STORYMIRROR

Telikicharla Krishna Rao

Romance

3  

Telikicharla Krishna Rao

Romance

స్కైలేబ్

స్కైలేబ్

13 mins
225

స్కైలాబ్

‘‌వేగా యిన్సిట్యూట్ ఆఫ్ యింజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ వ్యాపార ధోరణిలో నడిచే రెసిడెన్షియల్ విద్యా సంస్థ. స్టూడెంట్మెరిట్, పేరెంట్స్ ఆర్ధిక స్థోమతప్రాధాన్యతగా అడ్మిషన్స్ దొరుకుతాయి.స్టూడెంట్స్ పై ఫైనల్ ఎగ్జామ్స్ ముందు మంచి రేకులు సంపాదించాలని పేరెంట్స్,యిన్సిట్యూట్ రేటింగ్స్ పెంచాలని యాజమాన్యం,కాంపిటేటివ్ ఎగ్జామ్స్,కేంపస్ సెలెక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి తమ పేరు నిలబెట్టాలని ఫాకల్టీ నుండీ వత్తిడి పెరుగుతుంది.

పరీక్షల ముందు విద్యార్ధులలో కలిగే ఈ వత్తిడిని పోగొట్టి చైతన్యవంతులుగా చేయలనే సదుద్దేశంతోనే విద్యార్ధులను విహారయాత్రకు తీసుకేళ్ళే సాంప్రదాయాన్ని విద్యాప్రణాళికలో పొందుపరిచారు. దానిలో భాగంగానే కాలేజ్ యాజమాన్యం ఫైనల్ యియర్ స్టూడెంట్స్ ను మూడు రోజులవిహారయాత్రకై నాగార్జున సాగర్ పంపించింది. తల్లిదండ్రుల అనుమతి పొందిన పదిహేను మంది అమ్మాయిలు, యిరవై మూడు మంది అబ్బాయిలు విహారయాత్రలో పాల్గొన్నారు. వారి బృందానికి డైనమిక్స్ ప్రొఫెసర్ `రఘురాం’ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రొఫెసర్ రఘురాం గారి వయసు ఏభై ఏళ్లు. పెళ్లి కాలేదో లేక చేసుకోదలచు కోలేదో తెలియదు కానీ బ్రహ్మచారి. స్టూడెంట్స్ నే తన పిల్లలుగా భావించి, వారి సమస్యలకు స్పందిస్తూ,చదువులలో ప్రేరణ కలిగిస్తూ ఆదరాభిమానాలను పొందారు. అందుకే ప్రిన్సిపల్ గారు వారిని ఎస్కార్ట్ గా పంపించారు.

క్రమశిక్షణ పేరుతో కేంపస్ లో ఆంక్షల మధ్య పెరిగిన స్టూడెంట్స్ మానసిక ప్రవృత్తిస్వేచ్ఛా వాతావరణంలోకి అడుగిడగానే ఎలా ఉంటుందో రఘురాం గారికి తెలుసు. అందుకే వారిని చూసీ చూడనట్లు దూరం నిలబడే పర్యవేక్షణ చేస్తున్నారు. అంతా వారూహించినట్లే జరుగుతోంది.

విద్యార్ధులు ఆనందోత్సాహలను అదుపు చేసుకోలేక పోతున్నారు.సాగర్ జలాశయంలోని అంతులేని జలరాశిని చూసి ఆశ్చర్య పోయారు. ఎత్తిపోతల జలపాతపు జాలువారుకు మంత్రముగ్ధులు అయ్యారు. వైల్డ్ లైఫ్ సాంక్చురీప్రకృతి రమణీయతకు పరవశులయ్యారు. నందికొండ బౌద్ధారామాల పవిత్రతకు భావోద్వేగానికి గురయ్యారు.

సృష్టిలోగల జలజీవాలన్నీ ప్రకృతితో మమేకమై పరవశిస్తున్న వేళ తాము చదువుల పేరిట తాము కేంపస్ నిర్భంద వాతావరణంలో బ్రతుకుతున్నందుకు చింతించారు.ఆటవిడుపుగా దొరికిన అవకాశాన్ని వృధా చెయ్యలేదు. పలకరింపులవరకే పరిమితమయిన స్నేహాన్ని చెట్టాపట్టాలేసుకు తిరిగే స్థాయికి పెంచుకున్నారు. బోజనాలలో చనువుగా ఒకరి ప్లేట్ నుండీ మరొకరు తీసుకుతినసాగారు. ఎత్తిపోతలలో జలపాతంలో చేతులు పట్టుకుని సరిగంగ స్నానాలు చేశారు. కేంప్ ఫైర్ ముందు ఆడారు. పాడారు. డేన్సులు చేసారు.విహారయాత్రతమ జీవితంలో ఒక మధురస్మృతిగా మలచుకున్నారు.

విహారయాత్రలో చివరి రోజు అదే. చివరి సందర్శనా స్థలం అదే. మరుచటి రోజు తిరుగు ప్రయాణమని తెలిసిన వారిలో హుషారు సన్నగిల్లింది. అనుపు బౌద్ధారామపు పచ్చిక బయలు మీద చతికిలబడి సమాలోచనలు చేసుకోసాగారు.

స్టూడెంట్స్ ఏదో విషయంపై సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారని రఘురాం గ్రహించారు. చూస్తుండగానే కదలించిన కందిరీగల తుట్టలోని కందిరీగలలా తనని చుట్టుముట్టారు.

“వాట్ హేపెండ్ బోయస్?ఏమయింది?యిక ఎంజాయ్ చేయాలని లేదా?నవ్వుతూ ప్రశించాడు రఘురాం.కేంపస్ లో ఆడా, మగా వ్యత్యాసాలు పాటించకుండా `బోయస్’గా సంబోధించడం పరిపాటే.

“లేదు సర్. మాకు మరొక రోజు యిక్కడే ఉండాలని ఉంది. రేపటి మన ప్రయాణంవాయిదా వేయడానికి వీలవుతుందేమో తెలుసు కుందామని వచ్చాము” అందరి తరఫునా వకాల్తా తీసుకుని ప్రశ్నించింది ‘ధ్యేయ’.

