STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

బంగారీ

బంగారీ

6 mins
26


ఏమిరోవ్ లెవు లెవు గేదె తాడు తెంపుకపోతా ఉంది..నీ దుంప తెగ నీ మొద్దునిద్ర పాడుగాను..

లే... అని మొగుణ్ణి పరుగులెట్టించింది పొద్దుపొద్దున్నే కమల...తల్లి గొంతుకి ఉలిక్కిపడి లేచింది బంగారి...


మెడిసిన్ చదువుతోంది బంగారి..తల్లి పది గేదెలు పెట్టుకుని పాడి చూసుకుంటూ ఓ హొటేలు నడుపుతూ ఉంటే, తండ్రి వడ్డీవ్యాపారం చూసుకుంటూ ..చిన్న పల్లెటూరులో ఉన్నా డబ్బు జాగ్రత్తగా బానే కూడబెట్టి కూతురు బంగారి ఇష్టానికి తగ్గట్టు పై చదువులు బానే చదివిస్తున్నారు కమల, ప్రసాద్..


బంగారి పట్టణంలో ఓ హాస్టల్లో ఉంటూ, 

మధ్యమధ్యలో తమ పల్లెకు తిరుగుతూ బాగా చదువుకుంటోంది...


ఆ ఊరిలో ఒక వీధంతా పెద్ద పెద్ద భవనాలు, ఆడమగ తేడా లేకుండా వంటినిండా బంగారాలు..బాగా ఉన్నదన్న దర్పం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది అక్కడ ఉండే మనుష్యుల్లో...


అలాంటి ధనిక కుటుంబంలో పుట్టాడు శివుడు...


బంగారి తల్లిలానే ధైర్యస్థురాలు..

మర్యాద ఇచ్చినంత వరకు ఇస్తుంది, 

ఏదన్నా తేడా వస్తే అమ్మోరే...


శివ, బంగారి సిటీ నుంచీ బస్సులో వచ్చిపోయేటప్పుడు పలకరించుకుంటూ ఉంటారు...


బంగారి ఊరిలో ఎనిమిది గదులతో చిన్న భవనం కట్టించమని తన తల్లిని అడిగింది..డాక్టరు చదువు అవగానే ఊర్లోనే వైద్యం చేస్తానని చెప్పింది..తన ఫ్రెండ్సులో కొందరిని తమ ఊరికి సహకార వైద్యులుగా వచ్చిపోతూ ఉండాలని వారితో ఒప్పందం కూడా తయారుచేసుకుంది..


తమ ఊరి బాగు కోసం తాను అన్నివిధాలా కష్టపడాలని ధృఢనిశ్చయం బంగారిది..


నాలుగేళ్ళు తిరిగాయి..హాస్పిటల్ ప్రారంభానికి ఊరందరినీ పిలిచారు కమల, ప్రసాదు..


శివ ఫామిలీ కూడా వచ్చింది..ఏంది కమలా నువ్వు గేదెల్ని సావగొట్టి పాలాపారం సేసి, ప్రసాదు మనుషుల్ని సావగొట్టి వడ్డీయాపారం సేసి బాగా మూట కట్టారుగా..కొత్త హాస్పిటలు, కొత్త డాక్టరమ్మా మాంచి జోరు మీదున్నారుగా ముగ్గురూనూ అంది అనూరాధ అసూయగా, హేళనగానూ...


మామూలుగా నోరేసుకునిపడే కమల ఆ రోజు తన కూతురి చిన్ననాటి కల తీరిన రోజని ప్రశాంతంగా అన్నీ జరగాలని ఒక నవ్వు నవ్వుతూ అనూరాధని చూసేసి ఊరుకుంది కుర్ఛీలో కూర్చోండి అని సైగ చేస్తూ...


