ఓరి దేవుడా
ఓరి దేవుడా
స్మశానపు ఒడ్డున జువ్విచెట్టు క్రింద నులక మంచమేసుకుని కూర్చున్నాడు రత్తయ్య. రత్తయ్య వృత్తి రీత్యా కాటికాపరి. రోజులో యిరవై నాలుగు గంటల పాటూ స్మశానాన్ని కనిపెట్టుకు ఉండటమే వృత్తి. అందుకు గానూ పంచాయితీ అతనికి నెలసరి వెయ్యి రూపాయిలు జీతం యిస్తుంది. కాటికాపరితనం వారసత్వంగా వస్తున్న వృత్తే అయినా ఆ చిన్న ఉద్యోగం నిలబెట్టుకుందికి కూడా గ్రామ ప్రెసిడెంట్ కు వంద, కరణానికి వంద లంచం యిచ్చుకోవలసి వస్తుంది. లేకపోతే ఉద్యోగము నిలవదు.
ఊర్లో శవాలు లేస్తుంటేనే తప్ప పంచాయితీ యిస్తున్న జీతంతో అత బండి నడవదు. శవం మీద కనీసం అయిదు వందలన్నా మిగులుతుంది. నెలకు నాలుగయిదు శవాలు లేస్తుంటాయి. ఈ మధ్య ఊర్లోకి కొత్త డాక్టరు వచ్చాడు. అతని హస్థవాసి మంచిదిలా ఉంది. ఊర్లో శవాలు లేవడం లేదు. రత్తయ్య వ్యక్తిగతంగా ఎవరి చావూ కోరుకునే వాడు కాకపోయినా అతనికీ నిర్వర్తించవలసిన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి.
ఎండాకాలం. ఎండతీవ్రత పెరిగి వడఘాడ్పు కొట్టసాగింది. వడదెబ్బ సీజనులో ఊర్లో నుండీ ఒకటి రెండు శవాలు లేవడం పరిపాటే. అందుకే డప్పుల శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి వినసాగాడు. పాడె సిద్ధం చెయ్యమని చెప్పడానికి ఎవరన్నా వస్తున్నారేమోనని కళ్ళకి చెయ్య అడ్డం పెట్టుకుని ఊరి వైపు ఆశగా చూడసాగాడు. యింతలో ఉర్లోనుండీ ఒక వ్యక్తి శ్మశానం వైపు బిరబిర రావడం కన్పించింది. ప్రక్కనే ఉన్న కుండమీది చట్టి మూత తీసి సత్తు గ్లాసుతో నీటిని నింపుకుని గొంతు తడుపుకున్నాడు.
“ఎవులు బావూ నువ్వు? యింత ఎండల పడి వత్తనావు. ఊర్లో శవమేటన్నా లేసిందేటి?” ఆత్రంగా ప్రశ్నించాడు.
“లేదు రత్తయ్యా. నేను శవదహనం కోసం రాలేదు. నీతో పనుండి వచ్చాను”
“బావూ! నా పేరు నీకేలా తెలుసు? నువ్వెవరో నాకు తెలదు. ఈ ఊర్లో నిన్నెక్కడా సూడలేదు” ప్రశ్నించాడు రత్తయ్య.
“రత్తయ్యా. నేను ఈ ఉరివాడినే. గుళ్ళో ఉంటాను. నువ్వు నన్ను చూడలేదేమో కానీ నువ్వు రోజూ గుడి ముందు తలగుడ్డ చాపి ప్రసాదం కోసం అడుక్కోవడం నేను చూస్తుంటాను” అన్నాడు ఆ వ్యక్తి.
“ఏటీసెయ్యను బావూ. చండాలుడిని. గుళ్ళోకి అడుగెట్టే హక్కు నాకు లేదు. అయ్యవారు పెట్టే ఆ ప్రసాదంతో యిక్కడ నా పొట్ట నిండిపోతుంది. మాలపల్లిలో పెల్లం, పిల్లలు జీతం డబ్బులు తిని బతకతన్నారు... అదిసరే కానీ బావూ గుడిలో పూజారివి. యిలా నాకాడకు రాడమేటి?” అనుమానంగా ప్రశ్నించాడు రత్తయ్య.
“రత్తయ్యా! నన్ను నిలబెట్టే మాట్లాడతున్నావు. ఎండపొడ పడి వొచ్చాను. కూర్చోమనవా? త్రాగడానికి మంచినీళ్ళివ్వవా?” నిష్ట్యూర్యంగా ప్రశ్నించాడు ఆ వ్యక్తి.
