్గంపేట వైపు నుండి వచ్చేఆటోలే దిక్కు.

     దూరంగా ఆకాశంలో డబడబ మంటూ శబ్ధం వినిపించేసరికి ఉలిక్కిపడి తలెత్తి పైకి చూశాడు. ఎండ ఎప్పుడు మాయమైందో తెలీదు కానీ, తూర్పు వైపునుండి దట్టమైన నల్లని మేఘాలు, రధానికి కట్టిన గుర్రాల్లాగా పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా అక్కడ వాతావరణం చల్లబడిపోయింది. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతూ, దెయ్యం పట్టిన మనుషుల్లా ఊగుతున్నాయి. గాలి తీవ్రత కూడా క్రమంగా పెరిగిపోతోంది . దూరం నుండి గాలికి లేచిన ధూళి తనవైపే రావడం చూశాడు రాజశేఖరం. ఏంటో మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎదురవుతాయి, ఒక బస్ వస్తే బావుణ్ణు కదా అనుకుంటూ మళ్ళీ రోడ్డు వైపుకు దృష్టి మరల్చాడు. బోయ్ మంటూ హార్న్ కొట్టుకుంటూ, తాగినవాడిలా రోడ్డు మీద అటూ ఇటూ ఊగుతూ, జోగుతూ వస్తోంది ఆర్టీసీ వాళ్ళ డబ్బా బస్సు. హమ్మయ్యా.... ఆలస్యం కాకుండా వెళ్లిపోవచ్చు అనుకుంటూ చేతిని అడ్డుపెట్టాడు. బస్సు ఆపమన్నట్లు. అప్పటికే నిండు గర్భిణీ లాగా ఉన్న బస్సు తనని పట్టించుకోకుండా తాగిన వాడిలా ఊగుతూ, భారంగా ముందుకు వెళ్ళిపోయి తాను అందుకోలేనంత దూరంలో ఆగింది. రివ్వున అటువైపు పరిగెత్తడం, అందులోంచి ఒక ముసలాయన దిగడం, బస్ మళ్ళీ తనని పట్టించుకోకుండా ముందుకు పరుగుతీయడం వరసగా జరిగిపోయాయి.

    తన దురదృష్టానికి తిట్టుకుంటూ ఉసూరు మని మళ్ళీ సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు. టాప్.. మంటూ పెద్ద చినుకు నడి నెత్తిమీద పడిందేమో, అమ్మో, వర్షం వస్తుందేమో అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక గుడి దగ్గర నిలబడ్డాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది అన్నట్లు పెద్ద పిడుగొకటీ దాని వెంట రెండు మూడు ఉరుములు అన్నీ కలిసి భీతావహంగా వినిపించాయి. వర్షం నెమ్మదిగా జోరందుకుంది. అక్కడక్కడా ఒకటి అరా వచ్చి పోయే బైక్ లవాళ్ళు కనపడడం తగ్గిపోయింది. గుడి ఆవరణ ఆ వర్షం జోరుని ఆపలేకపోతోంది. నడుం వరకు ఉన్న భాగం వర్షం జల్లులకి పూర్తిగా తడిసిపోయింది.

      రోడ్డు అంతా భయానకంగా కనిపిస్తోంది. రోడ్డు మీద గుంతలు వర్షపు నీటికి నిండిపోయి, ఎక్కడ గొయ్యి ఉందో కూడా అర్థం కాకుండా ఉంది. గాలికి రోడ్డు కి రెండువైపులా ఉన్న చెట్ల కొమ్మలు ఫెళఫెళ ధ్వనులతో విరిగి పడిపోసాగాయి. ఇంక బస్సులు మీద ఆశ పెట్టుకోవడం అనవసరం. ఆటో లు కూడా రావు. ఆ సెంటర్ లో తాను తప్ప మరో మనిషి లేడు . ఒక్కసారి ఒళ్ళు ఝల్లు మంది రాజశేఖరానికి. దూరంగా ఫెళఫెళ మంటూ శబ్ధం చేస్తూ చెట్టు విరిగి రోడ్డు కి అడ్డంగా కూలిపోయింది. అయిపోయింది ఇంక బస్సు మీద అసలు ఆశ పెట్టుకోవడం దండగ అనుకుంటూ, వర్షం తగ్గితే తిరిగి ఫ్యాక్టరీ వైపు కి వెళ్లిపోడానికి నిర్ణయించుకున్నాడు.