శివ హాస్పిటల్ అంతా చూసి బంగారికి చెప్పాడు..బాగా అరేంజ్ చేసావే..నీకు హాస్పిటల్ ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలంటే ఓ మేనేజర్ కావాలిగా నేనుంటాలే..ఎంతైనా ఒకే ఊరువాళ్ళంగా అన్నాడు...


సరే అన్నట్టు తలూపింది బంగారి..బంగారికి అన్ని పనులకి తోడుగా మయూరి కుదిరింది..పదో తరగతి వరకు చదివి తల్లితండ్రికి స్థోమత లేక చదువు ఆపేసింది మయూరి..


బంగారి, మయూరికి ప్రైవేటుగా ఇంటరుచదువుకి డబ్బులు కట్టింది..హాస్పిటల్ లో కేవలం కనీసపు 

ఫీజు మాత్రమే వసూలు చేస్తూ మంచి వైద్యం ఇస్తుంది బంగారి, ఊరిలో పిల్లలకి చదువులో సాయం చేస్తూ ఉంటుంది బంగారి...


ఆ రోజు, ఇంటర్ పరీక్షలకు చదువుకుంటోంది మయూరి...అప్పుడే పేషంట్స్ అందరినీ చూడటం అయ్యి అలసటగా కళ్ళు మూసుకుంది బంగారి..


చదువుతున్న మయూరి పరుగెత్తుకెళ్ళి వాంతి చేసుకుంటోంది..బంగారి వెళ్ళి చూసింది..

మొహం, నోరు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చుని మయూరి చెబుతోంది తల తిప్పుతోంది అక్కా అని...


మయూరి పల్సు చూసింది బంగారి...ఏమిటి మయూరి నీకు ఇంకా ఎలా ఉంది వంట్లో అడిగింది బంగారి..మళ్ళీ వాంతి చేసుకుంది మయూరి..కళ్ళు తిరుగుతున్నాయక్కా అంది మయూరి...


మయూరి నీకు ఏ అబ్బాయితో పరిచయం ఉంది, ఎవరినన్నా ప్రేమించావా అంది బంగారి..అక్కా అని కళ్ళు పెద్దవి చేస్తూ భయంగా చూసింది మయూరి..సమాధానం చెప్పు మయూరి ఏ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు అని స్పష్టంగా స్థిరంగా అడిగింది బంగారి..


చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది మయూరి..చెప్పు మయూరి అని గట్టిగా అడుగుతూ పక్కన ఉన్న గ్లాసుని విసిరికొట్టింది బంగారి కోపంగా...మయూరి ఏడుపు ఆపేసి తల పైకెత్తి బంగారి వైపు చూస్తోంది...


బుద్ధి రాదా మీకు రోజూ పేపర్లో, టీవీల్లో ఇన్ని వార్తలు వస్తుంటాయి ఆ అమ్మాయి అలా మోసపోయింది, ఈ అమ్మాయి ఇలా మోసపోయింది అని..అయినా సరే ఇలా పిచ్చి పనులు చేస్తుంటారు ఎందుకు అని కోపంగా అడిగింది బంగారి... 


మోసం అని ఎందుకంటావు అక్కా, అతను నన్ను పెళ్ళి చేసుకుంటాడు అంది మయూరి..పెళ్ళి తరువాత చెయ్యాల్సిన పని ముందే పద్ధతి తప్పి చెయ్యటం మీ ఇద్దరూ చేసిన తప్పు, మోసం కాదా..పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు పద్ధతిగా పెళ్ళికి దారులు వేసుకోవాలి కానీ, ఇలా స్వార్ధపు పనులు చెయ్యరు అంది బంగారి..


ఇంతకీ ఎవరు అంది బంగారి..శివ అని చెప్పింది మయూరి...ఛీ మీరు హాస్పిటల్ లో వెలగబెట్టే పనులు ఇవేనా అడిగింది బంగారి చిరాకుగా...లేదక్కా..నీకు ఈ హాస్పిటల్ ఒక దేవాలయంతో సమానం అని నాకు తెలుసు...


