శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

చైతన్యపథం

చైతన్యపథం

2 mins
382



             చైతన్య పథం

          -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    చైత్రకు తాను చేసిన తప్పేమిటో అర్థం కావడం లేదు. 

తన స్నేహితురాలిని ఓ మానవమృగం అన్యాయం చేస్తే... న్యాయం కోసం మహిళాసంఘాలతో చేతులు కలిపిందని ఇంట్లో తల్లీ తండ్రీ ఆమెను గుమ్మలోనే నిలదీయడం మొదలుపెట్టారు. 


   చైత్రలో యే శక్తి ఆవహించిందో తెలీదు . ఎన్నడూ తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడలేనిది ...ఒకే ఒక్క విషయం అడిగింది....


   "ఇదే నా విషయంలో జరిగితే మీరు ఊరుకుంటారా" అని. అలా అడిగినందుకు తల్లి రుద్రకాళే అయ్యింది.


  "ఛీ... సిగ్గులేకపోతే సరి. మేమైతే కన్న కూతురని చూడకుండా నరికి పోగులు పెట్టేవాళ్ళం. అది లేచిపోయి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలి...వాడెలాంటి వాడో...? కాలుజారినదాన్ని తగుదునమ్మా అంటూ వెనకేసుకొస్తున్నావు.  నువ్వసలు బరితెగించిపోయావే. మగరాయుడిలా రోడ్లమీద పడి ఆ అరుపులేంటి...? నువ్వుకాదే. కన్నతల్లిగా నేను సిగ్గుపడుతున్నాను. ఆ చెడిపోయిన దానితో పాటూ రోడ్లమీద కూర్చుని నిరాహారదీక్షలొకటి. మన కుటుంబ మర్యాదలన్నీ మంటగలిపేసావు కదే. అయినా నిన్నింకా చదివించడం మాది బుద్ది తక్కువ. నువ్వేదో పెద్ద చదువులు చదువుతావు కదాని చదివిస్తుంటే...నువ్వు వెలగపెడుతున్నదిదా...? రోడ్డుమీద పడి అడ్డమైన వాళ్ళతో కలిపి ఆ రంకెలెయ్యడానికి ఆనోరెలా వచ్చింది. అయ్యో అయ్యో" ...అంటూ నోరు నొక్కుకుంది పార్వతమ్మ. 


  "చైత్రా...నీకిదే లాస్ట్ వార్నింగ్. మీరు మూయించాలని చూస్తున్నవాడు ఓ మినిస్టర్ బంధువు. నువ్వు ఇంతకన్నా మితిమీరితే వాళ్లొచ్చి నిన్నేమైనా చేయొచ్చు. నీ స్నేహితురాలి కూడా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడం మానుకో. నువ్విలా తిరుగుతున్నావని తెలిస్తే మొన్న నిన్ను ఖాయం చేసుకుని వెళ్లిన సంబంధం వాళ్లకు తెలిస్తే ఏమవుతుందో కొంచెమైనా ఆలోచించావా...? చదివే కొద్దీ నాయకురాలు లక్షణాలు ఒంటబడుతున్నట్టున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామో...అర్థం చేసుకో" అంటూ కండువాను ఓ దులుపు దులిపి బయటకు వెళ్లిపోయారు రాఘవయ్య.


   తల్లీదండ్రుల మాటలకు వీస్తుపోయింది చైత్ర. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇలా వున్నారు కాబట్టే...మృగాల్లాంటి మగాళ్లు పుట్టుకొస్తున్నారు. పులిలా ఎదురు తిరగాలనుకుంటే... ఆడపిల్లవంటూ పిల్లిని చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచకూడదు. ఆడజాతికి జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి" మనసులో ఓ విధమైన కసి పట్టుదల పెరిగిపోయింది చైతన్యలో.


  "ఇంకా అక్కడే నిలబడ్డావేం...? మన ఇంటావంటా లేని ముదనష్టపు పనులు చేయకుండా బుద్దిగా ఇంట్లోనే పడుండు. మారోజుల్లో అయితేనా... పరదాల చాటున వుండేవాళ్ళమే గానీ...ఇలా ఎప్పుడూ వీధులకెక్కలేదు". కళ్ళలో నిప్పులు కురిపిస్తూ కేకలేస్తూనే ఉంది పార్వతమ్మ.


   తాను పెద్ద తప్పుచేసినట్టుగా ఇంట్లో ఇలా నిలదీయడం అసలు నచ్చలేదు చైత్రకు.


  ఆనాడు విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు, కస్తూరిబా, ఝాన్సీ లక్ష్మీభాయ్ వంటి వారు పరదాలచాటునే ఉండిపోతే స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేవారా...? చరిత్రలో పేరు ప్రఖ్యాతులు గడించేవారా...? 


  అప్పటి వీరనారుల స్పూర్తితోనైనా...ఆడజాతిలో ప్రతిఒక్కరూ మృగాళ్ల చేతుల్లో అన్యాయమై పోతున్న సాటి ఆడవారికి అండగా నిలబడిగలిగినప్పుడే...ఈ మృగాళ్ల అంతుచూడొచ్చు. మనసులోని ఆలోచనలు ఉవ్వెత్తున లేస్తూ... చైతన్య పథం వైపే అడుగులు వేయమని ప్రేరేపిస్తున్నాయి చైత్రను. ప్రతి నారీ ఒక వీరనారి కాగలిగినప్పుడే...స్త్రీజాతికి గౌరవమిచ్చే విధంగా మగాళ్లు మసులుతారనిపించింది.

   

   మర్నాడు కూడా తమ పోరాటం ఆపలేదు. స్నేహితురాలితో పాటూ మహిళామండలి అండతో...  

"ఉయ్ వాంట్ జస్టిస్" అంటూ... గొంతుకలిపింది కలెక్టరేట్ ముందు చైత్ర....!!*


          *****    *****   ******


   


   


    




Rate this content
Log in

Similar telugu story from Fantasy