Venkata Rama Seshu Nandagiri

Children Stories

5  

Venkata Rama Seshu Nandagiri

Children Stories

శిక్ష

శిక్ష

2 mins
328


రాజు ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడే వాడికి తరగతి లో అయ్యగార్లు చెప్పే పాఠాలు, చదివిన కథల్లో నీతి వాక్యాలు అర్థమవుతున్నాయి.

ఆరోజు తరగతి లో గాంధీ గారి గురించి పాఠం చెప్తూ ఎవరినీ హింసించ కూడదని, అహింసయే మంచి మార్గమని అయ్యగారు చెప్పారు.

రాజు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న మురళి, ఆయన స్నేహితులు ఆనందంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వారి మాటల ద్వారా రాజుకి వాళ్ళు, నాన్న కలిసి, నలుగురిని పట్టుకుని జైల్లో పెట్టారని, మరో ఇద్దరిని కాల్చడం వలన వాళ్ళు ఆసుపత్రి పాలయ్యారని అర్థమైంది. వచ్చిన నాన్న స్నేహితులు వెళ్లి పోయారు.

అప్పటి దాకా చదువుకుంటున్న రాజు నాన్న టివి చూస్తుంటే తనూ పక్కన కూర్చున్నాడు. నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుని "బాబూ, బాగా చదువు తున్నావా? పాఠాలు అర్థం ఐవుతున్నాయా?" అని అడిగాడు.

"అర్థమవుతున్నాయి నాన్నా. అయ్యగారు చెప్పేవన్నీ నిజాలే కదా నాన్నా!" అడిగాడు రాజు.

"నీకెందుకు అనుమానం వచ్చింది?" నవ్వుతూ అడిగాడు మురళి.

"మరి తరగతి లో ఎవరినీ హింసించ కూడదని చెప్పారు. మీ పోలీసులేమో అందరినీ కొడతారు, జైల్లో పెడతారు. మరి అది తప్పు కాదా! మీకు పాపం రాదా! మీ అయ్యగారు మీకివేం చెప్పలేదా!" తన సందేహాలని బైట పెట్టాడు రాజు.

"అదా నీ సందేహం! మీ అయ్యగారు ఎప్పుడైనా, ఎవర్నైనా కొట్టడం చూశావా?" అడిగాడు. మురళి.

"ఓ, బాగా.అల్లరి పిల్లల్ని , చదవని పిల్లల్ని కొడతారు.

కానీ మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పి మంచిగా మాట్లాడతారు. మరి తప్పు చేస్తే కొట్టాలి కదా." అన్నాడు రాజు.

"మరి వాళ్ళకి పాపం రాదా!" అడిగాడు మురళి.

"రాదు. ఎందుకంటే వాళ్ళని మంచిగా మార్చాలంటే తప్పు చేసినప్పుడు శిక్ష వేయాలట." అన్నాడు రాజు ఉత్సాహంగా.

"మరి మేమూ అదే చేస్తాం. మీరంతా చిన్న పిల్లలు. చిన్న చిన్న తప్పులు చేస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. అందుకని వారికి మేం పెద్ద శిక్ష వేస్తామన్నమాట." అన్నాడు మురళి నవ్వుతూ.

"అయితే మీకు పాపం రాదు కదా నాన్నా." ఆనందంగా అన్నాడు రాజు.

"రాదు బాబు. వీళ్లు చెడ్డవాళ్ళు. మన దేశం లో వాళ్ళు. వీళ్ళని మేం శిక్షిస్తాం. కొందరు వేరే దేశం వాళ్ళు, మన దేశంలోకి బలవంతంగా రావాలని చూస్తారు. వాళ్ళని సైనికులు అడ్డుకుంటారు. మాట వినక పోతే చంపేస్తారు. అయినా పాపం రాదు. ఎందుకంటే వాళ్లు దేశాన్ని కాపాడుతారు కాబట్టి." అన్నాడు మురళి.

"అవునా." కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూసాడు రాజు.

"అవును. ఎందుకంటే, మేం వాళ్ళ మీద కోపంతో చేయం కదా. అల్లరి పిల్లల్ని దారిలో పెట్టడం మీ అయ్యగార్ల పని అయితే, ఇలాంటి వాళ్ళని దారిలో పెట్టడం, అవసరమైతే చంపడం మా పని. ఎవరి పని వాళ్ళు చేస్తే ఏ పాపం రాదు. " వివరించాడు మురళి.

"నాన్నా, ఈరోజు నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్ఛుకున్నాను. నువ్వు కూడా అయ్యగారివే." అన్నాడు రాజు. నవ్వుతూ కొడుకు ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు మురళి.

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।।

నీతి : సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని సమానంగా తీసుకుంటూ - కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ భాద్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.



Rate this content
Log in