     సుమారు గంట అయ్యింది కానీ వర్షం తగ్గే సూచనలు ఏమీ లేకుండా పోయాయి. వర్షం అంతకంతకూ పెరిగిపోతోంది. చుట్టుపక్కల తాను తప్ప ఎవరూ కనపడడంలేదు. వాచీ లో టైమ్ చూద్దామంటే చిమ్మచీకటి.

చక్ మని పెద్ద మెరుపు, దాంతోపాటూ ఢామ్మని పిడుగు పడడంతో గజగజ వణికిపోయాడు . ఈదురుగాలిలాగా శబ్ధం చేస్తూ గాలితోపాటు వర్షం జోరు పెరిగింది. తాను నిలబడిన గుడికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు ఒకటి జడలు విప్పుకొని, కాళ్ళు జాపుకుని కూర్చొన్న ముసలి మంత్రగత్తె లాగా కనిపించింది అతనికి. పగటి పూట అయితే తన ఆలోచనకి తానే నవ్వుకునేవాడేమో, కానీ రాజశేఖరం కూడా సగటు మనిషే కదా! పైగా వాతావరణం భీకరంగా ఉందేమో, గుండెల్లోంచి చలి తో వణుకు వచ్చినట్లు అనిపించింది.

       రోడ్డు కి అవతలివైపు ఉన్న ఆకేసియా చెట్టుకి ఎవరో వేలాడుతున్నట్లు అనిపించింది. ఆ చెట్టుకే కాదు, గత నెలలో వనజ ఊరేసుకుని వేలాడుతూ శవమై కనిపించింది. ఒక్కసారి ఆ స్థితిలో ఉన్న వనజ కళ్ళముందు కనిపించింది. కాళ్లుచేతులూ వణికిపోసాగాయి. పోనీ ఇంత వర్షంలో నడుచుకుంటూ వెళ్లిపోదామా అంటే, ఫ్యాక్టరీ ఏమీ దగ్గర కాదు. కనీసం అరగంట టైమ్ పడుతుంది నడవడానికి. హటాత్తుగా మెరిసిన మెరుపులో టైమ్ ఏడు గంటలు దాటి ఇరవై నిమిషాలు అయ్యిందని చూపిస్తోంది. వద్దు అనుకుంటూనే మళ్ళీ ఆ చెట్టు వైపు చూశాడు రాజశేఖరం. అక్కడే చెట్టుకింద కూర్చొని ఏడుస్తోంది వనజ. భ్రమ అనుకోవడానికి అవకాశం లేదు. కారణం తనకి ఆమె ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. వనజకీ తనకి ఆమె చనిపోకముందు మూడు నెలలు పరిచయం. ఒకరోజు తాను గర్భవతి నని, చెప్పేసరికి ఏమనాలో అర్థం కాలేదు అతనికి. గర్భం తీయించేయమని చెప్తే ఆమె నిరాకరించింది. తరువాత అతని కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. అయితే రాజశేఖర్ లో ఎలాంటి చలనం లేదు. అసలు నువ్వు చెడిపోయిన దానివని ఎందరో నాకు చెప్పారు. ఇంకెప్పుడూ నా దగ్గరకి రాకు అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి, బలవంతంగా ఆమెను పంపేశాడు. తరువాత ఆమె ఏమైందో ఎవరికీ తెలియలేదు. కానీ ఒకరోజు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకి ఉరి వేసుకొని ఉండడం తో బాగా భయపడిపోయాడు.

     జరిగిన సంఘటనకి తాను చాలా భయపడి, ఒక పదిరోజులు మెడికల్ లీవ్ పెట్టాడు. అప్పటినుండి అందరికీ దూరంగా ఉండడం మొదలెట్టాడు. ఈ రోజే సీతామహాలక్ష్మి తనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పైగా చాలా కాలంగా ఆడవాసన తగలకపోవడంతో మనసు వశం తప్పి, సీతామహాలక్ష్మిని ఎప్పుడెప్పుడు చేరుకుంటానా అని ఎదురుచూశాడు. ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అంతా చెడిపోవడం జరిగిపోయింది. “ఏమండీ కాకినాడ వెళ్ళడానికి బస్సులు దొరుకుతాయా” అంటూ వినిపించేసరికి తుళ్ళిపడ్డాడు అతను. హటాత్తుగా ఎవరో పక్కన నిలబడి అడిగినట్లు అనిపించింది. ఒక్కడే ఉండడం వలన అలా అనిపించిందేమో అనుకున్నాడు. గాలి రివ్వున వీస్తూ, జిగేల్మని ఆకాశంలో మెరుపు రావడంతో పక్కనే నిలబడ్డ ఒకామెను చూశాడు. నీలిరంగు చీరలో కనిపించింది ఆమె. ఇంకేమీ చూడలేదుఅతను. “ఎవరు మీరు”? అడిగాడు.

