మీరు మా గురించి మాట్లాడుకుంటే
మీరు మా గురించి మాట్లాడుకుంటే


"మీరోచ్చి ఎన్నాళ్ళు అవుతోంది ?"
"దాదాపు నాలుగేళ్ళు."
"అవునా, మరి మిమ్మల్ని బానే చూసుకుంటున్నారా, ఎటువంటి ఇబ్బందీ లేకుండా ?"
"హా చక్కగా చూసుకుంటారు. ప్రతీరోజూ మాతో కబుర్లు చెప్తారు. మా గురించి ఎంతో ఆలోచిస్తారు. మా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు."
"ఓహ్, చాలా సంతోషం. క్రొత్త వాళ్ళని కూడా బానే చూసుకుంటారా ?
ఏమి లేదు. మేము క్రొత్తగా వచ్చాము కదా !! మీతో ఉన్నంత అనుబంధం మాతో ఉండదు కదా, అందుకని మీ పట్ల చూపించినంత ప్రేమ మా పట్ల చూపిస్తారో లేదో అన్న చిన్న సందేహం అంతే !!"
"మీకు అటువంటి సందేహాలు ఏమీ అక్కర్లేదు. నాలుగేళ్ళ క్రితం వచ్చినప్పుడు, మేమూ ఇలాగే ఆలోచించాము. కానీ, వీళ్ళు చూపించే ప్రేమా ఆప్యాయతా గమనించాక, మేమూ వీళ్ళను ప్రేమించడం మొదలు పెట్టాము.
వీళ్ళు మా పట్ల చూపించే అభిమానానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాము.
రోజూ ప్రొద్దునా, సాయత్రం మాతో కొంత సమయం గడుపుతారు. ప్రతీ పూట, చక్కగా సాంబ్రాణి ధూపం వేస్తారు. మేము ఉన్న చోటును, ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతారు. ప్రత్యేక రోజులలో, పండుగ రోజులలో అయితే, మా వైభోగం మాటల్లో చెప్పలేము. అనుభవించి తీరాల్సిందే !!
ఎంతో అందంగా మా లోగిలిని ముస్తాబు చేస్తారు, మమ్మల్ని కూడా ఎంతో అందంగా అలంకరిస్తారు.
ఒకవేళ, వాళ్ళు ఏదన్నా పని మీద ఊరు వెళ్తున్నప్పుడు, మాకు ఎన్నో జాగర్తలు చెప్పి వెళ్తారు. మా బాధ్యత, ఎదురింటి వాళ్ళకో, ప్రక్కింటి వాళ్ళకో, పని వాళ్ళకో, ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పి మరీ వెళ్తారు.
మేము ఎప్పుడన్నా కాస్త నలతగా ఉన్నామంటే, వారు కూడా చాలా దిగులు పడతారు. వెంటనే, మా ఆరోగ్యం మెరుగు పరచడానికి ప్రయత్నం మొదలు పెడతారు.
ఆ ప్రయత్నాలు ఫలించి, మేము ఆరోగ్యంగా మారినప్పుడు వాళ్ళ మోహంలో కనిపించే సంతోషం అంతా ఇంతా కాదు.
చిన్న పిల్లలకు మల్లే, ఎంతో సంబర పడతారు.
అలాగే, ఒకవేళ ఎప్పుడన్నా పని ఒత్తిడిలో మమ్మల్ని రెండు మూడు రోజులు పట్టించుకోవడం కుదరలేదు అనుకో, ఆ మరుసటి రోజు వచ్చినప్పుడు, మాతో ఎక్కువ సమయం గడుపుతారు.
మా యోగక్షేమాలు కనుక్కుంటారు, రెండు రోజులు ఏ పనులు వల్ల మాకు సమయం కేటాయించ లేకపోయారో కూడా చెప్తారు.
అంతే కాదు, రెండు రోజులు నుంచి మమ్మల్ని పట్టించుకోనందుకు, ఏమీ అనుకోవద్దు అని మాకు క్షమాపణలు కూడా చెప్తారు."