మేము కిందటినెలలో ముంబాయి వెళ్ళాము..నాలుగు రోజులు శివా నాకు ముంబాయి అంతా తిప్పి చూపించాడు తెలుసా అని గొప్పగా చెప్పబోయింది మయూరి..


మీ అమ్మానాన్నకి తెలుసా నువ్వు శివా ముంబాయి వెళ్ళినట్టు అడిగింది ఆశ్చర్యంగా బంగారి..లేదక్కా ఇద్దరం సరదాగా దొంగచాటుగా వెళ్ళొచ్చాము, ఎంత బావుందో అలా వెళ్ళిరావటం అని కలల్లో తేలిపోతున్నట్టుగా చెబుతోంది మయూరి..


తలపట్టుకుంది బంగారి..మరి ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు, మరేమి చేస్తావు అంది బంగారి...


అదే శివని అడుగుతాను అని ఫోన్ చేయబోయింది మయూరి..అరే ఆగు ఫోన్ లో కాదు, ఇక్కడికి అతను వచ్చినప్పుడు అడుగుదువు గానీ..నేను పనుంది రమ్మని అడుగుతాను శివని, నువ్వు తొందరపడి ఫోన్ చెయ్యకు, మెస్సేజ్ పెట్టకు ఇదీ విషయం అని ..అని చెప్పింది బంగారి..ఊ అని సరే అన్నట్టు తలూపింది మయూరి అర్ధం అయ్యీ అవ్వనట్టు..


శివ వచ్చాడు..శివకి పని గురించి చెబుతోంది బంగారి..బంగారి మాటలు వింటూనే మయూరికి నవ్వులు విసరటం, ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వటం చేస్తున్నాడు సైలెంటుగా శివ..ఇదివరకు అస్సలు ఇవన్నీ ఏ రోజూ గమనించుకోలేకపోయింది బంగారి...ఈ రోజు అవన్నీ తలెత్తి చూడకపోయినా అర్ధమయిపోతుంటే కంపరంగా అనిపించింది బంగారికి..


సరే నేను వైరల్ ఫీవర్ పేషేంటుని చెక్ చేసి వస్తాను అని లేచి వెళ్ళింది బంగారి..మయూరి వెంటనే శివ దగ్గరికి వచ్చి శివా పొద్దున్న నాకు వంట్లో బాగోలేదు, బంగారి చెక్ చేసి చెప్పింది, నేను తల్లిని కాబోతున్నానని..అంది మయూరి..ఏంటీ అన్నాడు ఆశ్చర్యంగా, భయంగా శివ..ఎ ఎ ఎవరని అడిగిందా బంగారి నిన్ను అన్నాడు శివ..అవును, నేను మన ముంబాయి ప్రయాణం గురించి చెప్పాను అంది మయూరి...అయ్యో ఇప్పుడెలా అన్నాడు శివ..


ఏమయింది మీ ఇంట్లో నువ్వు చెప్పు మా ఇంట్లో నేను చెప్తా మనిద్దరం ప్రేమించుకున్నాము, మనకి పెళ్ళి చేయమని అని చెప్పింది మయూరి..చెబుదాము, కానీ కొంత కాలం ఆగి చెప్పాలి అనుకున్నాను, మా చెల్లికి పెళ్ళిసంబంధం చూస్తున్నారు, ఇప్పుడు మనవిషయం చెప్పటం సమస్య అవ్వచ్చు, కానీ చెప్పాలి తప్పదు, ఏమి గొడవలు అవుతాయో అన్నాడు శివ అసహనంగా తల పట్టుకుంటూ..