     “కాకినాడ వెళ్ళడానికి బస్ ఉంటుందా అంటే, ఎవరు మీరు అంటారేంటండీ. నేనెవరో చెప్పకపోతే మీరు బస్ గురించి చెప్పరా?” ఆమె గొంతు హస్కీ గా ఉంది. ఆమెలో విసుగు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత భారీగా వర్షం పడిపోతూ, చెట్లు అన్నీ విరిగి రోడ్డు కి అడ్డంగా పడిపోతే బస్సులు వస్తాయని ఎలా ఎదురుచూస్తారండీ?” ఎదురు ప్రశ్నించాడు. మరి మీరు ఎదురుచూస్తున్నారుగా, అడిగింది ఆమె. ఆమెకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు రాజశేఖర్ కి . నేను సాయంత్రం అయిదు గంటలకి ఇక్కడకి వచ్చాను. అప్పటినుండి ఒక్కటే బస్ వచ్చింది, కానీ ఆపలేదు చెప్పాడు అతను. అవునూ ఈ వర్షంలో మీరెలా వచ్చారు? అడిగాడు. నేను అవతలి వైపు నిలబడ్డాను. చీకటి పడితే భయమేసి ఇటువైపు వచ్చి మిమ్మల్ని చూశాను అంది ఆమె. మరి నేను గుడికి అటువైపు వచ్చినప్పుడు మీరు లేరు కదా! అనుమానంగా అడిగాడు. ఆమె శరీరం నుండి మత్తుగా సెంట్ పరిమళం వస్తోంది. అంత భయంకరమైన వాతావరణం లోనూ, అతని మగ బద్ధిలో మార్పు కనపడడం లేదు. ఆమె చిన్నగా నవ్వేసి ఊరుకుంది.

     ఇద్దరి మధ్యా కొంచెం నిశ్శబ్దం . మీరు కాకినాడ లో ఉంటారా? అడిగాడు. చాలా సేపు ఆమె నుండి ఎలాంటి సమాధానం లేదు. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అన్నాడు నిష్టూరంగా. అంతా నిశ్శబ్దం. చీకట్లో ఆమె కనపడడం లేదు. ఉన్నారా? అడిగాడు మళ్ళీ. మెరుపు వెల్తురులో ఆమె అక్కడ లేదని అర్థమైంది రాజశేఖర్ కి. కొంచెం సేపటికి, మళ్ళీ “ఏమండీ, ఇక్కడ దెయ్యాలు ఉంటాయా అంది ఆమె వెనకాల నుండి రాజశేఖర్ ని ఉద్దేశించి. అప్పటిదాకా ఎదురుగా నిలబడిన ఆమె తన వెనకాలకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. హటాత్తుగా మాటలు వినపడేసరికి ఉలిక్కిపడ్డాడు.

      అతడు ఏదో మాట్లాడేవాడేమో, హటాత్తుగా ఆమె వెనకాల నుండి మాట్లాడే సరికి కంగారు పడిపోయాడు. కాకినాడ లో మా పిన్ని ఇంటికి వెళదామని నిన్న బయల్దేరాను. ఇక్కడ ఊళ్ళో చుట్టాలు ఉంటే చూసి పోదామని నిన్న రాత్రి ఆగిపోయాను. ఇప్పుడు ఆలస్యంగా బయల్దేరాను ఇక్కడ వర్షానికి చిక్కుకుపోయాను అంది. ఆమె మాటలు వినసొంపుగా ఉన్నాయి.నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఏమైపోయారు? అడిగాడు. ఆమె గట్టిగా నవ్వేసి, నేను దెయ్యాన్నయిపోయాను అదిగో చూడండి ఆ చెట్టుకి వేలాడుతూ ఉన్నాను అంది. అసలే భయపడుతున్నదేమో రాజశేఖర్ ఆమె మాటలకి మరింత వణికిపోయాడు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. భయపడ్డారా? ఆమె గొంతు చిత్రంగా ఉంది అనిపించింది. 

