"Tirumalasree" PVV Satyanarayana

Comedy

4  

"Tirumalasree" PVV Satyanarayana

Comedy

లక్ష స్నేహాల వ్రతం

లక్ష స్నేహాల వ్రతం

5 mins
23.1K


వంటింట్లో పనిచేసుకుంటూన్న యశోద డోర్ బెల్ మ్రోగడంతో వెళ్ళి తలుపు తెరచింది.

గుమ్మంలో పరాత్పరరావును చూడగానే ఆమె వదనం వికసించింది. “రండి, బాబాయ్! ఇంటి దగ్గర నుండేనా రావడం? అంతా కులాసాయేనా?” అంటూ బైటకు తొంగిచూసి, “పిన్నిగారు రాలేదా?” అనడిగింది.

     “లేదమ్మా. తనకు చక్కెరవ్యాధి కదా! ప్రయాణం చేస్తే కాళ్ళు వాచిపోతాయని రాలేదు” జవాబిస్తూ లోపలికి వచ్చి సోఫాలో ఆసీనుడయ్యాడు అరవయ్యో పడిలో ఉన్న పరాత్పరరావు. 

     ఫ్యాన్ ఆన్ చేసి, “ఎండలో పడి వచ్చారు. మజ్జిగ కలుపుకు వస్తాను ఉండండి” అంటూ కిచెన్ వైపు వెళుతూన్న ఆమెను,

“మా సన్యాసి కనపడడేం? ఇంట్లో లేడా?” అనడిగాడు ముసలాయన.

     “ఇవాళ ఆదివారమే కద, బాబాయ్! ఇంట్లోనే ఉన్నారు. కాకపోతే సాలెగూట్లో చిక్కుకుపోయారు” అందామె నవ్వుతూ.

బెడ్ రూమ్ వైపు చూస్తూ, “ఏమండోయ్, ఎవరు వచ్చారో చూడండి” అని అరచింది.

     “ఇంకెవరు వస్తారు, మీ తమ్ముడు తప్ప! వారానికోసారి రావడం, ఐదు రోజులపాటు నీ చెత్త వంటను మెచ్చుకుంటూ మెక్కడం…వాడికి అలవాటేగా!” లోపలినుండే జవాబిచ్చాడు సన్యాసిరావు.

     యశోదకు ఒళ్ళు మండినా, పెద్దాయన ఉన్నాడని తమాయించుకుని, “మీ హాస్యాలకేంగాని, బాబాయ్ గారు వచ్చారు, రండి” అంది.

     ఆమె మజ్జిగ కలిపి తీసుకువచ్చేసరికి, గదిలోంచి ఊడిపడ్డాడు సన్యాసిరావు.

“మావయ్యా! నువ్వా! అత్తయ్య రాలేదా?” అంటూ పరాత్పరరావును పలుకరించి, భార్యతో, “వచ్చింది మావయ్య అని తిన్నగా చెప్పవచ్చుగా?” అన్నాడు.

     పరాత్పరరావు, సన్యాసిరావుకు మేనమామ. ఉయ్యూరులో ఉంటాడు. దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికని హైదరాబాదు వచ్చాడు.

“ఇవాళ రాత్రి పదకొండున్నరకు ముహూర్తం. మనందరం వెళ్ళాలి” అన్నాడు.

“మేమెందుకులేగాని, నువ్వు వెళ్ళొచ్చెయ్” అన్నాడు సన్యాసిరావు.

     “మీ చిరునామా తెలియక, శుభలేఖ ఇవ్వలేకపోయారట. మిమ్మల్ని తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. వెళ్ళకపోతే అపార్థం చేసుకుంటారు” అన్నాడు ముసలాయన.

     “మీ అల్లుడు అణకు కోడిపెట్టలా గుమ్మం కదలరు, బాబాయ్! చిత్రహింస అయిపోతోందనుకోండి నాకు!” అంది యశోద నవ్వుతూ.

     “చిత్రహింసా!” అని ఉలికిపడి, “ఏరా, సన్యాసీ! పెళ్ళాన్ని టార్చర్ చేసే స్థాయికి ఎప్పుడు దిగజారావు నువ్వు?” కించిత్తు కోపంగా అన్నాడు మేనల్లుణ్ణి ఉద్దేశించి.