“బావూ! నాను కూకున్న ఈ మంచం పీనుగు లేసిన మంచం. ఈ నీటికుండ పీనుగుతో పాటు వచ్చిన కుండ. తాగుతున్న నీరు ఈ దహనాల కోనేటివి. ఈ కాట్టంలో నాదంటూ ఏటీ లేని నికృష్టపు బతుకు బతకతన్నాను. నా నీల్లు నువ్వు త్రాగితే మైలపడిపోతావు. నేను నిన్ను ఆదరించిన విసయం పంచాయితీ పెద్దలకు తెలిత్తే నిన్ను గుడిలోకి అడుగెట్టనిట్టనివ్వరు. అయ్యవారి పనిలోండి తీసేత్తారు. ఊరి నుండీ వెలెసేస్తారు. నన్నూ పనిలో యిడుకోరు. యిది మనిద్దరికీ మంచిది కాదు”
“రత్తయ్యా. నువ్వనుకుంటున్నట్లు నేను అర్చకుడిని కాను. గుళ్ళో దేవుడిని. నా పేరు కాల భైరవుడు. బ్రహ్మ అహంకారాన్ని అణచడానికై పరమేశ్వరుని సంకల్పాన జన్మించాను. బ్రహ్మ ఐదవ శిరస్సును గోటితో త్రుంచి శరీరం నుండీ దూరం చేసి బ్రహ్మహత్యా పాతకానికి గురయ్యాను. దాని నుండి విముక్తి పొందడానికై అనేక తీర్థయాత్రలు చేసాను.
చివరికి కాశీ పుణ్య క్షేత్రంలో బ్రహ్మ హత్యా పాతకం తొలగింది. పరమేశ్వరుడు నాభక్తికి మెచ్చి కాశీనగరానికి క్షేత్రపాలకునిగా నియమించి దైవత్వం కల్పించాడు. పాపాలను శమియింపజేసి దోషాలను హరింపజేయగల శక్తులు ప్రసాదించాడు. నాకూ నా తండ్రి గారి లాగే సర్పాలంటే ప్రియం. సర్పాలనే నేను ఆభరణాలుగా ధరిస్తాను.
ఒకప్పుడు ఈగ్రామం జమీందార్ల పాలనలో ఉండేది. జమీందారు గారికి జాతక రీత్యా సర్పదోషముంది. సర్పాలతో నాకు గల అనుబంధాన్ని పురస్కరించుకుని దైవజ్ఞుల సలహా మేరకు సర్పదోషనివారణార్ధం కాశీ క్షేత్రంలో ఉండే నాఅంశను యిక్కడ విగ్రహంలో ప్రతిష్ఠ చేయించారు. నా ప్రతిష్ఠ జరిగి మూడు వందల సంవత్సరాలయింది”
“బావూ, నా లాగే మనిసిలా ఉన్నావు. దేవుడిని అని నువ్వంటే ఎలా నమ్మగలను?” ఆశ్చర్యపోతు ప్రశ్నించాడు రత్తయ్య.
“రత్తయ్యా! నీకు నమ్మకం కలిగించడానికై చెప్తున్నాను. చండాల కులస్తులైన మీకు దేవుని పేర్లు పెట్టుకుందికి అనుమతి లేదు. అందుకే ఏదో ఒక వాడుక నామధేయంతో పిలుస్తారు. నా విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు నీ పూర్వీకుడు బండిగాడు యిక్కడి కాటికాపరి. తర్వాత వరుసగా దాలిగాడు, గడ్డిగాడు, పెంటిగాడు, పసిరిగాడు, యిప్పుడు నువ్వు అయ్యారు...”
“బావూ. నా పూర్వీకుల పేర్లన్నీ బాగానే గురుతు పెట్టుకున్నావు. పేడలో పుట్టి పేడలో నసించిపోయే పేడపురుగు లాటోల్లం. మాపేర్లన్నీ ఎందుకు గురుతు పెట్టుకున్నావు? మా మీద నీకెందుకింత ధ్యాస? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
“రత్తయ్యా. నాజన్మదాత పరమశివునికి శ్మశానాలే విహారస్థలాలు. చితాభస్మాన్నే లేపనంగా పూసుకుంటాడు. అతని అంశలో ఉద్భవించిన నాకు శ్మశానాలతో, కాటికాపర్లతో అవినాభావ సంబంధ ముంది. అందుకే అదృశ్యరూపినై అప్పుడప్పుడు శ్మశానంలో తిరుగుతుంటాను. నీతో పనిపడింది కాబట్టే ఈ రోజు మానవ రూపు ధరించి వచ్చాను.
