kamala sri

Drama Romance Fantasy

4  

kamala sri

Drama Romance Fantasy

మిథునం

మిథునం

6 mins
437




''సుందర్... సుందర్...., ఏవండోయ్.. శ్రీవారూ.. లేవండీ.బారెడు పొద్దెక్కింది.సూర్యుడు ఆల్రెడీ డ్యూటీ ఎక్కి ఓ గంట పైనే అయ్యింది. తమరు లేస్తే స్నానం చేసుకుని గుడికి వెళదాం."

సమాధానం లేదు అవతలి వైపు నుంచి.

''ఓయ్ శ్రీవారూ!లేవండీ కోడి కూచి చాలా టైంఅయ్యింది.

ఈ రోజు కూడా మొద్దు నిద్రేమిటి?ప్రతీ సోమవారం ఊదయాన్నే లేచి గుడికి వెళతాం కదా.. ఇలా పడుకుంటే ఎలా? లేవండి స్వామీ" అంది అప్పుడే పూజ ముగించి వచ్చిన సుందరి.

''అబ్బా! ఏంటి సుందరీ.. కాసేపు పోడుకోనివ్వు ఫ్లీజ్.." అని మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు.

''లేవండి.. భర్త గారు.. తమరు తెమిలేసరికి మధ్యాహ్నం అయిపోతుంది.అందుకే లేచి రెడీ అవ్వండి"

''అబ్బబ్బా వినవు కదా! అలా అరిగిపోయిన టేప్ రికార్డర్ లా ఏదో ఒకటి అంటునే ఉంటావు లేచేంత వరకూ"అంటూ దుప్పటి నుంచి విడివడి బాత్రూమ్ లో దురాడు.

''ఏంటి అరిగిపోయిన టేప్ రికార్డర్ నా,అప్పుడెప్పుడో అన్నట్టు గుర్తు సుందరీ నీ గాత్రం మధురంగా ఉంటుందని" అంటూ బాత్రూమ్ నుంచి వచ్చిన అతనికి బట్టలు అందిస్తూ అంది.

''అప్పుడేదో మైకం కమ్మి అన్నాం..ఇప్పుడా మబ్బు వీడి.. అసలు స్వరూపం చూపిస్తున్నావు గా రోజూ" అంటూ పూజ గదిలోకి వెళ్లి పూజ చేసుకుని వచ్చాడు.

''అంటారంటారు. ఎన్నైనా అంటారు. బాగా అలుసైపోయాను కదా. ఎన్ని మాటలైనా అంటారు" అంటూ పూజ బుట్టలో సామాగ్రి సర్దింది.

''బాగా చూసుకుని వెయ్యు తాళం మొన్న ఓ రోజు గొల్లెం వేసితిని తాళం మరిచితి అన్న చందాన గొళ్ళం వేసి తాళం వేయకుండా గుడికి వచ్చేసావు".

''పోనీలెండీ ఏమున్నాయి ఇంట్లో.. ఏడువారాల నగలా, లేదా లక్షల సొమ్మా!"

''అంతకన్నా విలువైనవి ఉన్నాయి" అంటూ ముందుకు సాగాడు సుందర్.

''ఏమిటో నాకు తెలీని ఆ విలువైనవి?" సందేహంగా అంటూ అతని అడుగుల వెనుకే అడుగులు వేస్తూ ముందుకు సాగింది.

''నీతో నేను గడిపిన మధురానుభూతులు, వాటి పై ఎవరి చేయి పడినా నేను సహించలేను"అని గుడి ముందు చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కునేందుకు కుళాయి దగ్గర కు వెళ్ళాడు.

ఆమె మారు మాట్లాడకుండా వెళుతున్న అతన్నే చూస్తూ ''ఎంత ప్రేమ నా మీద" అనుకుని తనూ చెప్పులు విడిచి కాళ్ళు కడిగి గుడిలో అడుగు పెట్టింది.

దర్శనం అయ్యాక ఇంటి బాట పట్టారు. దారిలో కనపడేవారందరి పలకరింపులు పూర్తై ఇంటికి చేరేసరికి ఓ అరగంట పైనే అయ్యింది.

''సుందరీ! ఓ మంచి ఫిల్టర్ కాఫీ ఇవ్వవూ"అన్నాడు అర్ధింపుగా.

