శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

మళ్లీ మొదటికే

మళ్లీ మొదటికే

2 mins
435   దివ్యా..!

   ఆ గొంతు దివ్యకి పరిచితమే...

   వెనుతిరగలేదు. తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది.

   దివ్యా...ఐ లవ్ యు...! ఆపై అల్లరిమూక నవ్వులు.

దివ్యకి ధైర్యం సన్నగిల్లింది. ఈసారి అడుగులు తడబడ్డాయి. ధైర్యం కూడదీసుకుని నడుస్తుంది.ప్రతిరోజూ...ఆ కాలేజీ ఆవరణలో జరిగే తతంగమే అది.ఆమె ప్రతి చర్యను గమనిస్తూ ఆమెను ఏడిపిస్తున్నారంటే... అందం ఆమె శాపమా...?


            *       *          *


    ఫోటో స్టూడియో నుంచి బయటపడిన దివ్య ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తుంది...ఆమె మనసంతా కలతగా ఉంది.రోజూ అల్లరి పెడుతున్న ఆమూక ఆమెను విడవడం లేదు.ముఖ్యంగా ఆ మదన్. అతను తన కళ్ళముందు కదలాడేసరికి కసి, కోపం మిళితమైన ఆమె ముఖం కోపంతో ఎర్రబారింది.


    దివ్యా...!

   మళ్లీ అదే పిలుపు..అదే గొంతు ...అవే నవ్వులు...

ఏ రోడ్డున తగలడ్డా వీళ్ళే. ఇడియట్స్. పళ్ళు పటపట కొరికింది. 

    

   ఒంటరిగా నడుస్తున్న ఆమె భుజంపై పడింది ఓచేయి.తల తిప్పి చూసింది. కామంతో చూస్తున్న మదన్.

ఛీఛీ...ఎప్పుడు చూసినా నాలో ఏదో వెతుకుతున్నట్టే ఉంటాయి వీడి చూపులు అనుకుంటూనే...అప్రయత్నంగానే అతని చెంప చెళ్లు మనిపించింది.


   మదన్ అహం దెబ్బతింది. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే అక్కడ నుండి మాయమయ్యింది దివ్య. 

ఆ సుకుమారమైన చేతితో కొడితే....రక్తం గడ్డకట్టేటంతటి బలం ఆమెలో వుందనుకోలేదు.కళ్ళల్లో క్రోధం... శరీరంలో ప్రతి అణువూ కసితో మండిపోయింది. పళ్ళు పటపట లాడించాడు.ఏదో నిర్ణయం తీసుకుని వెనుతిరిగాడు.


         *      *      *     *


   ప్లీజ్ ...మదన్ కళ్ళు అర్థిస్తున్నాయి....

"సారీ సర్...మీరెంత బ్రతిమాలినా... ఆఫోటో ఇవ్వడం జరగదు.అందునా లేడీ ఫోటో".


   నిరాశతో వెనుతిరిగిన మదన్ కి ఫ్లాష్ లా ఒక మెరుపు మెరిసింది.పర్స్ తీసి పచ్చనోటు బయటకు తీసాడు.


   ఎథిక్స్ గాలికెగిరిపోయాయి.


   నోటు ఒకరి చేతిలోకి, ఫోటో ఒకరి చేతిలోకి మారిపోయాయి. వెనుతిరగబోయిన మదన్...మరో వంద కూడా తీసి..అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు.


   అతను ఆనోటందుకున్నాడు.పైకి మొఖం ముడుచుకున్నా...లోపల ఆనందం కొట్టొస్తూనే ఉంది.

     

        *       *          *       *


   సర్...

   నాచావుకు కారకుడు...ఈ ఉత్తరంతో పాటూ జత చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తి. ఇతను మదన్ అనే కాముకుడు .తన రూమ్ కి నన్ను రమ్మన్నాడు. అలా రాని పక్షంలో ఈఫోటో అందరికీ చూపించి యాగీ చేస్తానన్నాడు.శత విధాల బ్రతిమలాడాను. లాభం లేకపోయింది. అతని మూర్ఖత్వమే నన్నీ పని చేయించింది.నిజానికి పై ఫోటో అతనితో కలిపి నేను ఏనాడూ తీయించుకోలేదు. దాన్ని అతనెలా సృష్టించాడో...?

ప్లీజ్...అతన్ని అరెస్ట్ చేసి...నాలాంటి కన్నెల జీవితాన్ని కాపాడండి.

                    - దివ్య

   

    పోలీసు స్టేషన్ కొచ్చిన లేఖ అది.


           *      *        *      *


   కటకటాల నుంచి వచ్చిన మదన్ ప్రవర్తనలో మార్పు లేదు.మళ్లీ...అదే గొంతు...అవే నవ్వులు. కాకపోతే పిలుపులు వేరు.

    

    కథ మళ్ళీమొదటికే.*


   ******    *******   *****   *******


(13జులై 1986లో ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించిన ఆనాటి నేటికథ శీర్షికన)
   


Rate this content
Log in

Similar telugu story from Tragedy