"నా రాక గురుంచి నువ్వేమీ భయపడకు. నీకు తప్ప నేనెవరికీ కనపడను. నీకు తప్ప నా మాటలెవరికీ వినపడవు” అంటూ చొరవగా మంచం మీద కూర్చుని, సత్తుగ్లాసు తీసుకుని ప్రక్కనే ఉన్న కుండలోని నీరు తీసుకు త్రాగి సేద దీరాడు.
“బావూ. యిన్నాళ్లూ నాతో పీనుగులకే పని పనుందనుకునేవోడిని. యిప్పుడు దేవుల్లకి కూడా నాతో పనిపడతుందని తెలిసి ఆనంద పడిపోతన్నాను. సెప్పు. నేను నీకు ఎలాటి సాయం సెయ్యగలను?” ప్రశ్నించాడు రత్తయ్య.
*** *** ***
రత్తయ్యా! నా విగ్రహాప్రతిష్టకై జమీందారు గారు అప్పటిలో గ్రామ శివార్లుగా ఉండే ఈ దేవాలయ ప్రాంతంలో రెండెకరాల జాగా కేటాయించి, చుట్టూతా ప్రహారీ గోడ కట్టించి ఈశాన్య మూలగా చిన్న గుడి కట్టించి నన్ను పతిష్టించారు. నాకై కేటాయించిన ఈ గుడి ప్రాంగణంలో యితర దేవుళ్ళను ప్రతిష్టించాలన్న ఆలోచన అప్పట్లో వారికి లేదు.
కేవలం సర్పదోష నివారణ తప్ప వారు నానుండీ ఏమీ ఆశించలేదు. నా ధూపదీప నైవేద్యాలకయ్యే ఖర్చులు దివాణం నుండే పంపించే వారు. నా పూజాపునస్కారాలు నిర్వర్తించేందుకై నెలసరి జీతం మీద అర్చకుడిని నియమించి గుడి ప్రాంగణంలోనే వారికి నివాస గృహాన్ని కట్టించారు. జమీందారు గారు బ్రతికున్నంత కాలం అంతా సవ్యంగానే జరిగాయి. వారి తదనంతరం జమీందారీలు రద్దయ్యాయి. యాజమాన్యం పంచాయితీ చేతులలోకి వచ్చింది.
నెలవారీగా నా ధూపదీప నైవేద్యాల ఖర్చులు, అర్చకుని నెలసరి జీతం యివ్వడం పంచాయితీకి పెద్దలకు భారంగా అనిపించింది. భక్తులనుండీ విరాళాలను సేకరించి దేవాలయాన్ని అభివృద్ధి పరచి వచ్చే రాబడిలో తాము కూడా లబ్ది పొందాలన్న దురాలోచన చేశారు. అందులో భాగంగా అనువంశికంగా వస్తున్న గుడి అర్చకుడిని తరిమేశారు. తమ ఆశయాలు తీర్చగల సమర్ధుని కోసం వెదుకులాడి చివరికి కుక్కుటేశ్వర స్వామిని అర్చకుడిగా రంగంలోకి దింపారు.
కుక్కుటేశ్వర స్వామి లౌక్యుడు. గుడితో పాటూ గుడిలో లింగాన్ని కూడా మ్రింగగల సమర్ధుడు. దేవుని కన్నా పంచాయితీ పెద్దల కటాక్షం పొందడంలోనే మేలుంటుందని గ్రహించి ఆలయ సంపాదన అభివృద్ధికి అవసరమయిన సూచనలు చేశాడు.
క్షేత్రపాలకుని హోదాలో ప్రతిష్టించబడిన నేను ద్వితీయశ్రేణి దేవుడననీ, పరిమిత శక్తులు గలవాడననీ, భక్తుల గొంతెమ్మ కోరికలు తీర్చలేని అసమర్ధుడనని, అందుకే భక్తుల ఆదరణ పొందలేకపోతున్నానని ప్రభోదించాడు. కుక్కుటేశ్వర స్వామి చెప్పినదాంట్లో అతిశయోక్తి లేదు. విగ్రహ ప్రతిష్ఠ ఏసంకల్పంతో చేస్తారో దేవుని శక్తి యుక్తుల పరిమితి అంతవరకే ఉంటుంది. నా పరిస్థితీ అంతే. సర్పదోషనివారణకు మించిన శక్తులు నాలో లేవు.
“అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరమీని వేల్పు, మొహారమున దానెక్కిన బాఱని గుర్రము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ” అన్న సుమతీ శతకంలోని పద్యాన్ని చదివి వినిపించి అర్ధమయేటట్లు వివరించాడు. భక్తుల కోరికలు తీర్చలేని నావంటి అర్భకునికి రెండెకరాల స్థలం వ్యర్ధంగా విడిచిపెట్టడం అవివేకమన్నాడు. పవిత్ర దేవాలయ ప్రాంగణంలో అర్చక గృహాలుండటం, అందులో ముట్లుడగని స్త్రీలు సంచరించడం ధర్మవిరుద్దమనీ సలహా యిచ్చాడు.
ఆస్థలంలో భక్తజన ఆదరణ పొందుతున్న దేవీ దేవతా విగ్రహాలను ప్రతిష్టించడం, ప్రత్యేక సేవలూ, యజ్ఞయాగాదులూ, యితర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలలో అధ్యాత్మిక అవగాహన పెంచి, తద్వారా దేవాలయ ఆదాయం పెంచుకోగల అనేకానేకమయిన ఉపాయాలను తెలియజేశాడు. కుక్కుటేశ్వర స్వామి తెలివితేటలకు పాలకమండలి నివ్వెరపోయారు. వెంటనే కార్యాచరణ మొదలు పెట్టేందుకు అతనికి అనుమతి అధికారాలనిచ్చారు. కావలసిన నిధులు సమకూర్చారు.
వెంటనే భక్తులు విషేషంగా ఆరాధించే వినాయకుడు, ప్రసన్నాంజనేయుడు, కోదండరాముడు, వీసాల వెంకటేశ్వరుడు, భోళా శంకరుడు, సాయిబాబా లతో పాటూ త్రిమాతలయిన దుర్గ, లక్ష్మి, సరస్వతి, నవగ్రహాల విగ్రహాలను ఆళ్ళగడ్డ నుండీ చెక్కించి తెప్పించి అన్నిటికీ ఒకటే పైకప్పు క్రింద చిన్న చిన్న గుడులుగా ఏర్పాటు చేసి ప్రతిష్ఠలు చేయించాడు. దేవీ దేవతలకు శైవ, వైష్ణవ, శాక్తేయ పద్ధతులలో నిత్య పూజలు నిర్వహించగల తనవారందరినీ అర్చకస్వాములగా నియమించాడు.
వీటికి అదనంగా సమయానుసారంగా వచ్చే గణేశ, దేవీ నవరాత్రులు, అయ్యప్ప దీక్షలూ, యజ్ఞయాగాదులూ, వ్రతాలూ, దేవుళ్ళ కళ్యాణాలూ, రుద్రాభి అభిషేకాలూ, తైలాభిషేకాలూ, బిల్వార్చనలూ, కుంకుమార్చనలూ, గరికపూజలూ, బ్రహ్మోత్సవాలూ, అక్షరాభ్యాసాలూ, యిత్యాదివి నిర్వహించేందుకు వీలుగా మంటపం కట్టించాడు.
వీటికి అదనంగా గుడి వెనుక ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేసి గుడులు కట్టించి పోలేరమ్మ, నూకాలమ్మ, తలుపులమ్మ వంటి గ్రామ దేవతలకు స్థానం కల్పించాడు. వాటికి ఎదురుగా వధ్యపీఠాలను ఏర్పాటు చేయించాడు. రంగం వేసి భవిష్యవాణి చెప్పే జోగినులను, పోతరాజులను రంగంలోకి దింపారు.
