కాకరకాయ కూర
కాకరకాయ కూర




ఒక రోజు యాయవారం బ్రాహ్మడి కి, బియ్యం తో పాటు ఎవరో రెండు చిన్న కాకర కాయలు, శాకా దానంగా ఇచ్చారు.
ఆయన వాటిని అపురూపం గా భార్య కిచ్చి "వీటిని పులుసు, బెల్లం పెట్టి వండవే. మా అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది. నాకు చాలా ఇష్టం. తిని చాన్నాళ్ళైంది. జిహ్వ లాగుతోంది." అన్నాడు.
ఆమె "అదెంత భాగ్యం? మీరు తేలేదు, కానీ నేనెప్పుడూ వండనని అనలేదే. మా పుట్టింట్లో చేస్తే , మా అమ్మ కన్నా నేనే ఎంతో బాగా చేస్తానని మా నాన్న మెచ్చుకొనే వారు కూడానూ." అంటూ దీర్ఘం తీస్తూ అందుకుంది ఆవిడ.
ఆయన బైటికి వెళ్లి నాలుగు పనులు చూసుకొని, తిరిగి వచ్చే సరికి అపరాహ్ణం దాటింది. అసలే ఆకలి మీద ఉన్నాడు. భార్య చేసే కాకరకాయ కూర గుర్తుకు వచ్చింది. దాని కోసం ఉవ్విళ్ళూరుతూ ఇంటికి చేరాడు.
అతను ఇంటికి రాగానే భార్యను భోజనం వడ్డించమన్నాడు. ఆవిడ విస్తట్లో కూర పేరుతొ ఒకే ఒక కాకర కాయ ముక్క వేసింది.
"ఇదేవిటే, కాకర కాయ కూరంటూ ఒకే ఒక్క ముక్క వేశావ్. ఏం చేశావే కూరంతానూ." అంటూ రంకెలేశాడు బ్రాహ్మడు.
"అయ్యో రామా! నన్నంటారేంటీ. ఓ, మహా తెచ్చారండీ, రెండే రెండు కాకర కాయలు!" అంది ఎకసెక్కంగా.
"ఏం, కొని తెచ్చినవా? ఆ మహా తల్లి ఎవరో శాకా దానం పేరున ఇస్తే వచ్చినవి. 'పెడితే పెట్టావు గానీ, నీ మొగుడి తో సమానంగా పెట్టు' అందట, వెనకటికి ఎవరో నీలాటిదే. ఇంతకీ కూర సంగతి చెప్పు." అన్నాడు కోపంగా
"అబ్బో, చెప్పొచ్చారు. ఇంతోటి కాకర కాయలకీ, ఈ రాద్ధాంతం ఒహటి. వాటిని కష్ట పడి ఆరు ముక్కలుగా కోసి ఇద్దరికీ చెరికో మూడు ముక్కలని లెక్కేశాను కూడా." అంది చేతులు తిప్పుతూ.
"సర్లేవే. మరి నా వాటా మూడు ముక్కలేవీ?" అన్నాడాయన మరింత కోపంగా.
"అయ్యో రామా! అలా విరుచుకు పడతారేంటీ! మీకు రుచి తగ్గితే నచ్చదని రుచి చూశానండీ."అందావిడ.
"సరే ఓ ముక్క రుచి చూశావు. మరి మిగిల్న ముక్కలేవీ?" అన్నాడు ఆకలి, కోపం మేళవించిన స్వరం తో.
"అదేనండీ, ఉప్పు కోసం ఒక ముక్క, పులుపు కోసం ఓ ముక్క , తీపి కోసం ఒహటి, కారం కోసం మరోటి ఇలా రుచి చూడ్డానికే నాలుగు ముక్కలై పోయాయండీ." అందావిడ.
కోపం నషాళానికి ఎక్కుతుంటే, "మరింకా రెండు ముక్కలుంటాయి కదే" అన్నాడు తనని తాను సంబాళించుకుంటూ.
"అదేనండీ, మీరింకా రాలేదని బాగా ఆకలేసి భోజనం చేసేశాను. ఆ రెండిట్లో ఒక ముక్క నా వాటా కదా, నేనేసుకు తినేశానండీ." అంది అమాయకంగా.
"ఓసీ, ఎంత పని చేశావే. అసలు నన్నొదిలేసి నువ్వెలా తినగలిగావే!" అన్నాడాయన లబలబ లాడుతూ.
"ఇదుగో నండీ, ఇలా తినేశా నండీ." అంటూ విస్తట్లో ఉన్న ఆ ఒక్క ముక్కనీ తినేసింది ఆ మహ ఇల్లాలు.
ఆ బ్రాహ్మడికిక నోట మాట రాలేదు.
.....సమాప్తం.....