దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి
******************************************
కిరోసిన్ దీపాలు, కరెంటు అందుబాటులో లేని రోజుల్లో మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఆ వెలుగులో ఇంటిపనులన్నీ చక్కబెట్టుకునేవారు. ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రమే దీపం వెలుగుతూ ఉంటుంది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ దీపం ఆరిపోకముందే త్వర త్వరగా అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరుకునేవారు. గడియ గటక్ దివ్వె దిటక్ కుక్కి మంచం మీద కూలబడి అనుకుని హాయిగా కునుకు తీసేవారు. దీని వెనుక ఆసక్తి కరమైన కథ వుంది.
చాలాకాలం క్రితం జిమిడిపేట గ్రామంలో రొడ్డయ్య, రొడ్డమ్మ దంపతులునివసిస్తూ ఉండేవారు. వారిది వ్యవసాయ కుటుంబం. వారికి ఒక్కగానొక్క కొడుకు. వయసు పై బడటం తో అన్ని బాధ్యతలు కొడుక్కి అప్పచెప్పాడు రొడ్డయ్య.
తొలకరి చినుకు పడగానే అందరూ పొలం పనులు ప్రారంభించే వారు. రొడ్డయ్య కొడుకు మాత్రం ధీమాగా కూర్చునేవాడు. అదును తప్పిన తరువాత పంట సాగు చేసేవాడు. దానివల్ల పంట సరిగ్గా పండేది కాదు. ఎప్పుడూ పంటనష్టమే. రొడ్డయ్య కొడుక్కి పెళ్లి సంబంధాలు రావడమే కష్టం. ఇంకా స్థిరపడలేదు కాబట్టి. వచ్చిన సంబంధాలను కూడా “అప్పుడే చేసుకోను” అని తిరస్కరించేవాడు.
కొన్నాళ్ళకి రొడ్డయ్య, రొడ్డమ్మ కాలం చేసారు. రొడ్డయ్య కొడుకు ఒంటరి వాడయ్యాడు. దగ్గరి బంధువులంతా వచ్చి ఓదార్చారు. “పెళ్లి చేసుకుని ఉంటే, పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండేవాడివి.
అదును తప్పిన వ్యవసాయం వయసు తప్పిన పెళ్లి ఒకలాంటివే. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ ఊరికే అనలేదు ఇప్పుడు బాధపడి ఏం లాభం?” అన్నారు బంధువులంతా.
చేసిన తప్పును తెలుసుకున్నాడు రొడ్డయ్య కొడుకు. దీపం ఉంటే వెలుగు లేకుంటే చీకటి
సకాలం లో మన పనులు పూర్తి చేసుకోవాలని లేకపోతే చీకటి అవరిస్తుందని ఈ సామెత తెలియచేస్తోంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి నాలుగు పైసలు వెనకేసుకోవాలి. కానీ నేటి యువతరం విలాసాలకు అలవాటు పడి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు పైసలు సంపాదించవలసిన వయసులో నిమ్మకు నీరెత్తినట్లు పనీపాటా లేకుండా ఖాళీగా తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అందువల్ల వారి జీవితం చీకటి మయం అంటే కష్టాల మయం అవుతుందని ఈ సామెత తెలియచేస్తోంది. కాబట్టి నిర్ణీత సమయం లోనే పనులు పూర్తి చేసుకోమని చెప్తోంది ఈ సామెత.
(తపస్వి మనోహరం వారపత్రికలో 21-7-2024 న ప్రచురితమైంది)