కిరాణా దుకాణాలలో దొరకని సరుకంటూ లేనట్లే దేవాలయం సుమారుగా అన్నీ దేవీ దేవతా విగ్రహాలతో నింపేశారు. ధర్మదర్శనాలతో పాటూ రుసుం కట్టి అనుమతించే శీఘ్రకాల దర్శనాలు, గోత్రనామాల పూజలు, హారతి సేవలు, ఆకు పూజలు, గరిక పూజలు, తైలాభిషేఖాలూ, రుద్రాభిషేఖాలూ, యజ్ఞయాగాలు, కళ్యాణాలు, పవళింపు సేవాలూ నిర్వహించేందుకు ధరవరల పట్టిక వ్రేలాడ దీశారు. ముందస్తుగా డబ్బు కట్టుకుని రశీదు పొందిన భక్తులకు ముందు వరుసలో కూర్చోని తరించగల అవకాశం కల్పించారు. ఆకస్మికంగా వచ్చిన భక్తులు తత్కాల రుసుము చెల్లించి సేవలలో కూర్చునే వెసులు బాటు కల్పించారు.
భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కళ్యాణ కట్ట, నిలువు దోపిడీలు చెల్లించుకునే తులాభారం, దేవునికి మ్రొక్కుబడులు, విరాళాలు వేసుకునే హుండీలు, స్వామి వారి కానూకలను భద్రపరచే భండారపు గది, భక్తులకు సమర్పించుకున్న ఆవులు, ఎద్దులను కట్టేందుకై ప్రత్యేకంగా గోశాల, పూజాసామగ్రి విక్రయశాల, ప్రసాదాల విక్రయశాలలు నిర్మించారు.
యింతే కాక రుసుము కట్టి భద్రపరుచుకునే సామానుల గది, చెప్పుల గది, శౌచాలయాలు, భోజన ఫలహారశాల, వాహనాల నిలుపుదల జాగాలు వంటి అనేకానేక మౌలిక మౌలిక వసతులు ఏర్పాట్లు చేశారు.
ప్రజలవద్దకే పాలన అన్న ప్రభుత్వ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని దేవాలయానికి వచ్చి దైవదర్శనం చేసుకోలేని అభాగ్యులకు దైవదర్శనం కల్పించాలన్న సదుద్దేశంతో, దేవుళ్ళను పురవీధులలో రధాయాత్ర ద్వారా త్రిప్పే వెసులు బాటు కల్పించారు. శాశ్వత చందాలు కట్టి ప్రత్యక్షంగా సేవలకు హాజరు కాలేని భక్తులకు తీర్థ, ప్రసాదాలూ, విభూది, కుంకుమ, అక్షతలూ వారియి యిళ్లకు చేరవేయగల సదుపాయాలు కల్పించారు.
అలనా పాలనా కరువై `కాల భైరవుని గుడి’గా శిధిలావస్తాకు చేరిన నాదేవాలయ ప్రాంగణాన్ని యిప్పుడు కుక్కుటేశ్వర స్వామి `సర్వదేవతా సంస్థానం’ గా నామాంతరం చేశాడు. ఈ రోజు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఈ దేవాలయం మీద సుమారు రెండు మూడు వందలమంది బ్రతుకుతున్నారు” చెప్పాడు కాలభైరవుడు.
“నువ్వు సెప్పినది నిజవే బాబూ. కుక్కుటేసర సామి పెద్ద పూజారి అయ్యాక గుడి రూపు రేఖలే మారిపోయాయి. భక్తులలో దేవుని పట్ల భక్తి శ్రద్ధలెక్కువయ్యాయి. దేవుడి పేరు సెప్పి నాకు ప్రెసాదం కడుపునిండా రెండు పూటలా దొరుకుతున్నది. యిదంతా ఆ బావు సలవే. యిదంతా మంచిదే కదా బాబూ”
“రత్తయ్యా. నీ ఒక్కడి విషయంలో మంచి జరుగుతుండొచ్చు. కానీ కుక్కుటేశ్వర స్వామి అధ్వర్యంలో దేవాలయంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువవుతోంది. ధనవంతులయిన భక్తులు అమ్మవారికి మొక్కుబడులుగా సమర్పించుకునే పట్టు చీరలు నిర్వాహకుల యిళ్ళకు చేరుకుంటున్నాయి. బంగారు ముక్కు పుడకలు అరటిపండులో నొక్కి ప్రసాదాల రూపంలో అర్చక గృహాలకు చేరుకుంటున్నాయి. కొబ్బరి చిప్పలు ఫలహారశాలలకు చేరుకుంటున్నాయి.
