STORYMIRROR

gopal krishna

Tragedy Fantasy Others

4.8  

gopal krishna

Tragedy Fantasy Others

గాలి వాన

గాలి వాన

6 mins
429


    దసరాకి మొదలెట్టింది ముసురు. దీపావళి కి పెద్ద తుఫాను ఉందంట, రాములమ్మ మొహంలో ఆందోళన కనిపిస్తోంది. "మీ పెద్దోడు ఎప్పుడొస్తాడే రాములమ్మా" అప్పుడే వంటయ్యిందేమో ఇంకా మడి కట్టుకొనే ఉన్నారు లక్ష్మి గారు. "ఏమోనమ్మా, ఆడొస్తాడు ఇంటికి తాటాకు కొని నేయిస్తాడు అని కళ్ళుకాయలు కాసేలాగా ఎదురుచూసి చూసి ఇంక చూడ్డం మానేసానమ్మగోరూ" చీరచెంగుతో తడిసిపోయిన తలని, మొహాన్నితుడుచుకుంటూ చెప్పింది రాములమ్మ.

    "వంటయ్యిందండీ, మీరు స్నానం, దీపారాధన చేసొస్తే వడ్డిస్తాను", వీధి అరుగుమీద కూర్చొని ఎవరివో జాతకచక్రాలు రాస్తున్న భర్త రామశాస్త్రి గారికి వినిపించేలా పిలిచారు లక్ష్మీ దేవి గారు. ఆవిడ అసలు పేరు మాణిక్యాంబ. కానీ పచ్చని పసిమిఛాయతో, ఒంటినిండా బంగారు ఆభరణాలతో, ఇంటికి వచ్చినవారికి కడుపునిండా వండి వడ్డించే మాణిక్యాంబగారిని మొదట ఎవరు లక్ష్మీదేవి అన్నారో తెలియదు కానీ ఆవిడకి ఆ పేరు స్థిరపడిపోయి, అసలు పేరు మరుగున పడిపోయింది.

    "పనిమనిషికి భోజనం పెట్టేయ్యి లక్ష్మీ. పాపం ఎప్పుడు తిందో ముసల్ది". వర్షం జల్లు గుమ్మంలోకి వస్తే రాసుకుంటున్న కాగితాలు, పంచాంగం, కూర్చున్న చాప అన్నీ హాల్లోకి తెచ్చి మళ్ళీ కూర్చున్నారు. "ఎందుకండీ మీకు అంత శ్రమ. ఇప్పుడు మనకేం తక్కువయిందని ఈ జాతకాలు అవీ రాయడం. హాయిగా రెస్ట్ తీసుకోకూడదూ" రోజూలాగే చెప్పారు లక్ష్మి గారు. శాస్త్రిగారు చిన్నగా నవ్వేసి, "భగవంతుడు మనకి ఏ పని నిర్దేశిస్తే అది చెయ్యాలి లక్ష్మీ. నేను సంపాదిస్తున్న దాంతో మేడలూ మిద్దెలు కట్టాలని ఆశలేదు లే" అన్నారు.

    "రాములమ్మా, వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కొని, పెరట్లో నాలుగు అరిటాకుల కోసుకునిరా. తడిసిపోతావు. గొడుగేసుకొని వెళ్ళు" చెప్పారు లక్ష్మిగారు. రాములమ్మ ఇంటిపక్క సందులోంచి వెళ్ళి అరిటాకులు కోసి నూతిదగ్గర శుభ్రంగా కడిగి వంటగది దగ్గర వరండాలో పెట్టి, "అమ్మగారూ అరిటాకులు ఇక్కడెట్టానండీ" అంటూ కేకేసి, మళ్ళీ సందులోంచి వెళ్ళి వీధి గుమ్మంలో కూర్చుంది. రామశాస్త్రిగారు తాను రాస్తున్న జాతకం ఆపేసి స్నానానికి వెళ్తూ "ఆ రాములమ్మకి భోజనం పెట్టు లక్ష్మీ. తాను ఇంతసేపు ఏం కూర్చుంటుంది"? అన్నారు. "ఇందాకే టిఫిన్ పెట్టానండీ. దానికేమీ తొందరలేదు. మీరు కానివ్వండి" అంటూ దేవునిదగ్గర శుభ్రం చేసి కూర్చున్నారు.

