Varun Ravalakollu

Fantasy

4.9  

Varun Ravalakollu

Fantasy

డెడ్ మేన్ పేరడాక్స్ - 3

డెడ్ మేన్ పేరడాక్స్ - 3

7 mins
572


ఆ దిగ్భ్రాంతి నుండి ముందు తేరుకున్నది సీత. అదుగో, అప్పుడు - మనుషుల్ని పట్టుకొచ్చి గునపాలతోనూ, గొడ్డళ్లతోనూ వాడి కాలయంత్రాన్ని ధ్వంసం చేయించింది. ఆ విధ్వంసానికి కారణమేమిటో వాడి చుట్టుపక్కలవాళ్లకి తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. అప్పటి నుంచీ వాళ్లల్లో కొంతమంది, సత్యా తన మెషీన్ని ఎప్పుడు బాగుచేస్తాడా అని కాచుక్కూర్చున్నారు. నా రాకపోకలు చూసిన తరువాత ఎంతో కాలం పట్టలేదు వాళ్లు కాలయంత్రంలో ప్రయాణం చేద్దామని క్యూ కట్టడానికి!

“డెనోసార్లుండే గతంలోకి ప్రయాణించడానికి మనిషి పుట్టుక అనేది అడ్డమయినా, బొందితోనే, అదే వయసులోనే ఉంటూ ఎన్నో వేలయేళ్ల వెనక్కి ప్రయాణించడం సాధ్యమేనని నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా! భవిష్యత్తులోకి ప్రయాణించడం గూర్చి సామూహిక ఒప్పందమేమీ ఇంకా కుదర్లేదు. భవిష్యత్తుని గూర్చి సైన్స్ ఫిక్షన్ అంతా అది క్రీ.శ. 2050 అనో, లేక ఇరవై అయిదవ శతాబ్దమనో మొదలుపెట్టి, అప్పటి సమాజం ఎలా ఉంటుందోనని ఊహాగానాలు చేస్తున్నారు తప్ప, ఈనాటి మనిషి ఆనాటి సమాజంలో తేలడమేగాక మళ్లీ వర్తమానంలోకి రావడం అన్న అంశం గూర్చి ఆలోచించడంలేదు. అంతెందుకూ? నేనే ఇన్నిసార్లు టైం మెషీన్లో 5 నిముషాలతో మొదలుపెట్టి కొన్ని గంటలపాటు ప్రయాణం చేశాగదా, ఆ గంటలు వర్తమానంలోనే కదా నడుస్తున్నాయి? నేను ఆ మెషిన్ని గంటసేపు సెట్ చేస్తే, ఆ గంట తరువాత బ్రతికే ఉండి, దానిలోంచి బయటపడతాను అన్న ధీమాతో ఉండగలగడమే ఆశ్చర్యకరం. దాన్నే ఇంకా కొనసాగించి ఆర్నెల్ల తరువాత కాలానికి వెళ్లి ఓ గంట గడుపుదామనుకుంటే, అది ఒక్క పదినిముషా లైనాగానీ, ఆ భవిష్యత్ కాలంలో ఈ టైం ట్రావెలర్ అసలు బ్రతికి ఉంటాడని గ్యారంటీ ఎమిటి?” అని చెప్పి తన యింటి ముందు లైనుకట్టిన వాళ్లందరినీ వాళ్ల ప్రయాణాలు మానుకొమ్మనమని చెబుతూ వాళ్ల పయత్నాలని అడ్డం కొట్టడానికి సత్యా శతవిధాలా ప్రయత్నించాడట.

కొంతమంది రాఘవ, ఈశ్వర్ల ఉదంతాన్ని విని వెనక్కి తిరిగినమాట నిజమే!

