అపూర్వ కానుక
అపూర్వ కానుక
అఖిల్ కంగారుగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి స్పీడ్ గా ముందుకు పోనిచ్చాడు. కార్ కంటే వేగంగా పోతున్నాయి అతని ఆలోచనలు.
'ఎందుకిలా చేసింది.తనకేదైనా అయితే నేను తట్టుకోగలనా.నాతో రోజూ గొడవ పడుతున్నా, అత్తయ్యా మామయ్య లను తిడుతున్నా ఓర్చుకున్నా తన పరిస్థితి తెలుసు కాబట్టి. ఈ రోజు ఇంకా ఎక్కువ గొడవ చేసి అత్తయ్య మీదకి ఫ్లవర్ వాజ్ విసిరేసింది. దాంతో కోపంతో తనని కొట్టి ఆఫీస్ కి వచ్చేసాను. దాని వల్లే ఇలా చేసిందా.' అని ఆవేదన చెందాడు.
అతని ఆవేదనకీ, బాధకీ, కన్నీళ్లకీ కారణం"మోహన"... తన ముద్దుల భార్య ఆత్మహత్యాయత్నం చేయడమే.
ఆమె అలా చేయడంలో అర్థం ఉంది. నేను తనని కొట్టడంలోనూ అర్థం ఉంది. తనని కొట్టే ప్రతీసారీ నా చేతుల్ని గోడకేసి ఎన్నిసార్లు కొట్టుకున్నానో.
మోహన అలా అవ్వడానికీ, నేనిలా తనని కొట్టడానికీ సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన సంఘటనే కారణ.
ఒక్కసారిగా అతని ఆలోచనలు ముందు తమ గతం కదలాడింది.
అఖిల్❣️ మోహన... ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు.
తాము జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఈ లోపు ఓ ఎన్నారై సంబంధం వచ్చిందని మోహన తల్లిదండ్రులు పెళ్లి సంబంధం ఖాయం చేసుకుని నిశ్చయ తాంబూలాలు తీసుకుని పెళ్లికి సిద్ధపడ్డారు.ఇక చేసేదేమీ లేక ఓ అర్థరాత్రి పూట ఇల్లు విడిచి అఖిల్ దగ్గరికి వెళ్లిపోయింది మోహన.
తనకి తల్లీ తండ్రీ లేకపోయినా కన్నబిడ్డ లా పెంచుకున్న మేనమామ ఆశీస్సులతో ఇద్దరూ జంటగా మారారు.
"మా పరువు తీసి, వీడిని పెళ్లి చేసుకున్న నీవు ఇక మా దృష్టిలో చచ్చినట్టే లెఖ్ఖ." అంటూ సాపనార్థాలు పెట్టి వెళ్లిపోయారు తల్లీతండ్రీ.
అప్పటి నుంచీ వారు ఒక్కసారి కూడా మోహన ని చూడటానికి వచ్చిందే లేదు.
కానీ ఆ బాధ తెలీకుండా తమ కన్నబిడ్డలా మోహనని చూసుకున్నారు అఖిల్ మేనమామ విష్ణు, సావిత్రీ దంపతులు.
వారి కాపురం సజావుగా సాగిపోతుంది.అఖిల్ తన మామయ్య కంపెనీనే డెవలప్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
ఓ రోజు ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్. మోహన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయిందని.
మీటింగ్ ని మధ్యలోనే ఆపేసి ఆఘమేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మోహనని టెస్ట్ చేస్తున్న డాక్టర్ "కంగ్రాట్స్ మోహనా... నువ్వు తల్లివి కాబోతున్నావు." అంది.
ఆ మాటలకి అందరిలోనూ సంతోషం.
అఖిల్, మోహన దగ్గరికి వెళ్లి థాంక్యూ డియర్. థాంక్యూ సో మచ్." అన్నాడు ప్రేమగా ఆమె చేతులు పట్టుకుని.
"థాంక్యూ సో మచ్ అఖీ... నీ వల్లే నాకింతటి ఆనందం దక్కింది. నా జీవితంలో మరిచిపోలేని, మరిచిపోని, అపురూపమైన బహుమతి ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇంత గొప్ప బహుమతి అందించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను." అంది మోహన ఉద్వేగం గా.
"ఓ చక్కటి పాపాయిని కని నాకు కానుకగా ఇవ్వు." అన్నాడు నవ్వుతూ.
"నో నాకు నీలా అందమైన, మంచి మనసున్న కొడుకు కావాలి." అంది మోహన, అఖిల్ నే చూస్తూ.
"నో బేబీ నాకైతే నీలా బుట్టబొమ్మలా, బార్బీ గర్ల్ లా ఉన్న చక్కటి చుక్కలాంటి పాపాయి కావాలి." అన్నాడు అఖిల్.
నో...
నో... అంటూ ఇద్దరూ టామ్ అండ్ జెర్రీ లా వాదులాడు కుంటుంటే,
"మాకైతే ఇద్దరూ ఒకేసారి ఇచ్చినా పర్లేదు" అంటూ నవ్వుతూ వచ్చింది సావిత్రి స్వీట్స్ పట్టుకుని. విషయం తెలుసుకున్న విష్ణు కూడా పరుగున వచ్చాడు ఆఫీస్ నుంచి.