    "పెద్దవాడు ఫోన్ చేస్తాడనుకున్నా, బొత్తిగా వాడికి బాధ్యతలు లేకుండా పోయాయి" అన్నారు లక్ష్మీదేవి గారు. అమ్మాయి కూడా అంతేగా, మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేము కదా" అన్నారు. శాస్త్రిగారు భోజనం ముగించి, "లక్ష్మీ, వాతావరణం చాల అధ్వాన్నంగా ఉంది. తొందరగా భోజనం చేసి హాల్లోకి వచ్చెయ్యి. పెరట్లో బాదం చెట్టు పడిపోయేలా ఉంది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకు" చెప్పారు. మధ్యాహ్నం వార్తల్లో కోస్తా ఆంధ్రాకి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపొమ్మని చెప్తున్నారు రేడియో లో. పనులన్నీ ముగించుకొని ముందు గదిలోకి వచ్చారు లక్ష్మీదేవి గారు.

    "అమ్మగోరూ నేనింటికి ఎల్తానండీ, ఇల్లంతా ఎలా ఉందో సూసుకోవాల" చెప్పింది రాములమ్మ. "రాములమ్మా, ఇప్పుడు అక్కడకి వెళ్ళి ఏంచేస్తావు చెప్పు. ఇంట్లో సామాన్లు కూడా ఏమీ లేవు కదా. గాలివాన తగ్గేదాకా ఇక్కడే ఉండు. అమ్మగారి బట్టలు ఇస్తారు తీసుకో చెప్పారు శాస్త్రి గారు. "ఇంటికెళ్లాలండయ్యా, బట్టలు, వంటసామాన్లు తడిసిపోయాయేమో" అంది రాములమ్మ. "మరేమీ పరవాలేదులే, గాలివాన తగ్గేక నేనే దగ్గరుండి నీ ఇంటికి తాటాకు పంపించి, నేయిస్తాను. గోడలు బాగా తడిసిపోయి ఉంటాయి. ఇప్పుడు వెళ్ళకు" శాస్త్రి గారు పదేపదే చెప్పినా వినకుండా ఇంటికి బయల్దేరింది రాములమ్మ.

   ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని, ఎవరో తరుముతున్నట్లు పరుగులుపెడుతున్నాయి. ఉరుములు మెరుపులు ఎక్కడా హడావుడి చేయడంలేదు. గాలి మాత్రం ఈడ్చి కొడుతోంది. చెట్లు ఆ గాలిని తట్టుకోలేక వణికిపోతున్నట్లు ఊగిసలాడుతున్నాయి. "రచ్చబండ దగ్గర మర్రి చెట్టు రాములోరి గుడిమీద కూలిపోనాదిట" ఎవరో గట్టిగా అరుస్తున్నారు. "బడి పక్కనే ఉన్న రావి సెట్టూ బడి మీద పడిపోనాది. ఊరంతా భయంతో వణికిపోతున్నారు" ఎవరో గట్టిగా అరుస్తున్న అరుపులు గాలికి ఆగి ఆగి వినిపిస్తున్నాయి.

   మధ్యాహ్నం మూడు గంటల సమయం. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి కమ్ముకుపోయింది. నా ల జీవితంలో ఇదే పెద్ద తుఫాను లక్ష్మీ! శాస్త్రిగారు తాంబూలం వేసుకున్న నోటిని కడుక్కున్నారు. పురాణ పఠనం చేద్దామని. పెరట్లో బాదం చెట్టు ఫెళ్ళున శబ్దం చేస్తూ పడిపోయింది. ఆయన ముఖంలో నిర్వేదం. "ఎప్పుడో చిన్నప్పుడు బాదం మొక్క తెచ్చి వేసాను. ఇప్పుడు కూకటి వేళ్ళతో సహా లేచిపోయింది" కిటికీ లోంచి చూస్తూ అన్నారు.