‘ధ్యేయ’పుట్టుపూర్వోత్తరాలు రఘురాం గారికి తెలియకపోయినా తను కాలేజ్ టాపర్ అని,తమ యిన్సిట్యూట్ రేటింగ్స్ పెంచుకునే భాగంగా ఆమెకు యాజమాన్యం మెరిట్ కోటాలో `ఫ్రీ’ సీట్ యిచ్చారని తెలుసు. అందం,హుందాతనం,చదువు,సంస్కారాలతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా ‘ధ్యేయ’లో ఉన్నాయి.

“లేదమ్మా. టూర్ ప్రోగ్రామ్ అంతా ప్రిన్సిపల్ గారే డిజైన్ చేశారు. మన కదలికలను వారు క్షణక్షణం మోనిటర్ చేస్తున్నారు. మనని తీసుకు వచ్చిన బస్, పైలాన్ లో మనకోసం సిద్ధంగా ఉంది. డ్రైవర్ యిప్పుడే నాతో మాట్లాడాడు.

రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే మన తిరుగు ప్రయాణం. అందులో మార్పు చెయ్యడానికేమీ లేదు. అయినా ఎందుకిలా అడుగుతున్నారు?” అనుమానంగా ప్రశ్నించాడు రఘురాం.

“సర్. యిక్కడ సున్నితమైన విషయం వేరే ఉంది. అందుకు మీరు సహకరించాలి” చెప్పాడు ఒక అబ్బాయి.

“ఏమిటది? గంభీరంగా ప్రశ్నించారు రఘురాం.

“సర్.మీరిచ్చిన చనువు వల్ల మేమంతా అరమరికలు లేకుండా ఆటపాటలతో గడిపి ఆనందించాము. పరిచయాలు పెంచుకుని ఒకరికొకరం మనసిచ్చి ప్రేమించుకున్నాం. జీవితాలు పంచుకోవాలనుకుంటున్నాము.మీరు అనుమతిస్తే రేపు మనముంటున్న రిసోర్ట్ లోనే చిన్న సెలెబ్రేషన్ ఏర్పాటు చేసుకుని ఒకరికొకరం `ప్రపోజ్’ చేసుకుందామని అనుకుంటున్నాము.ఈ సెలెబ్రేషన్ యిప్పుడు చేసుకోకుంటే కేంపస్ కెళ్ళాక కుదరదు”

రెండవ ఆలోచనకు తావివ్వకుండాస్టూడెంట్స్ విషయప్రస్తావన నేరుగా తన ముందు తేవడానికి రఘురాం ఆశ్చర్యపోయాడు. తనిచ్చిన స్వేచ్ఛాస్వాతంత్రాలను వాళ్ళు దురుపయోగపరుస్తున్నందుకు బాధపడ్డారు. స్టూడెంట్స్ కు నచ్చచెప్పి వారి ప్రయత్నాన్ని విరమింపజేయదలచుకున్నాడు.

“బోయస్. మీరంతా పాఠ్యపుస్తకాలు వల్లెవేయ్యడంలోనే కాక ప్రేమ పాఠాలు వల్లెవేయ్యడంలో కూడా నిష్ణాతులని నా కిప్పుడే తెలిసింది. నేనుప్రేమ వివాహాలకు వ్యతిరేకిని కాను. అయినా మీనిర్ణయాన్ని సమర్ధించలేను”

“అదేంటి సర్. మీఅభ్యుదయ భావాలు మాకు తెలుసు. మీరు సహకరిస్తారన్న నమ్మకంతోనే చనువుగా మా ప్రేమ ప్రస్తావనలు మీ ముందు పెట్టాము” తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు విద్యార్ధులు.

“డియర్ బోయస్. తొందరపాటులో మీరెంత తప్పు చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ప్రస్తుత మీ మానసిక స్థితి `యిన్ఫాట్యుఏషన్ స్టేజ్’లో ఉండి. దీనినే తెలుగులో `మోహభ్రాంతి’ అంటారు. యిన్నాళ్లూ ఒక నిర్బంధ వాతావరణంలో పెరిగిన మీకు స్వేచ్ఛా వాతావరణంలోకి అడుగిడగానే చూసిన ప్రతి వస్తువూ అందంగానే కనిపడుతుంది.

కను, ముక్కు తీరు బాగుండి,కలుపుగోలుతనం ప్రదర్శించిన ప్రతి అమ్మాయి మనసుకు నచ్చెస్తుంది.అలాగే అమ్మాయిలకు కాస్తంత నిజాయితీ ఆత్మవిశ్వాసం ప్రదర్శించే ప్రతి అబ్బాయి మనసుకు నచ్చేస్తాడు. కాలం గడుస్తున్న కొద్దీ గాలికి మబ్బులు కొట్టుకుపోయినట్లు ఈ `యిన్ఫాట్యుఏషన్’ స్థితి పోయి వాస్తవం ఏమిటన్నదీ గ్రహించగలుగుతారు.

మీరు దీన్ని ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’(తొలిప్రేమ) అని భ్రమ పడొచ్చు. తొలిప్రేమ సినిమాలలో చూపించినంత రసజ్ఞతగా నిజజీవితంలో ఉండదు. తొలికాపుపిందెలలో నూటికొక్కటి మాత్రమే పరిపక్వత చెంది ఫలస్థితికి చేరుకుంటాయి. మిగతావి వాతావరణ ప్రకోపాలకు మాడి నిష్ప్రయోజనంగానేల రాలుతాయి.తొలి ప్రేమ కూడా అంతే.

తోడు కలిపినంత మాత్రాన పాలు పెరుగవదు. కొంతసమయం నిరీక్షణ తర్వాతే కమ్మని తియ్యని గడ్డ పెరుగుగా మారుతుంది. జీవితంలో తోడయినా అంతే. ప్రేమ నిరీక్షణలోని ఆటుపోట్లని తట్టుకుని నిలబడితేనే పెళ్ళి వరకూ దారితీస్తుంది. తొందరపాటుతనంతో వ్యవహరిస్తే జీవితాలే నాశనమై పోతాయి...”

