Chandini Balla

Inspirational Others Children

5.0  

Chandini Balla

Inspirational Others Children

ఎర్ర వర్ణం #సూటిగా మాట్లాడాలి

ఎర్ర వర్ణం #సూటిగా మాట్లాడాలి

4 mins
450


హిందీ క్లాసులో పిల్లలందరూ గోలగా ఉన్నారు, "ఇక అల్లరి చాలు, ఈ రెండు చాప్టర్లు చదవండి, ప్రశ్నలు అడుగుతాను" అంది స్కూల్లో కొత్తగా వచ్చిన వర్ణ టీచర్.

కాసేపు అయ్యాక ప్రశ్నలు అడుగుతూ, పక్కన అమ్మాయితో నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్న అమ్మాయిని చూసి "రమ్యా, నువ్వు చెప్పు ఈ ప్రశ్న కి సమాధానం" అంటూ లేచి నిలబడమని చెప్పింది.

ఇబ్బందిగా, బెదురుగా డ్రెస్సు సర్దుకుంటూ లేచి నిలబడింది రమ్య, వెనక బెంచీలో కూర్చున్న అనిల్, నవీన్ గుస గుస లాడుకుంటూ నవ్వడం మొదలు పెట్టారు.

రమ్యకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి,వెంటనే పరిస్తితి అర్థమయ్యిన వర్ణ ఆ అబ్బాయిలని "పుస్తకం లోకి చూడండి, వెదవ అల్లరి మీరు" అని క్లాసు లీడర్ నీ పెట్టీ రమ్య నీ తీసుకుని వెళ్ళింది.

గత నెల రజస్వల అయిన రమ్యకి సానిటరీ నాప్కిన్ వాడకం సరిగ్గా తెలియక బట్టలు పాడు అయ్యాయి.ప్రిన్సిపాల్ తో మాట్లాడి స్కూల్ ప్రింటు ఉన్న కొత్త యూనిఫాము సెట్ల నుండి ఒకటి తీసి ఇచ్చి ,సైన్సు టీచర్ పద్మ తో మాట్లాడి, రమ్యని తీసుకుని తిరిగి క్లాసుకు వెళ్ళింది వర్ణ.

"ఈ రోజు మీ అందరికీ ఉపయోగకరమైన సైన్సు పాఠం చెప్తాను నేను" అంటూ మొదలు పెట్టి, కౌమారంలో ఆడపిల్లలు, మగపిల్లల ఎదుగుదల గురించి చెప్తుండగా ఆడపిల్లలు సిగ్గుతో తల దించుకొనీ, గుస గుసలు ఆడటం, మగపిల్లలు ముసి ముసి నవ్వులు నవ్వడం చూసింది.

డస్టర్ తో టేబుల్ పైన కొట్టి,అనిల్ నీ లేపి "ఎందుకు నవ్వొస్తుంది మీకు" అని అడిగింది సూటిగా.

తల దించుకుని నించున్నాడు, "ఇందులో నవ్వవలసిన అవసరం లేదు, సిగ్గు పడనక్కర్లేదు. అందరూ ఆడవాళ్ళు ప్రతి నెల ఎదుర్కునే విషయం ఇది, ఇంట్లో మీ తల్లి, అక్క, చెల్లి అందరూ అనుభవించేది. వీలైతే ఇంట్లో ఆడవారికి ఆ సమయంలో సహాయం చేయండి, వెక్కిరించద్దు" అంటూ బహిష్టుకు పూర్వ లక్షణాలు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలో ఇంటి చిట్కాలు కూడా చెప్పింది వర్ణ.

అనిల్ ని కూర్చోమని చెప్పి, క్లాసు పూర్తి అయ్యాక స్టాఫ్ రూమ్ కి వెళ్ళింది. పద్మ "అలా అందరికీ ఒకేసారి చెప్పడం సిగ్గుగా అనిపించలేదా మీకు" అని అడిగింది ఆశ్చర్యంగా.

"ఇందులో సిగ్గు పడడానికి ఏముంది, ఇలా ఎవరూ మాట్లాడకుండానే అది నిషిద్ధ విషయంగా మార్చాము, దాని వల్ల ఎంతో మంది ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. ఎలాగో టీ వీ లో రక రకాల కంపెనీలు ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు, అదేదో మనమే పిల్లలకి అర్థమయ్యేలా చెప్తే, అక్కర్లేని ఆతృతతో నెట్, యూట్యూబ్ లలో వెతకాల్సిన అవసరం రాదు వాళ్ళకి.

