Dinakar Reddy

Children Stories Inspirational Children

5.0  

Dinakar Reddy

Children Stories Inspirational Children

బంగారు వాన సినుకు

బంగారు వాన సినుకు

2 mins
365


రైతు ముల్లు కర్రతో పొడిస్తే అందేంత దగ్గర మేఘాలు ఉండేవి అప్పట్లో అని మా నాయన అనేవోడు. 


ఇప్పుడు ఎక్కడ చూసినా వానలు సరిగ్గా కురవక రైతులు పడే ఇబ్బందులు, అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలు, కనీస మద్దతు ధర, రైతుల ఆత్మ హత్యలు. ఇవే. ఇవే కదా వార్తలు. వార్తా పత్రికల నిండా ఇవే కదా. నేను చదవను నాన్నా అని ఆ రోజు దిన పత్రిక విసిరి కొట్టాను.


నాన్న రోజూ అర గంట సేపు పేపరు చదవకపోతే ఒప్పుకునే వారు కాదు. న్యూస్ పేపరు సదివే స్కూలుకు పోవాలి.

అయినా సినిమా పేజీనో క్రికెట్ వార్తలో అయితే మనకు ఆసక్తి ఉంటుంది కానీ ఈ రైతుల ఆత్మ హత్యలు, రాజకీయాలు ఇవన్నీ ఎవడికి చదవబుద్ధి అవుతుంది. అందుకే ఈ రోజు నాన్న ముందు నా విసుగును చూపించినా. అమ్మ నన్ను అరిచి స్కూలు టైమ్ అయ్యింది వెళ్ళమని క్యారేజీ చేతికిచ్చి పంపేసింది.


నాన్న ఏమీ మాట్లాడలా. తరువాత నన్ను న్యూస్ పేపర్ చదవమని కూడా చెప్పనేలేదు.


ఎండా కాలం సెలవులు వచ్చాయి. టౌన్ నుండి పల్లెకు పొయినాము. రోజూ కరెంట్ ఉన్నంత సేపూ టీవీ చూడడం, కరెంట్ పోగానే పోలోమంటూ మామిడి కాయలు, జామ కాయలు ఇంకా చింత కాయల కోసం పరిగెత్తడం.


ఇంతలో ఓ రోజు భలే హడావిడి. అందరూ కుంపట్లు తీసుకుని వరి గడ్డి పెట్టి ఎరువు పోస్తున్నారు.


అమ్మా. ఇదేంటమ్మా అని అడిగాను నేను. 

ఇది మొలకల పున్నమి కోసం నాన్నా అని చెప్పింది అమ్మ.


సొద్దలు, వడ్లు, జొన్నలు, అలసందలు , కందులు, పెసర్లు ,ఉలవలు ఇట్లా నవ ధాన్యాలు కట్టిన గుడ్డలోంచి పలచగా కుంపట్లో పోసి దాని మింద ఆకులు పెట్టి గంప మూసినారు.


రోజూ రెండు సార్లు నీళ్ళు చల్లేది ఆ ధాన్యాలకు. కానీ సూడకూడదు అని చెప్పింది అమ్మ.


తొమ్మిదో రోజుకు తీసి చూస్తే అన్నీ మొలకలు వచ్చినాయి. 

అమ్మా వాళ్ళు పక్కన ఇండ్లల్లో ఉండే ఆడ వాళ్ళు కొత్త చీరలు కట్టి కుంపట్లకు పసుపు కుంకమ పెట్టినారు.


చిన్నా పెద్దా అందరం గుట్ట కాడికి పోయి కుంపట్లో మొలకకొచ్చిన ధాన్యం దేవుని ముందర పెట్టి టెంకాయలు కొట్టుకున్నాం. సామీ దేవుడూ! ఈ సారి మొలకలు బంగారట్టా ఉండాయి. ఇంగ అంతా నీ సల్లని సూపు సామీ అని పెద్దవ్వ మొక్కింది.


బంగారట్టా వానలొస్తాయంట మొలకల పున్నానికి. ఎంత బాగా మొలకలోస్తే అంత బాగా పండుతాయంట పంటలు అని పెద్దవ్వ సెప్పింది.


నాన్న అరగల కాడ కూడా టెంకాయలు కొడదాం అని సెప్తే ఆడ కూడా టెంకాయలు కొట్టుకోని మల్లా గుట్ట కింద తిన్నాలకు వచ్చినాం. 


నేను పీచు మిఠాయి తింటా మండపంలో ఓ పక్కన కూసున్నా. నాన్న వచ్చి నా పక్కనే కూసున్నాడు. 


సూడు నాన్నా. నేను రైతు బిడ్డనే. రైతును కాదు. మన పొలం కౌలుకిచ్చి వాళ్ళు ఇచ్చిందేదో మనం తీసుకుంటున్నాం. కానీ ఎగసాయం అంటే మనకు గిట్టదని కాదు. నువ్వు బాగా సదువుకో. కానీ అయిదు వేళ్ళూ నోట్లోకి పొయ్యేటప్పుడు ఆ అన్నాన్ని     పండించినోడికి దణ్ణం పెట్టుకోవడం మరచిపోవద్దు అని సెప్పినాడు. రైతుని తక్కువగా చూడొద్దు. పత్రికల్లో వచ్చేదీ నిజంగా జరిగేదీ ఒకటేనా అని నువ్వు ఆలోసించాల్రా అని చెప్పి ఎవరో పిలిస్తే నాన్న బయటకు పొయినాడు.


నాకేం పెద్దగా అర్థం కాలా. సరేనని తల వూపినా. ఏండ్లు గడిసిపోయినాయి.


నేను డిగ్రీలోకి వచ్చినా. 


ఓ రోజు నాన్న టీవీ సూస్తా ఉండాడు. నేను ఆ రోజు పేపరులో వ్యవసాయం గురించి రాసిన ఆర్టికల్ ఉన్న పేజీ మడిచి నాన్న కూర్చున్న టీపాయ్ ముందు పెట్టి దొడ్లోకి పొయినట్లే పొయ్యి ఎనకాల నిలబడినా.


నాన్న పేపరు తీసుకుని సదివినాడు. నేను మొలకల పున్నమి గురించి రాసిన వ్యాసం అది. న్యూస్ పేపరు వాళ్ళు బాగుందని వేసినారు. 


నాన్న కండ్ల నుండి నీటి బొట్లు కారి పేపరు మింద పడినాయి. నా కండ్లకు మాత్రం అవి మొలకల పున్నానికి తొలూత భూమ్మీద పడే బంగారు వాన సినుకుల్లా అవుపడినాయి.



Rate this content
Log in