ఆవేశంలో ప్రొఫెసర్ గారు చెప్పిన హితోపదేశం విద్యార్ధులకు కొంతవరకు అర్ధమైనా తాడూ బొంగరం,పిల్లా పీచూ లేని ప్రొఫెసర్ గారు తొలిప్రేమ మీద యింత విశ్లేషణ ఎలా చెయ్యగలిగారో వారికి అర్ధం కాలేదు.

అందరూ కలిసి అదే విషయం మీద అందరూ కలిసి ప్రొఫెసర్ గారిని ప్రశ్నించారు.

“ఈ మీకింకా వివరంగా చెప్పాలంటే నా నిజ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలు చెప్పక తప్పదు” అంటూ చెప్పడం మొదలెట్టారు.

*** *** ***

మాది కరీంనగర్ టౌన్ కు ఐదు కిలో మీటర్ల దూరంలో గల నందిపాడు అనే చిన్న ఊరు. నాన్న ఒక సాధారణ రైతు. మాగ్రామంలోనే గల ఒక భూస్వామి గారి భూములు కౌలుకు తీసుకు వ్యవసాయం చేసేవారు. మాకు స్వంత యిల్లు అంటూ ఉండేది కాదు. పొలంలోనే ఒక మూల పాక వేసుకు ఉండేవాళ్లం. వ్యవసాయరాబడితోనే మాయిల్లు నడిచేది.

నా`టెంత్’`యింటర్’ చదువులన్నీ కరీంనగర్ లోనే జరిగాయి. నందిపాడు నుండీ రోజూ కాలినడకన కరీంనగర్ వెళ్ళి వచ్చేవాడిని. `టెంత్ల్’`యింటర్’ ఎగ్జామ్స్ అన్నిటిలోనూ నేనే టాపర్ ని. ఎంసెట్ లో టాప్ రేంక్ హోల్డర్ ని. మెరిట్ ఆధారంగా నాకు యింజనీరింగ్ స్ట్రీంలో ఉస్మానియా యూనివర్సిటీలో కేంపస్ అడ్మిషన్ దొరికింది.

శలవులలో యింటికి వచ్చినప్పుడల్లా నాన్నకు పొలం పనులలో సాయం చేసేవాడిని. ఒకసారి అలా చేస్తున్నప్పడు అటుగా వచ్చిన భూస్వామి పరంధామయ్య గారికంట పడ్డాను. నా గురుంచిఅడిగి తెలుసుకున్నారు. చదువులలో నేను ప్రదర్శించిన ప్రతిభ తెలుసుకుని ముగ్ధులయ్యారు.పరంధామయ్య గారి అమ్మాయి వారికి ఏకైక సంతానం.

అతి గారాబం వల్ల చదువులో వెనుకంజ వేసింది. ఒకప్పుడు నేను యింటర్ చదివిన కాలేజ్ లోనే ఆమె యింటర్ చదువున్నది. కూతురిని పెద్ద చదువులు చదివించి మంచి సంబంధం చూసి పెళ్లిచేద్దామని పరంధామయ్య దంపతుల కోరిక.

నేను శలవులకి యింట్లో ఉన్నన్ని రోజులూ,వాళ్ళ అమ్మాయికి హోమ్ ట్యూషన్ చెప్పవలసిందిగా కోరారు. వారితో మాకున్న లావాదేవీల దృష్ట్యా కాదనలేకపోయాము. పరంధామయ్య గారిది లంకంత యిల్లు.యింటి నిండా ఆడా మగా పనివారితో కళకళలాడుతుండేది. ట్యూషన్ ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు వీలుగా మేడమీద గది ఏర్పాటు చేశారు. వారి అమ్మాయికి ట్యూషన్ చెప్తూనే నాస్టడీస్ కూడా చేసుకునే వాడిని.

అప్పటికి ఆ అమ్మాయి వయసు పదిహేడు. వయసుకు తగ్గ వంపుసొంపులతో అరవిరిసిన గులాబీలా ఉండేది. వ్యవహార రీత్యా పరంధామయ్య గారి అమ్మాయి నన్ను ఏకవచన ప్రయోగం చేసి `రఘు’ అంటూ పిలిచేది. నేను మాత్రం అంతస్తుల తారతమ్యం దృష్టిలో పెట్టుకుని `అమ్మాయి గారూ’ అని సంబోధించేవాడిని.

అమ్మాయి ప్రాయంలోకి అడుగిడితే వయసుతో నిమిత్తం లేకుండాపెళ్ళి చేసెయ్యడం తెలంగాణా ప్రజల సాంప్రదాయం. కూతురిని విదేశీ సంబంధం మాత్రమే చెయ్యాలన్న కృతనిశ్చయంతో ఉన్న పరంధామయ్య గారు ఒక ప్రక్క పెద్ద చదువులు చదివిస్తూనే, మరొక ప్రక్క విదేశీ సంబంధాల వేటలో పడ్డారు.

యిప్పటి మీలాగే అప్పట్లో ఆ అమ్మాయి కూడా `యిన్ఫాట్యుఏషన్ స్టేజ్’లో ఉంది. చదువులో ఉత్తమప్రతిభా పాటవాలున్న నేను ఆమెకు నచ్చేశాను. దొరికిన ఏకాంతాన్ని ఆసరాగా తీసుకుని నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించింది. నా పట్ల తను పెంచుకుంటున్న ప్రేమ వ్యక్తపరచింది. నేను అంగీకరిస్తే తల్లిదండ్రులకు చెప్పి వప్పించగలనంది.

మాయిద్దరి మధ్య కులాంతరంతో పాటూ ఆర్ధిక అసమానతలున్నాయి. ఒక కౌలు రైతు కొడుక్కి కూతుర్ని కోడలుగా పంపించగల పెద్దమనసు పరంధామయ్య గారిలో ఉండదని నాకు తెలుసు. కానీ నేనెంత నచ్చచెప్పినా అమ్మాయిగారు అర్ధం చేసుకునే స్థితిలో లేరు. చివరికి నాపై విముఖత కలిగించడానికి తనంటే యిష్టం లేదని చెప్పాను.

