అన్నం పెట్టిన ఇంటికి కన్నం
అన్నం పెట్టిన ఇంటికి కన్నం
“విశాలం నీకీ విషయం తెలుసా?” అని దీర్ఘం తీస్తూ అడిగింది ప్రభావతి.
“తల తోక లేకుండా అడిగితే నాకేం తెలుస్తుంది చెప్పు నాకసలే వినబడి చావదు” అంది విశాలం ముక్కుమీద కళ్ళజోడు మీదకి తోస్తూ. ఇరుగు పొరుగు ఇద్దరూ డెబ్భైయ్యో ఒడిలో ఉన్నవారే. అప్పుడప్పుడూ వీధి గుమ్మంలో కూర్చుని కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
సరిగ్గా అప్పుడే ఎదురింటి మీనాక్షి బయటికి వెళ్తోంది. అది చూసిన ప్రభావతి “ఇదిగో అమ్మాయి ఇలారా?” అని పిలిచింది.
“పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను మామ్మగారు. నాతో ఏమైనా పని ఉందా” అని అడిగింది మీనాక్షి.
“నాకు తెలియక అడుగుతాను. నీ పిల్ల ఆచూకీ దొరికిందా?”
“లేదు మామ్మ గారూ అది కనుక్కోవడానికే పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను.”
“ధైర్యంగా ఉండమ్మా! కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా! అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేశాడు. అలాంటి వెధవల్ని వదలకూడదు” అని శాపనార్థాలు పెట్టింది ప్రభావతి.
'ఈ ముసలావిడ వదిలేటట్లు లేదని' “నేను వెళ్ళొస్తా మామ్మ గారు” అని చెప్పి వెళ్ళిపోయింది మీనాక్షి.
“నువ్వు ఏదో చెప్తున్నావు... సరిగ్గా చెప్పు ప్రభావతీ. నాకసలే వినబడి చావదు.” అంది విశాలం.
“మీనాక్షి భర్త కరోనాతో కాలం చేశాడు. ఇద్దరు ఆడపిల్లలు. నా అనే వారు లేరు. కష్టపడి, కాణీ పరక సంపాదించి పిల్లల్ని పెంచి పెద్దచేసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. కాస్త నిలదొక్కుకుంటోంది అనే సమయంలో అవివేక్ అనే అబ్బాయి పరిచయమయ్యాడు. “అక్కా అంటూ వరస కలిపాడు. అనాధనని చెప్పి ఇంట్లోకి చేరాడు.
మీనాక్షి అతడిని బాగా నమ్మింది. సినిమాలకు షికార్లకు కలసి వెళ్ళేవారు. మీనాక్షి ఇంట్లో లేని సమయం చూసి మాయమాటలు చెప్పి పెద్ద కూతురిని తీసుకుని పరారయ్యాడు అవివేక్. జరిగిన సంగతి తెలుసుకుని లబోదిబో మంటూ పోలీసులనాశ్రయించింది మీనాక్షి.” అని వివరించింది ప్రభావతి.
“ఈ కథంతా నాకు తెలుసులే! అన్నం పెట్టిన ఇంటికి కన్నం అంటే ఏమిటో చెప్పు.” అంది విశాలం.
“పూర్వం వడ్డాది గ్రామంలో వరహాలమ్మ నివసిస్తూ ఉండేది. ఆమెది దయగల మనస్సు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ “అమ్మా ఆకలి” అంటూ ఒక యువకుడు వరాహాలమ్మ ఇంటిదగ్గరికి వచ్చాడు.
'పాపం ఎప్పుడు ఎంగిలి పడ్డాడో ఏమో' అని మనసులో అనుకుని కడుపు నిండా భోజనం పెట్టింది. అతడు తిన్న తరువాత సామాన్లు పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది వరహాలమ్మ. ఈలోగా మంచం తలకట్టున ఉన్న డబ్బులు బంగారం పట్టుకుని ఉడాయించాడు యువకుడు.
కాసేపటి తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబోమంది వరహాలమ్మ. “అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెట్టడమంటే ఇదే” నని వివరించింది ప్రభావతి.
(షార్ వాణి పత్రిక అక్టోబర్ 2024 సంచికలో ప్రచురితమైంది)
