Varun Ravalakollu

Fantasy

4.9  

Varun Ravalakollu

Fantasy

డెడ్ మేన్ పేరడాక్స్ - 1

డెడ్ మేన్ పేరడాక్స్ - 1

7 mins
897


పత్రికలలో వచ్చిన వార్తలు ఏమయినాగానీ, సత్యాది ఆత్మహత్య కాదు అని నేననుకోవడానికి బలవత్తరమైన కారణాలున్నాయి. అందులో మొదటిది, నా యాభయ్యేళ్ల సాన్నిహిత్యంలో వాడి దగ్గర పిరికితనం నాకు కనిపించకపోవడం. పులి మీదకు దూకితే వాడేం చేసేవాడో తెలియదుగానీ, వెన్ను మాత్రం చూపించడని నేను కరాఖండీగా చెప్ప గలగడానికి ఒక కారణం, నేను పక్కనున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. న్యూయార్క్ సబ్వేలో ఒక నల్లవాడు తుపాకీని వాడి నడుము కానించి వాలెట్ని ఇమ్మన్నప్పుడు, ప్రశాంతంగా, "డబ్బులు తీసుకుని, వాలెట్ నాకు తిరిగిచ్చెయ్, అందులో డ్రైవర్స్ లైసెన్స్ కావాలి. అది లేకపోతే ఆ మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంటుకి వెళ్లడం కోసం అనవసరంగా ఒక వర్క్ రోజు వేస్ట్ చెయ్యాలి!" అని ఎంతమంది అనగలరు? వాడి పక్కనే ఉన్న నేను నోట మాట రాక నిలబడ్డాను మరి! తరువాత సబ్వే వైపు వెళ్లడానికీ, ఏ వయసువాడయినా సరే, నల్లవాడి నీడని చూడడానికీ నేను భయపడ్డాను గానీ, వాడు న్యూయార్క్లో ఉన్నన్నాళ్లూ సబ్వేలోనే ప్రయాణం చెయ్యడమే గాక రోడ్డుమీద నల్లవాళ్ల మధ్య నిలబడ్డా పట్టించుకునేవాడు గాదు.

లేకపోతే, ఇరవై నాలుగు గంటలూ లాబ్లోనే గడుపుతున్నాడంటూ వాణ్ణి వదిలి వెళ్లిన రంజని సామంత్ దగ్గర చేరిందని తెలిసినప్పుడు ఆత్మహత్య చేసుకునుండాలి. "రోబో" సినిమాలో తనకెక్కువ సమయాన్ని కేటాయించకపోయినా ఐశ్వర్య రజనీకాంత్ ని వదల్లేదు గానీ, నిజజీవితంలో మాత్రం, ఐశ్వర్యని అనుకరించాలని రంజని ఏమాత్రం అనుకోలేదు. అయినా గానీ, కోపం మాట దేముడెరుగు ఆఖరికి నిరాశకూడా వాడి ఛాయలకి రాలేదు. పైగా లాబ్లోకొచ్చి ఆ విషయాన్ని మొహం మీద ఉన్న మాస్క్ని తొలగించి మొహంలో మొహం పెట్టి "నేను నిన్ను వదిలివెడుతున్నాను" అని రంజని చెబితే, ఎమోషనేదీ లేకుండా "అలాగా!" అన్నాడని, వాడిమీదకి చేతి కందిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ని ఆమె విసిరెయ్యగా అది పగిలితే, "చచ్చాం, ఇప్పుడు దీన్ని మళ్లీ తెప్పించుకోవడానికి వారం రోజులు పడుతుంది," అని తలపట్టుక్కూచున్నాట్ట! వాడే చెప్పాడు ఆ సంగతి!

నిజంగా నిరాశ వాడినీడకు చేరగలిగి ఉంటే అది వాడు కనిపెట్టిన గాడ్జెట్ మీద అన్ని హక్కులూ తనవేనంటూ పార్ట్నర్షిప్ లో వాడి వాటా జీరో అని సామంత్ చెప్పినప్పుడు జరిగుండాలి. ప్రపంచంలో ఏ మారుమూల చూసినా మనుషుల చేతుల్లో వాడి రీసెర్చ్ ఫలం కనిపిస్తున్నప్పుడు, దానివల్ల వచ్చే లాభాల మాట అటుంచి, అసలు దాన్ని కనుగొన్న వాడిగా వాడికి గుర్తింపే లేకపోతే ఆ పరిస్థితిలో ఉన్నవాళ్లల్లో ఎంతమంది ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యకుండా ఉంటారు? వాడికి అసలు అలాంటి ఆలోచనే లేనట్లు ఇంకేదో కనిపెట్టాలంటూ ముందుకి సాగిపోయాడు.

