నిండు కుండ తొణకదు
నిండు కుండ తొణకదు
నిండు కుండ
*****************
భీమాళి ఊరి చివర పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. గ్రామస్తులంతా ఆ బావిదగ్గరికి వెళ్ళి నీళ్ళను చేదుకుని కుండలతో తెచ్చుకునేవారు. అలా ఓసారి అమ్మలక్కలంతా నీటి కుండలు నెత్తిన పెట్టుకుని ఊసులాడుకుంటూ వస్తున్నారు. వారిలో ఒక అమ్మాయి కుండ వెలితిగా ఉంది. నడుస్తూ ఉంటే ఆ కుండలో నీళ్ళు గలగల శబ్దం చేస్తూ కిందకి మీదకి ఎగురుతున్నాయి. ముందు నడిచే వాళ్ళ మీదకు, వెనుక వచ్చే వాళ్ల మీదకు ఆ నీటి తుంపరలు పడుతున్నాయి దాంతో వారికి కోపం వచ్చింది. “నువ్వు మాతో రాకు, నీ కుండలో నీళ్ళు మా మీదకు తుళ్లు తున్నాయి అని విసుక్కున్నారు.
చేసేదేమీ లేక వారికి దూరంగా నడవసాగింది. అప్పుడు ఆ అమ్మాయికి తెలిసింది వెలితి కుండ తొణుకుతుందని నిండుకుండ తొణకదని.
మర్నాడు ఆ గ్రామంలో గ్రామ దేవత పండగ జరిగింది. ఆ సందర్భంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేసారు. భోజనాలకు అందరూ వరుసక్రమంలో కూర్చున్నారు. ఒకరు విస్తరాకులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు నీళ్ళు పెడుతున్నారు. మరొకరు కూరలు వడ్డిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నారు. ఈలోగా సన్నని గాలి వీచింది. పప్పు అన్నం, కూరలు, పరమాన్నం వడ్డించిన ఆకు ఎగరకుండా ఉంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడింది. నిండుకుండ తొణకలేదు. అన్నీ ఉన్న ఆకు ఎగరలేదు.
మన సమాజంలో కూడా నిండు కుండ లాంటి వ్యక్తులు ఉన్నారు. వారు ప్రతిభావంతులు, సంస్కార వంతులు వినమ్రంగా ఉంటారు. తమని గుర్తించాలని కోరుకోరు. అన్నీ ఉన్న ఆకు వలె అణిగి మణిగి ఉంటారు. దీనికి ఉదాహరణగా మన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి గారిని చెప్పుకోవచ్చు. శాస్త్రి పట్టా పొందినప్పటికీ వారికి ఇసుమంతైనా గర్వం లేదు. ప్రధాని అయినా కూడా వారు సామాన్య జీవితాన్నే గడిపారు. ఇలా ఎందరో ఉన్నారు. గొప్పవారి జీవితాలను పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఇక రెండో రకం వెలితి కుండ లాంటివారు. వీరు మిడిమిడి జ్ఞానం కలవారు అన్నీ తమకే తెలుసన్న గర్వంతో ఏమీ లేని ఆకులా ఎగిరెగిరి పడతారు. చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. గుర్తింపుకోసం తాపత్రయ పడతారు. వీరు వెలితి కుండ లాంటివారు.
నిండు కుండ తొణకదు అన్నా, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందన్నా ఒకటే
వెలితి కుండ తొణుకుతుందన్నా, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్నా అర్థం ఒకటే.
(ప్రజాశక్తి చిన్నారి లో 18-7-24 న ప్రచురితమైంది)
