STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children

3  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children

చదువు అటకెక్కింది(పలుకుబడి కథ)

చదువు అటకెక్కింది(పలుకుబడి కథ)

1 min
11


చదువు అటకెక్కింది(పలుకుబడి కథ)

*************************************

లక్ష్మీపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అంజలి టీచర్ కొంతమంది పిల్లల సాయంతో ఇంటింటికి వెళ్లి బడి మధ్యలో మానివేసిన పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. అలా పెంట వీధిలో ఉన్న లచ్చమ్మ ఇంటికి వెళ్ళారు. “మీ అబ్బాయి లావేసు చదువుతున్నాడా?” అని లచ్చమ్మని అడిగారు అంజలి టీచర్. 


“ఆడి సదువు ఎప్పుడో అటకెక్కింది. బడికెల్లమంటే అయ్యతో గొర్రెల ఎనకాల ఎల్తున్నాడు. మాయి వానాకాలం సదువులమ్మా.” అంది లచ్చమ్మ.


“ఇప్పుడు మళ్ళీ బడిలో చేర్చుకుంటాం పంపించండి. పిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదు” అని చెప్పి వివరాలు తీసుకుని బడికి బయలుదేరారు అంజలి టీచర్ గారు. ఆమెతో పాటు ఉన్న ప్రణతి, ప్రసన్నలు గుసగుసలాడుకోవడం అంజలి టీచర్ చూశారు. 


“ఏమిటా గుసగుసలు” అని అడిగారు. 


“ ఏమీ లేదు టీచర్, చదువు అటక ఎలా ఎక్కుతుందా అని ఆలోచిస్తున్నాం!” అని మెలికలు తిరుగుతూ చెప్పారు పిల్లలు. 


“ ఓహ్ అదా మీ సందేహం. పూర్వం రోజుల్లో మట్టి గోడల

ు, తాటి కమ్మలతో కప్పు వేసి ఇల్లు కట్టుకునేవారు. ప్రతీ ఇంటిలో ఒక అటక ఏర్పాటు చేసుకునేవారు. ముఖ్యమైన వస్తువులు, డబ్బులు, తినుబండారాలు ఎవరికీ అందకుండా అన్నీ అటకమీద పెట్టేవారు. ఏదైనా వస్తువు కావాలంటే నిచ్చెన వేసుకుని అటక మీదకి ఎక్కి తీసుకుని కిందకి దిగేవారు. పెద్దవాళ్ళు మాత్రమే అటక ఎక్కేవారు. “చదువు అటకెక్కింది” అంటే పిల్లాడు బడికి వెళ్లలేదని, చదువుకు దూరమయ్యాడని చెప్పే సందర్భంలో ఈ పలుకుబడిని వాడుతారు.


ఇక వానాకాలం చదువులు అన్నా అదే అర్థం స్ఫురిస్తుంది.. ఊరికి దూరంగా పొలాలు ఉంటాయి. 

వర్షాకాలంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేవారు కాదు అందుకని పూర్వం పాఠశాలలకు ఉడుపుల సెలవులు, దసరా సెలవులు, కోతల సెలవులు అని ఇచ్చేవారు. అలా ఎక్కువ కాలం సెలవుల్లో గడిపి చదువుకు దూరమైన వారి చదువు వానాకాలం చదువు అనేవారు. నాటి నుంచి ఈ జాతీయాలు వాడుకలోకి వచ్చాయి.” అని వివరించారు అంజలి టీచర్. 

“దీని వెనుక ఇంత కథ ఉందా?” అని నోరెళ్లబెట్టారు ప్రణతి, ప్రసన్నలు.


(లీడర్ దినపత్రికలో 17-5-24 న ప్రచురితం అయ్యింది)


Rate this content
Log in

Similar telugu story from Children