STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమతో వందనం

ప్రేమతో వందనం

6 mins
47


వందన తన ఫ్రెండ్స్ తో ,

మెక్ డోనాల్డ్స్ లో 

కూర్చుని ఉంది..


జీవన్ తన ఫ్రెండ్ చందూతో, 

వచ్చాడు అక్కడికి..


చందూ కి కాబోయే భార్య అనూ, 

వందన ఫ్రెండ్..

అనూని కలవటానికి వస్తూ, 

జీవన్ ని తీసుకొచ్చాడు చందూ..


వందన జీవన్ ని చూసి..

చూస్తూనే ఉండిపోయింది..

మాటల మాటల్లోనే జీవన్ వందనను చూసాడు..వందన జీవన్ నే చూస్తోంది..


జీవన్ అనూతో ఏదో చెబుతూ తల పక్కకి తిప్పాడు..వందన కనిపించింది..

ఇంకా జీవన్ నే చూస్తోంది...

ఏంటీ అన్నట్టు కనుబొమలు ఎగరేసాడు జీవన్, వందనని చూసి...


టక్కున స్పృహలోకి వచ్చినట్టయి, సిగ్గుతో ఎర్రబడ్డ మొహాన్ని, సన్నని నవ్వు, పెదాలను వరించగా, వందన కళ్ళు కిందకు దించేసింది..


జీవన్ కి సరదాగా అనిపించింది 

ఒక అమ్మాయి అలా తననే చూస్తూ ఉండటం..


అందరూ బర్గర్ తింటున్నారు..

జీవన్ వందన వైపు చూసాడు..


మళ్ళీ తననే చూస్తూ వందన..

ఈ సారి జీవన్ పలకరింపుగా నవ్వాడు...

వందన కూడా నవ్వింది..

మధురమైన నవ్వు...

చిరుచల్లని ప్రశాంతవీచిక జీవన్ ని తాకింది...


అందరూ వెళ్ళేందుకు లేచి నిలబడ్డారు...

వందన జీవన్ దగ్గరికి వచ్చింది..

" హాయ్ నేను వందన " అని చెబుతూ చెయ్యి చాచింది 

షేక్ హ్యాండ్ కి..


జీవన్ చెయ్యి కలిపాడు...మంచి ఆత్మీయస్నేహభావనేదో తాకింది జీవన్ మనసుకి...


వందన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో మంచిపోస్ట్లో పని చేస్తోంది...


ఒక్కతే కొన్నేళ్ళుగా 

ఒక చిన్న ఇంట్లో తన అమ్మానాన్నా తీపిగుర్తులతో ఇంటిని అలంకరించుకుని చిన్నప్పుడే తనకి దూరమైన తల్లితండ్రి చేతుల్లోనే భద్రంగా తానున్నట్టుగా అనుకుంటూ, తనని తాను వీలయినంత ధైర్యంగా ఉంచుకుంటుంది వందన..


ఆ రోజు జీవన్ బర్త్ డే ..వందన జీవన్ కోసం ఒక మంచి పెయింటింగ్ వేసింది...అందులో జీవన్ మీద తన ప్రేమను వ్యక్తపరుస్తూ అందంగా బొమ్మను గీసింది...


బర్త్ డే పార్టీ తరువాత అందరూ జీవన్ కి, 

అతని తల్లి వసుధకి బై చెప్పి వెళుతున్నారు..


వందన అక్కడే తన పెయింటింగ్ తో ఒక సోఫాలో కూర్చుని ఉంది...జీవన్ అలసటగా వచ్చి వందన పక్కనే సోఫాలో కూర్చుని " ఏంట్రా వీను ఎలా ఉంది 

నీ జాబ్, ఏంటి నీ అప్డేట్స్ " అని అంటూ మాట్లాడుతుంటే..వందన తన పెయింటింగ్ పైన చుట్టిన గిఫ్ట్ పేపర్ తీసి పెయింటింగ్ 

జీవన్ కి ప్రెజెంట్ చేసింది...


జీవన్ బొమ్మను చూసాడు...

తల పక్కకి తిప్పి వందనను సగం ప్రశ్నార్ధకం, 

సగం నవ్వు,ఆనందం కలగలిసిన మొహంతో చూసాడు...