ఇంకొంతమంది, మరునాడో, లేక నెల తరువాతో రాబోయే పదో తరగతి లేక ఇంటర్మీడియెట్ ఫలితాలని తెలుసుకుందామని ప్రయత్నించారట గానీ, సత్యా కావాలనే పెట్టిన ఆకాశన్నంటే ధర విని వెనుదిరిగారట. అయితే, ఎంత ఖర్చయితేనేం, ఒక రాయివేసి చూద్దాం అనుకున్న ఒక రాజకీయ నాయకుడు మాత్రం సత్యాని చేతులు వెనక్కి విరిచికట్టేసి తన భార్యని భవిష్యత్తులోకి ప్రయాణం చేయించాడు. (అప్పుడు ఆ శూర్పణఖచేత, ఇప్పుడీ రాజకీయ నాయకుడిచేత - ఇలా చేతులు వెనక్కి విరిచి కట్టించుకోవడం న్యూసెన్స్ గా ఉంది. ఇంక ఎవడు తొయ్యమంటే వాణ్ణి ఆ మెషీన్లోకి తోస్తానన్నాడు కథ చెబుతూ సత్యా మధ్యలో. ఇంకా, ఆయనకి ఈ మెషీన్ని చూస్తే భయమేసినట్టుంది, అందుకే భార్యచేత ప్రయాణం చేయించాడు- భార్య డిస్పోజబుల్ లా ఉంది! అని జోడించాడు) ఎమ్మెల్యే భార్యగా తనను తాను చూసుకున్నానని ఆవిడ తిరిగొచ్చి చెప్పినప్పటికన్నా అది నిజం కూడా అయిన తరువాత మొదలయ్యాయి సత్యా ఇక్కట్లు.

ఒకావిడ ముప్ఫయ్యేళ్లొస్తున్న వాళ్లమ్మాయికి అసలు పెళ్లియోగం ఉన్నదో లేదో తెలుసుకోవాలని సత్యా పాదాల మీద పడి ఏడిస్తే దయార్ధ్రహృదయంతో ఆమెని ప్రయాణం చేయించాడు. రెండేళ్ల తరువాత మనవణ్ణి ఆడిస్తున్న తనని చూసుకొని ఆనందపడ్డది. తరువాత రెణ్ణెల్లలోనే ఆ అమ్మాయికి పెళ్లయ్యిందిట గూడా.

ఇంక చిలకజోస్యాలనీ, కంప్యూటర్ జాతకాలనీ పక్కన పడేసి సత్యాని చుట్టుపక్కల ప్రజలు చుట్టుముట్టారు. తన మెషీన్ వల్ల నిజంగా భవిష్యత్తులోకి ప్రయాణం చెయ్యడం జరుగుతోందని సత్యాకూడా మెల్లగా నమ్మడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టుగా, ఆ రాజకీయ నాయకుడిలాగే, ఆ పెళ్లికాని కూతురి తల్లిలాగే ఆ యాత్రలు చేసివచ్చినవాళ్లు తమ జీవితంలో ప్రత్యక్షంగా బుజువులని చూపించారు. దానితో, సత్యా మెషీన్ పవర్ గొప్పదనం కార్చిచ్చులాగా వ్యాపించింది.

“అ మెషీన్కి దైవత్వాన్ని ఆపాదించి, పూలూ పండ్లూ సమర్పించుకోవడానికీ, కొబ్బరికాయలని కొట్టడానికీ రెడీ అయి వచ్చేవాళ్లని చూస్తే మతిపోయింది” అన్నాడు సత్యా.