అందరూ ఆ మాటకు నవ్వేశారు. రోజులు గడుస్తున్నాయి.మోహన కి అప్పుడు ఏడో నెల వచ్చింది. ఓ రోజు అర్థరాత్రి మెలుకువ వచ్చిన అఖిల్ , పక్కన పడుకోవాల్సిన మోహన కనపడక పోయే సరికి కంగారుగా లేచి చుట్టూ చూస్తుంటే బాల్కనీ లోని సిట్ అవుట్ లో కూర్చుని కనపడింది.
"ఏరా! ఇక్కడ కూర్చున్నావు. నిద్ర పట్టడం లేదా?!." అంటూ దగ్గరికి వెళ్లి అఖిల్ కంగారు పడ్డాడు మోహన కళ్లల్లోని కన్నీరు చూసి.
"ఏమైందిరా! ఎందుకీ కన్నీరు?!." అన్నాడు.
"ఎందుకో తెలీదు అఖీ. మమ్మీ, డాడీ గుర్తొస్తున్నారు. వాళ్ల ఒడిలో సేదతీరాలని, అమ్మ చేత ఏవేవో వండించుకు తినాలని, నాన్న తో కబుర్లు ఆడాలని చాలా కోరికగా ఉంది.వాళ్లను చూడాలనిపిస్తుంది పదే పదే." అంది.
"అవునా! కానీ మన పెళ్లి లో ఎన్నేసి మాటలన్నారు. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే మీ అమ్మ కి ఫోన్ చేశావు. కనీసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వినకుండా తిట్ల దండకం మొదలెట్టింది. ఇంకోసారి చేశావంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు నీకు వాళ్లని చూడాలని ఉందని వెళ్లి చెప్తే వస్తారంటావా?!." అన్నాడు అఖిల్ జరిగింది గుర్తు చేసుకుంటూ.
"అందుకే నీకు విషయం చెప్పలేక, నా కోరిక తీరే దారి కానరాక ఇలా." అంటూ మరోసారి కన్నీరు పెట్టుకుంది మోహన.
"హే మోహనా! ఎందుకే ఏడుస్తున్నావు. ఏడ్వకు బంగారు. నేను రేపు పొద్దున్నే వెళ్తాను. వెళ్లి మీ అమ్మా నాన్న కాళ్లు పట్టుకుని అయినా బ్రతిమలాడి తీసుకుని వస్తా. ప్లీజ్ బంగారం. నువ్వు ఏడ్వకే. నువ్వేడిస్తే నాకూ ఏడుపొస్తుంది." అంటూ మోహన్ ని పట్టుకుని ఏడ్చాడు అఖిల్.
"హే అఖీ... నువ్వెందుకు ఏడుస్తున్నావు?!." అంది మోహన అతని కళ్లు తుడుస్తూ.
"నా ప్రాణం కన్నీరు కారిస్తే నా కళ్లు కన్నీరు కార్చవా?!." అన్నాడు అఖిల్.
"సారీ అఖీ ఇంకెప్పుడూ ఏడ్వను." అంది కళ్లు తుడుచుకుంటూ.
"దట్స్ మై గర్ల్.రేపు పొద్దున్నే వెళ్తాను. మీ అమ్మా నాన్నలను తెస్తాను. సరేనా. రా పడుకుందువు గానీ." అంటూ ఆమెని బెడ్ దగ్గరకు తీసుకొని వెళ్లాడు. కాసేపటికి పడుకుంది మోహన.
ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అఖిల్. 'రేపు ఎలాగైనా వారిని తీసుకుని రావాలి. నా బంగారం కళ్లల్లో ఆనందం చూడాలి.' అనుకుంటూ తనూ నిద్ర పోయాడు.
మరునాడు ఉదయం లేచి ఆఫీస్ కి వెళ్లకుండా మోహన కన్నవారింటికి వెళ్లాడు.
డోర్ బెల్ చప్పుడు కి తలుపు తీసిన మోహన తల్లి కౌసల్య "ఎందుకొచ్చావు?." అంది కోపంగా
"ఆంటీ మోహన మిమ్మల్ని చూడాలంటోంది. తనకిప్పుడు ఏడో నెల. మీ పంతాలు, పట్టింపులూ పక్కన పెట్టి ఇంటికి రండి ఆంటీ. మీ కోసం చిన్న పిల్లలా ఏడుస్తోంది మోహన." అన్నాడు అఖిల్ అర్థింపుగా.
"ఆ పేరుతో మాకో కూతురు ఉండేది ఒకప్పుడు. కానీ అది చచ్చిపోయి సంవత్సరం అయ్యింది." అంది సుమిత్ర.
"ఆంటీ పెద్దవారు అలా మాట్లాడకూడదు. కడుపుతో ఉంది తను. మీకోసం పదే పదే కలవరిస్తుంది. ఎంత కాదన్నా తన కన్న తల్లి.తన కడుపులో ఉంది మీ మనవలు కాకుండా పోరు.కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఏవేవో కోరికలు, ఆశలూ ఉంటాయి. నేను ఎన్ని చేసినా తల్లిని కాలేను కదా. ప్లీజ్ ఆంటీ. రండి." అంటూ బ్రతిమలాడాడు అఖిల్.