వందన చెబుతోంది.... 

నా రాబోయే జీవితం అంతా నేను

నీతోపాటే ఉండాలని ఉంది జానూ.... 

అంది(జానూ అంటే హిందీలో.. 

జాన్ అంటే ప్రాణం అని..... 

జానూ అంటే ప్రాణసమానం అని) ..


జీవన్ తల్లి వసుధ అంతా చూస్తోంది 

దూరం నుంచీ, 

ఆవిడకు అంతా అర్ధం అయ్యింది....


జీవన్ వందనను చూసి " వీనూ...నువ్వంటే నాకూ చాలా ఇష్టం..కానీ... " అని ఆగిపోయాడు...


" ఏంటి జానూ.. "అంది వందన...జీవన్ ఆలోచిస్తూ ఉన్నాడు...కొంచెం తలవిదిలించి ఆలోచనలను వదిలేసి వందన చెయ్యి పట్టుకున్నాడు...


జీవన్ చెయ్యి వణుకుతోంది....వందన చెయ్యి పట్టు జారిపోతుందేమో అన్నట్టుగా అపురూపంగా పట్టుకుంటున్నాడు...


ఏదో చెప్పాలని ఉంది జీవన్ కి, చెప్పలేకపోతున్నాడు....


వసుధ నెమ్మదిగా వారి దగ్గరకొచ్చింది...వందన జీవన్ కి ఇచ్చిన పెయింటింగ్ చూసింది....


ఆ బొమ్మలో ఒకవైపు జీవన్, ఒకవైపు వందన ఉన్నారు..మధ్యలో ఒక అద్దం బొమ్మ, 

ఆ అద్దం మీద రాబోయే జీవితం మొత్తం అని రాసి ఉంది, ఆ అద్దంలో ప్రతిబింబం, ఆ అద్దం ముందు నుంచుని ఉన్న జీవన్, అతని గుండెలపై నిశ్చింతగా తల పెట్టుకున్న వందన, వందన భుజాల చుట్టూ రక్షణవలయంలా కాచుకుంటున్నట్టుగా జీవన్ రెండూ చేతులూ చుట్టేసి ఉన్నాయి...ఆ బొమ్మలో వందన భావన స్పష్టమవుతోంది....


జీవన్ వందన చెయ్యి ఇంకా పట్టుకుని ఉండే తల్లివైపు చూసాడు అర్ధమయ్యిందా వందన ఆశపడేదేంటో అన్నట్టుగా...


వసుధ అవునన్నట్టుగా తలూపింది....వందన నుదుటిపైన చల్లని ముద్దొకటి పెట్టి వందన, జీవన్ తలల మీద ఆశీర్వదిస్తున్నట్టుగా ఆప్యాయంగా చేతులుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది...


వందన సహనంగానే కూర్చుని ఉంది...


జీవన్ అభిప్రాయం తనకెప్పుడు చెప్పాలని ఉంటే అప్పుడే చెప్పనీ అని , తన ప్రేమ మాత్రం జీవన్ కి తెలియచెబితే చాలు అని ముందే అనుకుని ఉండేంత విశాలమైన మనసు వందనది..


తను ప్రేమించింది కాబట్టి జీవన్ కూడా వెంటనే ప్రేమించేయాలి, తనకి సమాధానం వెంటనే దొరికెయ్యాలి అని వందన అనుకోలేదు...


ప్రేమ మనసుకి సంబంధించినది...జీవన్ కి ప్రేమ ఉంటేనే తనకి చెప్పగలడు కదా అని వందనకు తెలుసు...


" జానూ ఇంక నేను ఇంటికి వెళ్తాను " అంది వందన..


" రేపు ఆఫీసుకి వెళ్ళాలా " అన్నాడు జీవన్ వందనను..


" పనుంది మరి, సరే మరి పుట్టినరోజు అబ్బాయి ఆశగా అడిగాడు కాబట్టి నాలుగింటికే పర్మిషన్ తీసుకుని వచ్చేస్తా ఇంటికి..ఆ టైముకి నువ్వు ఇంటికి రావచ్చు " అంది నవ్వుతూ వందన..