ఆ పవర్ని ఉపయోగించుకోవాలన్న ఆశ పదవతరగతి చదువుతున్న పిల్లల తల్లి దండ్రులతో మొదలుపెట్టి ఆరవ తరగతి పిల్లల తల్లిదండ్రులదాకా పాకి, చివరికి, ఎల్కేజీ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులని జేరడంలో వింతేమీలేదు. ఆ తల్లిదండ్రులు, అయిదు, పదీ, పన్నెండేళ్లు భవిష్యత్తులోకి ప్రయాణించి వాళ్ల పిల్లలకి ఐఐటీలో లేక మెడికల్ కాలేజీలో సీటొస్తుందో రాదో తెలుసుకున్నారు. రాదని తెలుసుకున్నవాళ్లే కాక, వస్తుందని తెలుసుకున్న వాళ్లు కూడా వాళ్ల పిల్లలకి కోచింగులు మానిపించేసి డబ్బుని ఆదా చేసుకున్నారు. అమెరికన్లయితే భవిష్యత్తుని మారుద్దాం అని ప్రయత్నించేవారేమో గానీ, రక్తంలో జీర్ణించుకున్న కర్మ సిద్ధాంతం వాళ్లెవరినీ అలా ఆలోచించనివ్వకుండా చేసింది.

ఇది మరి ఈ కోచింగ్ సెంటర్ల, రెసిడెన్షియల్ కాలేజీవాళ్ల నోళ్లల్లో మట్టికొట్టదూ? అలాగే స్పెషాలిటీ హాస్పిటల్స్ పనికూడా. ఆపరేషన్ చేసినా, చేయకపోయినా మనిషి బ్రతికేటట్లయితే, ఆపరేషన్ ఎందుకు చేయిస్తారు? ఆ ఆపరేషన్ అయిన తరువాత పేషెంట్ బ్రతక్కపోతే ఇంక ఆపరేషన్ కి ఖర్చెందుకు పెట్టాలి? ఆనాడయితే సత్యా ఇంకా ఒక్క కాలయంత్రంతోనే కుస్తీపడుతున్నాడు గానీ అతను అలాంటివాటిని మరికొన్నింటిని మార్కెట్లోకి వదిలితే తప్పనిసరయ్యే సునామీ ఫలితాలని ఆకళింపుచేసుకున్న ఈ కోచింగ్ సెంటర్లవాళ్లకీ, హాస్పిటల్స్ వాళ్లకీ ఎవరికయినా సత్యాని లేపెయ్యడం చిటికెలోపని. అయితే అలాచేసిన తరువాత ఆ మెషీన్ని ఎవరు దొరకబుచ్చుకొంటారో తెలుసుకోవాలన్న ఆతృత వాళ్లకుంది. ఆ బంగారు కోడిపెట్టని ఎవరికి వాళ్లే చేజిక్కించుకోవా లనుకోవడం అంత ఆశ్చర్యకరమయిన విషయమేమీ కాదుగదా! అప్పటిదాకా ఒకే మెషీన్తో కుస్తీ పడుతున్న సత్యా అలాంటివే ఇంకో రెండో మూడో తయారుచెయ్యబోతున్నాడని అతని దగ్గర కొత్తగా చేరిన ఇద్దరు కుర్రాళ్లు ఇంటి బయట ఉన్న లైన్ని కంట్రోల్ చెయ్యడానికి చెప్పారు. ఆ వార్త బయటికి పొక్కిపోయి, అలా జరగడంవల్ల సంభవించే సునామీ ముంపుకి గురయ్యే సంస్థల్లోనూ, వ్యక్తుల్లోనూ ఆందోళనని కలిగించింది.

అలాంటీ ఆందోళనకి గురయినవాళ్లల్లో సామంత్ బావమరిది ఒకడు. చట్టం గుర్తించిన సామంత్ భార్యకి తమ్ముడు. రంజనిని కంపేనియన్ గా ఉంచుకున్నాడని సామంత్ భార్యకి తెలిసికూడా కావలసినవన్నీ అమరుతున్నాయని సర్దుకుని తనకి నచ్చే మార్గాన్ని ఆమె ఎప్పుడో ఎన్నుకుంది. ఆ మార్గాలేవో తెలిసికూడా ఏమీచెయ్యలేని పరిస్థితి సామంత్ ది. ఎందుకంటే, అమెరికాలో విడాకులు తీసుకోవాలంటే సామంత్ ఆస్తిలో సగం ఆమెకి సమర్పించుకోక తప్పదు. అతను ఆమె అక్రమసంబంధాలని కారణాలుగా చూపిస్తే రంజనిని వేలెత్తి చూపించడానికి ఆమె లాయర్ ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. అందుకని స్టేటస్ కో కొనసాగించారు ఆ ముగ్గురూను.