"అదే మాకేం కానప్పుడు దాని కడుపులో ఉన్న బిడ్డ మాకేం అవుతుంది. దరిద్రపు సంతకోసం మా టైం వేస్ట్ చేయకు. వెళ్లిపో ఇక్కడి నుంచి." అంది కోపంగా.
"అలా అనకండి ఆంటీ. మోహన ఏడుస్తుందాంటీ. తను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఒకే ఒక్క సారి వచ్చి వెళ్లిపోండి చాలు. తను హ్యాపీ గా ఉంటుంది. ఇంకెప్పుడూ ఏ కోరికా కోరను అని అంది. మిమ్మల్ని ఎలాగైనా తీసుకొని వస్తానని చెప్పాను. దయచేసి నాతో రండి ఆంటీ మీ కాళ్లు పట్టుకుంటాను. "అంటూ అను కాళ్లపై పడ్డాడు.
"ఇప్పుడు గుర్తుకు వచ్చారా దానికి తల్లీదండ్రీ. మీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందటా అంటూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక,బయటికి రాలేక ఇంట్లోనే మగ్గిపోయాము. మా ఉసురు ఉసురు మీకు తగలక పోదా మీరు నాశనమైపోతారు."అంటూ రెండు చేతులతో దండం పెట్టింది.
"కడుపుతో ఉన్న బిడ్డకు చూడాలని ఉందని చెప్పిన మీ మనసు పెరగటం లేదా!.ఏం తల్లండీ మీరు.ఏ తల్లి అయినా తన కూతురు కడుపుతో ఉంది అంటే ఎంత సంతోష పడుతుందో.కానీ మీరు చూడ్డానికి కూడా రానని అంటున్నారు.శాపనార్థాలు పెడుతున్నారు. పంతాలు పట్టింపులతో మీరే ఉండండి.నా మోహన కి ఎవరూ లేకపోయినా నేనున్నా.నా కంటికి రెప్పలా చూసుకుంటా." అంటూ వెళ్ళిపోయాడు అఖిల్.
ఇంటి ముందు కార్ ఆగిన శబ్దం రాగానే సోఫాలో కూర్చున్నా మోహన బయటకు వచ్చింది తల్లి వచ్చిందేమో అనుకుంటూ. కానీ అఖిల్ ఒక్కడే రావడంతో,
"ఏంటి అఖీ క అమ్మ వాళ్ళు వెనక వస్తున్నారా?!." అంది.
సమాధానం ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు.
"అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వచ్చేసావేం. అమ్మా నాన్నా ఏమన్నారు?!." అంటూ వెళ్లి అతని పక్కన కూర్చుంది.
"అత్తయ్యా! తల నొప్పిగా ఉంది కాఫీ ఇవ్వరా ప్లీజ్." అన్నాడు అఖిల్.
"అఖీ! నేను అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా వచ్చేసావేం.అమ్మ వాళ్ళు ఎక్కడ?!."
"అమ్మా, అమ్మా అమ్మా అమ్మా ఎన్నిసార్లు అడుగుతావు.నాకు అదే పని అనుకుంటున్నావా. ఈరోజు బిజీగా ఉండి వెళ్ళలేదు.అయినా ఆ రోజు పెళ్లిలో అన్ని మాటలు అన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాను అనుకున్నావు!."అన్నాడు కోపంగా.
"అదేంటి అఖిల్ అలా మాట్లాడుతావు. రాత్రి నువ్వేగా అన్నావు అమ్మ ను ఎలాగైనా తీసుకుని వస్తాను అని. అందుకే అడిగాను." అంది బాధగా.
"రాత్రి నువ్వు ఏడుస్తుంటే చూడలేక అలా అన్నాను. అంతే కానీ నేను ఈ జన్మలో వాళ్లింటికి వెళ్లడం జరగదు." అంటూ సావిత్రి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుని త్రాగి టీపాయ్ మీద పెట్టి గదిలోకి వెళ్లి పోయాడు. వెళుతున్న అతడినే చూస్తూ ఉండిపోయారు మోహన, సావిత్రి.
బాధతో కన్నీళ్లు వాటికవే వస్తుంటే తుడుచుకోకుండా సోఫాలో కూర్చుండిపోయింది మోహన.
అది గమనించిన సావిత్రి "అయ్యో!తల్లీ కడుపుతో ఉన్న పిల్ల ఏడవ కూడదమ్మా."అంది.
"అది కాదు ఆంటీ తనే అన్నాడు అమ్మను తీసుకొని వస్తాను అని.అందుకే అడిగాను లేదంటే నేను అడగను." అంది బాధగా.
"వాడు ఏ మూడ్ లో ఉన్నాడో.అందుకే ఇలా మాట్లాడాడు.లేదంటే ఎప్పుడైనా నీమీద అరిచాడా చెప్పు."
"సరే నాకు చెప్పు నీకేం కావాలా అవన్నీ నేను చేసి పెడతాను"అంది సావిత్రి.
"ఆంటీ నాకేం వద్దు. నేనేమీ అడగక ముందే అన్నీ తెచ్చి పెడుతున్నాడు అఖిల్.ఇంకేం వద్దు."అంటూ అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్లి మంచంపై పడుకొని ఉన్న అఖిల్ పక్కనే కూర్చుని "అమ్మ రానంది కదా!." అంది.
"నేను వెళ్ళలేదు ఆఫీస్ లో వర్క్ ఉండి." అన్నాడు కళ్లు తెరవకుండానే.
