STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తరంగం

తరంగం

3 mins
335


ఒక అమ్మమ్మ, ఏడేళ్ళ మనవరాలు, తొమ్మిదేళ్ళ మనవడు.... ఒక మాల్ లో సరుకులు కొనటానికి వెళ్ళారు. అమ్మమ్మ ట్రాలీ తోస్తోంది..మనవడు రోజువారీ సరుకులు అరల్లోంచి తీసి ట్రాలీలో పెడుతున్నాడు..ఏడేళ్ళ వర్ష మాత్రం ప్రత్యేకమైన బిస్కెట్ పాకెట్లు అరలోంచి తీసి వాటిమీద ధర చూసి వద్దులే అనుకున్నట్టు తల ఊపి మళ్ళీ తిరిగి అరలో పెట్టేస్తోంది..వర్ష ఇబ్బంది చూసి అమ్మమ్మ...వర్షా..తాతయ్యకు ప్రత్యేకంగా ఏదన్నా తీసుకున్నావా లేదా అని అడిగింది..ఇది విని వర్ష వెంటనే ఫ్రూట్ కేక్ పెట్టే చల్లని అరల దగ్గరకి పరుగెత్తుకెళ్ళి అరల్లో చూస్తోంది...పై అరలో ఉన్న ఒక కేక్ వర్షకు తీసుకోవాలి అనిపించింది...ఇంతలో ఒక యువకుడు వచ్చి అదే కేక్ ను అరలోంచి..చేతిలోకి తీసుకున్నాడు...చిరుకోపం కళ్ళల్లో నిండగా అతన్నే సూటిగా చూస్తోంది వర్ష...ఈ కేక్ నీకు కావాలా ఏంటీ...అని అడిగాడు సత్య, ఆ యువకుడు...అవునన్నట్టు తను వేసుకున్న రెండు పోనీటైల్ జడలు కదిలేలా తల ఊపింది వర్ష..సరే నువ్వే తీసుకో అని కేక్ వర్షకిచ్చేసాడు అతను...బిల్ వేసింది కౌంటర్ లో అమ్మాయి..250 రూపాయలు బిల్ అయ్యింది...అమ్మమ్మ తన దగ్గర డబ్బులు లెక్కపెట్టింది..తక్కువ పడుతున్నాయి..మనవడు కూడా తన దగ్గర ఉన్న డబ్బులు లెక్క చూసాడు..అవి 30 రూపాయలు ఉన్నాయంతే...చాలవన్నట్టు మనవడు తల అడ్డంగా ఊపి అమ్మమ్మకి సైగ చేసాడు.. కౌంటర్ లో అమ్మాయిని అమ్మమ్మ అడిగింది...కేక్ వాపసు ఇవ్వచ్చా అని..సరే అంది ఆ అమ్మాయి...


వర్ష అలిగినట్టు బుంగమూతి పెట్టి అమ్మమ్మ దగ్గరికి వచ్చి...అమ్మమ్మా కిందటిసారి కూడా నువ్వు కొనలేదు...ఈ సారి నాకు ఇంకేమీ కొనిపెట్టద్దులే...ఆ కేక్ ఒక్కటీ తీసుకో..తాతయ్య కోసం అంది గారాబంగా వర్ష...లేదమ్మా ఈ సారి కొందాము..నా మాట విను చిట్టితల్లీ అంది బతిమలాడుతూ అమ్మమ్మ...


కేక్ కవర్ వెనక్కి ఇచ్చేసి మిగిలిన సరుకులకి బిల్లు కట్టేసి వెళ్తున్నారు అమ్మమ్మ వర్ష మనవడు...ఇదంతా చూస్తున్న సత్య..కౌంటర్ లో అమ్మాయిని అడిగాడు...ఇది వాళ్ళకు కావాలి కదా అని..అవును అంది అమ్మాయి..సరే డబ్బులు నేను కడతాను..కేక్ ఇవ్వండి..అని కేక్ కొనుక్కుని...పరిగెత్తుతూ వర్ష ముందుకి వచ్చి...కేక్ తీసుకో బంగారుతల్లీ అన్నాడు..వర్ష అమ్మమ్మ వైపు చూసింది...అమ్మమ్మ కొంచెం గాభరాగా ఇష్టం లేనట్టుగా...వద్దు బాబు..మేము తీసుకోలేము..మాకు అలా ఇష్టం ఉండదు..అని చెప్పింది...పర్లేదండీ..అని సత్య పెద్దావిడకు సర్దిచెప్పబోయాడు...