దేవుళ్ళ దర్శనాలు, సేవల ద్వారా వసూలయ్యే మొత్తానికి మించిన ఖర్చులు లెక్కలలో సరిజేసి నిర్వాహకులు సొమ్ము దోచుకు తింటున్నారు. దేవాలయ మౌలిక వసతులన్నీ నిర్వాహకులే నడుపుకుని లబ్దిపొందుతున్నారు. ధార్మిక కేంద్రంగా అభివృద్ధి పరచవలసిన దేవాలయాన్ని తమ కనుకూలంగా మలచుకుని వాణిజ్యకేంద్రంగా మార్చుకుంటున్నారు.
“బావూ! బెల్లమున్న సోటే ఈగలు ముసురుతాయి. ఈల్లంతా మానవులు. దేవుడివయిన నీకిదంతా కొత్తేమో కానీ నాకిది మామూలే. వేలునుండీ ఉంగరం ఉడకపోతే పీనుగు వేలుకోసి గుడ్డ సుట్టేసి శ్మశానికి నడిపెత్తారు. ఈల్ల నైజం యిదే. యివన్నీ నేను పట్టించుకోను. దేవుడివి. సూసీ సూడకుండా పోవాలి కానీ నువ్వెందు కింత హైరాన పడతన్నావు?”
“రత్తయ్యా. నువ్వు చెప్పిన మానవ బలహీనతలు నాకు తెలియనివి కావు. నేను వాటిని పట్టించుకోవడం లేదు. కానీ భక్తులు ఎద్దులను ఆలయప్రాంగణానికి తెచ్చి పరమేశ్వరునికి మ్రొక్కుబడిగా సమర్పించుకుంటున్నారు. వీటి నిర్వహణా భారం భరించలేని ఆలయ నిర్వాహకులు గతంలో సంచార జాతులయిన గంగిరెద్దులవారికీ, జంగమ దేవరలకూ, సాయిబాబా బండివారికి దానం యిచ్చేసేవారు. కానీ యిప్పుడు తెలివి మీరి పట్నంలో ఉన్న కబేళాకు అమ్ముకుంటున్నారు.
ఎద్దు నందీశ్వరుని ప్రతిరూపం. నందీశ్వరుడు పరమశివునికి ప్రియమైన భక్తుడు. అందుకే వాహనంగా మారాడు. పరమేశ్వరుని అనుగ్రహానికి లోనయినా ప్రతి జీవిలోనూ, వస్తువులోనూ, ప్రదేశం తోనూ నాకు అనుబంధముంది.
ఎద్దులను మొదట విడతగా లారీలలో ఎక్కించి కబేళాకు తరలిస్తున్నప్పుడు ఆమూగ జీవులు ఆక్రందన వాటి నల్లని కాటుక కళ్ళ నుండీ వెలువడే కన్నీటిలో కనపడింది. ఈ అరాచకాలన్నిటికీ మూలం కుక్కుటేశ్వరస్వామి. కుక్కుటేశ్వర స్వామిని ఆలయప్రధాన అర్చకుని హోదా నుంచీ తొలగిస్తే ఈ అకృత్యాలన్నీ దూరమయిపోతాయి”
“బాబూ! కుక్కుటేసర సామి పంచాయితీ పెద్దలకు బాగా దగ్గరయ్యాడు. గుడిలో లింగాన్ని తొలగించదానికైనా పెద్దలు అంగీకరిత్తారేమో కానీ ఆ బావుని తప్పించరు. గుడిలో పూజాలందుకుందికి దేవుళ్ళ కేటి కొదవ? ఒకరు కాకపోతే యింకొకరు లైను కట్టి నిలబడతారు. కానీ కుక్కుటేసర సామి వంటి ఘనమైన అర్చకుడు ఎక్కడ దొరుకుతాడు?” సమాధానమిచ్చాడు రత్తయ్య.
“రత్తయ్యా. కాలభైరవుడిని. కుక్కుటేశ్వర స్వామిని నియంత్రించగల శక్తులు నాకు లేవని కావు. అహంకారాన్ని అణచడం, దుష్టశక్తులను నిర్మూలించడం, దోషాలను హరింపజేయడం, నా స్వాభావిక శక్తులు. కాశీలో నన్ను నగర కొత్వాలుగా భక్తులు పూజిస్తారు.
కానీ దురదృష్టవశాత్తూ యిక్కడ ‘సర్పదోషనివారణ’ అనే ఏకైక సంకల్పం మీద నా ప్రతిష్ఠ జరిగింది. దైవబలం కన్నా సంకల్పబలం గొప్పది. అందువల్ల శక్తులున్నా ప్రయోగించలేని దుస్థితిలో ఉన్నాను” వాపోయాడు కాలభైరవుడు.