సన్యాసిరావు చురుగ్గా భార్య వంక చూసాడు.

     “అహఁ, చిత్రహింస అంటే నా ఉద్దేశ్యం అది కాదు, బాబాయ్! చిత్రమైన హింస అని…” కంగారుగా అంది యశోద.

“అంటే…అదో కొత్తరకపు హింసా?” విస్మయంగా అడిగాడు ఆయన.

     “అలాంటిదే లెండి. భర్త ఇంటి దగ్గర ఉంటే కలసి కాఫీ త్రాగాలనీ, కబుర్లు చెప్పుకోవాలనీ, మంచీ చెడూ మాట్లాడుకోవాలనీ ఏ భార్యకు ఉండదు, చెప్పండి. కాని, ఈయన అలా కాదు. ఇంటికి రాగానే తన సాలెగూట్లో – అదే – అంతర్జాలంలో దూరిపోతారు. భోజనానికీ, బాత్ రూమ్ కీ తప్ప కదలరు…ఇది పైకి కనిపించని చిత్రమైన హింస కాక మరేమిటి?” వివరించిందామె, రాని కన్నీళ్ళను చెంగుతో తుడుచుకుందామె. “ఏమైనా అంటే, అదేదో వ్రతం చేస్తున్నారట. భంగంచేయవద్దంటూ అరగంటసేపు మృదంగం వాయించేస్తారు”.

సన్యాసిరావు ఉత్సాహంగా చెప్పాడు – “ఔను, మావయ్యా! లక్ష స్నేహాల వ్రతం!”

     “అదేం వ్రతంరా? స్త్రీలు లక్ష వత్తుల నోము నోచుకోవడం ఎరుగుదును. ఈ కొత్త వ్రతం ఏమిటిరా!?” ఆశ్చర్యపోయాడాయన.

“అది స్త్రీలు పట్టే నోము…ఇది పురుషులు చేసే వ్రతము” అన్నాడు సన్యాసిరావు.

     యశోద కొంగు నోటికి అడ్డు పెట్టుకుని నవ్వాపుకుంది.

     “అదో వినూత్నపు వ్రతం, మావయ్యా! ఫేస్ బుక్ లో లక్షమంది స్నేహితులను చేకూర్చుకోవడమన్న మాట. ఆ విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కవచ్చును. ‘విశ్వమిత్ర’ అన్న బిరుదుప్రదానం కూడా చేస్తానన్నారు ఓ సమాఖ్య వాళ్ళు” వివరించాడు సన్యాసిరావు.

“అలాగా!” అంటూ నోరు వెళ్ళబెట్టాడు ముసలాయన.

“భోంచేసి విశ్రాంతి తీసుకో నువ్వు. పెళ్ళికి మీ అమ్మాయిని తీసుకువెళుదువుగానిలే” అనేసి మళ్ళీ తన సాలెగూటిలోకి దూరిపోయాడు సన్యాసిరావు.

     సన్యాసిరావుకు ముప్పయ్ ఐదేళ్ళుంటాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉదయం నిద్రలేవగానే ముఖం కడగకుండానే ‘ముఖపుస్తకం’ (ఫేస్ బుక్) లో ముఖం దూర్చేస్తాడు. చాటింగులూ, డోటింగులూ (లైక్ లు) తో సమయం తెలియదు. ఇటీవల ‘లక్ష స్నేహాల వ్రతం’ ఆరంభించాడు. ఫేస్ బుక్ ద్వారా లక్షమంది స్నేహితులను సమీకరించుకోవడమే దాని లక్ష్యం! రేయింబవళ్ళు అదే ధ్యాస. ఇంటివద్దే కాకుండా, కార్యాలయంలో సైతం ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం, పనిలో తప్పులు దొర్లి బాస్ చేత చీవాట్లు తినడం కూడా కద్దు.