నేను తనను దూరం పెడుతున్న కొద్దీ ఆమె నాకు దగ్గర కాసాగింది. కనీసం మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడైనా తనని చనువుగా `నువ్వు’ అంటూ పేరు పెట్టి పిలవమని ప్రాధేయపడింది. ఆమె కోరిక కాదనలేక పోయాను. తన కోరికఅంగీకరించినందుకు సంతోషంగా నాఅరచేతిని తన పెదాలకు తాకించి మృదువిగా ముద్దాడింది. ఆమెత్తని పెదాల స్పర్శకు నాతనువంతా పులకించిపోయింది. అయినా నేను నిగ్రహం కోల్పోలేదు. హద్దులు అతిక్రమించలేదు.

“సర్! మీ `లవ్ బర్డ్’ పేరు చెప్పకుండానే రసవత్తరమైన ప్రేమ కధ దాటించేస్తున్నారు. ఆ అమ్మాయి పేరేంటో చెప్పారా?” బలవంతపెట్టింది ధ్యేయ.

“పెళ్ళయి వేరే యింటికి పోయిన అమ్మాయి పేరు చెప్పటం సభ్యత కాదు. కానీ మీ కోసం ఒక క్లూ యిస్తాను. ఆమె పేరురెండు పదాల కలయిక. ఒకొక్క పదంలోంచి ఒకొక్క అక్షరం తీసుకుంటే `అల’ అవుతుంది. పెళ్ళయిన తర్వాత నుండీ ఆమె నా మనసులో `అల’ గానే మిగిలిపోయింది” అంటూ తన మనసులో ఆమె పట్ల గల ప్రేమవ్యక్తం చేసారు ప్రొఫెసర్ గారు.

“సర్. మీరిచ్చిన ఐ చిన్న `క్లూ’ ఆధారంగా ఆమే ఎక్కడునా తెచ్చి మీ ముందు నిలబెడతాను. మీప్రేమ కధ వినడానికి చాలా యింట్రస్టింగ్ గా ఉంది. కంటిన్యూ చెయ్యండి” అంది ధ్యేయ.

ఈలోగా అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. ఆ దుర్ఘటన వల్లనే నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను”

“సర్! ఏమిటా దుర్ఘటన? వివరంగా చెప్పండి” ధ్యేయ ఆత్రంగా ప్రశ్నించింది.

*** *** ***

ఆసంఘటన గురుంచి చెప్పాలంటే దాని పూర్వాపరాలు మీకు తెలియాలి. భూఉపరితల వాతావరణ పొరల పరిశోధనలతో పాటూ సూర్యగోళంలో జరుగుతున్న నిరంతర విస్పోటాలపై పరిశోధనలు జరిపేందుకు తేదీ 14-05-1973న అమెరికా శాస్త్రజ్ఞులు స్కైలేబ్ (Skylab) అనే ఒక అంతరిక్ష నౌకను రోదసి లోకి పంపించారు.

కొంతకాలం పనిచేసిన తర్వాత అది గమన గతి తప్పి గురుత్వాకర్షణ శక్తికి లోనయి భూమి మీద కూలిపోడానికి సిద్ధమయింది. 1979, జులై 11-12 తేదీల నడుమ భూమి మీద కూలిపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలుగుణించారు. శాస్త్రజ్ఞుల హెచ్చరికతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి.అంతరిక్ష నౌక కూలిపోతున్న వేగపు వరవడి మీద మరిన్ని పరిశోధనలు చేసి చివరికి ఆంధ్రప్రదేష్ లోని కరీంనగర్ జిల్లాలో కూలిపోడానికి ఎక్కువ అవకాశాలున్నాయని నిర్ధారించారు. అది కూలిపోవడం వల్ల కలగబోయే దుష్పరిమాణాలని ప్రజలకు వివరించి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

స్కైలేబ్ మీద పడుతుందన్న దుర్వార్త కరీంనగర్ వాసులను భయాందోళనలకు గురిచేసింది. అయోమయ పరిస్థితులలో విపరీత పోకడలను అనుసరించారు. కొంతమంది ప్రాణభీతితో కార్లలో దూరప్రాంతాలకు పోయారు. కొంతమండి తమ స్థిర, చరాస్తులను తక్కువ ధరకు తెగనమ్మి సొమ్ము చేసుకుని వలస పోయారు.కొంతమంది తమ సంపదను ప్రమాదం జరిగాక తీసుకునేలా రహస్య ప్రదేశాలలో భూస్థాపితం చేసి పోయారు.

ఎక్కడికీ వెళ్లలేని పేదలు తమ కుటుంబాలతో సహా ప్రార్ధనా స్థలాలను ఆశ్రయించారు.వారి సౌలభ్యంకోసం అన్నీ మతాల వారూ తమ ప్రార్ధనా స్థలాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

కష్ట,సుఖాలను సమానంగా స్వీకరించి ఆడామగా తేడా లేకుండా విందుభోజనాలు చేస్తూ కల్లుత్రాగడం తెలంగాణా ప్రజల సాంప్రదాయం. కొంతమంది ప్రజలు ఆ సంప్రదాయాన్ని పాటించారు. కల్లు దుఖాణాల యజమానులకు పండగే పండగ. కల్లులో తగు మోతాదు భంగు కలిపి`లోట్టె’ రెండువందలకు చొప్పున్న అమ్ముకున్నారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో పరంధామయ్య దంపతులు కుమార్తె పెళ్లి సంబంధాల వేటలో మద్రాసు వెళ్లారు. స్కైలాబ్ పతనవార్త తెలిసిన పరంధామయ్య గారు మద్రాసు నుండీ నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు.

“రఘూ! స్కైలాబ్ పడుతున్నవార్త మాకు ఆందోళన కలిగిస్తున్నది. యిప్పుడే అమ్మాయితో మాట్లాడాను. ఈ ఆపత్సమయంలో భయపడి పనివారంతా ఎవరి కుటుంబాలతో వారు గడపడానికై యిల్లు వదలి పారిపోతున్నారని చెప్పింది. అమ్మాయి కూడా భయపడిపోతున్నది. దానికి ఈ రాత్రి తోడు ఉండి ప్రమాదం పాలు కాకుండా కాపాడు.

అదే మా ప్రాణం. నువ్వీ సహాయం చేసావంటే నీ ఋణముంచుకోను. నా కూతురుని కళ్ళతో చూసిన మరుక్షణం ఐదెకరాల భూమి నీపేర రాస్తాను” అంటూ ఆవేశంగా వాగ్దానం చేసారు.