ఇంతకీ ఇరవై నాలుగు గంటలూ సత్యా తనతో గడపడాన్ని గర్వపడిన ఆ లాబ్ - వాడు ఉండే ఇంటి కార్ గరాజే! మొదట్లో ఇన్వెస్టర్గా ప్రోగ్రెస్ చూడడానికి వస్తున్నానంటూ ఆ లాబ్కి వారానికి ఒకసారి వచ్చిన సామంత్ తరువాత రోజుకోసారి రావడం మొదలుపెట్టి; లాబ్లోకి అడుగు పెట్టకుండానే ఆ యింట్లో రాత్రంతా గడుపుతున్నాడన్న విషయం గూర్చి ఆలోచించే వ్యవధే ఉంటే సత్యా చేసిన పరిశోధన అంత విజయవంతమయి ఉండేదికాదు; దానివల్ల సామంత్ కొన్ని మిలియన్లకి (డాలర్లలో) అధిపతి అయ్యెవాడూ కాదు. కొన్ని పెన్నీలు మాత్రమే సత్యాకి ఇచ్చాడు. తన కళ్లకి కనబడకుండా వెళ్లిపోవడానికి ఇచ్చిన లంచం అది. ఆ సామంత్ చేతినుండీ రాలినవి అతని ఆస్తితో పోలిస్తె పెన్నీలేగానీ, అవి మాత్రం సత్యా ఇండియా చేరి అక్కడ లాబ్ పెట్టడానికి తోడ్పడ్డాయి. ఆ పెన్నీలు దొరకడం సత్యా దురదృష్టమో లేక నా అదృష్టమో మీరే చెబుతారు. కానీ చెప్పొచ్చినదేమిటంటే ఇలాంటి పరిణామాలని అర్భకులెలా ఎదుర్కుంటారో మనం రోజు వార్తల్లో చూస్తూంటాం కానీ, సత్యా అర్భకుడు కాడు మరి! కనీసం అటు దేవుణ్ణి దూషించడంగానీ, ఇటు బాబాల వెంట తిరగడం గానీ చెయ్యలేదు. ఇంకా ఉదాహరణలు చెప్పి మీ సమయాన్ని వృధాపరచడం గానీ ఆసక్తిని చంపడంగానీ చెయ్యను.

సత్యా ఇండియాకి వెళ్లిపోతున్నాడంటే నేనంతగా ఆశ్చర్యపోలేదు. ఒకప్పుడు రీసెర్చ్ లాబ్స్లో పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల, ప్రతీ మూణ్ణెల్లకోసారీ లేకపోతే ఆర్నెల్లకోసారీ ప్రోగ్రెస్ చూపించలేని ప్రాజెక్టుల ఎత్తివేతని భరించగలిగే స్థితిలో వాడు లేడు. అప్పటికే ఒకసారి అరుపులూ, కేకలతో పోలీసులచేత కంపెనీ నుంచి బయటికి వెళ్లగొట్టించుకున్న ఖ్యాతి వాడి దయినప్పుడు వాణ్ణి ఆహ్వానించడానికి ఏ కంపెనీ ముందు కొస్తుంది? అలాంటి స్థితిలోనేగా వాడిమీద దాదాపు అయిదేళ్లు సామంత్ ఇన్వెస్ట్ చేశాడు!

వాడి అదృష్టమల్లా పిత్రార్జితమైన ఇల్లొకటీ ఇంకా వాడి స్వంత ఊళ్లో ఉండడం. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అమెరికాలో వాడి ఇంటిని కొన్నధరకి రెండురెట్లకి అమ్మేయగల్గడం. ఏదో సామెత చెప్పినట్లు, వాడు ఏమీ చెయ్యకుండా ఇండియాలో ఎలా కూర్చోగలడన్న నా ప్రశ్నకు రెణ్ణెల్లలోనే జవాబు దొరికింది, వాణ్ణించీ వచ్చిన ఫోన్ కాల్ వల్ల. ఏదో ఎక్విప్మెంట్ ఇండియాలో దొరకట్లేదు, ఫలానా ఆన్లైన్ కేటలాగ్నుంచీ కొని తెచ్చిపెట్టు అనేది దాని సారాంశం. సంవత్సరానికి అయిదారుసార్లు బిజినెస్ పనులవల్ల ఇండియా వెళ్లిరావడం నాకలవాటే.