సరే ఇప్పుడే చెప్పద్దులే, మీ చెల్లి పెళ్ళి అయ్యాక చెబుదాము, వీలయినంతవరకూ వేచి చూద్దాం అంది మయూరి..ఎలా మయూరి ఇంకో నెలా రెండునెలలకి మీ ఇంట్లో తెలిసిపోతుంది,ఈ లోగా చెల్లిపెళ్ళి కుదురుతుందో లేదో..ఎలా ఇప్పుడు అన్నాడు కంగారుపడుతూ శివ..


మనం చెప్పకముందే ఇళ్ళల్లో తెలిసిపోతే మంచిది కాదు, మనమే ముందు చెప్తే బావుంటుంది అన్నాడు శివ ముందుకంటే కొంచెం కుదుటపడుతూ...


శివా అని పిలిచింది బంగారి రూం లోకి వస్తూ..అప్పటివరకూ వారి అన్నిమాటలూ వింటూనే ఉంది ఎక్కడ శివ మయూరికి అన్యాయం చెయ్యాలనుకుంటాడో అని...ఇప్పుడైనా అతను ఎంతవరకూ మయూరికి న్యాయం చేస్తాడో తెలియట్లేదు బంగారికి..


శివ బంగారిని చూసాడు..సిగ్గుగా తల పక్కకు తిప్పేసుకున్నాడు..శివా ఇలా తొందరపడటం ఏమీ బాలేదు, ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుని ఇద్దరిజీవితాలు పాడవకుండా చూసుకోండి అంది బంగారి..


మర్రోజు మయూరి పనిలోకి రాలేదు..మద్యాహ్నానికి ఒక బాబు పరిగెత్తుకొచ్చి చెప్పాడు..అనూరాధ పంపించిన కొందరు మనుష్యులు వచ్చి మయూరి ఇల్లు తగలబెట్టేసారు, మనుషులు ముగ్గురూ బతికిబయటపడ్డారు కానీ..వారి సామానంతా బూడిదయిపోయింది అని...బంగారి వెళ్ళింది..మయూరి తల్లి బంగారికి చెప్పింది ఏటి సెయ్యాల తల్లీ ఇప్పుడు, ఈ ముదనష్టపుది ఇంత పాడుపని సేసింది...అంటూ..


శివకి ఫోన్ చేసింది బంగారి..మయూరి ముందురోజు వాళ్ళ అమ్మకి అంతా చెప్పేసిందని, వెంటనే మయూరి తండ్రి ఇంటికొచ్చి తన పేరెంట్సుకి చెప్పాడని, వారు కోపంతో ఈ రోజు మయూరి వాళ్ళ ఇల్లు తగలెట్టేసారని చెప్పాడు...


మరిప్పుడెలా శివా అడిగింది బంగారి..మయూరిని పెళ్ళి చేసుకుంటానని తన తల్లితండ్రికి చెప్పానని వారు ఒప్పుకోవట్లేదని చెప్పాడు శివ..అయినా సరే నేను మయూరినే తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను, తన తల్లితండ్రి ఒప్పుకునేదాకా ఎదురుచూస్తానని చెప్పాడు శివ..


కనీసం శివ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదులే అని బంగారి అర్ధం చేసుకుని మయూరి తల్లితండ్రికి ధైర్యం చెబుతోంది, కొన్నిరోజులు ఓపికపట్టమని సర్ది చెబుతోంది..మయూరి పక్కనుంచీ గొప్పగా మాట్లాడుతోంది నేను చెప్పాను కదా శివ నాకోసం ఏదయినా చేస్తాడని, మాది గొప్ప ప్రేమ అని చెబుతుంటే బంగారికి ఎక్కడలేని కోపం వచ్చింది..లేచి నుంచుని లాగిపెట్టి మయూరి చెంప మీద ఒక్కటిచ్చింది...