    "పక్షులు, జంతువులు ఎంత భయపడిపోతాయో కదా"! జాలిగా అన్నారు లక్ష్మీ దేవిగారు. వెనకవీధిలో గారెలు, పుణుకులు అమ్ముకునే వెంకటరమణ పొయ్యి వెలిగించి నూనె పెట్టినట్లున్నాడు పొయ్యి మీద. వెంకటరమణది ఆ ఊళ్ళో డాబా ఇల్లు. పొయ్యి మీద నూనె కాగుతున్న వాసన ఘుప్పున ముక్కుపుటాలను తాకుతోంది. పకోడీ వేస్తున్నాడేమో వీధుల్లో కుర్రాళ్ళు, పెద్దవాళ్ళు ఒక్కొక్కరుగా గొడుగుల్ని పొందిగ్గా పట్టుకొని వెంకటరమణ ఇంటివైపు బయల్దేరారు.

   శాస్త్రి గారి ఇంటికి ఎదురుగ ఉన్న అనంతం మాష్టారి కొబ్బరి చెట్టూ, ఇంటికి పక్కగా ఉన్న పనసచెట్టూ గాలిముందు నిలబడలేక ఓటమిని అంగీకరిస్తూ వాళ్ళ వంటగదిమీద కుప్పకూలిపోయాయి. "అయ్యయ్యో, సరస్వతమ్మగారు మడి, తడి సరిగా సాగట్లేదని గత ఏడాది దగ్గరుండి కట్టించుకున్న వంటిల్లు ఎలా కూలిపోయిందో కదా"! బాధపడుతున్నారు లక్ష్మీ దేవిగారు.

   పురాణపఠనం చెయ్యడానికి తగిన వెలుతురు లేదు. కిటికీ దగ్గర భార్యాభర్తలు కుర్చీలు వేసుకొని కూర్చొని, కబుర్లలో పడ్డారు. సాయంత్రం ఐదు కావస్తోంది. "నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను" అంటూ లేచారు లక్ష్మి గారు. ఆమె వంటగదిలోకి వెళ్తూ ఉంటే శాస్త్రిగారూ ఆమె వెంట వెళ్లారు. పరవాలేదు నేను చూసుకుంటాను అన్నారు ఆవిడ. ఇక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి. పైగా తుఫాను కదా, భయపడతావు. నేనేమీ పని చేయడంలేదు కదా!" అన్నారు ఆయన.

 &n

bsp;  చెరువు గట్టు తెగిపోయేలా ఉందిట. ఎవరో అరుస్తున్నారు వెనకాల వీధిలోంచి. పెరటివైపు ఉన్న వీధిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు చెట్లు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వీధివైపు నుండి చుట్టూ తిరిగి వెళ్ళాలి. కాఫీ తాగేసి, వంటప్రయత్నం చెయ్యకు లక్ష్మీ. నేనొచ్చాకా చూద్దాం" గబగబా బయటికి నడుస్తూ చెప్పి, చేతికర్ర, తాటాకుతో చేసిన గొడుగు వేసుకొని చెరువు గట్టువైపు బయల్దేరారు. "అయ్యగోరూ, తమరెందుకు ఇలా వచ్చారండీ" అడిగాడు సింహాచలం.

     "చెరువు గట్టు తెగిపోతోంది కదరా చూద్దామని వచ్చాను" ముందుకు నడుస్తూ చెప్పారు శాస్త్రిగారు. చిన్నా పెద్దా అందరూ గుమ్మాల్లోదీనంగా కూర్చుని ఉండడం చూశారు ఆయన. "ఏరా సింహాచలం ఎవరూ భోజనం చేసినట్లు లేదు"? అడిగారు. "సిత్తం పంతులుగోరూ, పనినేకపోతే మా బతుకులు ఇంతే కదండీ" అన్నాడు. "సింహాచలం, రాత్రికి బ్రాహ్మల వీధిలో భోజనాలు అని అందరికీ చెప్పు. ఒక్కరూ భోజనం తినకుండా పడుకోకూడదు, నువ్వు ఆ పనిలో ఉండు. నేను చెరువు గట్టు మీదికి వెళ్ళొస్తాను" అంటూ వడిగాముందుకు నడిచారు ఆయన.