మామూలుగా అయితే, ఇండియా చేరిన తరువాత హైదరాబాద్ తప్ప ఇంకో చోటికి వెళ్లాల్సిన అవసరం నాకుండదు. అలాంటిది, పుట్టి పెరిగిన ఊళ్లోని వీధుల్లో తిరగడానికి మళ్లీ వీడివల్ల అవకాశం దొరికింది గనుక, సంవత్సరానికి ఒకసారయినా, "అబ్బ, చంపుతున్నావ్రా!" అంటూనే వెళ్లి, వాణ్ణి కలిసి, వాడు తెమ్మన్నవాటిని స్వయంగా అందజేస్తుంటాను. వాడికి కావలసిన వస్తువులు అమెరికాలో అయితే ఇట్టే దొరికేవి. మహా అయితే ఒక వారంరోజులు ఆగవలసివచ్చేది. అలాంటిది, నేను తెచ్చి వాడికి ఇవ్వడం అంటే నెలలపాటు నిరీక్షణ. దీనివల్ల నీ పరిశోధన కుంటుపడట్లేదా అని అడిగాను. ఆశ్చర్యకరంగా, లేదన్నాడు. "కావలసింది తొందరగా దొరికినప్పుడు, దాన్ని తెచ్చి అమర్చిన తరువాత గానీ అది పనిచేస్తుందో లేదో తెలుసుకునేవాణ్ణి గాదు. ఉదాహరణకి ఎడిసన్ లైట్ బల్బులో టంగ్స్టన్ ఫిలమెంట్ వేస్తే మాత్రమే అది పనిచేస్తుందని తెలుసుకునే ముందర దాదాపు వంద వేరే ఫిలమెంట్లని వాడాడు. ఈ కాలంలో అలాంటి పరిశోధనలు చెయ్యాలంటే చాలా ఖర్చవుతుంది. ఇప్పుడు మనకి లభ్యమయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ కాబట్టి, నేను సిములేషన్స్ చేసి, ఆ పార్ట్ కొనేముందరే అది పనిచేసే అవకాశం హెచ్చుగా ఉందని రూఢి చేసుకున్న తరువాతే ఆర్డరిస్తున్నాను. ఆ విధంగా ఈ నిరీక్షణ నాకు మేలేచేస్తోంది," అన్నాడు వాడు.

వాణ్ణి కలవడానికి వెళ్లినపుడు ఆ ఇంటి చుట్లుపక్కలవాళ్లు నన్ను ఆసక్తిగా చూడడాన్ని నేను గమనించక పోలేదు. "మీరాయనకి చుట్టమా సార్?" అనడిగారు కూడా. కాదు, స్నెహితుణ్ణని చెప్పా.

"ఆయనకెవరూ లేరా సార్, చూడ్డానికి ఎవరూ రారు?" అని కూడా అడిగారు. ఎందుకయినా మంచిదని ఆ అడిగినవాళ్ల ఫోన్ నంబర్ తీసుకున్నా. ఇండియా కెళ్లినా గానీ, వాణ్ణి కలవడానికి కుదరని నాలుగయిదుసార్లూ వాళ్లకి ఫోన్చేసి వాడింకా బ్రతికే ఉన్నాడని నిర్ధారణ చేసుకునేవాణ్ణి. వాడికి ఫోనుందని నాకు తెలుసు. కానీ నేను ఫోన్ చేసినప్పుడెప్పుడూ దాన్ని వాడు ఆన్సర్ చేసిన పాపానపోలేదు.

ఇండియా కెళ్లిన అయిదారేళ్ల కనుకుంటా, ఫోన్చేసి, విస్కీ పట్రమ్మన్నాడు. అంతే! ఏ ఎలక్ట్రానిక్ పరికరమూ తెమ్మనమని చెప్పలేదు. షాకయ్యా. క్వాలిటీ సరుకు పట్టుకుని రెణ్ణెల్లల్లో వాడి ముందున్నాను.