''కాఫీ నా అదేం కుదరదు. పది నిమిషాల్లో జీడిపప్పు ఉప్మా చేస్తాను"

''కొంచమే లెద్దూ.. ఇవ్వరాదూ" అన్నాడు మళ్లీ..

''చెప్పాగా! నేను ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పి నట్టే" అంటూ భాషా స్టైల్లో చెప్పి వంట గది లోకి దూరింది.

ఉసూరు మంటూ అక్కడే ఉన్న సోఫా లో కూలబడి పేపర్ తీసి చదవడం మొదలు పెట్టాడు.అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త. ప్రియుడి మోజులో పడి భర్త ను చంపిన భార్య. ఆస్తి కోసం తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకులు. ముసలి తల్లి తండ్రులను మోసం చేసి ఆస్తి రాయించుకుని వృద్దాశ్రమం లో చేర్పించిన కొడుకూ, కోడలు... కోట్ల బాంకు బకాయిలు చెల్లించకుండా ఇండియా వదిలి పారిపోయిన వ్యాపార వేత్త.

పేపర్ నిండా అవే న్యూస్. చిరాకు పుట్టి టీ పాయ్ పై పడేసీ.''ఏంటో ఈ న్యూస్ పేపర్ వాల్లు.ఇలాంటి న్యూస్ తప్ప ఇంకేం దొరకవేమో?"అనుకున్నాడు మనసులో.

ఇంతలో పొగలు కక్కే వేడి వేడి జీడిపప్పు ఉప్మా పట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ''ఏవండోయ్! సుందర్ గారూ టిఫిన్ రెడీ. వచ్చి ఆరగించండి"

''మీరూ కూర్చోండి శ్రీమతి గారూ ఇద్దరం కలిపి తిందాం" అని పక్కనే ఉన్న చైర్ ని దగ్గరగా లాగి ఆమెను దాని పై కూర్చోపెట్టాడు.

ముందుగా ఆమెకు ఓ స్పూన్ పెట్టి , తనూ ఓ స్ఫూన్ తిసుకుంటుండగా ''అయ్యో.. ఇంకో స్పూన్ తో తినండి,ఎంగిలి" అంటూ ఆ స్పూన్ తీసుకోబోయింది.

''రామ చిలుక ఎంగిలి చేసిన జామపండు ఎంత తియ్యనో నీ పెదాలను తాకిన ఈ స్పూన్ తో తింటుంటే ఈ ఉప్మా రుచి అంత ‌మధురంగా ఉంది." అంటూ కొసరి కొసరి ఆమె కు తినిపిస్తూ, తనూ తిన్నాడం ముగించాడు.

''సుందరీ మధ్యాహ్నానికి సాంబారు, గుత్తి వంకాయ కూర వండవూ!"అంటూ ఆమె వైపు చూశాడు.

''ఆ.. గురువు గారికి.. జిహ్వ చాపల్యం ఎక్కువే"అంటూ ఆ ప్లేట్ తీసుకుని వెళ్లి సింక్ లో వేసింది.

ఫ్రిడ్జ్ లో చూస్తే.. ఓ నాలుగు వంకాయలు,కొన్ని టమాటా లు, రెండు మునగ కాయలు ఉన్నాయి. ''పోనీ లే పాపం చేసేస్తే పోలే.. నోరు తెరిచి అడిగారు.ఎప్పుడో కానీ ఇది చెయ్ అనరు.. నేనేం చేస్తే అది తింటారు.గుత్తి వంకాయ కూర కి మసాలా మిక్సీ పట్టే కన్నా రోట్లో రుబ్బి వేస్తే చాలా బాగుంటుంది" అనుకుని మసాలా దినుసులు తీసుకుని రుబ్బు రోలు దగ్గరకు వెళ్లి రుబ్బడం మొదలు పెట్టింది.

ఆ చప్పుడికి సుందర్ అక్కడకి వెళ్ళి.. ''కనపడరు కానీ మాటవింటారు పర్లేదు"అన్నాడు అరవింద సమేత లో పూజాహెగ్డే ఎన్టీఆర్ కి అన్నట్టు.

''అబ్బో.. పెద్ద డైలాగులు చెప్తున్నారే. సినిమాల ప్రభావం ఇలానే ఉంటుంది మరీ."

''ఏం మీరే చెప్పగలరా డైలాగులు మానును వచ్చు డైలాగులు. మేము చెప్పగలం" అన్నాడు నాటకీయ దోరణిలో.

