మిత్రలాభం
మిత్రలాభం
//మిత్ర లాభం//
“అరేయ్ ఈ రోజు నేను పిచ్చ హ్యాపీ గా ఉన్నాను. ఫుల్ గా తాగుతా.” అంటూ మందు గ్లాస్ ఎత్తి గట గటా తాగేశాడు మధు.
“రేయ్ ఏంట్రా ఆ తాగడం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. బిల్ పే చేసి ఇంటికి వెళ్దాం.” అని పక్కనే ఉన్న సుభాష్ అంటుండగా,
“హేయ్ ఆగరా... నా బాల్య మిత్రుడివైన నువ్వు అమెరికా నుంచి వచ్చిన శుభ సందర్భం గా ఈ పార్టీ. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోనీ.” అంటూ మరో గ్లాస్ పైకెత్తి “ఒన్ మోర్” అంటూ వెయిటర్ ని పిలిచాడు.
“మధూ ఇప్పటికే బాగా ఎక్కువ తాగావు. నీ సంతోషాన్ని రేపు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు.” అంటూ తూలుతున్న మధూ ని ఓ చేత్తో పట్టుకుని బిల్ పే చేసి బయటకు నడిచాడు సుభాష్.
“రేయ్ ఇంకొక్క పెగ్గు రా. ప్లీజ్ రా...” అంటూ మత్తుగా అడుగుతున్నాడు మధు.
బయటకు వచ్చి పార్కింగ్ లో ఉన్న తన బైక్ తీసి తూలుతున్న మధు ని మెల్లగా కూర్చోపెట్టి తనూ కూడా కూర్చుని స్టార్ట్ చేశాడు. కొద్ది దూరానికి పోయేసరికి ఎవరో రోడ్డుకి అడ్డంగా ఉండి చేయి ఊపేసరికి బండి స్లో చేయబోయాడు సుభాష్.
ఎదురుగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ ఉండటం గమనించిన మధు “రేయ్ ! పోలీసులు రా. బండి ఆపకు. దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ చేస్తారు. బండి వెనక్కి తిప్పు.” అంటూ మధు కంగారు పెట్టడం తో బైక్ ని వెనక్కి తిప్పాడు సుభాష్.
వీళ్ళు బైక్ ని వెనక్కి తిప్పడం గమనించిన పోలీసులు వెంబడించి కాస్త దూరం లో పట్టుకున్నారు. ముందే దొరికితే ఫైన్ తో వదిలిపెట్టేవారేమో, కానీ పారిపోవడానికి ప్రయత్నించడం తో ఫైన్ వేయడం తో పాటే కేస్ కూడా ఫైల్ చేసి ఇద్దర్నీ జీప్ ఎక్కించారు. బండి ని స్టేషన్ కి తరలించారు. ఆ రాత్రాంతా స్టేషన్ లో ఉంచి మరుసటి రోజు కౌన్సిలింగ్ చేసి ఇక మీదట డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఆరు నెలల జైలూ, పదివేల రూపాయల ఫైన్ తో పాటూ బండి సీజ్ చేస్తామని చిన్న వార్నింగ్ ఇచ్చి ఇద్దర్నీ విడిచిపెట్టారు పోలీసులు.
“రాత్రి ఎక్కడికి వెళ్లావు రా. ఇంటికి రాకుండా ఆ తిరుగులు ఏంటి?.ఎదిగొచ్చిన కొడుకువి నువ్వుండగా మీ నాన్న ఈ వయసులో కూడా ఆ మిల్లు లో గుమస్తాగా పని చేయాల్సి వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లీడుకి వచ్చి. ఆ వచ్చే సొమ్ము ఇల్లు గడవడానికే చాలడం లేదు. అలాంటిది వాళ్ల పెళ్లిళ్లు ఎలా చేయాలో ఏంటో. నువ్వు ఏదో ఒక పని చేసి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి ఇలా రోజూ రాత్రంతా స్నేహితులతో కబుర్లాడుతూ ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నావు.” అంటూ ఇంట్లోకి వస్తున్న మధు ని చూసి తిట్ల దండకం మొదలుపెట్టింది మధు తల్లి సావిత్రి.
“అబ్బా! సావిత్రీ ఇప్పుడేమైందనీ వాడిని తిడుతున్నావు. రాత్రి ఏదో సరదాగా అలా స్నేహితులతో కబుర్లాడుతూ ఆలస్యం అవ్వడం తో అక్కడే ఉండిపోయి ఉంటాడు. స్నేహితులతో ఉంటే ఉద్యోగాల గురించిన సమాచారం తెలుస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్లొచ్చు. ఇంక వాడి చెల్లిల్ల పెళ్లిళ్లు అంటావా వాడికి ఆ మాత్రం తెలీదా వాడి చేతుల మీదే వాళ్ళిద్దరి పెళ్లిళ్లు చేస్తాడు చూడు. పాపం రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందో లేదో కాస్త ఏదైనా ఎంగిలిపడి నడుం వాల్చమని చెప్పు.” అని తన మిల్లు కి వెళ్లిపోయారు మధూ తండ్రి రామారావు.
“మీరిలా వాడిని గారాబం చేయడం వల్లే వాడు ఇయా ఊళ్ళు పట్టుకు వెళ్లాడుతున్నాడు.” అని రుస రుస లాడుకుంటూ తన పనుల్లో పడింది సావిత్రి.
