STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Inspirational Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Inspirational Children

బడాయి పిల్లి

బడాయి పిల్లి

2 mins
18

బడాయి పిల్లి

*************


చింతలూరు గ్రామంలో వరహాలు శెట్టి అనే షావుకారు నివసించేవాడు. అతడు నిత్యావసర వస్తులు అమ్మేవాడు. అతడి ఇంట్లో ఎలుకల దండు ఉంది. అవి ఇంట్లో ఉన్న సరుకులన్నిటినీ చిందర వందర చేసేవి. ఆ బాధ పడలేక తెల్లగా బొద్దుగా ఉన్న పిల్లి పిల్లని తెచ్చి పాలు పోసి పెంచాడు షావుకారు. మా పిల్లి పాలు మాత్రమే తాగుతుందని, దేవతాంశ అని, ధైర్యశాలి అని, విదేశాల నుంచి తెప్పించానని అందరికీ గొప్పలు చెప్పేవాడు. నిజానికి ఆ పిల్లి భయస్తురాలు. కానీ ఆ విషయం ఎలుకలకు తెలీదు. పిల్లిని చూసి అవి భయపడేవి. 


వరహాలు శెట్టి చెప్పే గొప్పలు విన్న పిల్లి తాను అందరికంటే గొప్ప అనుకుంది. ఎలుకల్ని తినడం మరచి తన తోటి జంతువులతో, పక్షులతో బడాయి కబుర్లు చెప్పేది. ఆ బడాయి పిల్లి ఒకరోజు వరహాలు శెట్టి ఇంటి గోడ మీద కూర్చుంది. ఎదురుగా చెట్టు మీద ఉన్న కాకమ్మ "పిల్లి బావా! ఏమిటి సంగతి అంత తీరుబాటుగా కూర్చున్నావ్?" అని అడిగింది. 


"ఆ ఏముంది లే షావుకారి ఇంట్లోకి దొంగలు పడ్డారు. వాళ్ళని చితక్కొట్టి తరిమేశాను. అలసట తీర్చుకుందామని ఇలా కూర్చున్నాను." అంది పిల్లి.


"ఓసి నీ బడాయి... దోమని కొట్టి దొంగల్ని కొట్టేను అంటావా నీ గొప్ప గోదాట్లో కలవ." అంది పళ్ళు కొరుకుతూ పిల్లి వెనుక, చూరులో ఉన్న చిట్టెలుక.


“అబ్బో దొంగల్ని తోలేవా? చాలా ధైర్యం నీకు” అని అనుకుంటూ తుర్రున ఎగిరింది కాకి.


కాసేపటి తర్వాత ఆ చెట్టు మీదకి ఒక రామ చిలుక వచ్చింది వాలింది.


"పిల్లి మామా ఏంటి సంగతులు. ఎక్కడా కనిపించడం లేదు." అంది రామ చిలుక.


"ఈమధ్య ఒక పులి దారి తప్పి ఇటువైపు వచ్చింది. దానిని కొట్టి చంపేసాను. అయినా ఎవరూ నన్ను గుర్తించరు" అంది పిల్లి.


"నువ్వు ఇంత ధైర్య వంతుడవని ఇప్పుడే తెలిసింది మామా." అంది రామ చిలుక. 


పిల్లి గొప్పలు విని చిట్టెలుకకు చాలా కోపం వచ్చింది.

"ఓసి నీ వినేవాళ్లుంటే ఏనుగుని మింగేసానని కూడా చెప్తావు. నీ కళ్ళ మీద వాలిన పురుగుని చంపి పులిని చంపేనని గొప్పలు చెప్తావా? చేసింది పిసరంత చెప్పింది కొండంత అంటే ఇదే" అని మనసులో గొణుక్కుంది చిట్టెలుక. అంతలో దానికి ఒక విషయం గుర్తొచ్చింది. ఇన్ని రోజులై ఆ పిల్లికి తమ దండు భయపడుతోంది కానీ, పిల్లి మాత్రం ఒక్క ఎలుకను కూడా వేటాడలేదు అనుకుని

గబాలున చూరులోంచి బయటకు వచ్చి చురకత్తుల్లాంటి పళ్ళని చూపి భయపెట్టింది. ఇంకేంటి... బడాయి పిల్లి ఒకటే పరుగుతీసింది. 


చిట్టెలుక ద్వారా అసలు విషయం తెలుసుకున్న రామచిలుక 

"బడాయి పిల్లి లడాయికెళ్లి

దోమని చంపి దొంగలు అంది

పురుగుని కొట్టి పులిని చంపిన

 ధైర్యం తనదని పొంగిన పిల్లి

ఎలుకని చూసి ఒకటే పరుగు " అని పాడుకుంటూ తుర్రుమంది.


(విప్రవాణి పత్రిక జూలై ఆగష్టు 2024 సంచిక లో ప్రచురితం)


Rate this content
Log in

Similar telugu story from Inspirational