     వర్షం తగ్గితే మీ వాళ్లింటికి వెళ్లిపోతారా అడిగాడు. కాకినాడ వెళ్ళలేం అంటారా అడిగింది ఆమె. రోడ్డు మీద చెట్లు పడిపోతే బస్ ఎలా వస్తుందండీ అడిగాడు రాజశేఖర్ . ఏమో, వెనక్కి వెళ్లాలని లేదు. ఇక్కడే ఉండి , ఉదయాన్నే ఎలాగో ఒకలాగా వెళ్లిపోతా అంది. ఆమె అలా అంటుందని ఊహించనే లేదు. ఒక్కసారి మనసులోనే ఎగిరి గంతేశాడు . ఇవాళ నీ అదృష్టం పుచ్చిపోయిందిరా రాజశేఖరా! తనకి తానే అభినందనలు చెప్పుకున్నాడు. సీతామాలక్ష్మి ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఇలాంటి వాతావరణం లో అదీ ఆరుబయట.. .. ఊహించుకుంటూ ఉంటే మనసు వశం తిప్పుతోంది.

     ఏంటండీ మౌనంగా ఆలోచిస్తున్నారు అడిగింది ఆమె. అబ్బే ఏం లేదండీ! అన్నాడు. అవునూ కటికచీకట్లో తన ముఖ భంగిమల్ని ఆమె ఎలా కనిపెట్టి ఉంటుందబ్బా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఏవండోయ్ మిమ్మల్నే, ఇక్కడ ఎవరూ లేరు. మనం ఇద్దరమే ఉన్నాం. మీరు మాట్లాడకపోతే నాకు ఈ వర్షాన్ని చూస్తే భయమేస్తోంది.. .. ఆమె మాట పూర్తిగానే లేదు. దఢేల్ మంటూ పెద్ద శబ్ధంతో ఒక చెట్టుమీద పిడుగుపడింది. ఒక్కసారి చుట్టూ పొగ ఆవహించి చెట్టు నిలువునా కాలిపోవడం మొదలైంది.

       ఆమె కెవ్వు మని అరుస్తూ రాజశేఖరాన్ని గట్టిగా పట్టేసుకుని అతని గుండెల్లో మొహం దాచేసుకుంది. అతనికీ పిడుగుపాటుకి భయమేసింది. కానీ ఆమె దగ్గరగా జరిగి తనని కౌగలించుకోవడంతో, ఆమె చుట్టూ అప్రయత్నంగా చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు. ఆమె అతనినుండి దూరంగా జరిగే ప్రయత్నం చేయలేదు. ఆమె పట్టు అంతకంతకీ బిగుసుకుపోతోంది. ఇదే అదనుగా అతని చేతులు ఎక్కడెక్కడో తడమసాగాయి. ఆమె అదేమీ పట్టించుకోలేదు. గుడి దగ్గర ఇలాంటి పనులు తప్పని మనసు హెచ్చరిస్తోంది. కానీ శరీరం లో రాజుకుంటున్న అగ్నిలో పడి మనసు మాడిపోయింది.

 ఏంటి ఆలోచిస్తున్నావు. ముఖానికి ఆమె ముఖం దగ్గరగా జరిపి అడిగింది. ఈ రాత్రి ఇక్కడే గడుపుదామా? ఆశగా అడిగాడు. ఇంత చలిగా ఉంటే ఇంకా మాటలేనా! రెచ్చగొట్టింది ఆమె. గుడి తలుపులు తాళం వేయలేదు. ఇంతసేపు నేను చూడనే లేదు. లోపలికి వెళ్లిపోదాం పదా! అన్నాడు. “లోపలికి నేను రాను. నాకు నచ్చదు అలా, ఏదైనా ఇక్కడే బావుంటుంది” చెప్పింది ఆమె. ఆమెను అమాంతంగా చుట్టేసి గాఢంగా ఆమె అధరాలను చుంబించాడు.

 “మా ఆయన ఇప్పటికిప్పుడు వచ్చి మనిద్దర్నీ చూస్తే!” అడిగింది. బాగా బలమైన అవయవ సంపద తెలుస్తోంది. చూడనీ, పరవాలేదు. మాటలు మానేసి చేతల్లోకి దిగాడు రాజశేఖర్. అప్పుడు మనం కలిసే ఉండవచ్చు ఇంచక్కా.. చెప్పాడు. ఆశ బాగా ఎక్కువ ఉందే నీకు, అతని చర్యలకి సహకరిస్తోంది బాగానే. చక్ మని మెరుపు మెరిచింది. ఎవరో వీపు మీద ఛెళ్లున కొట్టినట్లనిపించింది ఆమె మొహం లోకి చూసేసరికి. సగానికి పైగా కాలిపోయినట్లుంది ఆమె మొహం. ఒళ్ళు జలదరించి ఒంటి మీద రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయి. హేయ్, ఎవరు నువ్వు? అడిగాడు గాభరా పడుతూ. ఆమె గట్టిగా నవ్వింది తప్ప జవాబివ్వలేదు.

