కుంభకోణం
కుంభకోణం
కుంభకోణం
**********
“శంకరం దసరా సెలవుల్లో కుంభకోణం వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేయించు” అంది తల్లి లక్ష్మీ నరసమ్మ.
“సరే” అన్నాడు శంకరం.
“మామ్మా కుంభకోణం లో ఏముంది చూడ్డానికి?” అని అడిగింది మనవరాలు మానస.
“దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో కుంభకోణం ఒకటి. చిదంబరానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒడ్డున ఉంది. దీనికి దేవాలయాల నగరం అని పేరు. ఇక్కడ పదహారు దేవాలయాలు ఉన్నాయి. అందులో బ్రహ్మ దేవాలయం ఒకటి.
బ్రహ్మచే సృష్టించబడిన అమృత భాండం ప్రళయం లో కొట్టుకుపోతూ, పరమశివుని ఆజ్ఞతో ఇక్కడ వెలసిందని, అమృతం తో నిండిన ఆ కడవ కోణం ఆకారంలో ఉన్న పట్టణానికి చేరడం వలన కుంభకోణం అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం.” అని మామ్మ చెప్పింది.
కాసేపటి తర్వాత రేడియోలో వార్తలు ప్రసారమయ్యాయి అందులో “ఇటీవలే వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణం” అనే వార్త మానస విని “నాన్నా భూ కుంభకోణం కూడా చూసొద్దామా!” అని ఉత్సాహంగా అడిగింది మనవరాలు.
“నీ తెలివి తెల్లారినట్లే ఉంది. అది చూసే ప్రదేశం కాదు. ఇది ఒక జాతీయం. కుంభకోణాన్ని
ఆంగ్లంలో స్కాం అంటారు. అంటే మోసమని అర్థం. ఒకప్పుడు కుంభకోణంలో దొంగ రైలు టికెట్లను ముద్రించి అమ్మేవారుట. ఇవి అసలు టికెట్లకు ఏమీ తీసిపోకుండా వుండేవిట. ఆ నోట ఈ నోట తెలిసి ఈ వ్యవహారం పై ప్రభుత్వం నిఘా పెట్టి శోధించింది. మూలం కుంభకోణం అని నిర్ధారించుకుని. ఆ ప్రింటింగ్ ప్రెస్ లను మూయించి దోషులను అరెస్టు చేశారు.
అలాగే కుంభకోణ ప్రాంత చెట్టియార్లు చిట్ ఫండ్ వ్యాపారాల ద్వారా రెట్టింపు మొత్తం ఆశచూపి ఆర్ధిక మోసపూరిత వ్యాపారం చేసి అనేకమంది చేత డబ్బును పెట్టుబడి పెట్టించి కొంతకాలానికి ఆడబ్బుతో మాయమయ్యేవారు. మలయాళ భాషలో కుంభకోణం అంటే మోసం అను అర్ధానికి ముడిపెట్టబడినది. అలా ఒకప్పుడు ఈ ప్రాంతం మోసాలకి నిలయమయ్యింది.
అప్పట్లో తరచూ కుంభకోణంలో నేరాల వార్తలు రావడంతో ఆ పేరు వెలుగులోకి వచ్చింది. ఏ పెద్ద నేరం లేదా అవినీతి జరిగినా కుంభకోణం అనడం ఆనవాయితీగా మారింది.” అని వివరించాడు తండ్రి శంకరం.
“అబ్బా ‘కుంభకోణం’ అనే ఈ జాతీయం వెనుక ఇంత కథ ఉందా” అని నోరెళ్లబెట్టింది మానస.
(సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధం లో 6-10-2024 న ప్రచురితమైంది.)