నేను వారి అవసరార్ధ వాగ్దానాన్ని పట్టించుకోలేదు. అపత్కాల పరిస్థితిలో అమ్మాయిగారికి తోడు ఉండటం నాకర్తవ్యంగా భావించాను. ఆ సమయంలో పొలం పాకలో ఉన్న అమ్మా నాన్నల గురుంచి భయపడలేదు. పొలం పాకలో నున్న వారికి బాహ్యప్రపంచంతో సంబంధ ముండదు. ముంచుకొస్తున్న ప్రమాదం తెలియదు. తెలిసిన వారికే భయం. లేని వారికి ఏమీ లేదు. భయం మనిషిని భయపెట్టి చంపినంతగా చావు మనిషిని భయపెట్టదు. అందుకే తల్లిదండ్రులను నేను భయాందోళనలకు గురిచెయ్యదలచుకోలేదు.

నేను యింటికి వెళ్లక తనకు తోడుంటానని తెలిసిన అమ్మాయి గారు ఆనందంతో నన్ను హత్తుకుపోయింది.

“అమ్మాయి గారూ. వదలండి. మీరేంచేస్తున్నారో మీకు అర్ధమవుతున్నదా?అంటూ కౌగిలినుండీ విడివడ బోయాను. 

“నాకు తెలుసు రఘూ! జీవితంలో మనకిదే చివరి రాత్రి కావచ్చు. మళ్ళీ సూర్యోదయం చూస్తామన్న నమ్మకం లేదు. ఈచివరి క్షణంలో కూడా కులాలూ,ఆర్ధిక అసమానతలు, పెద్దలు చూస్తారంటూ సమయం వృధా చెయ్యకు. ఈ ప్రళయరాత్రిని ప్రణయ రాత్రిగా మార్చుకుందాం. రా...” అంటూ పిచ్చి పట్టిన దానిలా వృక్షానికి పెనవేసుకుపోయిన లతలా నన్ను హత్తుకు పోయింది. నా పెదాలను తన పెదాలతో మూసేసింది.ఆమె వెచ్చని ఆమె శరీరస్పర్షకు నానిగ్రహం నీరుగారిపోయింది. యిద్దరం స్థితిగతులను మరచి ఉచ్ఛ నీచాలు లేకుండా కలిసాము.

తర్వాత జరిగినదేమిటో నాకు తెలియదు. మత్తు తలకెక్కిన వాడిలా మొద్దు నిద్ర పోయాను. ప్రొద్దున్నే పక్షుల కిలకిలారావాలతో మెలకువవచ్చింది. కళ్ళు తెరచి చూశాను. ప్రక్కన అమ్మాయి గారు లేరు. వంటిమీదున్న లుంగీ అస్తవ్యస్తంగా ఉంది. లేచి బట్టలు సరిచేసుకుంటుండగానే కాఫీ కప్పు పట్టుకుని అమ్మాయిగారు వచ్చింది.

“రఘూ. యిప్పుడే రేడియోవార్తలువిన్నాను. స్కైలాబ్ ఈ రోజు తెల్లవారు ఝామున హిందూమహా సముద్రంలో కుప్ప కూలిందట. ఆస్తినష్టం, ప్రాణనష్టం ఏమీ జరగలేదట. వీధులలో ప్రజలంతా ఆనందగా బిలబిల మంటూ తిరుగు సంబరాలు చేసుకుంటున్నారు. అదృశ్యం చూడటానికే ఆనందంగా ఉంది”

“నువ్వు కూడా అందుకేనా యింత ఆనందంగా ఉన్నావు?”రాత్రి జరిగిన సంఘటనపునరావృతం చేస్తుందనుకున్నాను. కానీ ఆమె అదేమీ పట్టించుకోలేదు.

“నాన్న ప్రొద్దున్నే ఫోన్ చేశారు. నిన్న స్కైలాబ్ పడుతుందన్న ఆత్రంలో చెప్పలేని విషయాలన్నీ యిప్పుడు చెప్పారు. అమెరికాలో జాబ్ చేస్తున్న పెళ్ళికొడుక్కి నేను నచ్చానట. మద్రాసులో పెళ్ళిమాటలన్నీ అయిపోయాయట. అబ్బాయి ఈ రోజు ప్రొద్దున్నే ఫ్లైట్ లో హైద్రాబాద్ లో లేండ్ అవుతున్నాడట.అతనికి యిండియాలో ఉండేందుకు ఎక్కువగా శలవు లేదట. నెలరోజుల లోపుగా పెళ్లి జరిపించేస్తే తనతో పాటూ నన్ను కూడా అమెరికా తీసుకు పోతాడట.

అమ్మా నాన్నా పెళ్లివారితో పాటూ కార్లలో మద్రాసు నుండీ బయల్దేరారట. రేపే మాయింట్లోనిశ్చయతాంబూలాలు ఏర్పాటు చేస్తున్నారట. నెలరోజులలో పెళ్లి జరిపించెయ్యాలని అబ్బాయి పట్టుపడుతున్నాడట. ఈ లోగానే నాకు పాస్ పోర్ట్ , వీసా ఏర్పాట్లు చేయిస్తారట. ప్రొద్దున్నే యింత శుభవార్త విన్నందుకు నాకు ఆనందంగా ఉండి” అప్పుడే తన పెళ్లయిపోయి భర్తతో పాటూ గాలిలో విహరిస్తున్నట్లు సంబరపడిపోసాగింది.

“అంత తొందరలో పెళ్ళా?... మరి నీ చదువుల సంగతి...?”

“అతను అమెరికాలో పెద్ద సాఫ్ట్ వేర్ యింజనీర్. మన లెక్కన నెలకి పది లక్షలు సంపాదిస్తాడు. యిండియాలో పేరెంట్స్ కి బోలెడన్ని వ్యాపారాలున్నాయట. వాళ్ళకి నేను చదివిన చదువు చాలట. యింకా చదువుకుని చేసేదేముంది అంటున్నారట. నీకు తెలుసు కదా? నాకు కూడా చదువు మీద పెద్ద యింట్రస్ట్ లేదు” అంది విరక్తిగా.