''సుందరీ.. నే రుబ్బేదా.. "అని ఆమె చేతి పై చేయి వేసి రుబ్బడం మొదలు పెట్టాడు.మధ్య మధ్య లో ఆమె బుగ్గ లపై మెల్లగా గిల్లుతూ, నడుము మెలికపై చేయి తో గిల్లుతూ కొంటె పనులు చేస్తుంటే..

''అయ్యా! మహానుబావా తమరు వెళ్ళి కూర్చోండి ఇలా అయితే పని పూర్తి కాదు" అంది.

''మరదే!పోనీలే కదా అని సాయం చేయడానికి వస్తే నా మీద నిందలు వేస్తావా!!" అంటూ బుంగ మూతి పెట్టాడు.

''ఆ.. మీరు చేసే సాయం ఏంటో నాకు తెలుసు గానీ వెళ్ళి టి.వీ పెట్టుకుని చూసుకోండి"అంటూ తన పనిలో మునిగింది.

సుందర్ నిరాశ గా వెళుతుంటే సుందరి నవ్వుకుంటూ పని పూర్తి చేసి వంట మొదలుపెట్టింది.

వంట ముగించి ఆన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది తనూ వెళ్ళి టి. వీ ముందు సెటిల్ అయ్యింది.

''సుందరీ... ఏ మాటకామాట నువ్వు చేసే సాంబారు ఉంటుంది చూడూ... సూపర్ అనుకో. ఆ వాసన కే కడుపు నిండి పోతుంది. ఇంక గుత్తి వంకాయ నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. నలభీమ పాకం అంటారే అలా నీ ప్రతీ వంటా అమోఘం. అందుకే కొంచెం ఎక్కువ తింటున్నానేమో పొట్ట కాస్తా వచ్చేసింది ఈ మధ్య."

''చాల్లెద్దురూ.. ఎంత తినేస్తున్నారనీ పొట్ట వచ్చేసింది. కడుపు నిండా తినకుండా.."అంది మందలింపు గా.

                         💘💘💘

ఇలా సుందరి చేసే ప్రతీ పని లో చేయి వేస్తూ.. మధ్య మధ్యలో చిలిపి పనులు చేస్తూ.... సుందరి మందలింపు లకు అలుగుతూ.. ఆమె చేసే ప్రతీ వంటకాన్నీ మెచ్చుకుంటూ... కాసేపు టీవీ, కాసేపు కబుర్లు సాయంత్రం వేళ పెరట్లో ఉన్న మొక్కలకు నీరు పెడుతూ సుందరి పై కొంచెం నీరు జల్లాడు.

''ఏంటి.. శ్రీవారూ.. ఈ పరాచికాలు,చూడండి ఎలా తడిసిపోయానో "అంటుంటే,

''పరాచికాలు శ్రీమతీ... సరసాలు!"అంటూ దగ్గరకు తీసుకోబోతుంటే,

''చాలు చాలు.. సరసాలు.. చాలు చాలు"" అంటూ తప్పించుకుని లోపలికి వెళ్ళింది.

అయ్యో! మంచి చాన్స్ మిస్ అయ్యానే.. ఇప్పుడు మిస్ అయితే ఏమయ్యింది నైట్ అంతా నాదే గా అనుకుంటూ ''ఈ రేయి తీయనిదీ'' అని పాడుకుంటూ లోపలికి వెళ్ళాడు.

                          💘💘💘

రాత్రి భోజనాలు పూర్తి చేసి, వంట గది సర్దడం లో సుందరి కి సాయం చేయబోతుంటే ''మీరు వెళ్లి టీవీ చూస్తూ ఉండండి. ఓ పది నిమిషాల్లో పూర్తి చేసి వస్తా!" అంది.

నువ్వు ఒక్క దానివే చేస్తుంటే నే వెళ్ళి కూర్చుని టీవీ చూడాలా నథింగ్ డూయింగ్.. అని లుంగీ పైకెత్తి కట్టి ''ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సలుపేమున్నదీ!"అని పాడుతు గిన్నెలు తోమడం పూర్తి చేశాడు.

సుందరి ఉదయం టిఫిన్ కి రుబ్బు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అంతా శుభ్రం గా తడిగుడ్డతో వత్తింది.

కాసేపు టీవీ చూసి పడుకోడానికి బెడ్రూమ్ లోకి వెళ్ళారు.