"దేనికి ఈ సెలబ్రేషన్?" కుతూహలాన్ని ఎంతసేపని కప్పెట్టగలను?

"గతాన్ని - ముఖ్యంగా బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతున్నందుకు!" అన్నాడు.

తరువాత వాణ్ణేమడిగానో గుర్తులేదు గానీ, వాడి లాబ్ టూరిచ్చాడు. లాబ్ అంటే, వాడి పాత ఇంట్లో నాలుగయిదు గదులు. రకరకాల బాక్సులూ, వైర్లూ, లైట్లతో నిండిపోయి వున్నాయి. కంట్రోల్ పానెల్ రకరకాల డిస్ప్లేలతో విమానంలో ఫ్లైట్ డెక్ ని గుర్తుకు తెచ్చింది. కరెంటు సప్లై ఎప్పుడూ అంతంత మాత్రమే గనుక జనరేటర్ పెట్టుకున్నాడు. అక్కడున్న పెద్ద బాక్సులన్నీ - రేకులతో చేసినట్లుగా ఉన్నవి - అన్నీ ఇండియా సరుకే. కొన్నింటిని స్పెషల్గా ఆర్డరిచ్చి చేయించుకున్నా నన్నాడు. "చాకులాంటి కుర్రాళ్లున్నారు మెషీన్షాపుల్లో" అన్నాడు.

"ఏం చేస్తుంది మెషీన్?" అడిగాను.

"టైంతో ఆడుకుంటుంది," అంటూ ఒక బటన్ని నొక్కాడు. ఒక రాక్షసుడు నోరు తెరిచి నాలుకని బయటికి పెట్టినట్లు నాకు అనిపించడానికి కారణం, ఇంట్లో తయారు చేసినందువల్ల కొద్దిగా క్రూడ్ గా ఉన్నట్లనిపించడం అయ్యుంటుంది. లేకపోతే, సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించే ఎమ్ఆర్ఐ మెషీన్ బెడ్ లాగే ఉంది ఆ నాలిక.

"ఎలా?"

"కాలాన్ని వెనక్కి నెట్టి!" అర్థంకాని నా మొహాన్ని చూసి "టైం ట్రావెల్ని సాధ్యపరిచే మెషీన్లగూర్చి వినలేదా? ఎన్నేళ్లబట్టీ అమెరికాలో ఉన్నావ్?" అంటూ చిరాకుపడ్డాడు.

అప్పుడు నాకర్థమయింది. గతంలోకి వెళ్లి ఆ అనుభవాలని పొందగలిగేలా చెయ్యగలిగే టైం మెషీన్లగూర్చి సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివాను. డైనోసార్లని వేటాడ్డం గూర్చి, రోమన్ల, గ్రీకుల గత వైభవాలని ప్రత్యక్షంగా సందర్శించడం గూర్చీ, మొహంజోదారో నాగరికతని స్వయంగా కళ్లతో చూడగలగడం గూర్చి రాసిన కథలు చదవడం నాక గుర్తుంది. అలాంటి అనుభవాలని ఈ మెషీన్ సాధ్యపరుస్తుందా!

"డెనోసార్ల దగ్గరకి తీసుకెడుతుందా?"

"తెలీదు," అన్నాడు అనాసక్తతతో, ఆశ్చర్యపోవడం నావంతయింది.

"తెలియనప్పుడు దీన్ని టైం మెషీన్ అని ఎలా అనగలవ్?"

"ఒక రోజుని వెనక్కెళ్లేలా చెయ్యగలిగినా అది టైం మెషీనే అవుతుంది."

"నిన్నటి అనుభవాలూ, జ్ఞాపకాలూ షార్ట్ టర్మ్ మెమరీలో నిక్షిప్తమవడంవల్ల వాటి నెమరువేసుకోవడానికి ఏ మెషీనూ అవసరంలేదు."