"ఎప్పుడూ లేనిది నా మీద కోపం అయ్యేసరికి అర్థం అయ్యింది. అమ్మ రానంది. ఆ మాట చెప్తే నేను ఎక్కడ బాధ పడతాను అని నువ్వు ఇలా నా మీద అరిచేసావు అంతే కదా!." అంటూ అతని తలపై చేయి వేసింది.
"అవునన్నట్లు"తల ఊపాడు.
"చాలా మాటలు అని ఉంటుంది కదా!."
సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు.
"సారీ అఖీ! నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పి చాలా తప్పు చేశాను.ఇంకెప్పుడూ అలా చెయ్యను." అంది మోహన.
"నువ్వు తప్పు చేయడం ఏంట్రా. మీ మమ్మీ నీ కోసం వస్తుందని మాటిచ్చాను.మాటని నెరవేర్చుకో లేకపోయాను.నన్ను మన్నించు."అన్నాడు అఖిల్.
"సరే చెప్పు ఎక్కడికైనా వెళ్దామా!.లేదా ఏదైనా కావాలా?!.చెప్పు చిటికెలో నీ ముందు ఉంచుతా"అన్నాడు ఆమె మూడ్ మార్చే ఉద్దేశంతో.
"ఏం వద్దు. నువ్విలా నా కళ్లముందు ఉంటే అదే చాలు." అంది.
ఓ మంచి రోజు శ్రీమంతం చేశారు మోహనకి. రోజులు గడుస్తున్నాయి. అప్పుడు మోహనకి తొమ్మిదో నెల. బాత్రూంలో స్నానానికని వెళ్లిన మోహన కాలు జారి క్రింద పడింది.
"అమ్మా!" అంటూ ఆమె అరుపు వినగానే వెళ్లి చూసిన అఖిల్ రక్తపు మడుగులో స్పృహ లో లేని మోహనని చూడగానే కంగారుగా "మోహనా...మోహనా..." అంటూ పిలిచాడు. అప్పటికే విష్ణూ, సావిత్రీ కూడా వచ్చారు.అందరూ ఆమె ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు.
వెంటనే ఆపరేషన్ కి ఏర్పాట్లు చేశారు డాక్టర్లు. ఓ గంట పాటు ఆపరేషన్ థియేటర్ లో ఉన్న డాక్టర్ బయటకు రాగానే "డాక్టర్ మోహనా...!?." అడిగాడు అఖిల్ ఏడుస్తూ.
"సారీ అఖిల్. క్రింద పడేటప్పుడు ఆమె కడుపు నేలని అమాంతం తాకడంతో కడుపులో ఉన్న పాప తలకి దెబ్బ తగిలింది. ఆపరేషన్ చేసి బయటకు తీసేసరికే బేబీ చనిపోయింది." అన్నాడు డాక్టర్.
దాంతో దుఃఖం తన్నుకు వస్తున్నా ఆపుకుంటూ "మోహన ఎలా ఉంది డాక్టర్. తనకీ నిజం చెప్పారా?!." అన్నాడు అఖిల్.
"లేదు అఖిల్ తను అన్ కాన్సియస్ లో ఉంది. అండ్ ఒన్ మోర్ థింగ్ అఖిల్. క్రింద పడటంతో ఆమె గర్భసంచి బాగా దెబ్బతింది. దాంతో దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట ఆమె తల్లి కాలేదు." అంది డాక్టర్.
"తన ప్రాణాలకేం పర్వాలేదు కదా డాక్టర్" అన్నాడు అఖిల్ ఏడుస్తూ.
"నథింగ్ టూ వర్రీ అఖిల్." అంది డాక్టర్.
"తనకి ఎప్పుడు స్పృహ వస్తుంది డాక్టర్?!."అన్నాడు విష్ణు ఏడుస్తూ.
"బ్లీడింగ్ ఎక్కువ అయ్యింది కాబట్టి కొన్ని సెడిటివ్స్ ఇచ్చాము. అండ్ ఒకేసారి రెండు ఆపరేషన్లు జరిగాయి. దాంతో ఓ రోజంతా అన్ కాన్సియస్ లో ఉంటుంది. తర్వాత నార్మల్ స్టేజ్ కి వస్తుంది." అని చెప్పి డాక్టర్ వెళ్లిపోయింది.
అఖిల్ అక్కడే ఉన్న చైర్లో కూలబడి పోయాడు "మోహనా..."అంటూ.
"రేయ్... నువ్విలా అయిపోతే రేపు మోహనకి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు. ధైర్యంగా ఉండు అఖిల్." అంటూ విష్ణు ఓదార్చాడు. అయినా అఖిల్ ని ఆపడం అతని వల్ల అవ్వడం లేదు.
"తను రేపు పాప ఏదని అడిగితే ఏం చెప్పాలి మామయ్యా!. ఎన్నో ఆశలు పెంచుకుంది ఆ బిడ్డపై. ఆడపిల్లల డ్రెస్ లూ, మగబిడ్డల డ్రెస్ లూ, బొమ్మలూ, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ ఎన్నో కొనుక్కుని దాచుకుంది. ఇప్పుడు ఇలా జరిగి బేబీ దూరం అయ్యిందంటే భరించగలదా?!. తనని నేను ఓదార్చగలనా?!." అన్నాడు అఖిల్ ఏడుస్తూ.
