ప్రస్తుతం
ప్రస్తుతం


రాధిక ఒక గుడిలో చెట్టుకి ఆనుకుని కూర్చుంది..ఆమెని చేదుజ్ఞాపకాలు వెంటాడుతున్నాయి, బాధగా కళ్ళు మూసుకుంది..మనసు కదిలినట్టయ్యింది, కళ్ళనుంచీ నీళ్ళు జారిపోతున్నాయి..తనకిష్టమైన దేవుడిని ఆసరాగా తలుచుకుంది..
ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా ..అని పాడుకుంటూ మనసుకి ఓదార్పు పొందుతోంది, తనను తాను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తోంది..కళ్ళు మూసుకుని తలను మోకాళ్ళమీదకి పెట్టుకుని పాట పాడుతూ ఉంది..
అలా ఒక పాట తరువాత, ఒక పాట పాడుకుంటోంది..అలా పాటలను గుర్తు తెచ్చుకుంటూ, పాడుకోవటంలో బాధను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తోంది...
అమ్మా ఎవరు తల్లి నువ్వూ అని ఓ మృదువైన గొంతు వినపడింది..కళ్ళు తెరిచి చూసింది..ఎదురుగా పూజారి, చుట్టూ ఒక పదిమంది భక్తులు కూర్చుని ఉన్నారు..అందరూ భక్తిగా చేతులు జోడించి ఉన్నారు..ఎంత బాగా పాడావమ్మా..పాటల్లోని నీ భక్తిపారవశ్యానికి, వింటున్న మేమూ ఇక్కడనుంచీ కదిలి వెళ్ళలేకపోయాము..మా అందరి మనసుల్లో ఒక ప్రశాంతత నింపిందమ్మా నీ గానం..రోజూ పొద్దున్న, సాయంత్రం ఒక గంటసేపు మైకు ముందు ఇలానే పాడుతావా తల్లీ, నీతో పాటూ మేమూ కాసేపన్నా మనశ్శాంతిని పొందుతాము అని అడుగుతున్నాడు పూజారి కారుణ్య..
రాధిక రోజూ గుడిలో పాడుతూ కొంచెం కొంచెంగా మనశ్శాంతిగా బతకుతోంది..నెలకింతా అని జీతం దొరుకుతోంది..భక్తులు చాలామందికి రాధిక ఓ ఆత్మబంధువు అయింది..కారుణ్య, రేవతిల కూతురు పల్లవికి రాధిక చాలా దగ్గరయ్యింది..రాధిక పాటలు విని పల్లవి కూడా మధ్యలో తన బుజ్జిగొంతుతో దేవుని పాటలు పాడుతుంటే చాలా బావుంటుంది..
విశ్వా ఆ రోజు గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నాడు..రాధిక గొంతు స్పీకర్లలో మధురంగా వినిపిస్తోంది..దేవునికి దణ్ణం పెట్టుకుని అందరితో పాటు పాట దగ్గర కూర్చున్నాడు..పాడుతున్న రాధికను చూసాడు..ఏయ్ నువ్వా , నువ్వేంటి ఇంత పవిత్రమైన గుడిలో, చీ ఛీ ఆమె మంచిది కాదు, ఆమెని గుడిలోకే రానియ్యకూడదు, అలాంటిది ఆవిడ చేత దేవునికి పాటలు పాడిస్తున్నారా అని గట్టి గట్టిగా అంటూ పూజారికి చెబుతూ నించున్నాడు..రాధిక మొహం ఎర్రబారిపోయింది..చుట్టూ ఉన్న జనాలు ఏంటిది అని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు..
కారుణ్య విశ్వతో అన్నాడు..మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు..పదండి అలా వెళ్ళి మాట్లాడుకుందాము అన్నాడు..
ఏం ఇక్కడ మాట్లాడితే ఏమయ్యింది..ఆమె రాధిక, మా ఊరిలోంచీ తరిమేస్తే ఇక్కడొచ్చి వాలింది మకిలిపట్టిన మనిషి అన్నాడు ఛీత్కారంగా రాధికను చూస్తూ...రాధిక కట్టెలా బిగుసుకుపోయినట్లు కదలకుండా కూర్చుని ఉంది..విశ్వా మాటలకు ఆమె తలలోని నరాలు చిట్లుతున్నట్టుగా నొప్పి మొదలయ్యింది..