    "అయ్యా! తవరింట్లో భోజనాలా, మీ ఈదిలోకి రావడానికే మేము శానా ఆలోసిత్తాము, అలాంటిది పిలిసి మరీ బోజనాలు పెడతామంటున్నారు" ఏదో చెప్తున్నాడు. "చెప్పింది చెయ్యి సింహాచలం, నేను చెరువు దగ్గరకి వెళ్ళి, మనోళ్లందరిని పలకరించి వస్తాను. ధైర్యం చెప్పాలి" ఇంటికి చేరుకుంటూనే లక్ష్మీ, ఊళ్ళో అందరూ అభోజనంగా పడుకుంటున్నారుట, కాళ్ళు కడుక్కుంటూ చెప్పారు" వంటగదిలోకి ఆవిడ వెళ్తూ ఉండగా, శాస్త్రిగారు "రావయ్యా, కరణం, రావయ్యా సుబ్రహ్మణ్యం, మనకి సేవ చేసే భాగ్యం కలిగింది. ఊరంతా అభోజనంగా ఉండిపోయింది, వంటల్లో సాయం చెయ్యండి" అంటూ పిలిచారు. 

     ఊళ్ళో వాళ్ళు తిండి లేకుండా ఉన్నారంటే వాళ్ళ మనసులు బాధగా మూలిగాయి. ఒక ఇంట్లో అన్నం గుండిగలు రెడీ అవుతున్నాయి, మరో ఇంట్లో కూర, ఇంకొకరింట్లో పులుసు ఇలా అరగంటలో వంట సిద్ధమైపోయింది. ముందు పిల్లలు, పెద్దవాళ్ళు అయ్యాకా, ఆడవాళ్ళు, తరువాత మగవాళ్ళకి వడ్డించేవారు వడ్డిస్తూనేఉన్నారు. వండిన వాళ్ళు వండుతూనే ఉన్నారు. రాత్రి పదిగంటల వరకూ భోజనాలు నడిచాయి. ఎవరిళ్ళకివాళ్ళు సంతోషంగా చేరుకుంటున్నారు. భోరున వర్షం. అయినా అక్కడ పెద్ద తిరణాల లాగా జరిగిపోయింది.

    అర్థరాత్రి అయ్యిందేమో, బాగా అలసటగా ఉన్న శాస్త్రిగారు ఉలిక్కిపడి నిద్రలేచారు. ఎవరో గుమ్మంలో నిలబడి పిలుస్తున్నట్లు వినిపించి పరుగున వచ్చి తలుపు తీశారు. "రావులమ్మ ఇల్లు కూలిపోయింది పంతులుగోరూ, ఈ ఏలప్పుడు తమరిని బాధపెట్టకూడదని అనుకున్నాం" రాములమ్మ దూరపు బంధువు లక్ష్మణ అన్న అబ్బాయి చెప్పాడు. "అయ్యో ఇల్లు కూలిపోయిందా, పదిమంది పెద్దలు బయల్దేరారు. దారిపొడవునా అడ్డంగా పడిపోయిన చెట్లు. కొందరు గుమ్మాల్లోనే కూర్చొని పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు. ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో అని భయం.

     అందరూ రాములమ్మ ఇంటికి చేరుకున్నారు. ఎవరైనా లోపలికి వెళ్ళి చూడండి అన్నారు శాస్త్రిగారు లాంతరు వాళ్ళ చేతికి ఇవ్వడానికి పట్టుకున్నారు. "అయ్యా, ఏ గోడలైన కూలిపోతాయేమో అని భయపడు తున్నారండీ" చెప్పాడు సింహాచలం. అలా భయపడితే ఎలారా. మీ ఇళ్ళల్లో చిన్నపిల్లలకి నీళ్ళు పొయ్యడం దగ్గరనుండి, రాములోరి కళ్యాణం వరకు రాములమ్మ లేకుండా జరుగుతుందా మనూళ్ళో. పదండీ మీ వెనకాల నేనూ ఉన్నాను అంటూ ఉండగా, కొందరు కుర్రాళ్ళు కత్తులు తెచ్చి, ఎక్కడికక్కడ పైకప్పు విడగొట్టి లోపలికి దారితీశారు.