అసలు నువ్వు ఏ కారణంతో మాకు కొని ఇస్తున్నావు..ఏంటి అవసరం..అని మందలించింది సత్యని అమ్మమ్మ...లేదు పెద్దమ్మా..నేను ఒకరికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంది...అది ఇలా చెప్తున్నాను అన్నాడు...ఇంకా చెబుతూ...నన్ను ఇలా చేయవలసిందిగా ఒకరు చాలా కాలం కిందట కోరారు...అని స్పష్టంగా, స్థిరంగా చెప్పాడు...కావాలంటే వర్ష కూడా ఇవాళ నేనిచ్చిన కేక్ తీసుకుని సంతోషపడినట్టే...తను కూడా ఎవరికైనా అవసరం లో సాయపడి సంతోషాన్ని అందించాలి...వర్షా...అలా చెయ్యగలనని, చేస్తాను..అని నాకు మాట ఇస్తావా..ప్రామిస్ చేస్తావా...అని వర్షను అడిగాడు...ముందు అర్ధం అయ్యీ అవనట్టు అయోమయంగా చూసిన వర్ష...ఒక నిముషం ఆలోచించి...సరే అన్నా తప్పకుండా చేస్తాను అంది ముద్దు ముద్దు మాటలతో...సరే బాబు అలా అయితే నాకు నీ చిరునామా ఈ కాగితం మీద రాసి ఇవ్వాల్సిందే...నేను నీ డబ్బులు ఇవ్వగలిగినప్పుడు ఆ అడ్రెస్ కి డబ్బులు పంపిస్తాను అని అమ్మమ్మ సత్యకు ఒక కాగితం ఇచ్చింది...సత్య నవ్వేస్తూ...సరే పెద్దమ్మా అని కాగితం మీద రాసి ఇచ్చాడు...


అమ్మమ్మ ఆ కాగితం చేతిలో పెట్టుకుని..పిల్లలతో ఇంటికి వెళ్ళింది...హాల్ లో చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న తాతయ్య దగ్గరకు పరిగెత్తుకొచ్చి వర్ష కవర్లోంచి కేక్ బయటకు తీసి చూపిస్తూ...హేయ్ తాతయ్యా నీ పుట్టినరోజు కేక్...అని కేరింతలతో తాతయ్యకు చెప్పింది...తాతయ్య చిన్నగా నవ్వి ఓ... ఇది నాకు చాలా ఇష్టమైన కేక్ అన్నారు...మనవడు కూడా తాత దగ్గరికి వచ్చి...అందరం కేక్ తిందాం తాతయ్యా అన్నాడు...సరే సరే ముందు చేతులు కాళ్ళు కడుక్కునిరండి అంది అమ్మమ్మ...పిల్లలిద్దరూ సరే అని లోపలికి వెళ్ళారు...తాత అమ్మమ్మను చూసి... డబ్బు మొత్తం ఖర్చు పెట్టకుండా ఉండాల్సిందిగా అన్నారు...లేదు లేదు...ఈ కేక్ మాత్రం ఒక అతను కొనిచ్చాడు...డబ్బులు ఉన్నప్పుడు పంపిస్తా అని అడ్రెస్ ఇప్పించుకున్నాను అని మాల్ లో జరిగినదంతా వివరంగా చెప్పి భర్త చేతికి...ఇదుగో అడ్రెస్ అని సత్య రాసి ఇచ్చిన పేపర్ ఇచ్చింది...తాత పేపర్ తెరిచి చూసారు...


ఒక చిన్న శ్రద్ధతో కూడిన సహాయక చర్య అనేక తరంగాలను సృష్టించి మళ్ళీ మనదగ్గరకే తిరిగొస్తుంది...అని రాసి ఉంది...తాతకు గతం గుర్తొచ్చింది...ఒక ఎనిమిదేళ్ళ చిన్న బాబు అరల్లోని కేకులు చూస్తూ ఒక కేక్ ఎంచుకున్నాడు తీసుకోవాలని...పక్కనే ఉన్న అమ్మని అడిగాడు..అమ్మా నాకు ఈ కేక్ ఇప్పించవా ప్లీజ్ అని...ఆవిడ పర్స్ తెరిచి చూస్తే సరిపడా డబ్బులు లేవు...వేరేది తీసుకుందాము నాన్న తక్కువ ధరలో...అని బాబుని అడుగుతోంది...అమ్మా నేను ఎప్పుడూ ఇలా అడగలేదు కదా ఇవ్వాళ నా పుట్టినరోజు...నాకు ఆ కేక్ మాత్రమే తినాలనుంది...అని బతిమలాడుతున్నాడు....అప్పుడు ఈ తాతగారు అదే బేకరీలోకి వచ్చారు బిస్కెట్లు కొనుక్కోవటానికి...ఇదంతా విన్నారు...ఆ బాబు అడిగిన కేక్ కొని బాబు చేతికిచ్చి...పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు అని బాబు తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించారు...బాబు తల్లి కాదనలేకపోయింది బాబు సంతోషం పాడు చేయటం ఇష్టం లేక......మీ అడ్రెస్ రాసివ్వండి...నేను డబ్బులు పంపిస్తాను అంది...బాబు కూడా అవునన్నట్టు నవ్వుతూ తాతని చూస్తున్నాడు...ఒక పేపర్ మీద ఇవే వాక్యాలు రాసి బాబు చేతికిచ్చి బేకరీ బయటకు వెళ్తున్నారు...బాబు పేపర్లో రాసింది చదివి...వెళుతున్న ఆయన వైపు చూస్తున్నాడు...ఆయన గుమ్మం నుంచి వెనక్కి తిరిగి బాబుని చూసారు...తృప్తితో వెలిగిపోతున్న బాబు మొహం చూసి ఆయన ప్రశాంతంగా , నిర్మలంగా నవ్వారు...బాబు దూరం నుంచే ధన్యవాదాలు అని చెప్పాడు...అది ఆయనకు వినపడలేదేమో అని బాబుకి అనిపించింది..



Rate this content
Log in

Similar telugu story from Classics