గొప్ప అనుకుంటున్నావా..చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని చేస్తున్న నీ ప్రవర్తన చిరాకుగా ఉంది, రేపు నీ పుట్టే బిడ్డకి నీ తొందరపాటు గురించి ఇంతే గర్వంగా చెప్పు, తనూ నీలానే పదహారేళ్ళకే తొందరపడాలని పాఠం నేర్చుకుంటూ పెరుగుతుంది లేదా పెరుగుతాడు...జీవితాన్ని మంటల అంచుల్లో నిలబెట్టుకుని కాలుతానా లేదా అన్నట్టు ఆటలాడుకుంటున్నావా...


చదువు చెప్పిస్తా అన్నాను, నా హాస్పిటల్ బరువుబాధ్యతలు నిర్వహించేలా నిన్ను తయారుచేసి నీకూ ఒక మంచిస్థానం కల్పించాలి అనుకున్నాను..ఆడపిల్లలమైనా మన ఊరుని గర్వంగా నిలబెట్టే రెండు గట్టి స్థంభాలు లాగా మనం తయారు అవ్వాలి అనుకున్నాను...ఈ రోజు నీ జీవితాన్నే ఎలా నిలబెట్టుకోవాలో తెలీని స్థితిలో ఉన్నావు నువ్వు..


వయసులో ప్రేమలో పడటం గొప్ప కాదు..ప్రేమను నిలబెట్టుకుంటూనే నీ వ్యక్తిత్వాన్ని కూడా మంచిగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం అంతకంటే గొప్ప అని తెలుసుకోలేకపోయావు...


ఇప్పటికీ నీకు నేను అన్నివిధాలా ఆదుకుంటాను, కానీ జీవితాన్ని పద్ధతిగా ఎలా నడుపుకోవాలో, సరైన విలువలతో ఎలా మలుచుకోవాలో అది ముందు తెలుసుకో నువ్వు...అంది బంగారి మయూరి చెంపలపై కారే కన్నీరు తన చేతులతో తుడిచి..తను కొట్టిన దెబ్బకు మయూరి చెంపపైన పడ్డ ఎర్రచారలను తన కర్చీఫుతో మెత్తగా అద్దుతూ ఒక అచ్చమైన అక్కలా మయూరిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది బంగారి..


ఆ రోజు బంగారి, కమల, ప్రసాదు, మయూరి తల్లీతండ్రీ కి తోడుగా, వారికి మేమున్నాం అండగా అన్నట్లుగా, అందరూ కలిసి శివ వాళ్ళింటికి వెళ్ళారు..గుమ్మంలోనే అనూరాధ గట్టిగా కేకలువేసింది..మీలాంటివాళ్ళతో సంబంధం మాకొద్దు అని తెగేసి చెప్పింది..శివ కూడా తల్లి మాటలు సహనంగా వింటూ ఉండీ, చివరలో స్థిరంగా చెప్పాడు...


అమ్మా నేను మయూరిని పెళ్ళి చేసుకోవాల్సిందే, తను నా బిడ్డకు తల్లి కాబోతోంది..ఈ పది నెలలలో మీరు మీ మనసులకి దయచేసి సర్దిచెప్పుకోండి..మయూరిని నా భార్యగా ఒప్పుకోండి, మా పెళ్ళికి ఒప్పుకోండి..నిజమే మేము తొందరపడటం తప్పే, కానీ ఈ తప్పు చేయకపోయినా ఎప్పటికైనా నేను మయూరినే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను..వాళ్ళ ఇల్లు తగలబెట్టించి మయూరిని లేకుండా చేద్దామనుకుంటే నేను బతికి ఉన్నా కూడా ఒంటరిగా ఏడుస్తూ మిగిలిపోతాను..మీకూ కొడుకు ఉండీ బతికున్న శవంలా మిగులుతాను..నా మనసుకి నచ్చిన అమ్మాయిని నా జీవితంలోకి రానివ్వండి ప్లీజ్ అమ్మా ప్లీజ్ నాన్నా అని ఏడ్చేసాడు అనూరాధ చేతుల్లో మొహం దాచుకుని...