మనం ఎప్పుడూ ఆడపిల్లలకి విడిగా, మగపిల్లలకు విడిగా క్లాసు తీసుకుంటాం ఇటు వంటివి, అది మంచి పద్దతి కాదు,ఒక వైపే నేర్పుతున్నాము మనము, ఆడపిల్లల్లో వచ్చే మార్పులు మగపిల్లలకు కూడా తెలియాలి,ఇలాంటి నిషిద్ధ విషయాలు సూటిగానే చెప్పాలి, అపుడే వాళ్ళు ఆడవారికి గౌరవం ఇస్తారని నా అభిప్రాయం, ఆడవారిమైన మనమే ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి, రేపు మన పిల్లలు ఇదే సమస్య ఎదుర్కుంటారు, అప్పుడు ఏదోకటి చేస్తాం కదా, అలాగే మనం చదువు చెప్పే పిల్లలు మన పిల్లలతో సమానం ఏ కదా!!" అని తోటి టీచర్లకు అర్థమయ్యేలా చెప్పింది,ఆమె చెప్పింది సబబే అని అనుకున్నారు.

పద్మ ఇకపై "సెక్స్ ఎడ్యుకేషన్" క్లాసు ఇద్దరికీ కలిపి చెప్పాలి, అప్పుడే ఆ వయసు వాళ్ళకి లేని పోని అపోహలు, ఉత్సుకత తగ్గుతాయని అనిపించింది.

ప్రిన్సిపాల్ గారి దగ్గర కూడా మాట్లాడి ఆడపిల్లల కోసం కొన్ని సానిటరీ నాప్కిన్లను తెప్పించాలని, అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళ్లక్కర్లేకుండా వాడుకునెలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది.

అక్కడితో ఆగకుండా కంప్యూటర్ మాస్టారుతో మాట్లాడి టాయిలెట్లలో ప్యాడ్లను ఎట్లా వాడాలో,పరిశుభ్రంగా ఎలా ఉండాలో పోస్టర్లు పెట్టించింది.

ఈ మార్పులన్నీ చూసి ప్రిన్సిపాల్ మేడంకు గాబరా మొదలు అయింది, తల్లి తండ్రులు ఏమని అనుకుంటారు అని.

కొన్ని రోజుల తరువాత, వర్ణ ను ఆఫీసుకి రమ్మని పిలిచారు ప్రిన్సిపాల్ గారు. ఒక చిన్న కాగితం చేతిలో పెట్టారు, అందులో

"డియర్ టీచర్,

ఒక మగపిల్లవాడు తల్లిగా వాడికి నేను చాలా విషయాలు చెప్పలేను, మీరు మొన్న చెప్పిన క్లాసు ప్రభావమో ఏమో కానీ మా వాడు నాకు నెలసరి వచ్చినపుడు ఎపుడూ లేనిది "అమ్మా, మంచినీళ్ళు కావాలా? ఏమైనా చేయనా సాయం" అంటూ వచ్చాడు.

ముందు ఆశ్చర్యం వేసినా తరువాత చాలా సంతోషంగా అనిపించింది, నేను సిగ్గుతో,భయంతో చెప్పలేని విషయాలు మీరు అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు.

ఇట్లు,

సరళ, అనిల్ తల్లి"

చిరు నవ్వుతో ప్రిన్సిపాల్ వైపు తిరిగి చూసింది, "నిజం చెప్పనా వర్ణ, ఇవన్నిటిని తల్లి తండ్రులు ఎలా తీసుకుంటారు అని ఆందోళన పడిన నాకు ఈ ఉత్తరం సమాధానం అయింది, థాంక్స్" అని ధన్యవాదాలు తెలిపింది వర్ణకు.

****

మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో "ఋతు చక్రం" ఒక నిషిద్ధ విషయం. దాని గురించి పిల్లలకు సూటిగా, ఎంత అర్థమయ్యేలా చెప్తే అంత మంచిది, ఆ బాధ్యత ఉపాధ్యాయులపై కూడా ఉందని నా అభిప్రాయం. ఎన్నో సంస్థలు దీనిని అరికట్టడానికి ఆ సమయంలో వాడే వస్తువులు ఉచితంగా ఇచ్చేలా పోరాడుతున్నారు, ఎందుకంటే వస్తువుల ఖరీదు వల్ల, "పింక్ టాక్స్" వల్ల వాటిని కొనుగోలు చేయలేక స్కూలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. స్టిగ్మా బ్రేక్ చేయాలి అంటే సూటిగా మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది.


ఆ వయసు వారు ఎక్కువ గడిపే సమయం పాఠశాల, కళాశాల, అందుకే ఉపాధ్యాయులు ఈ విషయంపై మరింత శ్రద్ధ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

ఇది కల్పిత కథ మాత్రమే, కౌమారంలో ఆడపిల్లలు ఎదుర్కున్న ఇబ్బందుల ఆధారంగా రాసిన కథ, మీకు నచ్చుతుందని ఆశిస్తూ సెలవు.

ధన్యవాదాలు🙏🙏


~వెన్నెల రాగ



Rate this content
Log in

Similar telugu story from Inspirational