చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం
ఆదివారం ఆటవిడుపు. పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ పెరట్లోకి వెళ్ళి ‘దాగుడు మూత దండాకోర్… పిల్లి వచ్చే ఎలుకా భద్రం… ఎక్కడి దొంగలు అక్కడే… గప్ చుప్ సాంబారు బుడ్డి’ అని పాడుకుంటూ దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. అందరికంటే ఆఖరున వచ్చాడు రుద్ర. ‘నన్నూ ఆడించండి’ అని పేచీ పెట్టాడు. “ముందుగా రావచ్చు కదా!” అంది సిరి.
“పోనీలే వాడు ఆటలో అరటిపండు, పాటలో పనస పండు ఆడనివ్వండి.” అంది మానస. ‘సరే’ నని రుద్రని కూడా ఆడించారు.
కొంత సేపు అయ్యాక “మేకని చంపుతాం” ”కాళ్లిరగ్గొడతాం” అని అరుస్తూ
‘పులి మేక’ ఆడారు. కాసేపటికి బాగా అలసిపోయారు.
“పిల్లలూ నూతి దగ్గర గుండిగలో నీళ్ళు ఉన్నాయి కాళ్ళు చేతులూ శుభ్రంగా కడుక్కుని రండి.” అని కేకేసింది పెద్దమ్మ.
పోలో మని పిల్లలంతా నూతి దగ్గరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని వరండాలో వరసగా కూర్చున్నారు. పిల్లల కోసం జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వేసి ప్రసాదం చేసింది పెద్దమ్మ.
నేతి వాసనకి ఘుమ ఘుమ లాడిపోతోంది ఆ ప్రదేశం. ‘పెద్దమ్మా ఇంకా ఎంతసేపు’ అంటూ రాగాలు తీశారు పిల్లలు. రుద్ర వంటింట్లో ఉన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు.
“నువ్వు శునకాచారివి తిన్నగా ఉండవు. దగ్గరికి వస్తే వాత పెడతాను వెళ్ళు” అని కసిరింది పెద్దమ్మ.
రుద్ర అలిగి బయటకి వెళ్ళాడు. ప్రసాదం గిన్నె, గరిటె తెచ్చి బయట పెట్టింది. బాదం ఆకులు తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ఆకు ఇచ్చింది. వరుసగా ఒక్కొక్కరికి ఆకులో ప్రసాదం పెట్టింది. గోరువెచ్చగా ఉంది ప్రసాదం. కొద్ది కొద్దిగా తీసుకుని ఊదుకుని తింటున్నారు పిల్లలు.
రుద్రకి ఆకు ఇచ్చి ప్రసాదం వేసేలోగా ఆకును కింద పడేశాడు. ప్రసాదం నేరుగా చేతిలో పడింది. చెయ్యి చురికింది. “అమ్మో మంట” అంటూ రాగం తీసాడు. గబగబా పెరట్లోకి తీసుకెళ్ళి చేతులు కడిగి కాసేపు నీట్లో చేతులు ఉంచింది. మంట తగ్గాక “ప్రసాదం తిందువు గాని రా!” అని పిలిచింది పెద్దమ్మ.
బుద్ధిగా ఆకుపట్టుకుని వెళ్ళాడు. “చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? భడవ” అంది పెద్దమ్మ. ఓ చిరునవ్వు నవ్వి లొట్టలేసుకుంటూ ప్రసాదం తిన్నాడు రుద్ర.
పూర్వం రోజుల్లో కర్రల పొయ్యి మీద వంట చేసేవారు. పొయ్యి మీద నుంచి గిన్నెను దించేటప్పుడు చెయ్యి కాలకుండా గుడ్డ, కాగితం లేదా ఆకులను ఉపయోగించేవారు.
అప్పుడప్పుడూ పాలు లేదా చారు పొంగిపోతాయని గభాలున వట్టి చేతులతో దించడానికి ప్రయత్నం చేసేవారు. చెయ్యి చురక గానే కాగితం లేదా గుడ్డ ఉపయోగించేవారు.
చెయ్యి కాలిన తర్వాత గుడ్డ ఉపయోగించినా ఫలితం ఏముంది మంట తప్పలేదు అని చెప్పే సందర్భంలో “చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం” అనే సామెత వాడుక లోకి వచ్చింది.
ఏదైనా కష్టం, నష్టం జరగక ముందే జాగ్రత్త పడాలి. జరిగిన తర్వాత లబోదిబో మన్నా, జాగ్రత్త పడినా ఉపయోగం లేదని ఆ నష్టాన్ని పూడ్చలేమని ఈ సామెత తెలియచేస్తోంది.
(మన తెలుగు కథలు.కాం అంతర్జాల పత్రికలో 17-7-24 న ప్రచురితమైంది.)