                          💘💘💘

పడుకున్న కాసేపటికి కాలి పై ఏదో పాకినట్టనిపించి మెలుకువ వచ్చి చూస్తే ఎదురుగా భర్త తన పాదాలు వత్తుతూ.

''అయ్యో అదేంటండీ..తప్పు.. "అంటూ కాలు వెనక్కి తీసుబోయింది.

''శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు.నేను పట్టుకుంటే తప్పేముంది. ఉండనీ. ఈ పాదాలు ఉదయం నుంచీ ఆ పనీ ఈ పనీ చేసి అలసి పోయాయి. వాటికి కాస్తైనా సాంత్వన కలుగుంది ఇలా చేస్తే!"

''అయినా ఈ అరవైయ్యేల్ల వయసు లో ఈ పనులన్నీ చేయడం అవసరమా చెప్పూ !"అంటూ ఆమెను మందలించ బోతుంటే,

''ఎందుకు కాదూ! నా భర్త కి నేను స్వయంగా వంట చేసి పెడితేనే నాకు తృప్తి.అలాగైతేనే కడుపు నిండా తింటారు,మీరు మాత్రం డబ్బైయ్యో పడిలోకి అడుగిడుతూ నవమన్మథుని లా ఆ వేశాలు వేయొచ్చా. అవ్వా! ఎవరైనా చూస్తే నవ్వి పోతారు ఈ వయసులో ఏంటీ ఈ సరసాలు అని"అంది అతన్నే మురిపెంగా చూస్తూ సుందరీ అని ముద్దుగా పిలవబడే మన కథానాయకి సుందర లక్ష్మి.

అనుకోనీ మనమేం తప్పు చేయడం లేదు కదా! భార్యాభర్తల మధ్య ఇలాంటి సంభాషణ లూ, సరసాలూ ఉంటేనే కదా ఆ బంధం కలకాలం సంతోషంగా నిలబడేది. లేదంటే పెళ్ళైన కొన్నాల్లకే మనస్పర్థలూ, ఆ తర్వాత విడాకులు.

అదే ఒకరికొకరు సాయం చేసుకుంటూ,ఆప్యాయంగా పలకరించుకుంటూ మధ్య మధ్య లో పిక్ నిక్ లనీ, ఔటింగ్ లనీ, విహారయాత్ర లనీ భార్య ను బయటకు తీసుకెళుతూ ఉంటే ఆమె కి భర్త పై ప్రేమ పెరిగితే, భర్త కి భార్య అభిరుచులు తెలిసే వీలుంటుంది. అంటూ ఓ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు సుందర్ అని ముద్దుగా పిలవబడే మన కావ్య నాయకుడు సుందరమూర్తి.

''చాల్లెండి.. మిమ్మల్ని వదిలి తే ఎన్ని ప్రసంగాలైనా చేస్తారు. పడుకోండి చాలా పొద్దు పోయింది" అంటున్న సుందరి ని చూసి,

''నీతో ఇదే గోల ఉదయం పొద్దెక్కి చాలా సేపయ్యింది అంటూ మాటి మాటికీ లేపుతావు.రాత్రి చాలా పొద్దు పోయింది పడుకోండి అంటూ నస పెడతావ్. భగవంతుడా ఇలాంటి నస భేరాన్ని నాకు అంటగట్టావేంటి తండ్రీ !"అంటూ బిక్కమొహం వేసుకుని ఉన్న సుందర మూర్తి ని అలానే చూస్తూ ఉండి పోయింది సుందర లక్ష్మి.

''ఏంటీ అలా చూస్తున్నావ్! కొంప దీసి.. కొరకేస్తావా ఏంటి చూపుల్తో" అన్నాడు కొంటె కృష్ణునిలా.

''అబ్బా.. కదలకండీ మిమ్మల్ని ఇలా చూస్తూ జీవితాంతం గడిపేయ్యొచ్చు''.

మన నలభై అయిదేళ్ళ పెళ్లి బంధం లో ఎన్నో ఆటుపోట్లు.. వాటన్నిటికీ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగ అవకాశాలు లేవని ఓ టిఫిన్ కొట్టు లో దినకూలీ గా పనిచేశారు. ఇంట్లో తోడికోడల్లు నన్ను అసమర్ధుని భార్య అంటూ ‌హేళన చేస్తుంటే మీరు సమర్థులని ఓ టిఫిన్ సెంటర్ అద్దెకు తీసుకుని దాన్ని దిన దినాభివృధ్ధి చేసి ఓ పెద్ధ రెస్టారెంట్ గా మార్చారు.