ఇంతలో నర్స్ వచ్చి ఓ చిన్న మూట ని తీసుకుని వచ్చి "సర్ బేబీ బాడీ. మీరు పూడుస్తారా. లేదా మా సెంట్రీ కి ఇచ్చి..."
"నో... వద్దు. నే...నే... పూడుస్తాను.ఇటివ్వండి." అంటూ ఆ మూట అందుకున్నాడు... సెంట్రీ...ఆ మూట ఎటు విసురుతాడో... ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకుంటూ.
ఆ మూటని గుండెలకు హత్తుకుని "చిన్ని తల్లీ... మాకు అందరాని లోకాలకు వెళ్లిపోయావా. నీ ముఖం కూడా చూసే భాగ్యం లేకుండా చేశాడే ఆ దేవుడు. మీ అమ్మకి నేనేం సమాధానం చెప్పను. ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు తల్లీ." అంటూ గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆపడం విష్ణు, సావిత్రి ల తరం కాలేదు.
కాసేపటికి తేరుకున్న అఖిల్ "మామయ్యా! పద... నా బిడ్డని సాగనంపుదాం." అన్నాడు ఉద్వేగంతో.
ఇద్దరూ వెళ్లి బేబీని తమ సొంత స్థలంలో పూడ్చి పెట్టి వచ్చారు. ఆ రోజంతా పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు ఎవరూ.
మరునాడు మెలుకువ రాగానే మోహన చుట్టూ చూసింది.
బిడ్డ కనపడక పోవడంతో... "అఖీ... అఖీ..." అంటూ గట్టిగా పిలిచింది.
ఆ అరుపులు విన్న అఖిల్ పరుగున వచ్చాడు. వెనకే విష్ణూ, సావిత్రి కూడా.
"అఖీ... మన బిడ్డా...?!."
ఏం సమాధానం చెప్పాలో తెలీక అలాగే నిలబడి పోయిన అఖిల్ చూస్తూ "మాట్లాడవేం అఖిల్... మన బిడ్డ ఎక్కడా...?!." అంటూ రెట్టించి అడిగింది.
సమాధానం లేని ప్రశ్న కి బదులెలా ఇవ్వగలడు తను. లేని బిడ్డని ఎలా తీసుకు రాగలడు. అందుకే మౌనాన్నే ఆశ్రయించాడు ఉబికి వస్తున్న కన్నీటిని అదిమిపట్టి.
"అంకుల్ అఖిల్ సమాధానం చెప్పడం లేదేంటి... నా బిడ్డ ఎక్కడ?!." అంది విష్ణుని చూస్తూ.
అతనూ సమాధానం ఇవ్వకపోయేసరికి "ఆంటీ నువ్వైనా చెప్పు. బిడ్డ ఎక్కడుంది. నేను వెంటనే చూడాలి తనని." అంది సావిత్రి వైపు చూస్తూ.
ఎవరూ సమాధానం ఇవ్వకుండా ఉండిపోవడంతో "సమాధానం ఇవ్వకుండా నిలబడి ఉన్నారేం. నా బిడ్డ ఎక్కడా?. చెప్పండి?."అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది.
అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో వణుకు, ఇంకాసేపటికి ఫిట్స్ మొదలై కాళ్లూ చేతులూ కొట్టుకుంటోంది.
అఖిల్ డాక్టర్ కి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం చెప్పాడు. ఆమె వెంటనే వచ్చి మోహన ని చూసి ఓ రెండు ఇంజెక్షన్లు వేసింది.కాసేపటికి మోహన స్పృహ కోల్పోయింది.
"డాక్టర్ మోహనకి ఏం అయ్యింది?!." అన్నాడు.
"అఖిల్ మీరు నాతో రండి."అంటూ తన క్యాబిన్ కి వెళ్లింది డాక్టర్.
అఖిల్, విష్ణులు డాక్టర్ వెనకాలే వెళ్లి "చెప్పండి డాక్టర్ ఏం జరిగింది మోహన కి?!." అన్నాడు.
"ఓసారి ఆమెని ENT డాక్టర్, నెర్వ్స్ డాక్టర్ కి చూపించాల్సి ఉంటుంది." అంది.
"ఏ...ఏమైంది డాక్టర్ తనకీ. ఎందుకు ?!." అన్నాడు అఖిల్ కంగారుగా.
తన తలకి ఏదైనా దెబ్బతగిలిందేమో అన్న చిన్న అనుమానం. దానివల్లే ఫిట్స్ వచ్చుంటాయి. నేను డాక్టర్ ని ఇక్కడికే రప్పిస్తాను." అంది.
"ఓకే డాక్టర్"అనడం తప్పించి ఇంకేం అనలేకపోయాడు అఖిల్.
డాక్టర్స్ వచ్చి మోహన ని టెస్ట్ చేశారు.ఆమె బ్రెయిన్ కి స్కాన్ చేశారు.ఇంకొన్ని టెస్ట్ లు చేశాక అఖిల్ ని పిలిచారు.
