M.V. SWAMY

Children Stories Classics

4.3  

M.V. SWAMY

Children Stories Classics

మల్లెపువ్వు.... మందారపువ్వు

మల్లెపువ్వు.... మందారపువ్వు

2 mins
718


         


మల్లెపువ్వు మందారపువ్వు ఇరుగుపొరుగున వుండేవి.మందారపువ్వు ప్రతిరోజూ శివాలయంకి వెళ్లి, శివుని పాదాలకు దండం పెట్టి వచ్చేది. ఒకరోజు మల్లెపువ్వుని కూడా శివాలయానికి రమ్మని పిలిచింది మందారపువ్వు. శివాలయానికి వెళ్లి శివార్చన చెయ్యాలని మల్లెపువ్వుకి కూడా అనిపించి మందారపువ్వుతో గుడికి వెళ్ళింది కానీ అక్కడ శివాలయం ఆవరణలో ఉన్న నందీశ్వరుడు మల్లెపువ్వుని శివుని గర్భగుడిలోనికి వెళ్ళనివ్వలేదు,"నువ్వు అలంకరణకు తప్ప పూజకు పనికిరావు,శివుడు అలంకార ప్రియుడుకాడు కాబట్టి నువ్వు శివుని దర్శనానికి వెళ్లడానికి వీలులేదు"అని శివాలయం బయటకు నెట్టేసాడు నందీశ్వరుడు. మల్లెపువ్వు చిన్నబోయింది,"ఒక్కసారి శివుని దూరంనుండే చూసి వచ్చేస్తాను "అని నందిని వేడుకుంది. అయినా నంది కనికరించలేదు.శివుని పూజకు తాను తప్ప మల్లెపువ్వు పనికిరాదు అని తెలుసుకున్న మందారపువ్వు మనసులో గర్వపడుతూ పైకి మాత్రం "నా మిత్రురాలు కాబట్టి మల్లెపువ్వుని కూడా గుడిలోనికి రానివ్వండి"అని నందేశ్వరుని కోరింది. నందీశ్వరుడు ఆచార విరుద్ధంగా నేను మల్లెపువ్వుని శివార్చనకు అనుమతించలేను"అని ఖరాఖండిగా చెప్పేసాడు.చేసేది చెప్పేది ఏమీలేక మల్లెపువ్వు శివాలయం గుమ్మం దాటి బయటే ఉండిపోయింది.మందారపువ్వు పూజ ముగించుకొని వచ్చిన వరకూ బయటే ఉండి, మందారపువ్వు పువ్వు గుడిబయటకు రాగానే ఆమె వెంట మౌనంగా నడిచి ఇల్లు చేరింది మల్లెపువ్వు.


                  గుడిలో తనకు లభిస్తున్న గౌరవ మర్యాదలు, ఆదరణ, మన్నన మల్లెపువ్వుకి చూపించడానికే, కావాలని మల్లెపువ్వుని ప్రతిరోజూ తనకి తోడుగానైనా గుడికి రమ్మనేది మందారపువ్వు,స్నేహితురాలి కోరిక కాదనలేక మల్లెపువ్వు శివాలయం ప్రధాన ద్వారం వరకూ వెళ్లి బయటే ఉండిపోయి, మందారపువ్వు పూజ ముగిసి గుడి బయటకు వచ్చేవరకూ ఉండి, మందారంతో కలసి తిరిగి ఇంటికి చేరేది . ఇలా చాన్నాళ్లు గడిచాయి.


                   కార్తీక మాస ఉత్సవాల్లో శివ పార్వతులు ఉల్లాసంగా వుండేవారు. ఒకరోజు పార్వతీదేవి" ప్రియతమా ఈ రోజు నాకు అలంకరణపై మనసు మళ్లింది, జడలో కురులు తురుముకోవాలనే కోరికగా ఉంది, మన గుడి బయట ప్రధాన ద్వారం వెలుపల నుండి మంచి సుగంధభరిత పువ్వు వాసన వస్తుంది, దాన్ని తెప్పించి స్వయంగా మీరే నా జడకు అలంకరించండి" అని కోరింది. శివుడు నందీశ్వరుని ఆదేశించింది, గుడి బయట ఉన్న మల్లెపువ్వుని సాదరంగా ఆహ్వానించి గుడిలోకి తీసుకు రమ్మన్నాడు. నంది "అది మల్లెపువ్వు మిమ్మల్ని తాకే అర్హతలు లేనిది"అని శివునికి చెప్పడానికి ప్రయత్నం చేసాడు. శివుడి కన్నెర్ర చేయగానే మారు మాటాడకుండా మల్లెపువ్వుని ఆహ్వానించి శివుని చెంతకు తెచ్చాడు. శివుడు మల్లెపువ్వుని చిరునవ్వుతో పలకరించి,తానే స్వయంగా దాన్ని తన ప్రేయసి పార్వతి జడలో తురిమాడు.అప్పడు శివుని పాదాల చెంతవున్న మందారం ఆశ్చర్యపోయింది,ఇంతలో శివుని నెత్తిన ఉన్న గంగమ్మ కూడా శివుని వేడుకొని తనకికూడా శిఖలో తురుముకోడానికి మల్లెపువ్వుని తెప్పించమంది, శివుడు మారు మాటాడకుండా శివగణాలను పిలిపించి, మల్లెపువ్వులను వెదికి తీసుకు రమ్మని ఆదేశాలు ఇచ్చాడు. క్షణాల్లో శివగణాలు మల్లెపూలను తెచ్చి శివునికి ఇచ్చాయి, శివుడు వాటితో పార్వతి జడను, గంగమ్మ శిఖను అలంకరించాడు, మందారపువ్వు తనకు గర్వభంగం జరిగిందని తెలుసుకొని ,సిగ్గుతో తల దించుకుంది. అప్పుడర్ధమయ్యింది, మందారినికి, నందికి, "ఈ సృష్టిలో జీవులకు, వస్తు సేవలకు దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది, దేన్నీ పనికిరానిదిగా చూసి అవమానించారాదని, తనకు లభించిన ప్రాధాన్యతకు గర్వపడిపోకూడదు" అని. శివుడు మర్మగర్బంగా చిరునవ్వులు చిందించాడు. మల్లెపువ్వు వినమ్రంగా శివునికి నమస్కరించింది.





Rate this content
Log in