Varun Ravalakollu

Fantasy

4.9  

Varun Ravalakollu

Fantasy

డెడ్ మేన్ పేరడాక్స్ - 2

డెడ్ మేన్ పేరడాక్స్ - 2

7 mins
518


నా కళ్లముందరే అయిదునిముషాలు సెట్ చేశాడు. కాలయంత్రం తన నాలుకని వెనక్కు లాక్కున్న దాదాపు ముప్ఫై సెకన్ల తరువాత నేనొక మైదానం మధ్యలో నిలబడి ఉన్నాననీ, నా చుట్టూ వేలకొద్దీ జనమున్నారనీ అర్థమైంది. నా శరీరం మీద రెండు పెదవుల స్పర్శ తెలిసిన తరువాత గానీ నేనొక పసికందుకి స్తన్యమిస్తున్నానని తెలియలేదు. ఉలిక్కిపడ్డాను. చేత్తో తడుముకుని రెండు రొమ్ముల ఉనికినీ నిర్ధారణ చేసుకున్నాను. లంగా సర్దుకుంటూ నేను పూర్తిగా స్త్రీరూపంలో ఉన్నానని గ్రహించాను. ముక్కుకి పోగు, చెవులకి కమ్మలూ, లంగా, దుప్పట్టా, పాలుతాగుతూ నన్నంటి పెట్టుకున్న పసికందూ నన్ను శిలా విగ్రహంలా నిలబెట్టాయి.

“హే భగవాన్!” అని పైకి చూసిన తరువాత చుట్టూ చూస్తే నేను పంజాబీల మధ్యలో నిలబడ్డానని అర్థమైంది. మైక్లో ఎవరిదో ఉపన్యాసం వస్తోంది గానీ ఒక్కముక్క అర్థం కావడం లేదు. ఇంతలో వెనకనుంచీ తోపుడు మొదలయ్యింది. “బ్రిటిష్ పోలీసులు!” అని వెనకనించీ వచ్చిన వార్త ఆ సభలో మధ్యలో ఉన్న నన్ను చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. దూరంగా స్టేజీ మీద ఉన్న వక్త ఇంకాసేపు అలాగే ప్రసంగించాడు. అసలే ఈ జెండర్ ఛేంజ్ తో స్టన్ అయివున్నాను. ఇప్పుడీ తోపులాట. అప్పుడే ఏం చూశావు అన్నట్టు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. తోపుడు కాస్తా తొక్కిసలాటగా మారింది. ఎక్కడికని వెళ్లేది? అందరిలాగా చెల్లాచెదురై పరుగెట్టి ముందుకు చూద్దును కదా, నుయ్యి! వెనక్కి చూస్తే కొందరు తుపాకీగుళ్లు తగిలి పిట్టల్లా నేలకురాలడం కనిపించింది. నా పక్కనుంచీ కొందరు వెళ్లి ముందున్న బావిలో దూకారు ఒకళ్లు నాకేదో చెప్పారు కూడా. భాష రాక అర్థంకాలేదు. ఇంకొకళ్లు నా చెయ్యి పుచ్చుకొని లాగి వాళ్లతో బాటు దూకించినప్పుడు అర్థమైంది. వాళ్లు నన్నుకూడా దూకమంటున్నారని. దూకాను సరే, ఈత రాదే! నా రొమ్ముని కరచుకొని ఉన్న పిల్లతోసహా నేను మునుగుతున్నాను. నీళ్లు నోట్లోకి పోతున్నాయి. ఊపిరి అందడంలేదు. ఇంతలో ఎవరో ఒకరు సరిగ్గా నా నెత్తిమీదకి దూకారు. అప్పుడర్థమైంది. నేనున్నది జలియన్ వాలాబాగ్లో నని!