“మరి నీకు ఈ పెళ్లి యిష్టమేనా? నా మీది వ్యామోహం వదులుకున్నట్లేనా?” అనుమానంగా ప్రశించాను. 

“యిష్టమే. ముందు నీ మీద మనసు పడ్డాను. నువ్వంగీకరిస్తే పేరెంట్స్ కు నచ్చచెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నాను. కులాలు,ఆస్తులు, అంతస్తులు,అంటూ చివరికి నేనంటే యిష్టం లేదని తెగేసి చెప్పేవు. నేనంటే యిష్టం లేని వాడిని చేసుకునే కన్నా, నన్ను యిష్టపడ్డా వాడిని చేసుకోవడమే ఉత్తమం కదా. అంతే కాదు. జీవితం మీద కూడా నా అభిప్రాయం మారింది.

నాన్నఆస్తిపాస్తుల వల్లే నాకింత మంచి సంబంధం కుదరబోతోంది. జీవితంలో ఎదగాలి అంటే డబ్బు ప్రాధాన్యత ఎంతున్నదీ నాకిప్పుడు అర్ధమయింది.అదర్శాలకు పోయి నిన్ను చేసుకోవడం వల్ల మంచి భార్యగా స్థిరపడతానేమో కానీ వేరే వరిగేదేమీ లేదు. అందుకే అన్ని విధాలా ఆలోచించి అమెరికా సంబంధమే మేలని మనసులో ఫిక్స్ అయిపోయాను”

“మరి నిన్నరాత్రి మనిద్దరి మధ్య ..?”ఆమె నానుండి దూరమయిపోతుందని తెలిసి తట్టుకోలేకఅడిగాను.

“లైట్ తీసుకో రఘూ! స్కైలాబ్ పడుతుందన్న భయంతో ఎవరికి తోచిన విపరీతపనులు వారు చేశారు. జీవితంలో ఏసుఖం పొందకుండా చచ్చిపోతానేమోనన్న తొందరలో నీ సాంగత్యం కోరాను. నువ్వు కూడా కాదనకుండా దరిచేరావు. యిచ్చిపుచ్చుకోవడంలో యిద్దరం ఆనందించాము. స్కైలేబ్ పడలేదు. మన మధ్య జరిగినదంతా మర్చిపో”

“యింత జరిగినాక నువ్వు మర్చిపోగలవేమో కానీ నేను మాత్రం నిన్ను జీవితాంతం మర్చిపోలేను”

“తొలి తప్పిదం నేను మాత్రం ఎలా మర్చిపోతాను?యిలాటి తప్పు మళ్ళీ పునరావృతం కానివ్వకుండా గుర్తుండేందుకు నాకు పుట్టిన తొలి సంతానికి `స్కైలాబ్’అని పిలుచుకుంటూ నిన్ను గుర్తుపెట్టుకుంటాను”

అమ్మాయిగారి లోని `యిన్ఫాట్యుఏషన్ స్టేజ్’ వదలిపోయిందని గ్రహించి నేను మరేమీ మాట్లాడ లేదు.

“సారీ రఘూ. నన్ను తప్పుగా అనుకోకు. నా కింకేమీ ట్యూషన్స్ అక్కర్లేదు. పెళ్లివాళ్లు వచ్చేలోగా నిన్ను యిల్లువదిలి వెళ్ళిపొమ్మని నాన్న చెప్పారు. పనివారు కూడా ఒకొక్కరే పనిలోకి వస్తున్నారు. నువ్విక బయల్దేరు” అంటూ నిష్క్రమించింది.

ఆ సంఘటన మరుచటి రోజే క్లాసులు మొదలయ్యాయన్న వంకతో నేను కేంపస్ కు వచ్చేశాను.పరంధామయ్య గారు తన భూములను అమ్మి ఘనమైన కట్నకానుకలతో పాటూ కూతురి పెళ్ళి చేసారని తెలిసింది. నెలరోజుల వ్యవధిలోనే అమ్మాయి గారు భర్తతో పాటూ అమెరికా వెళ్లిపోయారని తెలిసింది.

పరంధామయ్య గారు భూములు అమ్ముకోవడంతో అమ్మానాన్నలు నిరాశ్రయులయ్యారు.కొంతకాలం వ్యవసాయ కూలీలుగానే పనులు చేస్టూ పొట్టపోసుకున్నారు. నా యింజనీరింగ్ పూర్తయింది. భారత్ డైనమిక్స్ లో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో సెటిల్ అయ్యాక నేను అప్పటినించి అమ్మానాన్నలను దగ్గరకు తెచ్చి ఉంచుకున్నాను.పెళ్లిచేసుకోమని అమ్మానాన్నలు ఎంతో వత్తిడి తెచ్చినా ప్రేమించిన అమ్మాయిగారిని మర్చిపోలేక చేసుకోలేక పోయాను.

పిల్లలు లేని నేను పిల్లలకు దగ్గర కావాలన్న కోరికతో అందులోని జాబ్ మానేసి ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో జాయనయ్యాను” అంటూ చెప్పడం మిగించారు ప్రొఫెసర్.

*** *** ***

యిది జరిగి సుమారు ఐదు సంవత్సరాల తర్వాత...

ఒక ఆదివారం ప్రొద్దున్నే ప్రొఫెసర్ రఘురాం గారిని పలకరించడానికి ఓల్డ్ స్టూడెంట్ `ధ్యేయ’కేంపస్ లోనే ఉన్న క్వార్టర్ కు వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన ధ్యేయను చూసేసరికి ప్రొఫెసర్ ఆశ్చర్యపోయారు.

 “ధ్యేయా? వాటే సర్ప్రైజ్?ఎలా ఉన్నవమ్మా? లోపలకి రా” అంటూ అదరంగా ఆహ్వానించారు.

యిద్దరిమధ్య కాస్త కుశలప్రశ్నలయ్యాక `ధ్యేయ’ తను వచ్చిన పని బయట పెట్టింది.

“సార్! ఆరోజు నాగార్జునసాగర్ లో మీరు ప్రేమించిన అమ్మాయి గారి పేరు `అల’ అంటూ పజిల్ లా ఒక కోడ్ నేమ్ చెప్పి వదిలేసారు. గుర్తుందా?”నవ్వుతూ గుర్తు చేసింది.