కారుణ్య కోపంగా విశ్వ చెయ్యిపట్టి విసురుగా బయటకు లాక్కెళ్ళబొయ్యాడు..ఏంటి బాబూ నీకంత కోపమొస్తోంది ఆ అమ్మాయిని అంటే..నీకూ బాగా అలవాటు అయ్యిందా ఆమె తోడు అని ఎగతాళిగా, అసహ్యంగా మాట్లాడాడు విశ్వ..కారుణ్య ఆ మాటలకి నిశ్చేష్టుడు అయిపోయినట్టు కళ్ళు పెద్దవి చేసి విశ్వని చూస్తూ అలానే నిలుచుండిపోయాడు...అప్పుడు ఆ మాట విని చివ్వున లేచి వచ్చింది రాధిక..లాగి పెట్టి విశ్వ చెంప మీద గట్టిగా కొట్టింది...ఎన్నిసార్లు చంపుతూనే ఉంటారు, ఒక మనిషిని మీరు..ఒక బొమ్మలాగా నా బతుకుతో, నా భావాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు మీకు..ఒక మంచి మనిషిని, ఈ కారుణ్యని అంత అసహ్యంగా ఎలా చిత్రీకరించావు, నీకు కొంచెమైనా తెలుసా అతనిగురించి, తెలియని ఒక మనిషి గురించి నీచంగా ఎందుకు మాట్లాడావు..సృష్టిలో మీకు తెలిసి ఒకటే ఆలోచన, తప్పు అనేది ఇది ఒక్కటే అని..కానీ ఎలా పడితే అలా ఆలోచించేసి మీ నోటితో కంపు మాటలు మాట్లాడుతారు కదా, అది కూడా ఒక తప్పే..ఒక మనిషిని భౌతికంగా చంపితే ఎంత నేరమో, ఎంత పెద్ద శిక్ష పడాలో..ఒక మనిషిని మానసికంగా హింసించి చంపేసినా అంతే నేరం, అంతే పెద్ద శిక్ష పడాలి..
నా మనస్సుని చంపేస్తూ నా జీవితాన్ని అల్లరిపాలు చేసే హక్కు మీకెవరిచ్చారు..అని కోపంగా, ఆవేదనగా ఊగిపోతున్న రాధికను రేవతి వచ్చి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది...
చిన్నప్పుడే తల్లీతండ్రి లేని రాధికకి యుక్తవయసుకి వచ్చేటప్పటికి పెంచిన దూరపు బంధువులు కూడా పెళ్ళిభారం తలకెత్తుకోలేమని ఇంకా దూరం అయిపోయారు..ఆ ఊరిలో పెద్దింటి అబ్బాయి కిరణ్ తోట పనికని రమ్మని రాధికను బలవంతంగా సొంతం చేసేసుకున్నాడు..చిన్నప్పటినుండీ ఏదో ఒక బాధ, ఎవరో ఒకరితో శాపనార్ధాలు తింటూ పెరిగిన రాధికకి కిరణ్ చేసిన ఈ అన్యాయం కుమిలిపోయేంత పెద్దదని తెలీలేదు..
అలా కిరణ్ చేతిలో ఇంకోసారి, మరోసారి కూడా ఆటబొమ్మ అయ్యింది రాధిక...
పుట్టింటికి నిండుగర్భిణిగా వచ్చింది నిర్మల..
నిర్మలకు సాయంగా, రాధికను పనికి పెట్టుకుంది నిర్మల వాళ్ళ అమ్మ..
కిరణ్, నిర్మలకి అన్న..ఒకసారి తమింట్లో పనిచేస్తున్న రాధికతో, అన్న వ్యవహరిస్తున్న తీరుని పసిగట్టిన నిర్మల రాధికను అడిగింది..ఏమిటీ మా అన్నా, నువ్వూ ప్రేమించుకుంటున్నారా అని..
ప్రేమించటం అంటే అడిగింది రాధిక..
అబ్బా అంత అమాయకురాలివా..మా అన్నని వలలో వేసుకుని పెద్దింటి కోడలివి అయిపోవాలనే కదా నీ ఆలోచన అంది నిర్మల కొంచెం కోపంగానే.. మీరు
ఎక్కడా, నేను ఎక్కడమ్మా..మీతో బంధానికి నేనెందుకు ఆశ పడతానమ్మా..అంది అమాయకంగానే రాధిక..