మన ప్రేమ కు ఫలితంగా పుట్టిన బిడ్డ లను అల్లారు ముద్దుగా పెంచీ పెద్ద చేసి ప్రయోజకులను చేస్తే... వారు మనకిచ్చిన ప్రతిఫలం.."

అంటూ నెమ్మదిగా రోధిస్తున్న సుందర లక్ష్మి ని దగ్గర కు తీసుకుని ''అబ్బా! సుందరీ గతాన్ని గుర్తుచేసుకుని భాదపడొద్దని ఎన్ని సార్లు చెప్పాను.

వయసు లో ఉన్నప్పుడు సంపాదించాను అవిశ్రాంతిగా. నిన్ను కూడా సరిగ్గా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకూ నేను సంపాదించినదంతా ఎవరి కోసం వారికోసమే గా. వారి బాగు కోసమే గా!

కానీ వాళ్ళు.. మన సంపాదన కావాలి. కానీ ముసలి వాళ్ళమైన మన భాగోగులు వారికి అవసరం లేదా..

మనల్ని తీసుకెళ్లి ఏ వృద్దాశ్రమం లోనూ పడేసి హ్యాపీ గా ఎంజాయ్ చేయొచ్చు అని పెద్ద కొడుకు, కోడలితో అంటున్న మాటలు విన్నప్పుడు నా గుండె ఆగినంత పనైయ్యిందనుకో. వాడ్ని నా గుండె ల మీద ఎత్తుకొని పెంచానే. ఇప్పుడీ ముసలి ప్రాణం వాడికి బరువైయ్యిందా.

అందుకే... అందుకే నేనా నిర్ణయం తీసుకున్నా. నేను సంపాదించిన ఆస్తి లో ఇరవైయ్యో వంతు మాత్రమే నా దగ్గర ఉంచుకుని మిగిలిన దంతా మనలాంటి ముసలి వాల్లకి సేవచేసే వృద్దాశ్రమాలకీ, సేవా సంస్థలకీ అనాథ ఆశ్రమాలకీ రాసేశా...

అది తెలిసి పెద్ద గొడవ చేసారు ఇద్దరు కొడులూనూ. నువ్వెంతో ముద్దు గా చూసుకునే నీ ముద్దు ల చిన్న కొడుకు ఏమన్నాడో గుర్తుందా.. మాకు రావాల్సిన ఆస్తి ని మాకు రాకుండా చేశారు కదూ. దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు.. ఇంక మీకు ఈ కొడుకు లేఖను కోండీ అంటూ పెట్టే బేడా సర్ధుకుని వెళ్ళి పోతుంటే వాడినే అనుసరించాడు నీ పెద్ద కొడుకు.

వారికి కావాల్సింది మన ఆస్తి మనం కాదు.మనల్ని వదిలి వెళ్ళిన వారికోసం ఎందుకు భాదపడతావూ. బ్రతికి నన్నాళ్ళు సరదాగా.. సంతోషంగా గడుపుదాం. ఇంక చనిపోయిన తర్వాత అంటావా.. అంతా ఈశ్వరేచ్చ. ఆ జగన్నాటక సూత్రధారి మనిద్దరి జీవితాలను ఏ ఒడ్డుకు చేర్చాలనుకుంటున్నాడో" అంటూ ఏడుస్తున్న సుందరిని గుండెలకు హత్తుకుని అలా ఆలోచిస్తూ ఎప్పటికి నిద్రపోయాడో.

                     💐💐💐

ముసలి తనం లో ఉన్న తల్లి తండ్రి కోరుకునేది కాస్త ప్రేమ , ఇంకాస్త ఆత్మీయత అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఆ వయసులో వారిని వృద్దాశ్రమాల్లో వదిలి మనం సంతోషంగా ఉన్నామనుకుంటాం. కానీ రేపు అదే పనిని మన పిల్లలు చేస్తే కానీ తెలీదు మనం చేసిన తప్పేమిటో.

అయితే తమ పిల్లలు తమ కి ఆశ్రమానికి పంపాలనుకుంటున్నారని తెలిస్తే ఓ తండ్రి ఎలా స్పందిస్తాడు... ఆ తర్వాత పరిణామాల సమాహారమే... మిథునం..

చదివి.. మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తామని కోరుతూ....

మీ

కమల ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Drama