“అవునమ్మ. నా జీవితంలోకి సునామీలా వచ్చిపోయిన ఆమెను ఎలా మర్చిపోగలను?”

“సర్! మీరిచ్చిన పజిల్ నేను క్రేక్ చేసాను. ఆమె పేరు `అనంత లక్ష్మి’. ఆమె భర్త పేరు ఆనంద్. అతను అమెరికాలో ఎం‌ఎస్ చదువుకుని జాబ్ సంపాదించుకున్నాడు. అతని చదువునిమిత్తం తల్లిదండ్రులు ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద భారీమొత్తంలో అప్పుచేసారు. వడ్డీతో కలిపి అప్పు తీర్చలేని స్థాయికి పెరిగింది. ఫైనాన్సర్స్ వత్తిడి తట్టుకోలేని తల్లిదండ్రులు పెళ్ళి చేసుకుని వచ్చిన కట్నపు డబ్బుతో అప్పు తీర్చెయ్యవలసిందిగా అతన్ని నిర్భందించారు.

యిక్కడే కధలో మలుపుఉంది. ఆనంద్ అప్పటికే తనతో పాటూ పనిచేసే ఒక నార్త్ యిండియన్ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోకున్నా యిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకుని,అమెరికాలోనే సెటిల్ అయిపోదామనుకుంటున్నారు. అటువంటి పరిస్థితులలో ఫైనాన్సర్స్ వత్తిడి, తల్లిదండ్రుల నిర్బంధం ఆనంద్ ని యిరకాటంలో పెట్టాయి.తన ముందున్న దుస్థితిని ప్రియురాలితో చర్చించాడు.

అప్పుల ఊబిలోంచి బయటపడేందుకు,తమ కలలను సాకారం చేసుకుందికి వీలుగా యిద్దరూ పధకం రచించారు. అందులోని భాగంగానే ఆనంద్ పెళ్ళికి అంగీకరించాడు.పాపం ఆనంద్ తల్లిదండ్రులకు తమకొడుకు చేస్తున్న దురాగతాలు తెలియవు. అప్పటివరకూ పెళ్లి చేసుకోననని భీష్మించుకు కూర్చున్న కొడుకు అంగీకరించేసరికి ఎగిరిగంతేసారు.

ఈ నేపధ్యంలోఅమెరికా సంబంధం తప్ప వేరొకటి తన కూతురికి చెయ్యనని భీష్మించుకు కూర్చున్న పరంధామయ్య వారి గాలానికి చిక్కాడు. పిల్లవయసు తక్కువ, రంగు తక్కువ,చదువు తక్కువ అన్న వంకలతో బేరసారాలు చేసి చేసి చివరికి రెండు కోట్లు దగ్గర అంగీకరించారు. అది కూడా పెళ్ళికి ముందే నగదు రూపంలో యివ్వాలని,అబ్బాయికి ఎక్కువ శలవు లేనందు వల్ల నెలరోజులలోనే పెళ్లి జరిపి కూతుర్ని అల్లుడితో అమెరికా పంపించెయ్యాలని షరతుపెట్టారు.

రెండు కోట్లు పరంధామయ్య తాహతుకు ఎక్కువే కానీ, కూతురి సుఖసంతోషాల కన్నా ఎక్కువకాదు. తనకున్న యావదాస్తులూ వచ్చిన కాటికి తెగనమ్మి కట్నంతో పాటూ కూతురిని కూడా అల్లుడి చేతిలో ధారపోసి చేతులు కడుకున్నాడు. పెళ్ళయిన వెంటనే ఆనంద్ అనంత లక్ష్మిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అంతవరకూ కధ సుఖాంతమే.

అమెరికాలో అడుగు పెట్టిన మొదటి రోజునే తమ యింట్లోనే, భర్తతో పాటు ఒక నార్త్ యిండియన్ అమ్మాయి సహజీవనం చేయడం చూసి ఆశ్చర్యపోయింది. అమెరికాలో యిళ్ళు దొరకడం కష్టమని,ఒకే దగ్గర పనిచేసే యిండియన్ అమ్మాయిలు, అబ్బాయిలు యిలా సహజీవనం చెయ్యడం సర్వసాధారణమనిఆనంద్ నచ్చ చెప్పాడు.

రెండుకోట్ల కట్నం ఎదురిచ్చి యిండియా నుండి వచ్చిన పనిమనిషిలా వారిద్దరికీ, వండి వడ్డించి, యింటిపనులు. పాచిపనులూ చేయడం అనంత లక్ష్మికి కష్టం కలిగించసాగింది.

తొలిరేయి ముచ్చట తీరకుండానే తనను యిండియా నుండీ అమెరికా తీసుకొచ్చి ప్రోజెక్ట్స్, టార్గెట్స్ అంటూ లేప్ టాప్ చేత పట్టుకుని భర్త నార్త్ యిండియన్ అమ్మాయి గదిలో దూరి తలుపు లేసుకోవడం చూసి భరించ లేక పోయింది. ఒక తను యింట్లో నుండీ బయటకు వెళ్లివచ్చేసరికి భర్త ఆ అమ్మాయితో శారీరకంగా ఏకమవడం గమనించి నిలదీసింది.

“కమాన్ లక్ష్మీ యిప్పుడేమయిందని? యిది అమెరికా. నేను పనిచేస్తున్నది సాఫ్ట్ వేర్ ఫీల్డ్. స్ట్రెస్ రిలీవ్ చేసుకుందికి యిలాటివి సర్వ సాధారణమే. యిప్పుడు యిండియాలో కూడా యిది తప్పుకాదు” అంటూ నీతులు చెప్పాడు.

యిండియాలో నున్న తన తల్లిదండ్రులకూ, అత్తమావలకూ తన గోడు చెప్పుకుని ఏడిచింది. సప్తసముద్రాల అవతల ఉన్న వారు ఆనంద్ కు నచ్చచెప్ప గలిగినంతా చెప్పారు. అదంతా చెమిటి వాడి చెవిన ఉదిన శంఖమే అయింది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కోర్టు గుమ్మం ఎక్కింది.