మరి మా అన్నతో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావు, తప్పు కదూ..అని నిలదీసింది నిర్మల రాధికని..
తప్పా అమ్మా , అడిగింది రాధిక..
ఏమీ తెలీనట్లు అలా అడుగుతుంటే నీ మీద నాకు అసహ్యం వేస్తోంది..రేపు మా అన్నకొచ్చే భార్యకి, నీకొచ్చే భర్తకి అన్యాయం చేసినట్టు కాదా ఇది, మీ ఇద్దరూ చేసింది అని తిట్టింది నిర్మల..తప్పని నాకు తెలీలేదమ్మా, నిజం నన్ను నమ్ము..ఇంకెప్పుడూ నా ప్రాణం పోయినా ఈ తప్పు చేయను అంది దృఢంగా రాధిక..
నిర్మలకి పాప పుట్టి మూడోనెల వచ్చేదాకా అన్నిపనులూ కష్టపడి చేసింది రాధిక..తాను ఒక మనిషినని మర్చిపోయి యంత్రంలా పనిచేసింది రాధిక..కిరణ్ ఎన్నిసార్లు వెకిలివేషాలు వేసినా రాధిక పట్టించుకోలేదు..కిరణ్ నానా తిట్లు తిట్టాడు రాధికని..తన స్నేహితులతో తిట్టించాడు..అవమానించాడు, బెదిరించాడు..
అన్నీ భరించింది రాధిక కానీ తప్పు మాత్రం మళ్ళీ చెయ్యలేదు...
కిరణ్ మరీ శృతి మించుతుంటే నిర్మల కిరణ్ కి గట్టిగా చెప్పింది..అన్నా నీ కుక్కబుద్ధి మార్చుకోకపోతే నీ పెళ్ళిలో నువ్విలాంటి చెత్తమనిషివని నేనే చెప్పి మరీ,
ఏ అమ్మాయితోనూ,నీ పెళ్ళి కాకుండా చేస్తాను, తర్వాత నీ ఇష్టం..చూస్తూ చూస్తూ ఇప్పుడు రాధికనే కాదు రేపు రాబోయే నా వదినని అయినా నువ్వు బాధపెడుతుంటే సాటి ఆడదానిగా నేను ఊరికే ఉండను..నేనే నీకు చెప్పుదెబ్బలు రుచి చూపిస్తాను..తోడబుట్టినవాడివి అని కూడా చూడను..అని మందలించింది..
ఆరు నెలలుగా తనకి అంత సేవచేసిన రాధికకి భారీగా జీతం ఇచ్చి వేరే ఊరిలోకి వెళ్ళి బతకమంది నిర్మల..రాధిక అమాయకత్వం అర్ధం చేసుకున్న నిర్మల రాధికకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి లోకజ్ఞానం నేర్పించి పంపింది నిర్మల..
కొంతకాలం తరువాత, వేరే ఊరికి కిరణ్, తన స్నేహితులను కలవటానికి వచ్చినప్పుడు,
రాధికను అనుకోకుండా చూసి , మళ్ళీ వేధించటం మొదలుపెట్టాడు..అయినా రాధిక బెదరలేదు..కావాలంటే చంపనన్నా చంపెయ్యి కానీ తప్పుగా మాత్రం బతకను అంది రాధిక స్పష్టంగా..
ఇదివరకే తప్పు చేసాము , మళ్ళీ ఇప్పుడు తప్పు చేసినా చెయ్యకపోయినా ఒకటే అన్నాడు పొగరుగా కిరణ్..లేదు దొరా అప్పుడు తప్పని నాకు తెలీదు..ఇప్పుడు తప్పని తెలిసాక చచ్చినా చెయ్యను అంది రాధిక..అప్పుడు మాత్రం నువ్వేమన్నా చిన్నపిల్లవా నీకు ఏమీ తెలీదనుకోవటానికి అన్నాడు కిరణ్ ఎగతాళిగా..నిజమే దొరా అప్పుడు నాకు లోకం సరిగా తెలీదు..ఇప్పుడిప్పుడే బతకటం ఎలాగో నేర్చుకుంటున్నా అంది రాధిక..