బావమరిది ద్వారా ఆ టైం మెషీన్ గూర్చి విన్న తరువాత దాన్లో సామంత్ స్వయంగా ప్రయాణాన్ని కోరుకోవడానికి కారణం ఈశ్వర్ - అమెరికాలో చనిపోయినవాడు, రాఘవ కొడుకు. అతడు చనిపోయింది కారు యాక్సిడెంట్లో. దాన్లో పేర్కొనబడిన రెండవ కారుని డ్రైవ్ చేస్తున్న సామంత్ తాగివున్నాడనడానికి సాక్ష్యాధారా లున్నాయన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏక్సిడెంట్ అయినచోట సామంత్ బ్లడ్ని పరీక్ష చేసినప్పుడు చట్టపరిమితిని మించి చాలా అధికంగా అతని రక్తంలో ఆల్కహాల్ ఉందని తేలిందన్నాడు. లేదు, ఈశ్వర్ తాగి ఉండడమేగాక నైట్ క్లబ్లో తగాదాపడి బయటకొచ్చి కోపంగా డ్రైవ్ చేసి రెక్లెస్ గా ఉండడంవల్ల ఫలితాలని అనుభవించాడు, తన క్లయింట్ నిమిత్తమాత్రుడన్నాడు సామంత్ లాయర్. డబ్బున్న వాడవడంచేత కేసు విచారణ అయ్యేదాకా బెయిల్ తీసుకుని మామూలుగానే తనపనులని చేసుకుంటున్నాడు.

ఈ కేసు ఎలా ముగుస్తుందో అతను తెలుసుకోవా లనుకోవడంలో తప్పులేదు. దానికోసం టైం మెషీన్ లో ప్రయాణించాలని ఆశపడడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు. అయితే అతనికి దేశం వదిలి బయటకుపోవడానికి అనుమతి లేనందువల్ల రంజనిని పంపించాడు సత్యా దగ్గరికి. సత్యాని కలిసినప్పుడు రంజని కొద్దిగా తొట్రుపడినమాట నిజమేకాని, సత్యామాత్రం పట్టించుకోలేదన్నారు చూసినవాళ్లు.

“లైన్లో ముందుకు రావడానికి రంజని తనని నా భార్యగా చెప్పుకుంది!” అని నాతో చెప్పి పడీ పడీ నవ్వాడు సత్యా.

“ముందుగా నెల తరువాతి భవిష్యత్తుతో మొదలుపెట్టి, ఆపైన రెణ్ణెల్లకి వెళ్లిందిగానీ ఆమె వచ్చిన పనికిమాత్రం అంతకన్నా ముందుకి వెళ్లవలసిన పనిలేకపోయింది. టైం మెషీన్ లోంచి బయటికి వచ్చినప్పుడు ఆమెకీ, సామంత్ కీ నచ్చేలా కోర్టులో తీర్పు వచ్చిందని తెలిసినట్లుగా ఆమె మొహంలో పెద్ద రిలీఫ్ కనిపించింది. అయితే అంతటితో ఆగవలసింది! అనవసరంగా మళ్లీ మెషీన్ లో దూరి ఆర్నెల్ల ముందుకెళ్లింది. నచ్చనిదేదో కనిపించింది. బయటి కొచ్చినప్పుడు మొహం మాడిపోయి ఉంది,” అన్నాడు సత్యా నాతో.