ఛీ ఛీ హాస్పిటల్ పెట్టావా మేరేజి ఆఫీసు పెట్టావా మహాతల్లీ..నీ ఊరు ఉద్ధరణ అంటూ కులాలను మతాలను కలిపేసుకోమంటావా అని అటు తిరిగి ఇటు తిరిగి బంగారీ మీద యుద్ధం మొదలెట్టింది అనూరాధ..


బంగారి ఓపికగా అన్నీ భరిస్తోంది..ఆవేశపడబోయిన తల్లి చెయ్యి గట్టిగా పట్టుకుని వద్దని కళ్ళతోనే వారించింది తల్లిని...


శివ కూడా కళ్ళతోనే సారీ అన్నట్టు చూసాడు బంగారి వైపు..


మయూరి ఇంటర్ పరీక్షలు బాగా రాసేలా ప్రోత్సహించింది బంగారి..మయూరికి పరీక్షల్లో మంచిమార్కులు వచ్చాయి..బాంకు ఎక్జామ్స్ రాయించింది బంగారి మయూరితో...క్లర్కు ఉద్యోగం వచ్చింది మయూరికి..మంచి జీతం..


నెలలు నిండి లక్షణమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది మయూరి..అమ్మా నా కూతురిని చూద్దాం పదమ్మా అని శివ అనూరాధని తీసుకొచ్చాడు ..మనవరాలుని ఎత్తుకోవటానికి మనసు ఉన్నా కోపం తగ్గలేదు అనూరాధకి..ఇదేరా మీ పిల్లల పొగరు..అసలు కంటే వడ్డీ ముద్దవుతుందని ఇలాంటి వెధవ ప్లానులు చేసేస్తున్నారు మీ కాలం పిల్లలు, మీ బుట్టలో నేనేమీ పడను అంది అనూరాధ...అమ్మా ఎప్పటికైనా నేను మయూరి కోసమే ఎదురుచూసేవాడినని చెప్పానుగా, ఇవేమీ నాటకాలు కాదులేమ్మా..నీ మనవరాలుని ఆశీర్వదించు, ముద్దు చెయ్యి అన్నాడు శివ తల్లిని బతిమలాడుతూ...అనూరాధ నెమ్మదిగా తనకు తాను సర్ది చెప్పుకుని..పాపను ఎత్తుకుంది..పాప నుదుటిన ముద్దు పెట్టింది..దీప్తి అని పేరు పలుకుతూ పాపను (దీప్తీని) గుండెలకు హత్తుకుంది..ఆ నాన్నమ్మ మనవరాళ్ళ కలయికను చూసి మయూరి శివ ల కళ్ళు ఆనందంతోనో, అన్నిరోజుల మానసిక ఒత్తిడి నుండి ఊరట పొందినందుకో.. నీళ్ళ తో నిండిపోయాయి...తన వైపు చూసిన అనూరాధకు గౌరవంగా చేతులు జోడించింది మయూరి...అనూరాధ మౌనంగా తల పక్కకు తిప్పుకుంది..బహుశా ఇంకొంచెం సమయం పడుతుంది సర్దుకోవటానికి అనూరాధకు...


గ్రామీణ బాంకులో ఉద్యోగం చేస్తూ పాపను 

ముద్దుగా పెంచుతోంది మయూరి, బంగారి ఆశయాలకు తోడుగా నడిచేంత 

పరిణితి వచ్చింది మయూరికి ఇప్పుడు ..


బంగారి హాస్పిటలుకి ఇంకో అంతస్థు 

కట్టించింది ఎప్పట్లానే ఉన్న, తన తల్లి తండ్రి సహాయసహకారాలతో..


శివ ఊరి అవసరాలకు తన చదువుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయగలుగుతున్నాడు...


మొత్తానికి ఆ ఊరికి మూడు మట్టిలో మాణిక్యాలు దొరికాయి, ఊరు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తోంది.


Rate this content
Log in

Similar telugu story from Classics