ప్రాణంపోయిందని నిర్థారించబడ్డవాడు, ‘లేదు బతికే ఉన్నాను’ అని నిరూపించేటప్పుడు తీసే మొదటి శ్వాసలా పెద్ద శబ్దంచేస్తూ ఊపిరి పీల్చుకున్న తరువాత కొన్ని సెకన్లకి ఆ రాక్షస నాలికమీంచి బయటపడి లేచి నిలుచున్నాను.

సత్యా నవ్వాడు - పట్టలేని కోపంతో ఆ నాలికమీంచి లేచి నిల్చున్నవాణ్ణి కాస్తా, ఒళ్లంతా చెమటలతో నిండిపోయినా గానీ, నోరు తెరిచే ముందరే నేను ఆడదాన్ని కాదని నిర్ధారించుకోవడం కోసం తడుముకోవడాన్ని చూసినప్పుడు నేను కూడా ఫక్కుమని నవ్వాను.

“ఈ మెషీన్ నన్ను నిజంగా కాలయాత్ర చేయించిందనీ, నువ్వా అనుభవాన్ని ప్రోగ్రాం చెయ్యలేదనీ బుజువేంటి?” ప్రశ్నించాను.

“నీ జీవితంలోని అనుభవాలనే నీకు చూపిస్తే జ్ఞాపకాల లోతుల్లోంచి తవ్వి తీశానని అనేవాడివి. ఈ తారీకుతో నయితే, పుస్తకాలల్లో చదువుకోవడం వల్ల ముందరే కొద్దిగా నయినా పరిచయముంది గానీ, దాని వివరాలు నీకు ఇప్పుడు తెలిశాయి!”

ఒక్క క్షణ మాలోచించి, తరువాత వాడు చెప్పినది లాజికల్గానే ఉందనిపించింది. “ఇంకేం, అమ్మెయ్!” అన్నాను.

“ఎందుకూ?” అన్నాడు అమాయకుడిలా.

“పిచ్చోడిలా మాట్లాడతావేంటి? ఎంత డబ్బు చేసుకోవచ్చో అస్సలు అయిడియా లేదా?”

“నాకెందుకు, డబ్బు?”

“పోనీ, ప్రపంచానికి నూతన టెక్నాలజీని అందిస్తున్నాని అనుకునైనా సరే - ఎడిసన్ లైట్ బుల్బుని అందించినట్లుగా.”

“ఇది నాకోసం నేను చేసుకున్నది - అంతే.”

“నేనీసారికి వచ్చేసరికి ఆ డైనోసార్ల కాలం దాకా వెళ్ళొచ్చేలా మార్చు. నీకు బ్రహ్మాండమయిన కాంట్రాక్టులని తెచ్చే బాధ్యత నాది.”

“చూద్దాంలే,” అన్నాడు. వెంటనే “నో” అననందుకు సంతోషించాను. మాట మర్చి, “రాఘవ ఈ ఊళ్ళోనే ఉన్నాడు తెలుసా?” అన్నాను.

“అలాగా,” అని నిరాసక్తంగా ఊరుకున్నాడు.

“క్రితంసారి వచ్చినప్పుడు కలిశాను. నిన్నీపాటికి కలిసుంటాడని అనుకున్నానే!”