“నీకు శక్తులు లేనప్పుడు భక్తులు మాత్రం నీకు పూజలెందుకు సేట్టారు? అకృత్యాలు, అరాసేకాలూ జరుగుతున్నాయని బాధపడక పల్లకుండా నువ్వున్న సోట నువ్వు పడుండటమే మేలు” రత్తయ్య సలహా యిచ్చాడు.
“లేదు రత్తయ్యా. నా కళ్ళముందు జరుగుతున్న అకృత్యాలను ప్రత్యక్ష సాక్షిగా చూస్తూ పడుండలేను. నువ్వు నాకొక సహాయం చెయ్యాలి” అర్ధించాడు కాలభైరవుడు.
“ఏటి సెయ్యమంటావు బావు?”
“రత్తయ్యా. ఎల్లుండి రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. నియమం ప్రకారం దేవాలయం మూసివేయబడుతుంది. గుడిలో ఎవరూ ఉండరు. ఆ రోజు రాత్రి నువ్వు ప్రహారీ గోడ దూకి గుడిలోకి ప్రవేశించి ఈశాన్య మూల శిధిలావస్థలో పడిఉన్న నా గుడిలోండి నావిగ్రహాన్ని పునాదులతో సహా పెకలించి వెయ్యి”అభ్యర్దించాడు కాలభైరవుడు.
“దానివల్ల ఏటవుతుంది బావూ?” కంగారుగా ప్రశ్నించాడు రత్తయ్య.
“రత్తయ్యా. రక్షణ శక్తులు కలిగిఉన్న నా అంశకు పరిమితులు విధించి రాతి విగ్రహంలో బంధించి ప్రాణప్రతిష్ఠ జరిపారు. నా కళ్ళముందు జరుగుతున్నా అన్యాయాలను అడ్డుకోలేక చూసి సహించలేక తీవ్ర మానసిక ఉద్వేగానికి బలవుతున్నాను. దయజేసి నన్ను బంధవిముక్తిడిని చెయ్యి” ప్రాధేయపడ్డాడు కాలభైరవుడు.
“బావూ? జన్మతః చండాలుడిని. ఏ జనమలో సేసుకున్న పాపమో కానీ గుళ్ళోకి అడుగెట్టే పెట్టే హక్కు లేనోడిని. నీ మాట మీద యిని మరొక తప్పు సేత్తే వచ్చే ఏటై పుడతానో తెలదు. నా సేత తప్పు సేయించకు” వేడుకున్నాడు రత్తయ్య.
“రత్తయ్యా. జన్మ చండాలుడికి కాలాంతరమున మోక్షం లభ్యమవుతుంది కానీ కర్మ చండాలుడికి దొరకదు. నిన్ను నువ్వు పాపినని తలంపు చేయకు. నీ జన్మ ఉత్కృష్టమైనది. మోక్షాలలో మొదటిదయిన కపాల మోక్షం నీ చేతుల మీదుగా జరిగేలా నిర్దేశించినది ఆభగవంతుడే. నీ వల్లనే ఆత్మకు యిహాలోక బంధాలనుండీ విముక్తి కలుగుతుంది. నీచే విముక్తి కాబడిన తర్వాతనే జీవి ఖర్మఫలాను సారం తదుపరి జన్మ ఎత్తుతాడు. మోక్షం కలిపించడంలో పరమాత్మకు ఒక మెట్టు క్రింద నువ్వే ఉన్నావు.
విగ్రహంలో బంధించబడి ఉన్న నా అంశను విముక్తి చెయ్యడం కూడా కపాల మోక్షం లాటిదే. కాకపోతే విధివిధానం వేరు. అందు గురుంచి తప్పు చేస్తున్నానన్న భావన నీలో రాకూడదు. నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు” ప్రభోదించాడు కాలబైరవుడు.
*** *** ***
జువ్వి చెట్టుమీదున్న గుడ్ల గూబ వికృతమైన అరుపుకు మంచం మీద పడుకున్న రత్తయ్యకు మెలకువ వచ్చింది.
“చెః. అసుర సందె ఏల నిద్దర పట్టడమేటి? ఆ నిద్దరలో యిలాటి కల రాడమేటి?” కలవర పడ్డాడు రత్తయ్య.