మిస్టర్ అఖిల్ తలకి దెబ్బ తగలడంతో బ్లడ్ క్లాట్ అయ్యింది. దాంతో ఆమె కి ఫిట్స్ వచ్చింది.ఈ పొజీషన్ లో ఆమెకి బేబీ లేదనే విషయం తెలిస్తే పానిక్ అయ్యి ఆమె కోమా లోకి వెళ్లిపోవచ్చు లేదా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
"నో... అలా కాకూడదు. నా మోహనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్. అది నా ప్రాణం." అన్నాడు అఖిల్ ఏడుస్తూ.
"ఆమె ప్రాణాలు కాపాడుకోవాలంటే బేబీ బ్రతికే ఉందనీ పుట్టడంతో హెల్త్ కాంప్లికేషన్స్ రావడం తో ఇన్ టెన్సివ్ కేర్ లో ఉంచాలని చెప్దాము. ఇలా ఆమె ప్రాణాలను కాపాడుకోవడమే." అన్నారు డాక్టర్స్.
"కానీ ఇలా ఎన్నాళ్లు డాక్టర్?!."
తన మానసిక పరిస్థితి కాస్త కుదుటపడ్డాక ట్రీట్మెంట్ లో ఉన్న బేబీ చనిపోయిందని చెబ్దాము. అప్పుడు తను అంతగా పానిక్ అవ్వకపోవచ్చు. కానీ తనకి నిజం తెలిసే వరకూ తనేం చేసినా ఏం అన్నా మీరు రియాక్ట్ కాకండి.
బిడ్డని చూడాలనే ఆ తల్లిని అర్థం చేసుకోండి. మోహనని కూడా పసిపాపలానే చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ హెర్." అంటూ వెళ్లిపోయారు డాక్టర్లు.
రాత్రి కి మెలుకువ వచ్చిన మోహనకి బేబీ ఇంటెన్సివ్ కేర్ లో ఉందనీ, ఎవరినీ ఎలో చేయరనీ చెప్పాడు అఖిల్.
"దూరం నుంచే చూస్తాను అంటే లేదు మోహనా బేబీ కి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బయటి వాళ్లు వెళ్తే ఆ ఇన్ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉంది." అంటూ హాస్పిటల్ లో ఉన్నన్నాళ్లూ సర్ది చెప్పాడు.
ఇంకా ఎక్కువగా కేకలు వేస్తే సెడిటివ్స్ ఇచ్చి పడుకోపెట్టేవారు. తనని అలా చూస్తూ ఉండలేక పిచ్చి వాడిలా తయారు అయ్యాడు అఖిల్. వారం తర్వాత మోహనని డిశ్చార్జ్ చేశారు.
అప్పటి నుంచి మోహనని సముదాయించడం ఇంకా కష్టంగా మారింది.
బేబీ కోసం అడిగి అడిగీ అఖిల్ ని విసిగిస్తుంటే ఓ రోజు కోపం తట్టుకోలేక కొట్టేశాడు. దాంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.
"ఎందుకు నా పాపని నాకు చూపించడం లేదు. ఏం చేశావు తనని." అంది ఓ రోజు.
"చెప్పాగా మోహనా బేబీ కి హెల్త్ బాలేదని. క్యూర్ అయ్యాక తీసుకుని వస్తాను. సరేనా" అని తప్పించుకోబోయాడు.
"ప్రతీ రోజూ ఇదే మాట చెప్పి తప్పించుకుంటున్నావు అఖీ. పాపకి పాలు పట్టాలి. నా రొమ్ములు గడ్డ కట్టేస్తున్నాయి. నొప్పి భరించలేక పోతున్నాను. అయినా చూస్తూ ఉన్నావంటే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం చేశావు చెప్పు." అంది కోపంగా.
"నేనేమీ చేయలేదురా బేబీ హాస్పిటల్లో ఉంది." అన్నాడు అఖిల్.
"లేదు ఇన్నిరోజులు ఉంచరు ఎవరూ కనీసం ముఖం కూడా చూడనివ్వకుండా. ఏదో జరిగింది ఏం చేశారో చెప్పండి.మీరంతా కలిసి ఏదో చేశారు."అంటూ ముగ్గుర్నీ తిట్టడం మొదలుపెట్టింది.
"చెప్పాం కదమ్మా పాప హాస్పిటల్ లో ఉందనీ." అంది సావిత్రి.
"అబద్ధం చెప్తున్నావు నువ్వు. లేదు బేబీ హాస్పిటల్లో లేదు. అయినా ఓ కన్నతల్లి పడే ఆవేదన నీకు అర్థం కావడం లేదా. ఎలా అవుతుంది లే గొడ్రాలివి కదా. నవమాసాలు మోసి పిల్లలు కనుంటే ఆ బాధ తెలిసేది. పుట్టి ఇన్ని రోజులు అయినా నా బిడ్డ ని చూడకపోతే నా మనసు ఎంతలా కుమిలి పోతుందో." అంటూ పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ,
"ఓహ్ నీకు పిల్లలు లేరు కదా. నీ ఎదురుగా నేను బిడ్డని కనే సరికి కుళ్లు తో నా బిడ్డని నువ్వే మాయం చేశావు. ఎవరికో దాన్ని ఇచ్చేశావు. అంతేకదా. మేనత్తే తప్పు చేసింది కాబట్టి సర్ది చెప్పుకుంటున్నాడు నా మొగుడు. అంతేనా. ఏం చేశావే రాక్షసీ."అంటూ ఫ్లవర్ వాజ్ ని ఆమె పైకి విసిరింది. జస్ట్ మిస్ కళ్లు పోవాల్సిందే. దాంతో కోపంతో మోహన చెంపపై కొట్టి ఆఫీస్ కి వెళ్లి పోయాడు.