ఆనంద్తనముందున్న పరిస్థితులను వివరిస్తూ తను ఉద్యోగ నిర్వహణకు భార్య అవరోధంగా ఉండి వేధిస్తున్నదని, విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. భర్త తన తల్లిదండ్రుల నుండీ కట్నం తీసుకుని తనను మోసగించాడనిఅనంత లక్ష్మి కోర్టుకు తెలియపరచింది. ఎవరికి దొరికిన సాక్షాధారాలను వాళ్ళు కోర్టులో వేశారు.

అమెరికా మోజులో ఉన్న తన చేత ఆనంద్ వీసా ఫార్మాలిటీస్పేపర్ల మధ్య `ప్రినప్షనల్ అగ్రిమెంట్’ (ముందస్తు పెళ్లి వప్పందం)పెట్టి తన చేత సంతకం పెట్టించుకున్నాడని తెలియదు.

ఆ `ప్రినప్షనల్ అగ్రిమెంట్’ లో తామిద్దరం మేజర్ల్ మని, పరస్పరం ప్రేమించుకున్నామని, కట్నకానుకలు లేని ఆదర్శ వివాహం చేసుకుంటున్నామని, తమ వివాహానికి పెద్దల అనుమతి ఉందని, మనస్పర్ధలు వచ్చినా పక్షంలో ఒకరికొకరు ఆర్ధిక భారం కాకుండా స్నేహితులుగా విడిపోతామని వ్రాసి ఉందన్న సంగతి తెలియదు.

అంతకుమించిన దురదృష్టం ఏమిటంటే దాని మీద సాక్షులుగా అనంత లక్ష్మి తల్లిదంద్రులు, ఆనంద్ తల్లిదండ్రుల సంతకాలున్నాయని తెలియదు. ఎవరికీ ఏమీ అనుమానం కలగని రీతిలో ఆనంద ఆ అగ్రిమెంట్ మీద మద్రాసు రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రీ చేయించైనా సంగతి తెలియదు.

అసలు `ప్రినప్షనల్ అగ్రిమెంట్’ అనేది ఒకటి ఉంటుందన్నది అనంత లక్ష్మికి ఊహ కందని విషయం. సాక్షాధారాలు ఆనంద్ కు అనుకూలంగా ఉన్నందున అమెరికా కోర్టు ఆనంద్ కు అనుకూలంగా విడాకులను మంజూరు చేసింది. అనంతలక్ష్మి పీడ వదిలించుకోగలిగి నందుకు ఆనంద్ అతని గర్ల్ ఫ్రెండ్ కోర్టు ఆవరణలోనే `హై-ఫై’ చెపుకున్నారు.

జీవితంలో ఘోరంగా మోసగించబడిన అనంత లక్ష్మి ఆత్మహత్య చేసుకోకుండా ప్రాణాలతో యిండియాకి తిరిగి రావడమే గొప్ప విషయం. అమెరికా సంబంధపు మోజులో తాము చేసిన తప్పుకు కూతురు బలయి పోవడాన్ని అనంత లక్ష్మి తల్లిదండ్రులు స్వీకరించ లేక పిచ్చివారయి పోయారు. ఆనంద్ తల్లిదండ్రులు కొడుకు చేసిన మోసానికి బాధపడ్డారు.

విషయం అక్కడితో ఆగిపోతే బాగానే ఉండేది. మూడు నెలలు తిరగకుండానే అనంతలక్ష్మి గర్భవతి అయ్యింది. తల్లిదండ్రులు ఎంత నిలదీసి ప్రశ్నించినా తన గర్భానికి కారకులు ఎవరన్నదీ చెప్పుకోలేదు. ఉన్న ఊరిలో ముఖం చెల్లక, అనంతలక్ష్మి తల్లిదండ్రులు తమ మకాం ఒక మారుమూల ప్రదేశానికి మార్చేసారు. అనంతలక్ష్మి తన పేరుని ఆనందిని గా మార్చుకుని ఒక మారుమూల పల్లెటూర్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ కూతురిని పోషించుకుంటున్నది...”

“యిన్ని వివరాలు ఎలా సేకరించగలిగావమ్మా?” ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు ప్రొఫెసర్.

“సర్! మీరు ప్రేమించిన అమ్మాయి రెండు పదాల పేరులోని రెండు అక్షరాలను కలుపుతూ `అల’ అని మీరు క్లూ యిస్తే తన కూతురికి “స్కైలాబ్” అన్న నిక్ నేమ్ పెట్టి `ఆనందిని’మరొక క్లూ యిచ్చింది. ఈ రెండు `క్లూ’ ల ఆధారంగా ప్రయత్నిస్తూ పోతే ఆనందినే అనంత లక్ష్మి అని తెలుసుకుందికి నాకు మూడు సంవత్సరాల సమయం పట్టింది”

“చాలా సంతోషమమ్మా. యింతకీ `స్కైలేబ్’యిప్పుడు ఎక్కడుంది?ఏమి చేస్తోంది?అసలు పేరేమిటి?”ఆత్రంగా ప్రశ్నలవర్షం కురిపించారు.

“సర్! నా నిక్ నేమ్ `స్కైలేబ్’. నా తల్లి పేరే ఆనందిని. మీరు కాలేజ్ రికార్డ్సు చూస్తే ఆమె పేరు కనపడుతుంది. యిక నా పేరు నేనే చెప్పుకోవడం భావ్యం కాదు” అంది ధ్యేయ నవ్వుతూ.

ఈ సారి ప్రొఫెసర్ రఘురాంగారి నెత్తిన నిజంగా స్కైలేబ్ పడినట్లయింది. చాలా సేపు మాట్లాడలేక కళ్లమ్మట నీళ్ళు కారుస్తూ ఉండిపోయారు. తర్వాత ధ్యేయను దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకుని ....

“అమ్మా! అనంతలక్ష్మి ప్రేమాభిమానాలకు నోచుకోని జీవితం చాలా గడిపి ఉంటుంది. తన కోసం నాహృదయ కవాటాలు యింకా తెరుచుకుని ఉన్నాయని చెప్పమ్మా” అన్నారు ఆర్ద్రంగా.

*** *** ***


Rate this content
Log in

Similar telugu story from Romance