ఇందాక రాఘవ ప్రసక్తి రావడం మీరు గమనించే ఉంటారు. కలిసున్నట్లున్న పోజులతో ఉన్న బొమ్మలతో తప్ప పురాణాల్లో త్రిమూర్తులెప్పుడూ కలిసి తిరిగినట్లు ఆధారాలేవీ లేవు. గుళ్లు లేని బ్రహ్మ సంగతి పక్కన పెట్టినా మిగిలిన ఇద్దరికీ కలిపి కట్టిన గుళ్లుకూడా ఎక్కడాలేవు - ఈ మధ్యలో అమెరికాలాంటి దేశాల్లో ప్రవాస భారతీయులు కొత్తగా కడుతున్నవాటిని మినహాయిస్తే. హైస్కూల్లో ఉన్నప్పుడు మాకు మాత్రం త్రిమూర్తులన్న పేరొచ్చింది. ఎక్కడి కెళ్లినా కలిసి వెళ్లేవాళ్లం. పొరబాటున ఇద్దరమే ఎక్కడయినా కనిపిసే మాకు తెలిసినవా ళ్లెవరయినా గానీ, మూడో వాడేడని వెంటనే అడిగేవారు. రాఘవ మెడిసిన్లో సీటొచ్చి కాకినాడ వెళ్లిపోయాడు. నేనూ, సత్యా వేరే కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివినా, అమెరికా చేరిన తరువాత మా స్నేహాన్ని కొనసాగించాం. పెళ్లయిన తరువాత రాఘవగూర్చి విశేషాలు ముందు మాకు జాలినీ, బాధనీ కలిగించడంవల్ల వాణ్ణి ఓదార్చబోయాం గానీ తరువాత వాడికి దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి నేనొచ్చాను. సత్యా అయితే సరే. వాడిలోకంలో వాడుంటాడు గదా! ఇంట్లోనే వేరే గదిలో ఉన్న పెళ్లాన్నే పట్టించుకోనివాడికి పదివేల మైళ్లవతల ఉన్నవాడేం గుర్తుంటాడు? ఇప్పుడయినా రాఘవ ప్రసక్తి తేవడానికి కారణం, దాదాపు అరవయ్యోపడిలో పడుతున్నాం కదా, వాడి సమస్యలు సర్దుకొని ఉండక పోతాయా, ఇప్పుడయినా మళ్లీ ముగ్గురం హాయిగా కలవవచ్చునన్న ఆశతో. అందుకే రాఘవని కలిసి, ఎలాగయినా సరే సత్యాని కలవమని మరీ మరీ చెప్పాను.

అదెంత తప్పో ఆర్నెల్ల తరువాత సత్యానుంచీ వచ్చిన ఫోన్ కాల్ వల్ల తెలిసింది. వాడిచ్చిన చాంతాడంత లిస్టుని చూసి, “ఇవన్నీ డైనోసార్ల కాలానికి తీసుకెళ్లడానికే?” అన్నాను.

“డైనోసార్లని చూడాలంటే అంత వెనక్కి వెళ్లక్కర్లా. నా చుట్టూ కూడ ఉన్నారు. ఈ సారొచ్చినప్పుడు చూద్దువుగాని,” అన్నాడు.

తరువాత తెలిసిందిదీ - రాఘవ ‘జీవితం’ వాడి పెళ్లితోనే అంతమయిందని వాడి పెళ్లయిన మూణ్ణాళ్లకే నాకూ, సత్యాకీ నిర్ధారణ అయింది గానీ, వాళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మేము పొరబడ్డామేమో ననుకున్నాం. వాడి భార్యకి శూర్పణఖ అని కాకుండా సీత అని పేరు పెట్టినందుకు ఆవిడ తల్లిదండ్రుల మీద నాకు ఎప్పటినుంచో ఉన్న కోపమివాళ తారాస్థాయికి చేరుకుంది. సీత అనగానే నాకు రాముడి భార్య కాక, రాఘవ భార్య గుర్తుకు రావడం గురించి కాదు నేను మాట్లాడేది. సత్యా ఎంతో శ్రమపడి తయారు చేసిన కాలయంత్రాన్ని గునపాలతోనూ, గొడ్డళ్లతోనూ నాశనం చేయించడం గూర్చి.