వాడీ కథ చెప్పినప్పుడు నేను వాడిదగ్గరే ఉన్నాను. ఈ కథా కమామీషూ నాకు కూడా కొద్దిగా భవిష్యత్తులోకి ప్రయాణించాలన్న కోరికని కలిగించడంలో తప్పేంలేదని మీరు ఒప్పుకుంటారు. వాడడిగితే, ఏదో ఉజ్జాయింపుగా భవిష్యత్తులో ఒక తేదీ చెప్పాను. నాకేదో నోబెల్ ప్రైజు వస్తుందని గానీ, లాటరీలో వందల మిలియన్ల డాలర్లు కొట్టేస్తానేమోనని తెలుసుకుందామని గాదు. ఏదో చిన్న కుతూహలంతో అంతే. అయితేనేం ఎదురయిన అనుభవం మాత్రం మళ్లీ హార్ట్ రేట్ని అధికంగా పెంచేసి చెమటలు పోయించేదే!

వెల్లకిలా మంచంమీద పడుకుని వున్నాను - అమెరికాలోని మాయింట్లో, నా బెడ్డు మీదనే. అయితే, నిద్రపోవడంలేదు. రంజని గూర్చి, సామంత్ గూర్చి, రాఫువ గూర్చ్ ఏవో అస్పష్టంగా ఆలోచనలు. ఇంతలో క్రింద కాలింగ్ బెల్ శబ్దమవడం, మా ఆవిడ తలుపు తీయ్యడం లీలగా వినిపించింది. ఆవిడ అడ్డుపడుతున్నా వినకుండా,

“రెండు నిముషాలే మేడం” అంటూ హైదరాబాద్ తెలుగు ఏక్సెంటులో వినిపించిన మాటల తరువాత ఆ వచ్చినవాళ్లు పైకి వస్తున్నట్లుగా మెట్లమీద అడుగులచప్పుడు వినిపిస్తుంటే, ఎందుకో గుండె వేగం కొద్దిగా పెరగసాగింది.

వాళ్లు బెడ్రూంలోకి రావడానికి ఎంతోసేపు పట్టలేదు. వాళ్లు ఇద్దరు. వాళ్లని చూడగానే నాకు కోపమొచ్చింది. “ఆవిడ వద్దంటున్నా వినకుండా ఇక్కడికి రావడానికి మీకు ఎటికేట్ లేదా?” కోపంగా ప్రశ్నించాను.

“కోపం తెచ్చుకోకండి సార్. మేమడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తే అందరం ఎవరి దారిన వాళ్లం త్వరగా వెళ్లిపోవచ్చు. మేమిక్కడి కొచ్చిన పనికూడా త్వరలోనే అయిపోతుంది,” వాళ్లలో ఒకడన్నాడు.

“నా ఇంట్లోకొచ్చే కోన్ కిస్కాగాళ్లకి నేనెందుకు జవాబు చెబుతాను?” నాకు కోపం పెరిగిపోతోంది. వాళ్ల మొహాలని అప్పటీదాకా చూడలేదు మరి!

“మీ ఇండియా పోలీసులకి ఇక్కడికొచ్చి ప్రశ్నించడానికి అధికార మెవరిచ్చారు?” మా ఆవిడ కోపంగా ప్రశ్నించింది. యూనిఫాం వేసుకోకపోయినా, ఆమెకి తామెవరో క్రిందనే చెప్పినట్లున్నారు.

వాళ్లు పోలీసులన్న మాటను విని నేను స్టన్ అయ్యాను గానీ వెంటనే తేరుకున్నాను.

“జానకీ, నువ్వు 911 కి ఫోన్ చెయ్యి!” ఆమె నాదేశించాను. అమెరికా పోలీసులొచ్చిన తరువాత ఆ వెధవల సంగతి తేలిపోతుంది.


“అలా చేస్తే మీకే నష్టం. మీ అమెరికన్లు దేశసరిహద్దులని దాటనీయరాదని ఆంక్ష విధించిన వస్తువులని మీరు ఇండియాకి చేర్చారని వాళ్లకి సాక్ష్యాధారాలని మేమందజెయ్యాలని కోరికగా ఉందా? ఆ తరువాత అమెరికాలో కటకటాలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారు!” వాళ్లలో ఇంకొకడన్నాడు.