      ఆమె కౌగిల్లోంచి విడిపించుకుని లేవబోయాడు. ఆమె మరింత గాఢంగా అతణ్ణి పెనవేసుకునిపోతోంది. అతణ్ణి మరింత దగ్గరగా లాక్కుంది. ఆమె గొంతు మునుపటిలా మృదువుగా లేదు. గరగర శబ్ధం లాగా వస్తోంది. హేయ్, వదులు ఒక్కసారి అంటూ ఆమె పట్టునుండి గింజుకోసాగాడు. ఆమె రెండు కాళ్ళని అతని నడుం చుట్టూ బిగించి కదలకుండా చేసి, అతణ్ణి బలహీనుణ్ణీ చేయాలని ప్రయత్నం చేస్తోంది. వర్షం యధాలపంగా కురుస్తూనే ఉంది తప్ప కొంచెం కూడా తగ్గడం లేదు. మెరుపు మెరిసిన ప్రతిసారీ ఆమె ముఖం లోకి చూస్తూ ఆమె పట్టునుండి విడిపోవడానికి గింజుకుంటూనే ఉన్నాడు.

    అంత వర్షంలోనూ, రాజశేఖర్ శరీరం చెమటతో తడిసిపోయింది. నన్నొదులు నీకు దణ్ణం పెడతాను, అప్రయత్నంగా ఆ మాట నోట్లోంచి వచ్చింది. ఒరేయ్ రాజశేఖర్ నీకు వనజ గుర్తుందా? ఆ రోజు నన్నొదిలేయకు అని కాళ్ళు పట్టుకొని బతిమాలితే కూడా కనికరించలేదు కదరా. పైగా గర్భవతిని చేసి, నీకు నాకూ సంబంధం లేదు అంటూ చేతిలో ఒక అయిదువేలు పెట్టి అవమానించావు కదరా! నేనేరా ఆ వనజ ని. గుర్తొచ్చానా? ఈ గుర్తులన్నీ, నీ వలన వచ్చినవే. చెప్పింది ఆమె. అ.. అ.. అంటే.. ను.. నువ్వు.. వ .. న .. జ.. వా? నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ఆమె బలంగా అతణ్ణి మొహం మీద కొట్టి, కావాలంటే సరిగా చూడు అంది. 

       అతనికి కి గతం అంతా గిర్రున రీల్ లాగా తిరగసాగింది. తప్పైపోయింది నన్ను క్షమించి వదిలెయ్యి అంటూ ఆమెను బతిమాలసాగాడు. నిన్ను వదిలెయ్యడమా , నో వే .. అంటూ అతణ్ణి మరింత గట్టిగా బంధించింది. అర్థరాత్రి ఎప్పుడో దాటిపోయింది. ఆమెతో పెనుగులాడుతూనే ఉన్నాడు రాజశేఖరం. “నేను నీ కాళ్ళు పట్టుకుని బతిమాలితే నన్ను చెడిపోయిన ఆడది అన్నావు. నీతో అందమైన జీవితం ఊహించుకున్నాను. పెళ్ళికి ముందు ఇవన్నీ సహజమే లే. తానే నెమ్మదిగా మారిపోతాడు అనుకుంటూ నీతో ప్రేమగా ఉన్నాను. అయినా నన్ను అనుమానించి అవమానించావు.”

       చిమ్మచీకటి, ఏం కనిపించడం లేదు. వనజ చచ్చిపోయింది కదా, ఇప్పుడు ఎలా వచ్చింది. చనిపోయిన వాళ్ళని ముట్టుకోలేము కదా, ఇక్కడ ఉన్నది వనజ కాదు. నిజంగా అమ్మాయే, కానీ ఎందుకో తనని భయపెడుతోంది . తనకి తాను ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయసాగాడు. మళ్ళీ భయంకరమైన మెరుపు, దాని వెంటే పిడుగు. ఇవాళ నాకు కాళరాత్రే , నా బ్రతుకు అధ్వాన్నంగా ముగిసిపోయినట్లే తనలో తానే అనుకోసాగాడు.