రాఘవ చేసిన తప్పేమిటి? వాడు జీవించి ఉన్నప్పటి క్షణాలని గుర్తు చేసుకోవాలను కోవడం. పెళ్లి కాకముందు వాడి ప్రేమ వ్యవహారానికి అడ్డం కొట్టంది వాడి తండ్రి - గోడకేసి రక్తం వచ్చేలా తలకాయని కొట్టుకుని, ఆ ప్రేమ పెళ్లే గనుక జరిగితే రైలుక్రింద తలకాయ పెడతానని బెదిరించి, వాడి తల్లిచేత, “నీ కాళ్లు పట్టుకుంటాను నాయనా, నాకు పతిభిక్షని పెట్టు” అని చెప్పించీను. తాళికి తలవంచింది సీతకాదు రాఘవ. పెళ్లి ముందరి వాడి ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిలోనే ఆమె చెవిలో ఊదిన ఆమె చుట్టానికి బుద్ధి లేకపోతే సరే, నిమిష నిమిషానికీ, “నువ్వు దాన్నయితే ప్రేమగా చూసుకుని ఉండే వాడివి కాబోలు. నారాత ఇలా తగలడ్డది!” అని ముక్కు చీదడానికి ఆమెకి సిగ్గుండక్కర్లా? ఇద్దరు పిల్లలుకూడా పుట్టిన తరువాత కలిగిన సిగ్గువల్ల కాబోలు, వాడు పడగ్గదులు వేరు చేయించినా (రాఘవ పోయిన తరువాత ఈ సంగతిని ఆమె నోటి ద్వారానే విన్నార్ట చెవులున్న వాళ్లందరూను) వాడు హాస్పిటల్లో ఉన్నా, డిస్పెన్సరీలో ఉన్నా క్షణక్షణం ఎక్కడ ఉన్నదీ ఆమెకు చేరుతూనే ఉండాలట!

ఆ పరిస్థితిలో వాడు కాలయంత్రంలో ప్రేమ రోజులని తిరిగి అనుభవించాలను కోవడంలో తపేముంది? నా ప్రోద్బలంతోనయితేనేం, మొత్తానికి వాడు సత్యాని కలిసిన తరువాత సాయంత్రం డిస్పెన్సరీలో ఉన్నాడని అబద్ధం చెప్పించి, ఆ కాలయంత్రంలో దూరితే, కనీసం చెప్పినచోట లేడనే విషయం ఆ శూర్పణఖకి చేరడానికి ఎన్నాళ్లు పడుతుంది? రాఘవని ఏ రావణుడూ ఎత్తుకునీ పోలేదు, వాడు వెళ్లింది లంకకీ కాదు. ఉన్న ఊళ్లో ఎంతసేపు వాణ్ణి పట్టుకోవడం! ఆవిడ జులుంచేసి, సత్యా ఇంటికి వెళ్లీ, రాఘవ టైం మెషీన్లో ఉన్న సమయంలో, కాసేపట్లో తలుపులు తెరుచుకుంటాయి, ఆగమంటూ అడ్డంపడిన సత్యాని పక్కకుతోసి, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కిందట. అయినా, కాలయంత్రం గూర్చి ఆవిడకు చెప్పడానికి సత్యాకి బుద్ధుండొద్దూ? పైగా, గతంలో కెళ్లి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని చెబితే ఆవిడకి తిక్క రేగకుండా ఎందుకుంటుంది? చేరి మూర్ఖుని మనసు అంటూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.