వాళ్లు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. నేను ఇండియాకి పట్టుకువెళ్లిన వాటిలో వేటికీ నేను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమేమయినా ఉంటుందేమో నన్న ఆలోచన కూడా నాకు రానిమాట నిజమే. కానీ అందరు ఇండియన్లకన్న నేనెక్కువ ఏం పట్టుకెళ్లానని? ప్రతి వస్తువూ ఓపెన్ మార్కెట్లో కొన్నదే! అయినా, నా నుదుటి మీద చెమటలు పట్టడం మొదలయింది. గుండెవేగం పెరగడం తెలుస్తోంది.

“నేను ఏ చట్టము ఉల్లంఘించ లేదు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఫో!” గట్టిగానే అరిచినట్లున్నాను. చేతికందిన దాన్ని వాళ్లమీదకి విసురుదామని ప్రయత్నించబోయానుగానీ, చెయ్యి కదలనంటోంది.

నా వాలకాన్ని చూసిన జానకి “అయ్యో, ఇవాళే హాస్పిటల్ నుంచీ వచ్చింది. ఆయనకి సృహతప్పి...” అనడం లీలగా వినిపించింది.

టైం మెషీన్ లోంచి బయటికొచ్చేటప్పటికి మళ్లీ వంటినిండా చెమటలే. ఈసారి మాత్రం నన్ను చూడగానే సత్యాకి నవ్వేమీ రాలేదు. నా అనుభవాన్ని గూర్చి వాడేమీ అడగలేదు. నేను కూడా బాగా డిస్టర్బయ్యాను. వాడికి కూడా ఏమీ చెప్పాలనిపించక పోవడంవల్ల చెప్పలేదు.

రంజని అమెరికాకి తిరిగివచ్చిన తరువాత రెణ్ణెల్లు కాకుండానే సామంత్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. టైం మెషీన్ సంగతి తేల్చుకోవడానికి సామంత్ ఇండియా వెళ్లాడు. తేల్చుకోవడానికి అని ఎందుకన్నానంటే సత్యా సృష్టించిన కాలయంత్రం ఈ రెణ్ణెల్లల్లో ఎంతమంది సామాన్య ప్రజానీకం చేత విపరీతమయిన ఖర్చులని పిల్లల కోచింగుల కోసం లేక ఖరీదయిన వైద్యాలకోసం భరించవలసిన భారాన్ని తొలగించిందో, దానివల్ల ఎంతమంది అతని సంగతి తేల్చుకోవడానికి రెడీగా కూర్చున్నారో మీరూహించగలరు. ఆ బాధ్యతని సామంత్ తన భుజాలమీద కెక్కించుకున్నాడని అతని బావమరిది ద్వారా విని కష్టకాలం గట్టెక్కే సమయం ఆసన్నమయిందని వాళ్లు కుదుటపడ్డారు.

సామంత్, “అయిందేదో అయింది” అని మొదలుపెటి,

“ప్రతీ ఇంట్లోకి ఒక టీవీని చేర్చగలిగినట్లే ఇంటింటికీ ఒక టైం మెషీన్ ని అమర్చగలిగితే, వెలనిబట్టి భవిష్యత్తులో ఎంతదాకా చూడవచ్చో నిర్ణేశించేలా ఎన్నో రకాల మోడల్స్ని తయారుచేసి అమ్మితే, వాటివల్ల ప్రపంచంలోని అన్ని మూలలనుండీ వచ్చే లాభాలకి అంతే ఉండదనీ, ఇంత దివ్యమయిన టెక్నాలజీని అప్పటికే అయిదేళ్లపాటు సొమ్ము చేసుకోవడానికి వినియోగించకుండా వృధా చేశాడనీ, తన కంపెనీ వాటి తయారిని, అమ్మకాలనీ చేబడితే యాభై శాతం వాటా సత్యా దేనని,” ఇంకా ఎన్నో చెప్పాడు.

