STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational Children

వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు

వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు

2 mins
45

వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు

***************************************


పూర్వం చంద్రగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో రాముడు, భీముడు అనే ఇద్దరు మిత్రులు నివసించేవారు. వారు ఇరువురు వ్యాపారం చేసి జీవనం సాగించేవారు. ఒకసారి భీమునికి డబ్బులు అవసరమై రాముని వద్దకు వెళ్లి “ మిత్రమా నాకు బాకీ ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సరుకు కొనడానికి డబ్బులు లేవు. చేబదులుగా వంద వరహాలు ఇవ్వు. కొద్దిరోజుల్లో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను.” అన్నాడు భీముడు. మిత్రుని అవసరాన్ని గుర్తించిన రాముడు “సరే” నని భీమునికి వంద వరహాలు ఇచ్చి పంపించాడు.


కొద్దిరోజుల తర్వాత చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి రాముని ఇంటికి వెళ్ళాడు భీముడు. రాముని ఇంటికి తాళం వేసి ఉంది. వ్యాపార నిమిత్తం పొరుగు రాజ్యానికి వెళ్లినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పడంతో చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చాడు భీముడు. 


కొద్దిరోజుల తర్వాత వ్యాపార నిమిత్తమై పొరుగు రాజ్యానికి వెళ్ళాడు భీముడు. రాముడు ఇంటివద్ద ఉన్నప్పుడు భీముడు గ్రామాంతరం వెళ్ళడం భీముడు ఇంటివద్ద ఉన్నప్పుడు రాముడు వేరే రాజ్యం లో ఉండటంతో మిత్రులిద్దరూ కలవలేకపోయారు. కొన్నాళ్ళ తరువాత రామునికి డబ్బులు అవసరపడ్డాయి. భీముడు ఊళ్ళో లేడు. చేసేదేమీ లేక పొరుగు రాజ్యం లో ఉన్న తన స్నేహితుని వద్దకు పయనమయ్యాడు రాముడు. దారిలో భీముడు కనిపిస్తే బాగుణ్ణు అని మనసులో అనుకున్నాడు. సాయంత్రానికి పనులన్నీ ముగించుకుని పూటకూళ్లవ్వ ఇంటికి చేరుకున్నాడు. అనుకోకుండా అక్కడ భీముడు తారసపడ్డాడు. “హమ్మయ్య వెతకబోయిన తీగ కాళ్ళకి తగిలినట్లు” సరిగ్గా సమయానికి నువ్వు దేవుడిలా కనపడ్డావు.” అన్నాడు రాముడు. “అయ్యో ఎంతమాట ఆపదలో ఆదుకున్నది నువ్వు.” అని చెప్పి చేబదులుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు భీముడు. “నీ డబ్బులు నీకు ఇచ్చేశాను ఆ తీగ సంగతి ఏమిటో కాస్త వివరంగా చెప్పు” అన్నాడు భీముడు. “ సరే చెప్తా విను! పూర్వం సిద్ధుడు అనే ఆయుర్వేద వైద్యుడు శిష్యుల సాయంతో పరిసరాల్లో దొరికే ఆకులు, బెరడు, తీగలతో మందులు తయారు చేసేవాడు. ఒకసారి తిప్ప తీగ తీసుకురమ్మని శిష్యులకు చెప్పాడు సిద్ధుడు. శిష్యులు ఆ తీగ కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు. అలా వెళ్తున్న వారి కాళ్ళకు ఒక తీగ అడ్డుపడింది. తీరా చూస్తే అది గురువుగారు తీసుకురమ్మని చెప్పిన తిప్ప తీగ. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పరుగున గురువుగారి దగ్గరి వెళ్ళి “ గురువు గారూ వెత కబోయిన తీగ కాలికి తగిలింది.” అని వారు తెచ్చిన తిప్ప తీగను గురువుగారికి ఇచ్చారు. గురువుగారు శిష్యులను మెచ్చుకున్నారు. నాటినుంచి కావలసిన వ్యక్తులు తారసపడినప్పుడు, అవసరమైన వస్తువులు దొరికి నప్పుడు ఈ పలుకుబడిని వాడుతున్నారు.” అని చెప్పాడు రాముడు. “అయితే ఆ తీగని నేనే నన్నమాట.” అన్నాడు భీముడు నవ్వుతూ.


(మొలక బాలల పత్రిక ఆగష్టు 2024 సంచికలో ప్రచురితమైంది)


Rate this content
Log in