జీవన్ మర్రోజు సాయంత్రం వందన ఇంటికి వెళ్ళాడు...


వందన గులాబీ రంగు కాటన్ చీరలో మంచి కాఫీ రెడీ చేసి జీవన్ రాక కోసం ఎదురుచూస్తూ ఇళయరాజా పాటలు సన్నగా వినిపించేలా చేసి, అలా అన్నీ తయారుగా ఉంచి మంచి ఆహ్లాద వాతావరణం సృష్టించింది..


జీవన్ తెల్లని టీ షర్ట్ లైట్ బ్లూ జీన్స్ లో వచ్చాడు..చేతిలో అన్ని రంగులతో అందంగా అమరిన పువ్వులతో ఫ్లవర్ బొకే తెచ్చాడు...


వందన జీవన్ కి కాఫీ ఇచ్చింది...

జీవన్ కాఫీ తాగి...... 

" వీనూ నేను నీతో మాట్లాడాలి " అన్నాడు...

" చెప్పు జానూ.. " అంది వందన...


" అమ్మానాన్న లేకుండా వంటరిగా ఇన్నేళ్ళు ఉండటం కష్టమే కదా ఎలా భరించావు..." అని అడిగాడు జీవన్..


" కష్టమే..... కానీ తప్పదు అన్నప్పుడు, ఏడుస్తూ బలహీనపడితే సమస్య తీరదుగా అందుకే.. 

నవ్వే దారులనే ఎంచుకున్నాను...

చిన్నదే అయినా కనీసం సొంత ఇల్లు మిగిల్చారు నాకు మా అమ్మానాన్న...


దగ్గరచుట్టాలు చిన్నవయసులో తోడుగా ఉన్నారు..నాకు సాయం చేసేది కొంత , వారి స్వలాభం కొంత చూసుకునేవారు..అయినా పర్లేదులే నా అని చెప్పుకోటానికి ఓ నలుగురున్నారు అని సర్దుకుపోయాను...నేనూ అమ్మనాన్న లేని అనాధనే, ఆ బాధ తెలిసిన నేను బాగా ఊహ తెలిసాక అనాధశరణాలయాలకు వెళ్ళి శని, ఆదివారాలు అక్కడే ఉండేదాన్ని...


వారు ఏది తింటే అదే తిన్నాను, వారు ఎలా ఉంటే అలాగే ఉన్నాను...సోమవారం నుండీ శుక్రవారం వరకు ఇంట్లో వరుసకు అమ్మమ్మ , మామ అయ్యేవారితో ఉండేదాన్ని..కొంచెం దూరపు చుట్టాలే అయినా అనాధశరణాలయంలో పిల్లలకి కనీసం ఇలా కూడా బంధువులు లేరు, వారు నాకంటే బాధలో ఉన్నారు అయినా ధైర్యం తెచ్చుకుని బతికేస్తున్నారు, మరి నేను ఇంకెంత ధైర్యంగా ఉండాలి అని నన్ను నేను ఉత్సాహపరుచుకునేదాన్ని...


అలా అలా చిన్నవయసులోనే జీవితం అంతా అర్ధం అయింది అనిపించింది నాకు..... " అంది...పెదవులపై చిన్న చిరునవ్వు, కళ్ళల్లో చిరు చెమ్మ తో వందన...

జీవన్ ఎదురు కుర్చీలోంచి లేచి వచ్చి వందన తలపై ప్రేమగా చెయ్యి వేసి చెప్పాడు...


" వీనూ మరి ఇప్పుడు పెళ్ళి చేసుకునే సమయం వచ్చింది నీకు...చిన్నప్పటినుంచీ సరైన కుటుంబజీవితం లేని నీకు ఇప్పుడు నిండుగా కుటుంబసభ్యులు ఉండే ఇంటికి కోడలిగా వెళ్ళాలి అనే ఆశ ఉండటం సహజం కదా " అన్నాడు జీవన్...


ఊ అని నవ్వుతూ తలూపింది వందన..


" మరి వీనూ..నీకో మాట చెప్పాలి...మా అమ్మ నా నాన్నను కోల్పోయి ఇరవయి ఏళ్ళవుతోంది...నాన్న ఆర్మీ ఆఫీసర్...యుద్ధంలో చనిపోయారు...నాకు ఆరేళ్ళు అప్పుడు...అమ్మ చాలా ఏడ్చేది...ఒకరోజు నన్ను వళ్ళో కూర్చోపెట్టుకుని..కన్నా నువ్వు ఏ రోజూ, నాన్న కావాలి అని బాధపడకూడదు..నాన్న దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు...మనం ఆయన ప్రాణాలతో లేరని, మనకి తోడుగా లేరని మనం బాధపడద్దు...


ఆయన తన తల్లి భారతమాతకు తన ప్రాణాలు ధారపోసారని గర్వపడదాము...అదే మనం మీ నాన్నకు ఇచ్చే ప్రేమాంజలి...మనం ధైర్యం కూడకట్టుకుని నవ్వుతూనే బతకాలిరా " అని చెప్పి, నా వెన్నుతట్టి నాకు ఆధారమయ్యింది మా అమ్మ..


నాన్న వంతు ప్రేమ,ఆసరా కూడా అన్నీ తానే నాకు అందించింది...నాన్న లేరు అని బలహీనపడకుండా నాన్న కూడా తనలోనే ఉన్నారు అన్నట్టుగా రెట్టింపు బలంతో తనను తాను నిలబెట్టుకుని నన్ను నడిపించింది మా అమ్మ...


ఇప్పుడు నేనూ ఒక ఆర్మీ ఆఫీసర్ని వీనూ...నేనూ నా తండ్రిలా దేశం కోసం బ్రతుకుతాను, అవసరమైతే దేశం కోసం చనిపోతాను... " అని స్పష్టంగా చెపుతూ వందన వైపు సూటిగా చూసాడు.., వందన భావాలను అంచనా వేసుకునేందుకు...


వందన జీవన్ ని చూసింది...


ఇప్పుడు శెలవు మీద ఈ ఊరికొచ్చాను వీను...మళ్ళీ నాలుగురోజులకి నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి...నిజంగా ఈ ట్రిప్పులో నువ్వు నాకు ఇలా బంధంగా మారిపోతావని నేనసలు ఊహించనేలేదురా...


ఇప్పుడు నువ్వు నిర్ణయించుకునే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..బాగా ఆలోచించుకో వీనూ " అని అన్నాడు...


మనసు లోపల వీను దూరమైతే కష్టం అన్న బాధ సుడులుతిరుగుతున్నా , మెదడుతో బాగా ఆలోచించి వీను శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని స్థిరంగా వీనూని మంచీచెడు ఆలోచించుకోమని స్పష్టంగా చెబుతున్నాడు జీవన్ వందనకు...


అంతా విన్న వీను కాసేపు మౌనంగా ఉంది...

జీవన్ బాల్కనీలోకి వెళ్ళి నుంచుని బయటకు చూస్తున్నాడు...


వందన లేచి వచ్చి జీవన్ చెయ్యిపట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది....జానూ అని పిలిచి జీవన్ ని చూస్తోంది...ఏంటీ అన్నట్టు స్థిరమైన చూపులతో జీవన్ చూస్తున్నాడు వందనను...


" జానూ నీకు నేనంటే ఇష్టమా కాదా, అది చెప్పు, ముందు నువ్వు.. " అంది వందన...


" వీనూ అది కాదు ముఖ్యం...

నీ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం 

తీసుకోవటం ముఖ్యం ఇప్పుడు.. " అన్నాడు జీవన్...


" జానూ నీకు నేను ఇష్టమో కాదో ముందు తెలియాలి నాకు, అది చెప్పాలి కదా, ముందు నువ్వు.. " అంది వందన...


" నాకు దేశ సైనికునిగా దేశం మీద ఉన్న ప్రేమ మాత్రమే ఎక్కువ " అన్నాడు స్థిరంగా జీవన్...


" సరే అలానే, అది తగ్గించుకోమని అడిగేంత బాధ్యతలేని పౌరురాలిని కానులే నేను...నీకు నా మీద ప్రేమ ఉంటేనే కదా మన పెళ్ళికి అడుగులు పడేది..అందుకని అడుగుతున్నాను " అంది వందన...


" నా జీవితం శాశ్వతమో అశాశ్వతమో నాకు తెలీదు కదా వీనూ... " అన్నాడు కొంచెం బాధగా జీవన్...


వందనకు ఆ మాటలకు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి..అయినా సరే బయటపడకుండా 

ఐ లవ్ యూ జానూ అనేసింది వందన...

జీవన్ కూడా వెంటనే అప్రయత్నంగా 

ఐ లవ్ యూ టూ వీనూ అని చెప్పేసాడు...


వందన హాయిగా నోరారా నవ్వేసి జీవన్ చేతులు పట్టుకుని జీవన్ కళ్ళల్లోకి చూసి చెప్పింది...జానూ ప్రేమ పుట్టేది మన చేతుల్లో లేదు, ఆ ప్రేమ ఎవరిమీద ఉంటే వారితో గడిపే జీవితం ఎంతసేపు అయినా అది ఆనందదాయకమే...నాకెంత రాసిపెట్టి ఉంటే అంతవరకూ నీతో నా జీవితం..నా జీవనసహచర్యం నీతోనే...దేశం కోసం ఎంతో ఆలోచించే మీ కుటుంబంలో భాగం అవ్వటం, ముఖ్యంగా నా మీద నీకు ప్రేమ ఉండటం నాకు చాలా సంతోషమైన విషయం...అది చాలు నాకు...


నేను నువ్వు అత్తమ్మ అందరం కలిసి ఉన్నంతసేపు ఆనందం అంతా మనదే...ఒకవేళ దైవం నిన్ను నాకు దూరం చేస్తే నేను ఒంటరి అయిపోతాను అని నువ్వు పడే బాధ నిజమే..నువ్వు లేకుండా అనే విషయం నాకు చాలా బాధే...ఆ బాధ తరువాత ఎప్పుడో తట్టుకోలేనని, ఇప్పుడే నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇంకా నరకం...నీ నెచ్చెలిగా, నీ సగభాగంలా కొంతసేపు అయినా నేను బతికినా అది నాకు జీవితం మొత్తం ఆనందాన్ని మూట కట్టి ఇచ్చినట్టే....అని ఒక నిముషం ఆగింది వందన....


 ఏంటి వందన ఆలోచించేది, అని జీవన్

ఆతృతగా చూస్తున్నాడు వందనని...


వందన చెపుతోంది...జానూ ఒకవేళ భౌతికంగా నువ్వు దూరమైతే భరించడం నాకెంత కష్టమైనా మన ప్రేమ జ్ఞాపకాలతో నేను జీవితం గడిపేసే ధైర్యం తెచ్చుకుంటాను...అదే కాక ముఖ్యంగా ఇన్నేళ్ళూ ఒంటరిపోరాటం చేసిన అత్తమ్మకు నువ్వు కూడా లేని జీవితం ఇంకా బరువవుతుంది....అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిద్దాము...ఒకవేళ వస్తే ఆవిడకో తోడు ఉండాలి కదా....దేశం కోసం కనపడే పోరాటం చేస్తారు మీ సైనికులు...కనపడని పోరాటం చేసేది 

మీ సైనికుల కుటుంబసభ్యులు అని స్పష్టంగా అర్ధం అవుతోంది...అలాంటి ఒక అమ్మకు నేను కూతురుగా మారిపోతాను, ఎప్పటికీ వదిలిపోని తోడునవుతాను....దేశం కోసం పోరాడేవారికి నావంతు రుణం నేను తీర్చుకుంటాను...అంది స్థిరంగా వందన....


జీవన్ నిజమే కదా ఈ కోణంలో అమ్మకోసం నేను ఆలోచించలేదే అనుకుని...వందన నిజంగా జీవితాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంది అని తెలుసుకుని అంతులేని ఆప్యాయతతో వందనను ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు...ఇంకోసారి మనసారా ఐ లవ్ యూ వీనూ అని ప్రేమగా చెబుతూ......జీవన్ ని అపురూపంగా తన చేతులలో బంధించుకుంది ప్రేమతో 

వందన...


Rate this content
Log in

Similar telugu story from Romance