రాధిక ఎదురుతిరుగుతుంటే కోపం వచ్చి కిరణ్, రాధిక గురించి తప్పుగా ప్రచారం చేసాడు..ఊరి బయటుండాల్సిన ఆమె ఊరిమధ్యలో మనమధ్యలో ఉంటోంది , తరిమెయ్యండి అని..అప్పుడు ఊరివాళ్ళలో కొందరు మూర్ఖులు, గొర్రెలు కిరణ్ మాట నమ్మి రాధికను దూరంగాపొమ్మని తరిమారు..మరి అదే తప్పు చేసిన కిరణ్ మనలోనే ఉన్నాడే, మరి వాడినేమి చెయ్యాలి అని ఒక్క మూర్ఖుడు కూడా ఆలోచించలేదు.. నాణానికి ఒకవైపే ఆలోచించి ఆవేశపడి, నాణానికి రెండోవైపు కూడా ఆలోచించాలి అనే జ్ఞానం లేని గొర్రెలమంద ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో, ఎప్పుడు ఎవరిని అవమానించి నేలకేసి కొడతారో వారికే తెలీనంత స్పృహలేని స్థితిలో ఉంటారు చాలామంది జనం...వారిలో విశ్వ ఒకడు..
కారుణ్య , అతని ఊరి జనం సమావేశం అయ్యారు..రాధిక గుడిలో పాడవచ్చా పాడకూడదా అని నిర్ణయించటానికి..చాలామంది పాడకూడదన్నారు..కారుణ్య, రేవతి చెప్పారు..మనుష్యులం మారటం సహజం..
కాలమే క్షణం క్షణం మారుతూ నిముషాలుగా మారి గంటలుగా మారి రోజులుగా మారుతూ ఉంటుంది..ఆమె ఇదివరకు రోజుల్లో ఏమిచేసారు అనేది అప్రస్తుతం, ఇప్పుడు, ఈ రోజు ఆమె జీవన విధానం ఏమిటి, ఆమె ప్రవర్తన ఏమిటీ అనేదే మనం చూడాలి..ఒకరి తప్పొప్పులు ఎంచుకుని జీవనం సాగించాలంటే అందరమూ పక్కనున్నవారిలో ఏదో ఒక తప్పును, కారణంగా చూపి, దూరం పెడుతూ ఉంటే, యే ఇద్దరూ కలిసి జీవనం సాగించలేరు..
చిన్నదో, పెద్దదో అయిన తప్పులు అందరమూ చేస్తూనే ఉంటాము..తప్పుని గుర్తించినప్పుడు తిట్టి మందలించి దూరం పెట్టినట్టే , తప్పు దిద్దుకుని పద్ధతిగా జీవించే వారిని అక్కునచేర్చుకోవటమూ అవసరమే..
ఆవిడ ఈ రోజు మర్యాదగా జీవిస్తున్నారు..నిన్నటి రోజు తిరిగిరాదు కదా ..అలానే నిన్నటి ఆవిడ తప్పుని గతానికి వదిలేసి..ఇప్పటి రాధికను ఎప్పటిలానే గౌరవిద్దాము అని చెప్పారు కారుణ్య, రేవతి..
వారం రోజుల తరువాత తిరిగి పాడే అవకాశం వచ్చినప్పుడు పాట మొదలుపెట్టిన రాధిక గొంతు వణికింది, కళ్ళు నీటితో నిండిపోయాయి..రాధిక కళ్ళుమూసుకుంది..కళ్ళల్లో తెల్లనిబట్టల్లో సాయిబాబా చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ కనపడ్డాడు..అంతే ఆ ఒక్క దివ్య రూపం మీద మాత్రమే ద్రృష్టిని కేంద్రీకరించి అంతఃకరణశుద్ధిగా కేవలం దైవాన్ని మాత్రమే దర్శిస్తూ ..ధ్యానంలో ఉన్నట్టుగా మనస్సుతో పాడుతూ ఉంది..అంత మధురమైన గానం అక్కడున్నవారు అంతకుముందెప్పుడూ వినలేదు..అందరూ కృష్ణుని వేణుగానానికి వశమైపోయినట్లుగా, రాధికా గానానికి నెమ్మదిగా తలలూపుతూ చేతులు జోడించి కళ్ళుమూసుకుని కాసేపు ప్రశాంతస్థితిలోకి వెళ్ళారు...
మళ్ళీ, రాధిక , రోజూ గుడిలో పాటలు పాడుతోంది..ఇప్పటికి అయితే రాధికకి,
అవమానించి ఛీత్కరించుకునేవారు కొందరున్నా , వారికంటే ఎక్కువగా గౌరవవించేవారు కూడా ఉన్నారు..