ఆకతాయి చిట్టెలుక
ఆకతాయి చిట్టెలుక
ఆకతాయి చిట్టెలుక
**********************
వరహాలు శెట్టి అనే షావుకారు ఎలుకల బాధపడలేక ఒక తెల్లని జూలు పిల్లిని పెంచుకున్నాడు. తన దగ్గరికి వచ్చేవారికి ఆ పిల్లి గురించి ఎన్నో గొప్పలు చెప్పేవాడు. నిజానికి ఆ పిల్లికి తగని భయం. అందులోనూ చురకత్తుల్లాంటి పళ్ళున్న చిట్టెలుక అంటే మరీ భయం. పిల్లి షావుకారు చుట్టూ తిరుగుతూ ఉండేది. అతను పోసిన పాలు తాగి హాయిగా గుర్రు పెట్టీ నిద్రపోయేది.
ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ పిల్లికి భయపడేవి. కానీ చిట్టెలుక మాత్రం పిల్లి ఆట కట్టించాలని అనుకునేది. ఒకరోజు షావుకారు లేని సమయం చూసి దుకాణంలోకి వెళ్ళింది. ఒక జెమ్స్ బిళ్ళల పేకెట్ ని కొరికింది. అందులోనుంచి ఒక బిళ్ళ తీసి చప్పరించింది. భలే రుచిగా ఉంది. తన మిత్రులందరికీ చడీ చప్పుడు లేకుండా రమ్మనమని సైగ చేసింది. అందరికీ తలో ఒక బిళ్ళ ఇచ్చింది. ఎలుకలన్నీ లొట్టలేసుకుంటూ తిన్నాయి. చిట్టెలుక మాత్రం పిల్లి కోసం వెతికింది. గుమ్మంలో హాయిగా నిద్రపోతూ పిల్లి కనిపించింది. ఇదే మంచి సమయం అని భావించి గురిచూసి జెమ్స్ బిళ్ళని పిల్లి వైపు విసిరింది. అది కాస్తా వెళ్ళి పిల్లి ముక్కుకి గట్టిగా తగిలింది. ఆ దెబ్బకి తుళ్ళిపడి లేచింది . ఎదురుగా చిట్టెలుక కనబడేసరికి బయటకు పరుగు తీసింది. దాని వెనకాలే చిట్టెలుక కూడా వెళ్ళి "పిల్లి బావా! ఎందుకలా పరిగెత్తావు" అని ఏమీ తెలియని నంగనాచిలా అడిగింది.
“ నా ముక్కు మీద ఏదో గట్టిగా తగిలి నొప్పి పెట్టడంతో తెలివి వచ్చింది. ఎదురుగా నిన్ను చూసేసరికి భయం వేసి పారిపోయాను.” అంది పిల్లి.
“నువ్వు నన్ను కొరకవు కదా!” అని అడిగింది పిల్లి. దానికి చిట్టెలుక నవ్వుతూ “నేను నిన్నెందుకు కొరుకుతాను?” అంది.
“నువ్వు అన్నిటినీ కొరికి పాడుచేస్తావని షావుకారు అంటూ ఉండగా విన్నాను, అందుకే అడిగాను” అంది పిల్లి.
“ఓ అదా! సరే కానీ, మనిద్దరం నేస్తం కడదామా!” అని అడిగింది చిట్టెలుక.
“సరే కానీ నాకు నువ్వంటే భయమని నీ మిత్రులకు చెప్పొద్దు.” అంది పిల్లి.
ఎవ్వరూ చూడని సమయంలో పిల్లి, చిట్టెలుక ఆడుకునేవి. ఒక్కోసారి చిట్టెలుక, పిల్లి తోక కొరకడం, మీసాలు పట్టి లాగడం చేసేది. పిల్లికి కోపం వచ్చి ఆలిగేది.
ఒకరోజు పిల్లి బాగా ఆలోచించింది. “చిట్టెలుకా! చిట్టెలుకా! మనిద్దరం ఏదైనా పందెం వేసుకుందాం. నువ్వు గెలిస్తే నీ ఇష్టం. నేను గెలిస్తే మాత్రం నువ్వు నన్ను అల్లరి పెట్టకూడదు.” అంది పిల్లి.
“సరే! నేను ముందు పరిగెడతాను. నువ్వు నా వెనక పరుగెత్తి నన్ను పట్టుకో. నేను దొరికితే నువ్వు గెలిచినట్లు. నేను నీకు దొరకక పోతే నేను గెలిచినట్లు” అంది చిట్టెలుక.
“ఓ సరే. పరుగెత్తు.” అంది పిల్లి.
పిల్లికి దొరక్కుండా ముప్ప తిప్పలు పెట్టింది
చిట్టెలుక. ఆఖరుగా సన్నటి గొట్టంలో దూరింది. ఎలాగైనా చిట్టెలుకను పట్టుకోవాలన్న కోరికతో ముందువెనుక ఆలోచించకుండా ఆ గొట్టంలోకి బుర్ర దూర్చింది పిల్లి. అంతే బుర్ర గొట్టం లో చిక్కుకు పోయింది. చిట్టెలుక రెండోవైపు నుంచి బయటకు వచ్చి పిల్లి తోకను కొరికింది. గొట్టం నుంచి తల బయటకి రాక, చిట్టెలుకను ఏమీ చేయలేక ఓటమిని ఒప్పుకుంది పిల్లి. అప్పుడు చిట్టెలుక గొట్టాన్ని కొరికి పిల్లిని పిల్లిని కాపాడింది. మర్నాటినుంచి తన అల్లరిని కొనసాగించింది చిట్టెలుక.
(విప్ర వాణికి సెప్టెంబర్ - అక్టోబర్ సంచికలో ప్రచురితమైంది)