"కరక్టే. ఈ మెషీన్ టైం ట్రావెల్ని సాధ్యపరుస్తుందని నిన్ను నమ్మించవలసిన అవసరంలేదు. ఏం చేస్తుందని అడిగావ్ గనుక చెప్పాను. దీని ద్వారా నా చిన్నతనాన్ని శిశువుగా ఉన్నప్పుడు కాళ్లమీద పడుకోబెట్టి మా అమ్మమ్మ నీళ్లు పొయ్యడాన్ని మా నాన్న పొట్టమీద పడుకుని నిద్రపోవడాన్ని, రెండేళ్ల వయసులో మా అమ్మ నా పొడుగాటి జుట్టుకు కొప్పుని పెట్టి దానికి పూలదండ నమర్చడాన్నీ, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వూ, నేనూ, రాఘవా కలిసి సుబ్బరాయుడిగారింట్లో దొంగతనంగా జామకాయలని కొయ్యడాన్నీ - అరవయ్యేళ్లు ఇంటూ 365 రోజులూ - ఆఖరి ఊపిరి పీల్చేదాకా గుర్తు తెచ్చుకోవడానికి జ్ఞాపకాలు అనంతం. వాటికి మెరుగులని అద్దుతోంది, అప్పుడు చుట్టుపక్కల మనుషుల్లో చూసినా అర్థంకాని భావాలని ఇప్పుడు ప్రేక్షకుడిగా చూడగలగడం - అద్భుతంగా ఉంది!"

"టైం మెషీన్లగూర్చి రాసిన కథల్లో గతంలోకి వెళ్లి, అప్పుడు జరిగిన సంఘటనని ఏమయినా మారిస్తే భవిష్యత్తు మారుతుందని రాస్తారు గదా, నువ్వలా వర్తమానాన్ని - గతానికి వర్తమానం భవిష్యత్తే గదా! - మార్చేలా చెయ్యడానికి ఏమీ నీ టైం ట్రావెల్స్లో ప్రయత్నించలేదా?"

"ఉదాహరణకి రంజని నాతోనే ఉండేలా చెయ్యడం? దానికి నేనెందరి రాతలు మార్చాలి!"

"నువ్వు కనిపెట్టిన గాడ్జెట్ వల్ల సామంత్ అంత లాభపడ్డాడు కదా, పోనీ నీకు లభించాల్సిన ఆ క్రెడిటయినా-"

"ఆ గాడ్జెట్ ఎవరిద్వారా సాధ్యమయిందో వాడికీ, నీకూ, నాకూ తెలుసు. అది ప్రస్తుతం ఇక్కడ కూడా రోడ్డుమీదకెడితే కనిపిస్తుంది. సాంకేతిక ప్రగతికి సహాయపడ్డందుకు నాకు గర్వంగానే ఉంది. దాన్ని నా నుంచీ వేరుచెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ట్రై చేస్తావా? కావాలంటే డైనోసార్ల కాలానికి వెళ్లు" అన్నాడు.

వాడు మాటమార్చాడని అర్థమవుతూనే ఉంది. ట్రై చెయ్యకపోతే "కథల్లో చదివినది ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం దొరికినప్పుడు జారవిడుచుకున్నావా?" అని ఎవరయినా నన్ను ప్రశ్నించవచ్చునేమో గానీ, ఆ మెషీన్ నాలికమీద పడుకుని దాని లోపలికి వెడితే బయటికి తిరిగొస్తానా అన్న విషయం గూర్చే నా భయం. రెండేళ్ల క్రితం ఎమ్.ఆర్.ఐ మెషీన్లో కెళ్లిన అనుభవం ఉందిగానీ, అది ఒక అమెరికన్ కంపెనీ తయారుచేసింది. అమెరికన్ హాస్పిటల్లో ఉపయోగించబడుతోంది. దానికి సర్టిఫికేషన్లన్నీ ఉన్నాయి. ఏమయినా హెచ్చుతగ్గులొస్తే, ఓ పట్టుపట్టడానికి లాయర్లు లైన్లు కడతారు. కోర్టుకేసు మాటటుంచి వీడి మెషీన్ కి ఎలాంటి సర్టిఫికేషన్లనీ ఆశించడం కూడా తప్పే. నా ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఈ మెషీన్లో నా శరీరం భరించే శక్తికి మించి మాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయినా, హై ఎనర్జీ ఎలక్ట్రాన్లో, లేక ఎక్స్ రే రేడియేషనో ప్రొడ్యూస్ అయినా, వాటివల్ల కలిగే దుష్పరిణామాలకి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నని లేవనెత్తింది.