      ఆమె గొంతులో కోపం తో పాటు బాధ ఉంది. హటాత్తుగా అతణ్ణి దూరంగా విసిరేసి, లేచి కూర్చొని భోరున ఏడవసాగింది. ఆమె తనని విసిరేయడంతో కళ్ళు బైర్లు కమ్మాయి. గుడి గోడకి కొట్టుకుందేమో తల, అమ్మా.. అంటూ గావు కేక పెట్టి కింద కూలబడిపోయాడు. చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా, స్పృహలోనే ఉన్నట్లున్నాడు. అప్పటికే ఒంట్లో శక్తి ఐపోవడంతో ఏమీ పాలుపోని రాజశేఖరం ఎలాగో ఓపిక తెచ్చుకొని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆడది కాదు, దెయ్యం అనుకుంటూ లేచి కూర్చోవడానికి ప్రయత్నం చేయసాగాడు. కానీ వెన్నెముక విరిగిపోయినట్లుంది. లేచి నిలబడడం కాదు కదా ఇప్పుడు కూర్చోవడం కూడా సాధ్యం కావట్లేదు. జుట్టు విరబోసుకుని కూర్చున్నట్లున్న చెట్టుమీద దఢేల్మని పిడుగుపడింది. కెవ్వున అరిచి లేచి కూర్చొన్నాడు ఒక్కసారి.

    ఆమె రాజశేఖర్ కేసి చూసి నవ్వింది. అటువైపు చూడ్డానికే భయపడిపోతున్నాడు అతను. ఒరేయ్ శేఖరం నిన్ను చంపాలంటే నాకు క్షణం పని కానీ నిన్ను చంపను, ఎందుకంటే నిన్ను ప్రేమించాను కదా! చెప్పింది ఆమె. జీవితాంతం నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి . ఉద్యోగం చేసుకోడానికి పనికిరాకూడదు నీ శరీరం అంటూ లేచి నిల్చుని అతని దగ్గరగా వచ్చింది. చిమ్మచీకట్లో అంత వర్షంలోనూ గుడ్లగూబ ఎక్కడో ఆకలితో బాధగా అరుస్తున్నట్లుంది. ఆ అరుపు కి రాజశేఖరానికి గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. నన్ను క్షమించు వనజా, ఇంకెప్పుడూ ఏ అమ్మాయి జోలికి పోను అంటూ మరోసారి చీకట్లోకి దణ్ణం పెట్టాడు. కళ్ళు మూతలు పడిపోసాగాయి. ఆమె ముందు తాను ఓటమి ఒప్పుకున్నట్లు కళ్ళు మూసేశాడు. ఎప్పటికో స్పృహ వచ్చినట్లుంది. ఏమైందో అర్థం కావడంలేదు అతనికి. భళ్ళున తెల్లవారింది. లేచి కూర్చోవాలని ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. చుట్టూ వాతావరణం భీభత్సంగా ఉన్నట్లు కనిపిస్తోంది. “పాపం ఎవరో ఇతను, రాత్రంతా గుడి దగ్గర పడి ఉన్నట్లున్నాడు. బాగా భయపడిపోయినట్లున్నాడు. తలకి కూడా గాయమైనట్లుంది. కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకెళదాం పట్టండి అంటూ నలుగురు మనుషులు అప్పుడే అటువైపు వచ్చిన ఆటో లోకి బలవంతంగా ఎక్కించారు.

       అసలే ఈ ప్రాంతం మంచిది కాదు అంటారు . గుడిలో అమ్మవారి దయవలన బతికి బట్టకట్టినట్లున్నాడు. మొన్నే గా ఒకతను కాకినాడ నుండి వచ్చే లాస్ట్ బస్ దిగి, వాళ్ళ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్ళే లోపు గుండె ఆగి చచ్చిపోయాడు. అంతకు ముందు నెలలో కాలేజీ కుర్రాడు బస్ దిగీ దిగంగానే రక్తం కక్కుకుని చచ్చిపోయాడు, ఆటో లో పడుకున్న మాటలు వింటున్న రాజశేఖర్ కి తనను క్షమించి వదిలేసిన వనజ గుర్తొచ్చింది. రాత్రంతా తనతోనే ఉన్న ఆమె ఏమైందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.


Rate this content
Log in

Similar telugu story from Horror