"మీ మాటలు వింటూ ఉంటే, మాకు చాలా సంతోషంగా ఉంది.
అయితే, మంచి మనసున్న వారి చెంతకు చేరాము అన్నమాట."
"హా అవును, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ, మనల్ని ఇంతగా అభిమానించి, గుర్తించి, ప్రేమించి, గౌరవించే వారి ఇంటికి చేరలేము.
అక్షయ పాత్రలా, ఎంత మంది వచ్చినా, ఎపుడూ ఇంకొకరికి చోటు ఉండేలా చూస్తారు.
పాత వాళ్ళ మధ్యలో, క్రొత్త వాళ్ళకి చోటు ఇస్తూ, అందరినీ ఒక కుటుంబంలా కలిసి ఉండమని కోరతారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మాలో చాలా మంది పేర్లు వాళ్ళకు తెలియవు. కొందరి పేర్లు అయితే అసలు నోరు తిరగవు కూడా !!
అంతే కాదు, మేము అందరం ఒకేలా ఉండము. ఒక్కొక్కరిదీ ఒకొక్క తీరు. ఒక్కొక్కరి ఎదుగుదల ఒక్కో విధంగా ఉంటుంది.
అయినా కూడా, ఎన్నడూ పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా, మా అందరినీ ఒకటిగానే చూస్తారు.
ఎవరి నుంచి ఎటువంటి ప్రతిఫలం వస్తుంది అన్నది ఏ మాత్రం ఆలోచించకుండా, అందరినీ ఒకేలా ప్రేమిచడం వారి ప్రత్యేకత. వారి లోని ఆ ప్రత్యేకతే, మాకు వారి పట్ల మాకు ఎంతో అభిమానాన్ని కలిగిస్తుంది.
ఇక అన్నిటికీ మించి, ప్రతీరోజూ మాకు తమ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటారు.
మాకు ప్రాణవాయువును అందిస్తూ, మాకు ఆరోగ్యాన్ని , ఆనందాన్ని ఇస్తున్న మీకు, ఈ కాస్త నీరు తప్ప ఇంకేమి ఇవ్వలేము, అని ఎన్నోసార్లు మమ్మల్ని ఎంతో ఎత్తులో నిలబెడుతూ, తాము చేసే దానిని మాత్రం ఎంతో చిన్నదిగా చెప్పుకుంటారు.
అలాంటప్పుడు మాకు ఏమి అనిపిస్తుందో తెలుసా !!
మీ దృష్టిలో మీరు నీరు మాత్రమే ఇస్తున్నాము అనుకుంటున్నారు. కానీ, నీటితో పాటు, ప్రేమా ఆప్యాయతలు, ఇలా ఎన్నెన్నో ఇస్తూ, మమ్మల్ని ప్రతీక్షణం సంతోష పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు.
అలాంటి మీ కోసం మేము ఆరోగ్యంగా ఉంటూ, మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రయత్నిస్తాము.
అని ఎన్నోసార్లు చెప్పాలి అనుకుంటాము.
కానీ, వారిలా మదిలోని భావాలను చెప్పుకోవడానికి, మేము మనుషులం కాదు, మొక్కలము.
అందుకే, వారి కోసం వీలయినంత ప్రాణవాయువును అందిస్తూ, వారిని జాగర్తగా కాపాడుకోవడమే, వారి పట్ల మాకున్న ప్రేమకు నిదర్శనం అని నమ్ముతాము."
అన్నారు.
క్రొత్తగా మన ఇంటి తోటలోకి వచ్చిన మొక్కలు, మొదటి నుంచి మన ఇంట్లో ఉన్న మొక్కలు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే, వారి సంభాషణ ఎలా ఉంటుందో అన్నది ఊహించి ఇలా వ్రాసాను.
మీకు ఎలా అనిపించిందో, మీ కామెంట్స్ ద్వారా తెలియ చేయండి.