Venkata Rama Seshu Nandagiri

Children Stories

5.0  

Venkata Rama Seshu Nandagiri

Children Stories

భగవద్గీత - ప్రాముఖ్యత

భగవద్గీత - ప్రాముఖ్యత

2 mins
612


ఆరోజు ఆదివారం. పిల్లలు రాజేష్ , రమేష్ కూర్చొని బాలభారతం చూస్తున్నారు. వాళ్ళ అమ్మ సుధ వంటలో బిజీగా వుంది. నాన్న శేఖర్ బెడ్రూం లో ఏదో సర్దుకుంటున్నాడు.

ఇంతలో హఠాత్తుగా టివి శబ్దం ఆగిపోయింది. పిల్లల గొడవ గట్టిగా వినపడుతోంది. అమ్మా , నాన్నా ఇద్దరూ ఒకే సారి పరుగెత్తుకొచ్చారు.

"నాకిష్టం లేదు, అందుకే కట్టేశాను." చిన్నవాడు రమేష్

అరుస్తున్నాడు.

"ఏమిట్రా ఆ అల్లరి, టివి పెట్టి చూసుకోమన్నా గొడవేనా? ఇలాగైతే టివి ఎప్పుడూ. పెట్టనివ్వను." తల్లి సుధ మందలించింది.

"చూడమ్మా , యుద్ధం మొదలైంది, వీడు టివి కట్టేశాడు." రాజేష్ తమ్ముడి మీద ఫిర్యాదు చేశాడు.

సుధ ఏదో అనబోతుంటే వారించి "సుధా, నీ వంట చూసుకో. నేను వీళ్ళని చూసుకుంటాను." ఆంటూ శేఖర్ పిల్లలిద్దరి భుజాల మీద చేతులువేసి దగ్గరకు తీసుకొని సోఫాలో కూర్చోపెట్టాడు.

"చూడండి, మీ గొడవ నాకర్ధమైంది. నువ్వు యుద్ధం

చూద్దామనుకుంటే తమ్ముడు టివి కట్టేశాడు. అవునా." అన్నాడు శేఖర్ రాజేష్ ని ఉద్దేశించి.

"అవును నాన్నా, వాడికి యుద్ధం అంటే ఇష్టం ఉండదు. ప్రతిసారి ఏ సినిమా లో యుద్ధం వచ్చినా అలాగే చేస్తాడు." అన్నాడు రాజేష్ చిరుకోపంతో.

"నీకు యుద్ధం అంటే ఎందుకు ఇష్టం లేదు నాన్నా?" ప్రేమగా తలనిమురుతూ అడిగాడు శేఖర్ చిన్నవాడిని.

"నాకు భయం నాన్నా. అయినా యుద్ధం చేయకూడదు కదా. కొట్టుకోవడం తప్పు అని మీరే చెప్తారు కదా. మరి యుద్ధం చూసి, మేమూ అలాగే కొట్టుకోవాలా?" చేతులు, తల ఊపుతూ అభినయిస్తూ అడుగుతున్న చిన్నకొడుకు రమేష్ ని చూస్తే నవ్వొచ్చింది శేఖర్ కి.

"యుద్ధం అంటే ఏమిటీ? ఇద్దరు మనుషుల మధ్య అయితే గొడవ. రెండు రాజ్యాల మధ్య అయితే యుద్ధం. ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ రెండుగా విడిపోయి యుద్ధం చేస్తే మహా యుద్ధం. అదే మహాభారతం, మీరు ఇప్పటి దాకా చూసింది." అన్నాడు శేఖర్ చిరు నవ్వుతో.

"అది చూద్దామంటేనే వీడు కట్టేశాడు, ఇంతలో కరెంట్ కూడా పోయింది." అన్నాడు రాజేష్ కినుకగా.

"యుద్ధం చూడకూడదు, తప్పు. కదా నాన్నా." అన్నాడు రమేష్ తండ్రిని తనవైపు తిప్పుకుంటూ.

"మీఇద్దరూ గొడవెందుకు పడ్డారు? టివి చూడడం కోసం‌, కదా. అలాగే మహాభారతం లో అన్నదమ్ముల పిల్లలు రాజ్యం కోసం గొడవ పడ్డారు." శేఖర్ ఒక నిమిషం ఆగి వారిద్దరి వైపు చూశాడు.

"అప్పట్లో టివి, క్రికెట్ లేవేమో కదా నాన్నా." అమాయకంగా అడుగుతున్న చిన్న కొడుకును చూసి నవ్వేశాడు శేఖర్.

"వాళ్లు చిన్న పిల్లలు కారు కదా. పెద్దయ్యాక నాదీ రాజ్యం అంటే నాది అని గొడవ పడినప్పుడు, మిగిలిన రాజ్యాలలో కొంతమంది కౌరవులకి, మరి కొంత మంది పాండవులకి యుద్ధం లో సహాయం చేశారు. అందుకే అది మహా భారత యుద్ధం అయింది." పిల్లలకు వివరంగా చెప్పాడు శేఖర్.

"శ్రీ కృష్ణుడు పాండవుల వైపు కదా నాన్నా." ఆసక్తిగా అడిగాడు రాజేష్.

"అవును. ఆయన ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాడు. పాండవులకి తండ్రి లేరు. కానీ కౌరవులకు

తండ్రి ధృతరాష్ట్రుడు. ఆయనే మహారాజు. ఆయనకి కళ్ళులేవు. యుద్ధం చూడాలని ఉన్నా చూడలేరు, కనుక సంజయుడు అనే అతనిని యుద్ధం గురించి ప్రతీ విషయం వివరంగా చెప్పమంటారు." మరింత వివరంగా చెప్పాడు శేఖర్.

"ధృతరాష్టృడు కౌరవులకి నాన్న , కాబట్టి యుద్ధం చూడాలి, అనుకున్నారు. మరి మనం ఎందుకు తెలుసుకోవాలి?" రమేష్ ప్రశ్నించాడు.

"ఎందుకంటే యుద్ధం చేసినప్పుడు, కొందరు అన్యాయం చేసైనా గెలుద్దామని అనుకుంటారు. కొందరు న్యాయంగా గెలవాలని ప్రయత్నిస్తారు. ఈ యుద్ధం లో ఎవరు ఎలా గెలిచారు అన్నది తెలుసుకోవడానికి. మనకి మంచీ - చెడు, న్యాయం - ధర్మం లాంటి విషయాలు తెలియాలంటే పురాణాలు చదవాలి. అందులో భగవద్గీత అయితే మనిషికి వచ్చే సమస్యలన్నిటికీ ఏదో రూపంలో పరిష్కారం

చెప్తుంది. అందుకోసం మనం భగవద్గీత చదవాలి." వివరించాడు శేఖర్.

"నాన్నా మాకు భగవద్గీత లోని విషయాలన్నీ చెప్పండి, మేం వింటాం." అన్నారిద్దరూ ఏకకంఠంతో ఉత్సాహంగా.

"తప్పకుండా. మనకు వీలైనప్పుడల్లా నేర్చుకుందాం." అంటూ ఇద్దరినీ దగ్గరకు తీసుకొన్నాడు శేఖర్.

                           ....సమాప్తం....



Rate this content
Log in