     ఓసారి అలవాటు ప్రకారం ఓ యువతికి ‘ఫ్రెండ్ రెక్వెస్ట్’ పెట్టాడు సన్యాసిరావు. మర్నాటికల్లా ఆమె తాలూకు మనిషట – బాహుబలి సినిమాలోని కాలకేయుడిలా ఉన్నాడు – వెదుక్కుంటూ వచ్చి మరీ సన్యాసిరావును కాలర్ పట్టుకున్నాడు. 

“ఏరా, సన్నాసీ! నా పోరికే లైన్ వేస్తావు బే?” అంటూ ఎడాపెడా ఆగకుండా వాయించేసాడు, అతని సంజాయిషీని వినిపించుకోకుండా. తీవ్రంగా హెచ్చరించి, వెళ్తూ వెళ్తూ ముక్తాయింపుగా ముఖం మీద ఓ పిడిగ్రుద్దు కూడా వేసాడు…

     మరోసారి ఓ వర్ధమాన సినీనటికి ‘ఫ్రెండ్ రెక్వెస్ట్’ పెట్టడంతో, ఆమె ఫిర్యాదును అందుకున్న పోలీసులు వచ్చి సన్యాసిరావును పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పదివేలు గుంజి, రోజంతా గుంజీలు తీయించిగాని విడిచిపెట్టలేదు.

ఆ సంగతిని అతను ఫేస్ బుక్ స్నేహితులతో పంచుకోవడంతో, అంతా ఏకగ్రీవంగా పోలీసుల చర్యను ఖండించారు.

“చూసారా? నా మీద ఈగ వాలినా నా స్నేహితులెవరూ ఊరుకోరు” అంటూ సహోద్యోగులతో సగర్వంగా చెప్పుకున్నాడు సన్యాసిరావు. “నా వ్రతం పూర్తైతే, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లక్ష గళాలు ఏకమై నాకు బాసటగా నిలుస్తాయి”.

     సన్యాసిరావు స్నేహితుల ఖాతాలో అప్పటికి సుమారు డెబ్భై ఐదు వేల మంది చేరారు. త్వరలో మిగతా లోటును భర్తీ చేసుకోవాలన్న దీక్షతో ఫేస్ బుక్ లోంచి ఫేస్ ని త్రిప్పడంలేదు అతను.

     గుంటూరులో యశోద అక్క కూతురి పెళ్ళి ఉంది. మరో పదివేల స్నేహితుల్ని కలుపుకుంటే తన వ్రతం ముగుస్తుందనీ, పెళ్ళికి వెళ్ళి విలువైన సమయాన్ని వృధా చేయలేననీ చెప్పేసాడు సన్యాసిరావు.

     “కాంప్లెక్స్ లో ఎవరి ఫంక్షన్ కీ రారు మీరు. పెళ్ళికైనా పేరంటానికైనా నేను ఒక్కతినే వెళ్ళాలి. కనీసం దగ్గర బంధువుల ఇంట్లో శుభకార్యానికి కూడా వెళ్ళకపోతే ఎలా? అక్కయ్య బాధపడుతుంది. ఈ సారికి రండి” అంటూ యశోద ఎంత బ్రతిమాలినా ససేమిరా అన్నాడు అతను.

యశోద ఒంటరిగానే వెళ్ళింది, వారం రోజుల వరకు తిరిగి రాకూడదని తీర్మానించుకుని మరీ

సన్యాసిరావుకు వంట రాదు. హోటలే గతి మరి.

     యశోద వెళ్ళిన నాలుగో రోజు రాత్రి పది గంటలకు హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి తిరిగివస్తున్నాడు సన్యాసిరావు. తమ వీధిలో ప్రవేశించగానే ఎక్కణ్ణుంచో కారు ఒకటి వేగంగా వచ్చి అతని మోటార్ బైక్ ని గ్రుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయింది. క్రింద పడిపోయాడు అతను. హెల్మెట్ ధరించలేదేమో, తలకు బలమైన గాయం తగలడము, స్పృహతప్పి పడిపోవడమూ జరిగిపోయాయి…

రెండు రోజుల తరువాత ఊరి నుండి తిరిగి వచ్చిన యశోదకు భర్త ఆసుపత్రిలో ఉన్నాడన్న వార్త అందింది. ఉన్నపళంగా ఆసుపత్రికి పరుగెత్తిందామె. సన్యాసిరావు తెలివిలోనే ఉన్నాడు.