నిద్రమత్తు వదిలించుకుందికై కుండలోని నీరు సత్తుగ్లాసుతో తీసుకుని ముఖం కడుక్కున్నాడు
*** *** ***
సరిగ్గా యిదిజరిగిన మూడవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ రత్తయ్యకు ఊర్లో నుంచీ డప్పుల శబ్దం వినిపించింది. ఎండ ధనరు కళ్ళలో పడకుండా కంటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఊరి వైపు చూస్తున్న రత్తయ్యకు ప్రెసిడెంట్ గారి పెద్దపాలేరు ఆపసోపాలు పడుతూ పరుగులు తీస్తూ రావడం కంటపడింది.
“ఏటి రావన్నా? ఏదన్నా పీనుగు లేసిందేటి? అంతలా పరుగులెట్టుకుంటూ వత్తన్నావు?” ప్రశ్నించాడు రత్తయ్య.
“లేసిందా? అని అడుగుతావేటిరా? ఒకటి కాదు. మూడు పీనుగులు. యియాల నీకు పండగే పండగ”
“ఆదేటన్నా? ఊర్లో అంత ఘోరం ఏటి జరిగింది?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు రత్తయ్య.
“నిన్న రేతిరి గ్రెహనం పడిందట. గుడి తెరిసి ఉండకూడదని నియమం ఉందని కుక్కుటేసర సామి అందరినీ ఎల్లగొట్టి గుడికి తాళాలేసుకుని యింటికి పోయేడట. పొద్దున్నే తిరిగి గుడి తలుపులు తెరిసి సూసేసరికి గుడిలో పెద్ద బీభత్సం జరిగింది.
పసువుల సాలలో నున్న ఎద్దులను ఎవరో కట్లు విప్పి వదిలేశారట. అర్చకసాములు తలుపులు తెరిసే సరికి ఎద్దులన్నీ గుడి ప్రాంగణంలో రంకె లేత్తూ సెల్లా సెదురుగా తిరుగుతున్నాయట. ఏటీ గోరమని అర్చకసాములు నివ్వెరపోయేలోగానే ఎద్దులు పగపట్టినట్లు రుసరుసలాడుతూ కాళ్లతో తన్ని కొమ్ములతో కుమ్మి గుడి దాటి బయటకు పోయాయట. ఈ కుమ్ములాటలో యిద్దరు అర్చకుల ప్రేనాలు పోయాయి. అయిదుమందికి ఆసుపత్రి పాలయ్యారు.
యిసయం తెలిసిన కుక్కుటేసర సామి గ్రామపెద్దలను తీసుకుని గుడికొచ్చేడు. గుడిలో సావులు జరిగాయన్న వోర్త తెలిసి పోలీసులోచ్చేసేరు. ప్రెజలు గుడిలో గుమిగూడి పోయారు. దొంగతనం ఏటన్నా జరిగిందేమోనని పరిసీలనలు సెయ్యగా ఎక్కడా పూసిక పుల్ల కూడా పోలేదట. కానీ ఎల్ల తరబడి పూజా పునస్కారాలు లేక గుడిలో పడున్న కాలభైరవ యిగ్రహాన్ని ఎవరో త్రవ్వి పునాదులతో సహా పెకిలించి బయటకు యిసిరేసారట. యిగ్రహం క్రింద నిధినిచ్చేపాలు దొరుకుతాయేమో నని ఎవడో దొంగ యిలాటి పని సేసుంటాడని కుక్కుటేశర సామి గర్భగుడిలోకి అడుగేట్టేడట.
అంతలోనే ఎక్కడో పాతాళం నుండీ వచ్చినట్లు పదడుగుల నాగు పాము భుస్సు మంటూ నిలువెత్తూ లేసి కుక్కుటేశర సామి మెడ నరం మీద కాటేసిందట. నిలువెత్తు మనిసీ నురగలు కక్కుతూ అక్కడికక్కడే ప్రేనాలు వదిలేడట. కళ్ల ముందు జరిగిన గోరానికి పోలీసులు పంచనామా సేసుకుని శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించేరట. కాసేపటిలో మూడు పీనుగులూ యిక్కడికి వత్తన్నాయి. తొందర చితులు సిద్ధం సెయ్యమని పెసిరెంట్ బావు సెప్పేడు”
“ఓరి దేవుడా? మరీ... యింత గోరం సేత్తావా” అని మనసు లో బాధపడుతూనే పనిలో నిమగ్నమయ్యాడు రత్తయ్య.
*** *** ***