ఆవిడ రాఘవని బలవంతంగా ఇంటికి లాక్కెళ్లిన తరువాత ఆవిణ్ణీ, కూతురినీ (కొడుకు అమెరికాలో ఉన్నాడు) కలిపి “మీరెవరు, నేనిక్కడ ఎందుకున్నాను?” అని రాఘవ అడిగితే, వేషాలేస్తున్నాడని శూర్పణఖ గట్టిగా తిట్టిపోసిందట. మరునాడు రాఘవ అసలు హాస్పిటల్ వైపు గానీ, డిస్పెన్సరీ వైపు గానీ వెళ్లకపోతే నటనే ననుకుందట. మళ్ళీ రాఘవ దగ్గరకి ఎక్కడ చెక్కేస్తాడోనని ఇంటి బయటకు వెళ్లడానికి వీల్లేకుండా గట్టి కాపలా పెట్టిందట. వారం రోజుల తరువాత కూడా వాడావిణ్ణి నువ్వెవరంటుంటే, తిక్కపుట్టి పెళ్లిఫోటో చూపించిందట. అది చూసి వాడు “నాకెప్పుడు పెళ్లయ్యింది?” అనేసరికి, లబోదిబోమని మొత్తుకుంటూ వాణ్ణి పట్టుకెళ్లి ముందు డాక్టర్ల చుట్టూతా, తరువాత పూజలు, శాంతులు పేరిట గ్రహాలచుట్టూ తిప్పిందట. అప్పటిదాకా ఇంటిగడప తొక్కనివ్వని రాఘవ అన్నా చెల్లెళ్లని ఇంటికి పిలిపిస్తే వాళ్లని గుర్తుపట్టినట్లే ఉన్నాట్ట కానీ, “ఇంత ముసలాళ్లలా కనిపిస్తున్నారేంటీ?” అనడిగాట్ట. అతని చెల్లెలి మొగుణ్ణి కానీ, ఆమె పిల్లలని కానీ, అన్నయ్య పిల్లనికానీ ఎవరినీ వాడు గుర్తుపట్టలేదట. అప్పుడు గానీ వీడు చెల్లెలి పెళ్లికి ముందుకాలంలో ఉన్నాడని వాళ్లకి అర్థం కాలేదట. ఆమెకి పెళ్లే కాని కాలంలో వాడున్నప్పుడు ఆ తరువాత తరువాత వచ్చిన ఆమె మొగుడిగూర్చి గానీ తన పెళ్లిగూర్చి గానీ వాడికి తెలియకపోవడంలో వింతేముంది?

అప్పుడు మొదలుపెట్టిన సీత శోకం రాఘవతోబాటు అందరినీ సత్యా ఇంటికి లాక్కెళ్లేలా చేసింది. టైం మెషీన్లో ఎమర్జెన్సీ స్టాప్ నొక్కడం ఏ ఫలితాలకి దారితీసిందోనని ముందుగా సత్యా ఆదుర్దా పడ్డాట్ట కానీ అప్పటికి ఆమె తాకిడికి గురై రెణ్ణెల్లు దాటినందువల్ల ఏమీ అయ్యుండదన్న నిశ్చయానికి వచ్చాట్ట. వాళ్ల దగ్గరనుంచీ వివరాలని సత్యా రాబట్టిన తరువాత, “ఎలాగోలా ఆయన్ని మామూలుగా చెయ్యా”లన్న ఆజ్ఞని జారీచేసిందట శూర్పణఖ. సత్యా ఏదో ఒకటి పెద్దగా వ్యాఖ్యానం లేకుండా చేస్తే సరిపోయేది. ఆలా కాకుండా, వాళ్లతో “ఇప్పుడు వాణ్ణి కాలయంత్రంలో పడుకోబెట్టి కాలాన్ని మళ్లీ వెనక్కు తిప్పితే, తిరిగొచ్చిన తరువాత వాడు ఆ యాత్ర చేసేముందరి స్థితిలో ఉంటాడా లేక ఏదయినా స్థితిలో ఉంటాడా? వెళ్లే ముందరి స్థితి అయితే, మీకు కావలసిన పరిణామాలేవీ సంభవించవు. కానీ, తరువాతి స్థితిలోకి వస్తాడనుకోవడానికి మనకు ఆ స్థితి ఏమీ తెలియదే?” అన్నాట్ట.

“కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ఆ మెషీన్లో పడుకోబెట్టి, కొన్నేళ్లు కాలచక్రాన్ని వెనక్కి తిప్పిన తరవాత తిరిగి వచ్చేటప్పుడు రెణ్ణెల్ల క్రిందటి తేదీ దగ్గర ఆపుచేస్తే సరి!” అన్నాట్ట రాఘవ చెల్లెలి కొడుకు. ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఆ కుర్రాడికి ఇంటెలిజెంట్ అని అప్పటికే బిరుదుండడంచేత, ఆ అయిడియాని మెచ్చి ఆఖరికి శూర్పణఖ కూడా వాణ్ణి ముద్దుపెట్టుకున్నదట కూడా.