అయితే సత్యా మాత్రం అవేమీ పాటించడానికి సిద్ధంగా లేడు. ఈ టెక్నాలజీని వినియోగించి, భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి ఇంకా ఎంత జరుగుతుందో తెలుసుకుందామని అతని ఆశయం. ఈ ప్రజల తాకిడికి అది సాధ్యం కావడంలేదు. పైగా, అప్పటిదాకా ప్రజలకి ఒనగూరుతున్న లాభాలని చూసి అసలు తన మొదటి ఆశయం సమంజసమేనా అన్న మీమాంసలో ఉన్నాడు.

“నీ ఆశయం సమంజసమైనదే. ఈ ప్రజలు నిన్ను అనవసరంగా తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ మెషీన్ సంగతీ, ఈ ప్రజల సంగతీ నాకు వదిలెయ్. నువ్వు నీ రీసెర్స్ సంగతి చూసుకో!” అన్నాడు సామంత్.

“నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏ రీసెర్చ్ చేసినా అది ఎంతో కొంత సామాజిక అభివృద్ధిని ఆకాంక్షించే చెయ్యాలి. ఇలాంటి మెషీన్లు ఇంకొన్ని ఉంటే ఇంకా ఎక్కువమందికి ప్రయోజనం ఒనగూరే మాట నిజమే. కానీ, నువ్వు పెట్టే ధరలు వీటిని ఎక్కువమందికి అందుబాటులో లేకుండా చేస్తాయి. ఇవాళ ఖరీదయిన హస్పిటళ్లని నడిపే వాళ్లు ప్రస్తుతం వాళ్ల దగ్గరున్న పరికరాలన్నింటినీ చెత్తకుప్పలో పడేసి ఈ కాలయంత్రాలతో డబ్బు చేసుకోవడం మొదలెడతారు. ఒకపక్క నుంచీ సామాన్య ప్రజలకి మేలు చేయాలనుకుంటూ, ఇంకో పక్కనుంచీ ఇలాంటి పరిస్థితిని వాళ్లకి ఎలా కల్పించగలను? ఎడిసన్ కనిపెట్టిన లైట్ బల్బు ఈనాటికీ ప్రపంచమంతటా సామాన్య మానవులకికూడా ఎంతో ఉపయోగపడుతోంది. నా రీసెర్చ్ కూడా అంతటి ప్రయోజనాన్ని చేకూర్చాలనేది నా ఆకాంక్ష కానీ అది ఎలాంటి రీసెర్చ్ వల్ల సాధ్యమవుతుందన్నదే నాకు అవగాహనకు రాని విషయం. ప్రస్తుతానికి ఇలాంటి వాటిని తయారుచెయ్యడమే నాకు ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. అది కూడా నేను చేస్తె తప్ప నేనాశించినంత ప్రయోజనముండదని కూడా నాకు తెలుసు. అందుకే అలా చెయ్యడానికి చాకులాంటి కుర్రాళ్ల సహాయం తీసుకున్నాను!” అన్నాడు సత్యా.

సామంత్ మెదడులో జరగాల్సిన కార్యక్రమం రూపు దిద్దుకున్నది. పైకి మాత్రం, నిరాశగా మొహం పెట్టి,

“నీ సంగతి తెలిసిందేగా, కానీయ్. అయితే నన్ను కూడా కొద్దిగా భవిష్యత్తులోకి తొంగి చూడనిస్తావా?” అన్నాడు.

అయితే ఆ మెషీన్లోకి వెళ్లేముందర “ముందు నువ్వెళ్లి రాకూడదూ? ఈ డొక్కు రేకుల్ని చూస్తే భయమేస్తోంది!” అన్నాడు.

***


Rate this content
Log in

Similar telugu story from Fantasy