నా ఆలోచనలని పసిగట్టినట్లున్నాడు. "ఓ పది నిముషాలపాటు నేను వెళ్లొస్తాను, నీ కళ్లముందరే. తరువాతే నువ్వెడుదువుగాని!" అన్నాడు. సరేనని తల ఆడించాడు.

సత్యా ఆ మెషీన్ కంట్రోల్ పానెల్ మీదనున్న బటన్లనేవో నొక్కాడు. పది నిముషాలు సెట్చేశాడు. "ఇది అలారం లాగే, సమయం అయిపోగానే వర్తమానానికి తెచ్చేస్తుంది," అని వివరించి, "నువ్వేం చెయ్యనక్కర్లేదు, చూస్తూ ఉండు," అని ఆ రాక్షసుడి నాలుకమీద పడుకున్నాడు. ఒక పది సెకన్లల్లో ఆ నాలుక ఆ మెషీన్లోకి వెళ్లిపోయింది. అప్పుడు, ఆ కంట్రోల్ పానెల్ మీది డిస్ప్లేలో ఉన్న అంకెలని చూశాను - 1960, సెప్టెంబర్ 6 పొద్దున్న పదిగంటల అయిదు నిముషాలు. ఆ తారీకునీ, ఆ సమయాన్నే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడా అని అనుమానమేసింది. డిస్ప్లేలో టైం మారడం గమనించాను, పదినిముషాల తరువాత ఆ మెషీన్ ఆటోమేటిగ్గా నాలికని వెళ్లబెట్టింది. బయటకొచ్చిన తరువాత చెప్పాడు - "నేనున్న స్కూల్లో నువ్వు జాయిన్ అయింది ఆ సంవత్సరమేనని గుర్తుందిగానీ తేదీ గుర్తులేదు. సెప్టెంబర్ 6 కే స్కూల్లో ఉన్నావు."

వాణ్ణి నమ్మాలో లేదో తెలియలేదుగానీ ఆ మెషీన్లో పదినిముషాల సేపుంటే ప్రమాదం లేదనిపించింది. ఎందుకయినా మంచిదని, అయిదు నిముషాలు సేప్టీ మార్జిన్ క్రింద ఉంచుకుని "ఒక్క అయిదు నిముషాలు మాత్రం" అన్నాను. అంతేకాక వాడు అయిదు నిముషాలే సెట్ చెయ్యడం చూశానుకూడా.

"ఏ సంవత్సరాన్ని డయల్ చెయ్యమంటావో చెప్పు."

"డైనోసార్ల యుగానికి."

"అంటే మిలియన్ల సంవత్సరాల వెనక్కి. నేను ఎప్పుడూ ఈ మెషీన్లో అంత వెనక్కి వెళ్లాలనుకోలేదు గనుక అన్ని డిజిట్లని ప్రోగ్రాం చెయ్యలేదు - ఇరవయ్యవ శతాబ్దంలో సాఫ్ట్ వేర్ ప్రోగ్రాముల్లో సంవత్సరానికి రెండంకెలే కేటాయించినట్లుగా. మరి, ఇందాక డైనోసార్ల యుగానికి వెడతావా అనడిగావెందుకు అని నువ్వడగవచ్చు. కాసేపు కూర్చుంటే సాఫ్ట్ వేర్ మారుసాను."

సాఫ్ట్ వేర్లో చేసే చిన్న చిన్న మార్పులు అసలు ప్రోగాంకే ఎంత ఎసరుపెట్టవచ్చో స్వయంగా అనుభవం ఉన్నవాణ్ణి గనుక "వద్దులే" అన్నాను. పైగా, ఇప్పుడు సాఫ్ట్ వేర్ని మారిస్తే, దాని తరువాత ఆ మెషీన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోడానికి వాణ్ణి మళ్లీ నాకన్నా ముందు కాలయాత్ర చేయించాలి.

"క్రీస్తుశకంలో ఏ రోజయినా సెలెక్ట్ చేసుకోవచ్చు."

"నేను పుట్టకముందరి ఏ రోజయినా పర్లేదు," అన్నాను గానీ, అయిదున్నర నిముషాల తరువాత గానీ నేనెంత తప్పుచేశానో అర్ధంకాలేదు.

***



Rate this content
Log in

Similar telugu story from Fantasy