సత్యా అంత తేలిగ్గా కుదరనిస్తాడా? “కాలచక్రంలో వెనక్కి వెళ్లి తిరిగి రావచ్చు గానీ మధ్యలో ఆపడానికి వీల్లేదు. అలాకాక మధ్యలో ఆపితే వచ్చే పరిణామాలను ఎదురుగా చూస్తూనే ఉన్నారు. కాలచక్రమనేది ఎప్పుడూ ముందుకు తిరుగుతూనే ఉంటుంది కాబట్టి, ఈ యంత్రంలోకి వెళ్లిన తరువాత తిరిగి వచ్చేటప్పటి సమయం వెనక్కి వెళ్లేటప్పుడున్న సమయాన్ని దాటి ఉండాలి. అంటే, పదిగంటలప్పుడు ఆ యంత్రంలోకి అడుగు పెట్టేటట్లయితే, తిరిగి వచ్చేటప్పటి సమయం, కనీసం పదిగంటల ఒక్క నిముషం అయివుండాలి. వెనక్కి వెళ్లడానికి ముప్పైసెకన్లు, తిరిగి రావడానికి ముప్పై సెకన్లూ పడతాయి” అన్నాట్ట.

“అయితే ఒక పనిచేద్దామత్తా. ఈ మెషీన్లో తిరిగివచ్చే సమయంక్రింద ఒక ఆరునెలలకవతలి సమయాన్నెన్చుకుందాం. ఈ మెషీన్ వల్ల కాకపోయినా, ఎలాగోలా 6 నెలల్లో మామయ్య మామూలు మనిషవుతాడని నాకు నమ్మకముంది” అన్నాట్ట ఆ ఇంటెలిజెంటు.

శూర్పణఖ మురిసిపోయిందట వాడి ఆప్టిమిజానికి. “ఎందుకయినా మంచిది, ఒక సంవత్సరం తరువాత కాలాన్ని సెలెక్టుచేసుకో. మీ మామయ్య నాకు నా వచ్చే పుట్టినరోజుకి రవ్వల నెక్లెస్ కొనిపెడతానన్నారు. కొంటారో లేదో ఈ దెబ్బతో తెలిసిపోతుంది” అన్నదట. లిఫ్టులో ఎక్కిన తరువాత నాలుగో అంతస్తు చేరాలంటే “అది సరిగ్గా పనిచేస్తుందో, లేదో ఎందుకయినా మంచిది, అయిదవ అంతస్తు బటన్ నొక్కితే?” అన్న ఆలోచనని రానివ్వనివాళ్లు ఆమెని సమర్థించారట.

నలుగురు మనుషులు సత్యాని చేతులు విరిచి పట్టుకున్న తరువాత ఆ ఇంటెలిజెంటు కంట్రోల్ పానెల్లో డేట్లని సెలెక్టు చేసుకున్న తరువాత రాఘవని ఆ మెషీన్లోకి పంపించారట. రాఘవ దాన్లోంచీ బయటకు వచ్చిన తరువాత వాళ్లందరినీ - సీతనీ, కూతుర్నె గాక చెల్లెలి మొగుణ్ణీ, వాళ్ల పిల్లలనీ కూడా గుర్తుపట్టి, పేరుపెరునా పలకరించేసరికి అందరూ ఆనంద పడ్దార్ట.