     పోలీసుల కథనం ఆలకించి నిశ్చేష్టురాలయింది యశోద… ప్రమాదం జరిగిన వెంటనే ఆ వీధిలోని వారంతా పరుగెత్తుకుని వెళ్ళి చూసారు. కాని, ఒక్కరూ అతన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎవరో ఫోన్ చేయడంతో పోలీసులు, 108 ఆంబులెన్సూ రావడం, అతన్ని ఆసుపత్రికి తరలించడమూ జరిగాయి. మర్నాడు అతని మోటార్ బైక్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా సన్యాసిరావు యొక్క ఐడెంటిటీని గుర్తించిన పోలీసులు ఇంటికి వెళ్తే, తాళం వేసియుంది. భార్య ఊళ్ళో లేదని తెలుసుకుని, ఆమె తిరిగి రాగానే కబురు అందించవలసిందిగా పక్క ఫ్లాట్ స్ వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయారు. 

     మేనల్లుడికి ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే కంగారుగా పరుగెత్తుకు వచ్చాడు పరాత్పరరావు. ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన మేనల్లుడికి బాగా క్లాసు పీకాడతను – “విశ్వవ్యాప్తంగా స్నేహితులను సంపాదించుకోవాలనుకోవడంలో తప్పు లేదురా, సన్యాసీ! కాని, ముందుగా నీ చుట్టూ ఉన్న మనుషులను గుర్తించి వారితో పరిచయము, మైత్రి ఏర్పరచుకోవడం అంతకంటె ముఖ్యం! నీ ఇరుగుపొరుగుల మంచిచెడులలో పాలుపంచుకోవడం వల్ల అది సుసాధ్యమవుతుంది. నా గూట్లో నేను ఉంటాను, వాళ్ళతో నాకేం పని అనుకుంటే…ఇదిగో, ఇలాగే ఉంటుంది ఫలితం! నువ్వు నివసిస్తూన్న వీధిలోనే నీకు ప్రమాదం జరిగితే నీ కాంప్లెక్స్ లోని వాళ్ళు, నీ ఇరుగుపొరుగులు సైతం నిన్ను గుర్తించకపోవడమంతటి దౌర్భాగ్యం మరోటి ఉండదు. అందుకే ‘ఇంట గెలచి రచ్చ గెలవా’ లంటారు. సామెత పాతదే అయినా అందులోని సందేశం గొప్పది. ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లక్షమంది ఉన్నా, సమయానికి నీకు పనికిరాకుండాపోయారు! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇరుగుపొరుగులతో పరిచయాలు పెంచుకో. అవసరానికి నీకు అండగా నిలచేది వాళ్ళే!” .

     మేనమామ పలుకులలోని సత్యం ఆకళింపు కావడంతో, “సారీ, మావయ్యా! ఈ అనుభవం నాకో గుణపాఠం అయింది. ఇక మీదట ఈ కాంప్లెక్స్ లోని అందరితోనూ కలుపుగోరుగా ఎలా కలసిపోతానో చూడు” అన్నాడు.

“అలాగని, నీ విశ్వమిత్ర యాగాన్ని మధ్యలోనే గాలికి వదిలేయనవసరం లేదులే. గురికి చేరువలోనే ఉన్నానన్నావు కదా!” అన్నాడు పరాత్పరరావు నవ్వుతూ.

     “అంతర్జాలం ఓ మాయాజాలం. సిస్టమ్ ని షట్ డౌన్ చేయగానే అంతర్థానమయిపోతుంది. మన చుట్టూ ఉన్న మనుషులే సత్యమూ, నిత్యమూను” అంది యశోద చిరునవ్వుతో. 

     “ఇంత జరిగాక, కాదని ఎలా అంటాను బంగారం!” అని సన్యాసిరావు అనడంతో, నవ్వులు విరిసాయి అక్కడ.

                                                           ******


Rate this content
Log in

Similar telugu story from Comedy