తను వెళ్లిపోయాక మోహన ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోవాలని ప్రయత్నించడం అప్పుడే ఆమెకి మందులు ఇవ్వడానికి వచ్చిన సావిత్రి చూసి ఆమెని కాపాడటంతో పెద్ద గండమే తప్పింది.
సావిత్రి ఏడుస్తూ ఫోన్ చేయడంతో అఖిల్ ఇంటికి పయనమైనాడు.
••••••¶¶¶•••••
వేగంగా వెళ్తున్న కార్ కీ, అతని ఆలోచనలకీ ఒకేసారి బ్రేక్ పడింది ఎవరో కార్ కి అడ్డుగా రావడంతో.
ఎవరో ముఖాన్ని కప్పుకున్న మనిషి రోడ్డు దాటుతూ చూసుకోకుండా అఖిల్ కార్ కి అడ్డంగా వచ్చింది. అతను బ్రేక్ వేయకపోతే ఆమె ప్రాణం పోవాల్సిందే. కోపంగా క్రిందకి దిగి "ఏయ్ చూసుకుని వెళ్లడం తెలీదా నీకు?!." అంటూ కోపగించుకుంటున్నా ఆ వ్యక్తి పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యంగా అనిపించింది అఖిల్.
ఓ నాలుగైదు కుక్కల అరుపు వినపడింది రోడ్ పక్కనే ఉన్న పొదల్లో. అసంకల్పితంగా అటువైపు చూశాడు. ఏదో మూట చుట్టూ తిరిగుతూ గొడవ పడుతున్నాయి.
ఎందుకో అతని మనసు కీడు శంకిస్తుండగా అటుగా పరుగెత్తాడు. కర్రలతో ఆ కుక్కలను తరిమి కొట్టి ఆ మూటను విప్పి చూశాడు. ముద్దుగా బొద్దుగా అందంగా ఉన్న ఆడబిడ్డ. ఎవరో పడేశారు. ఇందాక రోడ్ పై తన కార్ కి అడ్డుగా వచ్చిన వ్యక్తే పొదల్లోకి విసిరేసి వెళ్లిపోతున్నట్టుగా ఉంది.' అనుకుంటూ ఆ బిడ్డని తనతో పాటూ తీసుకుని వెళ్లి కార్ లో పెట్టాడు మోహన పడే బాధని చూడలేక ఆ దేవుడే ఓ పరిష్కారం చూపించాడనుకుని.
దార్లో బిడ్డకి చిన్న డ్రెస్ లూ, డైపర్లూ తీసుకుని పాపకి తొడిగి ఇంటికి పయనం అయ్యాడు.
మంచంపై నీరసంగా పడుకుని ఉంది మోహన... పాపా... నా పాపా... వీళ్లు నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు.ఆఖరికి నన్ను ప్రాణం లా చూసుకునే అఖీల్ కూడా నాపై చేయి చేసుకుంటున్నాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఎక్కడున్నావు తల్లీ.
దేవుడా నన్నింతగా శిక్షించడం ఏమైనా బాగుందా. కన్న బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యాన్ని కూడా నాకు రాసిపెట్టలేదా. నేనేం పాపం చేశాను." అనుకుంటూ తనలో తానే కుమిలి పోతుంది.
"అత్తయ్యా! " అనే పిలుపు వినిపించడంతో సోఫాలో కూర్చున్న సావిత్రీ, అప్పటికే ఇంటికి చేరిన విష్ణు గుమ్మం వైపు చూశారు. చేతిలో బిడ్డతో అఖిల్.
ఆశ్చర్యంగా అతని దగ్గరకు వెళ్లి "అఖిల్ ఈ బిడ్డ...?!." అన్నారు. అతను విషయం మొత్తం చెప్పాడు.
ఆ దేవుడే మనకో దారి చూపించాడు." అనుకుంటూ మోహనా! పాపా... నీ పాప వచ్చిందిరా." అంటూ పిలిచింది సావిత్రి.
"పాప... నా పాప వచ్చిందా... అఖిల్ పాప ని తీసుకుని వచ్చాడు.పాప వచ్చింది." అంటూ పరుగున బయటకు వచ్చింది మోహన.
చేతిలో ఉన్న బిడ్డని చూడగానే ఆమెలో ఆనందంతో పాటు కన్నీరు. అఖిల్ లోపలకు తీసుకుని రాబోతుంటే "ఆగండి."అంది.
ముగ్గురిలో నూ ఆశ్చర్యం. భయం...
హాస్పిటల్ నుంచి తీసుకుని వస్తున్నారు ఎంత దిష్టి తగిలిందో నా బిడ్డ కి. ఉండండి దిష్టి తీస్తాను అంటూ దిష్టి నీళ్లు సిద్ధం చేసి
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్లో వాళ్ల దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఆ హాస్పిటల్ లో నిన్ను తాకిన ప్రతీ ఒక్కరి దిష్టీ పోవాలి..." అంటూ దిష్టి తీసింది "ఇప్పుడు రండి ఇంట్లోకి" వాటిని బయట పారబోసి ఇంట్లోకి వచ్చి కాళ్లూ చేతులూ కడుక్కుని అఖిల్ చేతిలోని బిడ్డని అందుకుంది.
