STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

3.4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories Inspirational

ఇచ్చకాలు

ఇచ్చకాలు

2 mins
97


1. ఇచ్చకాలు (సామెతల కథ)
*****************************
చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో కాకులు, గుడ్లగూబలు కలిసి మెలసి జీవించేవి. ఇచ్చకం అనే గుడ్లగూబ పొరుగున ఉన్న కాకి దగ్గరికి వెళ్ళి ”కాకి బావా! కాకి బావా! ఏం చేస్తున్నావ్? పండుగ కట్నం ఏమిచ్చాడు మీ మామ?" అని అడిగింది. 

“రెక్కాడితే కానీ డొక్కాడదుగా! ఆహారానికి బయటికి వెళ్లి ఇప్పుడే వస్తున్నాను. ఎప్పుడో వెళ్లిపోయిన పండుగ సంగతి ఇప్పుడెందుకు?" అంది కాకి. 

“పోనీ ఊళ్ళో సంగతులేంటో చెప్పొచ్చుగా!” అంది ఇచ్ఛకం.

 “ఏమో నాకేం తెలుసు నేను ఇతరుల విషయాలు పట్టించుకోను” అంది కాకి ముక్తసరిగా.

"అవునులే, నీకు ఎంగిలి మెతుకులు ఏరుకోడానికే సమయం సరిపోదు... ఇంక అందరి సంగతులు ఏం పట్టించుకుంటావు?" అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇచ్ఛకం.

అలా ఒక్కొక్కరిని అడుగుతూ చిలుక దగ్గరికి వెళ్ళింది ఇచ్చకం.

 “అత్తమ్మా బాగున్నావా?" అని ప్రేమగా అడిగింది. 

“ఏంటి సంగతి ఇలా వచ్చావు?" అని అడిగింది చిలుక. 

“హ ఏముంది క్షణం తీరిక లేదు కడుపుకి తిండి లేదు అన్నట్లు అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునే సరికి కాలం గడిచిపోతోంది. నువ్వు పలకరిస్తే చక్కగా జవాబిచ్చావు, కానీ ఆ కాకి బావ చూడు, ఎవరి సంగతులూ పట్టించుకోడట. ఎంత బడాయో మరి” అని జవాబిచ్చి రివ్వున ఎగిరి పోయింది ఇచ్చకం.

 అలా ఒకరి మాటలు ఇంకొకరి దగ్గర చెప్తూ జమిందారు కాకి ఇంటికి వెళ్ళింది. “జమిందారు బాబాయ్ నువ్వు మీ అల్లుడికి పండగ కట్నం ఇవ్వలేదని నిన్ను తిడుతున్నాడుట. ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను.” అంది ఇచ్చకం. 

“ఔనా నువ్వు మంచిదానివి కాబట్టి చెప్పావు, వాడి సంగతి ఇప్పుడే చెప్తా" అని కోపంగా ఎగురుకుంటూ అల్లుడు దగ్గరికి వెళ్ళింది జమిందారు కాకి. “హమ్మయ్య నా కడుపు ఉబ్బరం తీరింది” అనుకుంటూ కూనిరాగాలు తీస్తూ కూర్చుంది గుడ్లగూబ. కాసేపటి తర్వాత జమిందారు కాకి, అల్లుడు కాకి రెండు ఇచ్చకం దగ్గరికి వచ్చాయి. వాటిని చూడగానే “పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టు” అయ్యింది. “నా దగ్గర మా మామ గురించి, మా మామ దగ్గర నా గురించి చెడ్డగా చెప్పావు. నిజానిజాలు ఇప్పుడు తేలాల్సిందే! లేకుంటే మామధ్య స్పర్థ ఇంకా పెరిగిపోతుంది.” అని గట్టిగా నిలదీసింది అల్లుడు కాకి. ఈలోగా మరికొన్ని కాకులు, పక్షులు అక్కడికి చేరాయి. “అవును ఇచ్చకం ఇలాగే చెప్తుంది. ఇంతకు ముందు కూడా దీని మాటలు విని మేమంతా గొడవలు పడ్డాం. మా కుటుంబాలకు దూరమయ్యాం. దీని అంతు చూడాల్సిందే!" అన్నాయి పక్షులన్నీ. 

"ఇచ్చకాలు చెప్పే బుద్ధి ఉన్నవాళ్లు మన మధ్య ఉండకూడదు" అని పక్షులన్నీ కలిసి అన్ని గుడ్లగూబలను వెంట తరిమాయి. అలా కాసేపటికి చీకటి పడింది. పక్షులన్నీ చీకట్లో ఎగరలేక వాటి గూటికి తిరిగి వచ్చేశాయి. గుడ్ల గూబలు మాత్రం “బ్రతుకు జీవుడా అనుకుంటూ” చీకట్లో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి.

 “ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా” అని నీ వల్ల మా అందరికి కూడా ప్రాణహాని కలిగింది ఇక మీదట అయినా ఇచ్చకాలు చెప్పడం మానుకో” అని గుడ్లగూబలన్నీ ఇచ్చకాన్ని తిట్టి పోశాయి. తప్పును తెలుసుకుని మౌనంగా ఉండిపోయింది ఇచ్చకం. కాకులకు భయపడి నాటినుంచి పగటిపూట తిరగడం మానేశాయి గుడ్లగూబలు.

(ప్రజాశక్తి స్నేహలో 18-2-2024 న ప్రచురితమైంది)


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন