జీవనశైలి
జీవనశైలి
గుళ్ళోంచి విష్ణుసహస్రనామం వినిపిస్తోంది..
మర్రిచెట్టు మీద పక్షుల సందడి పెరగుతోంది..
నూతిలో చేద చప్పుళ్ళు వినిపిస్తున్నాయి..
మడిపంచె కట్టుకుని పువ్వులేరడానికి బయటకొచ్చారు సుందరయ్య గారు..
వంటింట్లోంచీ కాఫీ డికాక్షన్ వాసన, పాలు పొంగిన వాసన కలగలిపి ముక్కును తాకింది...
" వాణీ.. " పిలిచారు సుందరయ్యగారు..
కాలి పట్టీల చిరు మువ్వల సవ్వడితో, ' నాన్నా ' అని అంటూ బయటకొచ్చింది వాణీ..
" అతన్ని అమ్మ నోటినుంచీ కాపాడే బాధ్యత నీదే, సరేనా.. " అని కూతురిని హెచ్చరించి,
కూతురిచ్చిన చిక్కటి, కమ్మటి కాఫీ తాగేసి గుడికి బయలుదేరాడు సుందరయ్య..
వెనక్కి చూసింది వాణీ..
ఆరుబయట నులకమంచం మీద అప్పుడే చిరుగా మొదలైన సూర్యకిరణాలు తట్టిలేపుతున్నాయని విసుగ్గా లేచికూర్చున్నాడు వైభవ్..
వాణీ వైపు నిద్రమత్తు వీడని కళ్ళతో చూస్తూ
" గుడ్ మార్ణింగ్ " చెప్పాడు..
వాణీ నవ్వుతూ ' శుభోదయం ' అని జవాబిచ్చింది..
బెడ్ కాఫీ ప్లీజ్ అడిగాడు..
వాణీ ఏదో అనబోయి సరే ఇప్పుడే వద్దులే అనుకుని వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతోంది వాణీ..
" ఏమిటే.. ఇవాళ సాయంత్రం వరకూ నువ్వు ఏమీ తినకూడదు, తాగకూడదని మరిచిపోయావా " అని మందలించింది తల్లి సరళ.." గుర్తుందమ్మా " అంది వాణీ..
" మరి ఎవరికోసం ఆ కాఫీ "..అడిగింది సరళ..
" అమ్మా మాల కట్టమ్మా, ఇవాళ జాజిపూలు, కనకాంబరాలు కలిపికట్టు, ఎంత బావుంటుందో.. " చెబుతోంది వాణీ తల్లి ధ్యాసని మరల్చాలని, కాఫీ గ్లాసు తీసుకెళుతూ, ..
వెనకాలే వచ్చిన తల్లి, వాణి వైభవ్ కి కాఫీ అందించబోతే,
" వాణీ కాఫీ కిందపెట్టు, మరిచిపోతున్నావా ఆచారాలు, అతను స్నానం చెయ్యలేదు, నువ్వేమో ఉపవాసదీక్షలో ఉన్నావు " ..అరిచింది సరళ..
వాణీ ఇబ్బందిగా వైభవ్ వైపు చూసింది, అతను బాధపడతాడేమో అనుకుని..పక్కనున్న అరుగుమీద కాఫీగ్లాసు పెట్టింది, తీసుకోమని సైగ చేస్తూ..
" అబ్బాయ్ నువ్వు పెరడు వైపు రానే లేదు మొహం కడుక్కోనే లేదు, కాఫీ ఎలా తాగుతావు పాచినోటితో,.. " అంది కోపంగా సరళ వైభవ్ తో..
" అమ్మా " అని అంటూ తల్లిని వారించబోయింది వాణీ..
" ఆంటీ నేను రాత్రి పడుకునేముందే బ్రష్ చేసుకుని పడుకుంటాను, రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకుంటే పళ్ళకు మంచిది, అది పాటిస్తాను " అని చెప్పేసి కాఫీ తాగుతూ దూరంగా ఉన్న ఆవులనీ, ఇంకా దూరంగా ఉన్న తాటిచెట్లని చూస్తున్నాడు..
పదింటికి గుడికి బయలుదేరుతున్నారు ముగ్గురూ..
త్రీఫోర్త్ పాంటూ, టీ షర్ట్ వేసుకుని బయలుదేరుతున్న వైభవ్ ని చూసి " ఇదేం అవతారం పంచె కట్టుకోవటం నేర్పలేదా మీ నాన్న.. " అడిగేసింది సరళ..
" రాదండీ " అన్నాడు వైభవ్.." ఆ పక్కింట్లో రమణ ఉంటాడు అక్కడికెళ్ళి కట్టించుకో పో " అంది సరళ..వాణీ లోపలికి పరుగెత్తుకెళ్ళి పంచె ఒకటి తెచ్చి వైభవ్ చేతికిచ్చింది..
పంచెకట్టులో ఉత్తరీయం భుజాలచుట్టూ కప్పుకుని నడుస్తున్న వైభవ్ ఇబ్బందిపడుతున్నాడు, ఏదన్నా మంచి దృశ్యం ఫొటో తీసుకోవాలంటే ఉత్తరీయం భుజాల వెనక్కి జారిపోతోంది..
" వాణీ ఫొటో తియ్యవా ప్లీజ్ " అని ఫోన్ వాణికి ఇస్తున్నాడు..
ఉండొకసారి అని సరళ తన గొలుసుకున్న పిన్నీసు తీసి అతని ఉత్తరీయానికి రెండు అంచులూ దగ్గరికి కలిపి పిన్నీసు పెట్టింది, " ఏం మనిషివిరా నువ్వూ, ఇంత చిన్నపని కూడా చేతకాదు " అని కసిరింది..
" తిడితే తిట్టారు కానీ సూపర్ అయిడియా ఆంటీ మీది.. " అన్నాడు వైభవ్ ..
" ఇంకోసారి ఆంటీ అన్నావంటే ఆ వేపమండ తీసుకుని కొడతా " అంది సరళ బెదిరింపుగా..
" అమ్మా ఊరుకో " అంది వాణి..గుడిలో అన్నీ, ఫొటోలు తీస్తూ ఉన్నాడు వైభవ్..
" ఇదిగో ఇలా రా మంత్రాలు వినవూ, పూజ చూడవు..ఒకటే కుయ్ కుయ్ అని ఆ ఫొటోలు..ముందు రెండుచేతులూ జోడించి దణ్ణం పెట్టుకుని దేవుడిని చూడు, మనసు పూజమీద మంత్రాల మీదా లగ్నం చెయ్యి " అంది సరళ, ఫోన్ లాగేసుకుని అతని చెయ్యిపట్టి పక్కన కూర్చోబెట్టుకుంది సరళ..
అతను పూజ మీద శ్రద్ధపెట్టాడు..
" ఓం నమహ్ శివాయ అని అనుకుంటూ ఉండు " అని హితబోధ చేసింది.." ఓం నమహ్ శివాయ " అని అంటూ దేవుడిని చూస్తూ ధ్యానంలోకి వెళ్ళాడు వైభవ్ నెమ్మదిగా కళ్ళు మూతలుపడగా...
ఒకే లయలో ఒకే శ్రుతిలో మంత్రాన్ని పఠిస్తూ ఉంటే అతనికి శరీరం తేలికయినట్టుగా ఉండి, మంత్రం అతని నోటి వెంట శ్రుతిబద్ధంగా బయటకు వస్తోంది..అతనికే తెలీకుండా అయిదునిముషాల తరువాత నిశ్శబ్దం నిండిన గుడిలో అతని గొంతు వినిపిస్తూ ప్రతిధ్వనిస్తోంది..మనసుతో పలుకుతున్న అతని మంత్రపఠనం అతనిని ప్రశాంతంగా చేయడమే కాదు, వినేవారికి కూడా చెవులకు హాయిగా ఉంది..చాలాసేపు అలానే ధ్యానంలో ఉండి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు..అతనికి మంచిగా అనిపించింది..దేవునికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పక్కకు చూస్తే సరళ నవ్వుతూ చూస్తోంది..
" ఏరా పిచ్చిసన్నాసి ఎంత బాగా
పలికావురా మంత్రం " అని మెచ్చుకుంది..
అలా అతని పట్నం పోకడలు, సరళ పాతకాలం పద్ధతులూ పోటీ పడుతుండగా ఒక నెల గడిచిపోయింది..ఆవుల అంబారవాలు, బొగ్గులకుంపటి పై కాచే పాల సువాసనలు, మనకళ్ళ ముందు అప్పుడే కాస్తున్న టొమాటాలు, కాకరకాయలు, ఫ్రెష్ గా అప్పుడే కోసుకుని తినే తాటిముంజలు, కారం పుడుతున్నా కమ్మగా అనిపించే గోంగూర ఘుమఘుమలు, పండుమిరప కారాలు, ఏమక్కాయ్, ఏరా ..అనే సరదా పిలుపులు, చాలా విడ్డూరంగా విస్తుపోతూ చర్చించుకునే పట్నపోళ్ళ తరహాలు తాలూకు అమాయకపు, మూర్ఖపు కలగలపు మాటలు..హాయినిచ్చే ఆచారాలు కొన్ని, భయం పుట్టించే సంప్రదాయాలు కొన్ని..ఇలా ప్రక్రుతికి దగ్గరగా ఉండే పల్లె జీవితం ఒక నెలరోజులు గడిపాడు వైభవ్..
దూరంగా వస్తున్న తండ్రిని చూసి పంచెకట్టుతో పరుగెత్తుకెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు వైభవ్..
సుందరయ్య చెప్పాడు " ఏరా నీ కొడుకు మందు మాట ఎత్తితే ఒట్టు..సాయంత్రాలు వాణీ సంగీతం క్లాసులు చూస్తూ వినటం, హరికథలకి గుడికి వెళ్ళటం, మా ఆవిడ కాచే పప్పుచారు రెసిపీలు తెలుసుకోవడం " అని సుందరయ్య అంటుంటే.. " నువ్వు ఇంత ఇంగ్లీషా " అని హరి ఆశ్చర్యంగా సుందరయ్యని చూసాడు..
" మనోడు నేర్పించాడులేరా, మన అచ్చతెలుగు వాడికి మేము నేర్పితే ఇంగ్లీషు వాడు మాకు నేర్పాడు..మందైతే మానినట్టే " అన్నాడు సుందరయ్య..
" తల్లిలేని పిల్లాడని స్వేచ్చనిస్తే మందు అలవాటు దాకా వెళ్ళాడు, స్వతహాగా మాట వింటాడు, వ్యసనం కదా, వెంటపడి వేధించబోయింది..అయ్యో అనే నా బాధను చూసి నాన్నా నాకు మానాలని ఉంది, ఎలా మానాలో తెలీట్లేదు అని ఏడ్చాడు..
జీవనశైలి మార్చి చూస్తే అనిపించి, మీ దగ్గరికి పంపాను..ఇహ ఇప్పుడు వెనక్కి వెళ్ళాక చూడాలి ఏం చేస్తాడో " అని అన్నాడు హరి ఆప్యాయంగా వైభవ్ చేతులు పట్టుకుని..
" నాన్నా, ఇంక మందు ముట్టను, ఒకవేళ పొరపాటున ఎప్పుడన్నా తాగాననుకో, పెద్దమ్మకి ఫోన్ కలిపి, పెద్దమ్మతో ఫోన్ లో ఓ పదితిట్లు తిట్టించు దెబ్బకి మానేస్తాను.. " అని భరోసా ఇచ్చాడు వైభవ్ నవ్వుతూ వెళ్ళి సరళ వడిలో తలపెట్టి పడుకుంటూ..
తల్లిలేని పిల్లాడు తల్లిప్రేమకి ఆశపడుతున్నాడనిపించి హరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..కళ్ళు తుడుచుకున్నాడు..
" హరీ, ఎప్పుడు మీ ఇద్దరికీ ఇక్కడికి రావాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చెయ్యండి, ఇది మీ ఇల్లే కదర్రా " అంది సరళ వైభవ్ జుట్టు నిమురుతూ గొంతు ఏడుపుగొంతులోకి మారగా..
లేచి కూర్చుని తడి అయిన తన కళ్ళని సరళ చీరకొంగుతో తుడుచుకుంటూ అంటున్నాడు వైభవ్ " ..వస్తానమ్మా, నాకు ఎప్పుడు దిగులనిపిస్తే ఇక్కడికి వచ్చేస్తా, అప్పుడు వెన్నపూస అంతా నాకే పెట్టెయ్యి వాణీకి వద్దే వద్దు " అన్నాడు అల్లరిగా వాణీని ఉడికిస్తూ వైభవ్..
" పోరా ఇది మా అమ్మ " అంది వాణీ సరళని పట్టుకుని, " నువ్వే పో ఇది మా అమ్మ " అనేసాడు వైభవ్ తానూ సరళని పట్టుకుని..అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు..
" కధ కంచికి, మనమింటికి.. " ఇదివరకు కధల్లో ఇలా రాసేవారు కదా, ఎంత బావుంటుందో..