గదిలోకి వెళ్లి స్నానం చేసి తిన బుద్ది కాక అలా మంచం మీద నడుం వాల్చాడు మధు. అతని చెవుల్లో తండ్రి అన్న మాటలే వినిపిస్తున్నాయి. స్నేహితులతో మాట్లాడితే వాడికి ఉద్యోగ అవకాశాల కోసం తెలుస్తుంది అన్నారే కానీ పల్లెత్తి ఓ మాట అనలేదు. అటువంటి తండ్రి ని తను మోసం చేస్తున్నాడు. తనేదో చదువు కోసం స్నేహితులతో కలిసి తిరుగుతున్నాను అనుకుంటున్నారు.
కానీ తనేమో తాగి రోడ్లమ్మట పడి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏకం గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి రాత్రంతా స్టేషన్ లోనే ఉండి వచ్చాడు. తన మీద అంత నమ్మకం పెట్టుకున్న తండ్రిని తను మోసం చేస్తున్నాడు.... అలా తన తండ్రి ని మోసం చేస్తున్నాను అని అనిపించగానే అతనికి తెలియకుండానే కళ్ల వెంట కన్నీరు వచ్చాయి.
రోజులు గడుస్తున్నాయి. మునుపటిలా మధు రాత్రి పూట బయట తిరగకుండా పెందలాడే ఇంటికి చేరుకుంటున్నాడు. పేపర్లో , నెట్ లో చూసిన ఇంటర్వ్యూ లకు వెళుతూ వస్తున్నాడు. కొద్ది రోజులకు ఓ మంచి కంపెనీ లో ఉద్యోగం సంపాదించాడు.
ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ పేకెట్ ఇంటికి తీసుకుని వెళ్లి సంతోషం గా అందరికీ పంచిపెట్టాడు మధు. కొడుకు విషయం చెప్పగానే ఆనందం తో పొంగిపోతారు మధు కుటుంబం మొత్తం.
కొద్ది రోజులకు మధు పెద్ద చెల్లెలు సుమతి పెళ్లి ని తమ స్తోమతకు తగ్గట్టుగా పెట్టుపోతల్లో ఏ లోటూ లేకుండా జరిపించారు. అప్పగింతలు ముగిశాక ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు విశ్రాంతి తీసుకోవడానికి.
***********
తలుపు చప్పుడు అవ్వడం తో “ఎవరూ?.” అని కళ్లు తెరిచారు రామారావు గారు.
“నేనంకుల్ సుభాష్ ని. లోపలికి రావోచ్చా?.” అన్నాడు సుభాష్.
“నువ్వా...! రా బాబూ...” అన్నారు.
సుభాష్ వెళ్లి మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని "ఇప్పుడు మీరు సంతోషం గా ఉన్నారా అంకుల్?!.” అని ప్రశ్నించాడు.
“చాలా సంతోషం గా ఉన్నాను నాయనా. నువ్వు చేసిన మేలు మర్చిపోలేను.” సుభాష్ చేతులు పట్టుకుని అన్నారు రామారావు గారు.
“ఇందులో నేను చేసిన మేలు ఏముంది అంకుల్. నా స్నేహితుని జీవితం గాడిలో పడటానికి నేనేం చేయాలో అది చేశాను.
నాలుగేళ్ల తరువాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన నాకు నా బాల్య స్నేహితుడు మధు ఇలా మందుకు బానిసై పనీ పాటా లేకుండా తిరుగుతున్నాడని మా బాబాయ్ మిల్లు కి వచ్చినప్పుడు అక్కడే వర్క్ చేస్తున్న మీరు చెప్పడం తో తెలిసింది. వాడి తాగుడు విషయం మీకు తెలీదని వాడు అనుకుంటున్నాడని కూడా తెలిసింది. అది తెలిసాక నా స్నేహితుని జీవితం గాడిలో పడటానికి నా వంతుగా నేనేమీ చేయాలో ఆలోచించి... కావాలనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్న వైపుగా బైక్ ని పోనిచ్చి మళ్లీ వెనక్కి తిప్పాను.
పోలీసుల్ని చూడగానే బైక్ వెనక్కి తిప్పడం తో వాళ్ళు చేజ్ చేసి మమ్మల్ని పట్టుకుని స్టేషన్ లో పెట్టారు. ఓ చిన్న వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించాక మీరు వాడిని సమర్ధిస్తూ ఆడిన మాటలు వాడిపై ప్రభావం చూపించాయి. మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని వాడిలో వాడే తర్జనకు గురై వాడిలో పరివర్తన వచ్చి ఉద్యోగం సంపాదించాడు.” అని చెప్పడం ముగించాడు సుభాష్.
“మరి ఆ పోలీస్ కేస్ సంగతి ఏంటి బాబూ?!.” ఎక్కడో తొలిచేస్తున్న ప్రశ్న ని అడిగేశారు రామారావు గారు.
“ఆ విషయం లో మీరేమీ భయపడవద్దు అంకుల్. ఆ స్టేషన్ ఎస్సై నా ఫ్రెండ్ నే." అని ఆయన చేతిపై తన చేయి వేశాడు సుభాష్.
“హమ్మయ్యా...” అంటూ గుండెల మీద చేయి వేసుకున్నారు రామారావు గారు.
ఇక్కడ రామారావు గారికి కూడా విషయమేంటంటే తాగడం అలవాటు లేని సుభాష్ కేవలం మధూ లో మార్పు కోసమే ఆ రాత్రి మధూ తో పాటుగా బార్ కి వెళ్లాడనీ, తన స్నేహితుని జీవితం కోసం మందు ని విషం లా చిన్న సిప్ తీసుకున్నాడనీ...
... కమల'శ్రీ'✍️.