ఆమె చేతిలోకి వెళ్లగానే అంతవరకూ పడుకుని ఉన్న బిడ్డ నిద్ర మేల్కొని ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది.
"అయ్యో! తల్లీ ఏమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు. ఏం జరిగింది అఖిల్ పాప ఎందుకు ఏడుస్తుంది?." అంది కంగారుగా ఏం చేయాలో తెలీక.
అప్పుడు గుర్తుకొచ్చింది అఖిల్ కి పాలడబ్బా, పౌడర్ కొనడం మర్చిపోయాను ఆకలికి ఏడుస్తుందేమో. అనుకుంటూ "మామయ్యా!."అంటూ విష్ణు ని పక్కకి పిలిచి విషయం చెప్పాడు. నేనిప్పుడే వెళ్లి తెస్తాను అంటూ విష్ణు బయటకు వెళ్లబోయాడు.
బిడ్డ కంకటిల్లేలా ఏడుస్తుంటే మోహన లోని మాతృహృదయం కరిగి... ఆమె రొమ్ములో చిన్న నొప్పి మొదలైంది.
అప్పుడు అర్థం అయింది మోహనకి పాపకి ఆకలేస్తుందని. వెంటనే తన చీర చాటున బిడ్డని ఉంచి జాకెట్ హుక్స్ తొలగించి, స్థనాలను బిడ్డ నోటికి అందించింది. బిడ్డ వెంటనే అందుకుంది.
కాసేపు ఏడ్చింది, మోహనకి ముఖంలో బాధ.కానీ మరికాసేపటికే బిడ్డ ఏడుపు ఆపేసింది. మోహన ముఖంలో బాధ స్థానే నవ్వు వికసించడంతో ముగ్గురిలో నూ ఆశ్చర్యం తో కూడిన ఆనందం.
బిడ్డ కడుపునిండా పాలు త్రాగి నిద్ర పోయాక చీరను సవరించుకుని కన్నీరు నిండిన కళ్లతో అఖిల్ వైపు చూసి,
"థాంక్యూ అఖిల్... నా బిడ్డని నాకు అప్పగించి అపూర్వమైన బహుమతి ని ఇచ్చావు. ఓ తల్లికి తన బిడ్డను చేతిలోకి తీసుకుని పాలివ్వడం కంటే గొప్ప అనుభూతి ఏదీ ఉండదు తెలుసా. ఇన్నాళ్లూ అది లేక నేనెంత వేదన చెందానో. దానివల్లే నిన్ను చాలా బాధపెట్టాను. ఎప్పుడూ అడిగే వాడివి ఏం కావాలో చెప్పు చిటికెలో తెస్తాను. ఇంతకన్నా గొప్ప బహుమతి ఏదైనా ఉంటుందా." అంది కళ్లల్లో మెరుపుతో.
"ఆంటీ నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలు అన్నాను. అంకుల్ మీరు కూడా క్షమించండి." అంది సావిత్రి వైపు చూసి.
"అయ్యో! అవేం మాటలమ్మా. పిల్ల ని చూపించడం లేదన్న బాధతో అన్నావు. ఆ మాత్రం దానికే క్షమాపణలు ఎందుకు. మా కూతురు గా నీకు అనే అధికారం హక్కు ఉన్నాయి." అంది సావిత్రి.
"అది మీ మంచితనం. కానీ నేనెంత ఫూలిష్ గా బిహేవ్ చేశానో నాకు తెలుసు." అంది తలదించుకుని.
ఇన్నాళ్లూ బిడ్డని తేలేదని బాధపడ్డావు. ఇప్పుడు మమ్మల్ని తిట్టావని బాధపడుతున్నావు. అవన్నీ పక్కన పెట్టేసి నవ్వు తల్లీ." అన్నాడు విష్ణు.
అఖిల్ మాత్రం మోహన లో వచ్చిన మార్పుని, ఆ మార్పుకి కారణం అయిన బిడ్డ ని చూస్తూ ఉండిపోయాడు.
"అఖిల్ ఇంతకీ బిడ్డ ఎవరి పోలిక?!." అంది మోహన.
గతుక్కుమన్నాడు అఖిల్ ఏం చెప్పాలో తెలీక.
చిన్నపిల్లలికి పోలికలు అప్పుడే ఎలా తెలుస్తాయి. అది పడుకుంది కదా, దానికి పక్క సిద్ధం చేసి అందులో పడుకోబెట్టు. అఖిల్ నువ్వు, మీ మామయ్యా సిద్ధాంతి దగ్గరకు వెళ్లి ఎప్పుడు బారసాల చేయాలో కనుక్కోండి." అంటూ తొందరపెట్టింది సావిత్రి.
"సరే"అని ఎవరికి కేటాయించిన పనులు వారు చేయడానికి సిద్ధం అయ్యారు...
పాప రాకతో ఆ ఇంట్లో కోల్పోయిన ఆనందం మరోసారి తిరిగొచ్చింది.
(( సమాప్తం))
Note:- "అమ్మ ఎవరికైనా అమ్మే..."
... కమల'శ్రీ'✍️.