అయితే మరునాడు రాఘవ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నాలేమీ చెయ్యకుండా ఇంట్లో కూర్చునుంటే, కొద్దిగా జంకుతూనే శూర్పణఖ, “ఏమిటీ, ఇవ్వాళ హాస్పిటల్ వెళ్లట్లేదా?” అనడిగిందట. రాఘవ, “నేను రిటయరయ్యాగదే, నన్నెవడు రానిస్తాడు హాస్పిటల్ కి?” అన్నాట్ట. ఆ క్రితం రెణ్ణెల్ల హడావిడిలోపడి మర్చిపోయిందిగానీ ఆవిడకి తెలిసినంతవరకూ తరువాత దాదాపు రెండువారాల్లో అతను రిటైరవుతాడు. “అప్పుడే రిటైరయ్యా నంటాడేమిటి?” అని ముందు ఆశ్చర్యపోయినా అప్పటికి రెట్టించకుండా ఊరుకుందట గానీ, ఆవిడకి మతిపోగొట్టిన విషయం మాత్రం, కొడుకు ఈశ్వర్ని చూసినప్పుడు రాఘవ చేసిన సీను. అమెరికాలో ఉన్న ఈశ్వర్కి రాఘవ గొడవ కొద్దిగా చెప్పినా, ఎలాగో రాఘవ రిటైరయ్యే సమయానికి తండ్రి పక్కన ఉండేందుకని కొనుక్కున్న ఫ్లైట్ టిక్కెట్టు ఉంది కదా, అప్పుడే రావచ్చులే అని అతనికి నచ్చచెప్పారు. కానీ, రాఘవ మామూలు మనిషయ్యాడని సంబరపడుతున్న వేళలో, కొడుకుని చూసిన రాఘవ ఏడుస్తాడని - అది కూడా, చాలాకాలం తరువాత చూసినందువల్ల కాక దయ్యాన్ని చూసినట్లుగా - ఎవరయినా ఎలా ఊహిస్తారు? సీత తలబాదుకుంటూ ఈశ్వర్ని పక్కకు తీసుకెళ్లి అంతకుముందు రెణ్ణెల్లూ జరిగిన భాగోతమంతా వాడికి వివరించిందట.

ఈశ్వర్ అక్కడున్న వారంరోజులూ అతను కనబడితే ఏడిచే రాఘవని భరించలేక “ఏమిటీ నీ ప్రాబ్లం?” అని గట్టిగా అతణ్ణి గసిరితే, “వీడు దయ్యమయ్యాడే” అని బావురుమన్నాట్ట. “నీ బొంద! వీడు మనిషే. నువ్వే మమ్మల్ని బతికుండగానే పీక్కుతింటున్నావు” అని సీత మొగుణ్ణి తిడితే, వాడుకాస్తా, “వాడు పోయిన తారీకు నీకు ఎందుకు గుర్తులేదో నాకు అర్థం కావట్లేదు” అని తలబాదుకున్నాట్ట.

సీతకి వళ్లుమండిపోయి, “నిక్షేపంలా ఉన్న నా కొడుకుని చంపుతావెందుకు?” అని చేతికందిన వాటిని రాఘవమీదకి విసిరిందట. రాఘవ, “వాడు పోయిన తారీకు” అంటూ దాదాపు ఆర్నెల్ల తరువాత తేదీని చెప్పి, “న్యూస్ పేపర్లో వచ్చిందిగా, వాడుపోయిన విషయమూ చూపిస్తానుండు,” అని బుజువులకోసం ఇంట్లో వెతకడం మొదలుపెట్టేసరికి వాణ్ణి గదిలో పెట్టి తాళం వేశార్ట.

“నెల్లాళ్ల తరువాత రాఘవ చనిపోయేదాకా వాడి మకాం అక్కడే” అన్నాడు సత్య. ఈశ్వర్ నిష్క్రమణ దినం గూర్చిన రాఘవ మాటలు సత్యాకి చేరాయిగానీ, “తన కాలయంత్రం ద్వారా భవిష్యత్తులోకి వెళ్లడం సాధ్యమా?” అన్న ప్రశ్నకి పెద్దగా తన మైండ్లో చోటివ్వకుండా రాఘవతోబాటే దాన్ని పూడ్చిపెట్టాట్ట. అయితే రాఘవ చెప్పిన తారీకునాడే ఈశ్వర్ అమెరికాలో మరణించడం రాఘవ కుటుంబాన్నే కాక సత్యాని కూడా దిగ్భ్రాంతికి లోను చేసింది.

***


Rate this content
Log in

Similar telugu story from Fantasy