     ఎక్కడో గోడకింద నుండి రాములమ్మ చెయ్యి కనిపిస్తోంది. ఒరేయ్ ఇక్కడ ఉందిరా, రండి అంటూ శాస్త్రిగారు కేకపెట్టడంతో అందరూ అక్కడికెళ్ళి రాములమ్మని చాలా కష్టమ్మీద బయటికి తీశారు. తలకి పెద్ద గాయమైంది. అక్కడికక్కడే ప్రాణం పోయినట్లుంది. రాములమ్మా అంటూ ఆమెను గట్టిగా కదిలించారు కానీ అప్పటికే ఆమె శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.

   ఇప్పుడెలాగా అన్నారు ఎవరో? శవాన్ని ఎక్కడుంచాలి అడిగారు. అందరూ ఒకరిముఖాలు ఒకరు చూసుకోసాగారు. కనీసం శవాన్ని ఉంచడానికి కూడా వాళ్ళ గుడిసెళ్ళో అవకాశం లేకుండా పోయింది. "ఒరేయ్, లక్ష్మణా, పట్టంద్రా సాయం అంటూ అక్కడే ఉన్న పట్టెమంచం మీద రాములమ్మని పడుకోపెట్టి, ఒకవైపు పైకెత్తుకోడానికి సిద్ధపడ్డారు శాస్త్రిగారు. అది చూసి అనంతం మాస్టారు కూడా ముందుకు వచ్చారు. "అయ్యో, తమరు గొప్పవారు, మేమున్నం కదయ్యా అంటూ నలుగురు నాలుగువైపులా పట్టుకున్నారు. మా గడపలో ఖాళీయే గా ఇక్కడే దింపండి మంచం అంటూ ఒక చాప తెచ్చి పరిచారు కరణంగారు. రాములమ్మ తల దగ్గర దీపం పెట్టారు ఆయన భార్య.

   ఆడవాళ్ళు, మగవాళ్ళు వర్షాన్ని లెక్కచెయ్యకుండా ఒక ఏభై మంది వరకూ చేరుకున్నారు. రాములమ్మ తమ ఇళ్ళల్లో ఎలా సేవలు చేసిందో చెప్పుకున్నారు. రాములమ్మ కొడుక్కి ఉదయం ఫోన్ చేద్దాం అనుకున్నారు. ఉదయానికి ఆకాశం కొంచెం తెరిపి ఇచ్చింది. భారీ వర్షం తగ్గి, జల్లులు జల్లులు పడడం మధ్యమధ్య కాసేపు విరామంతో తుఫాను నెమ్మదించింది. ఉదయం ఆరు అయ్యేసరికి ఊరంతా పిల్లాపాపాలతో అక్కడికి చేరుకున్నారు. శ్మశానంలో ఏర్పాట్లు చూడ్డానికి పదిమందిని ఏర్పాటు చేశారు.

  రాములమ్మకి అంతిమ వీడ్కోలుకు ముందు శాస్త్రోక్తంగా బ్రాహ్మలు పూజాదికాలు జరిపించి, పాడెనెత్తుకున్నారు. కాపులు ఎంత వారించినా రాములమ్మ మనసు బంగారంరా. మనూళ్ళో పిల్లలందరికీ స్నానాలు చేయించేది. పురిటి బట్టలుతికి తెచ్చేది. గుడికి పువ్వులు అందించేది. రాములోరి కళ్యాణం అంతా తనదే హడావుడి. అలాంటి గొప్ప మనిషి రాములమ్మ. అంటూ అందరూ ఆమె అంత్యక్రియలు ఘనంగా నిర్వహించి ఆమె ఋణాన్నితీర్చుకున్నారు.

    "ఈ గాలివాన మనకోక గొప్ప గుణపాఠం నేర్పించింది. నేటినుండి కులాలవారిగా మనం విడిపోకూడదు. మనసున్న మనుషుల్లా మెలగాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళం ఉంటూ, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం, అవసరాలకి సాయం చేసుకోవడం చెయ్యాలి" చెప్పారు శాస్త్రిగారు. "అయ్యా, మీలాంటి పెద్దోళ్ళుఅలా సెప్తే మేమెలా కాదంటామయ్యా, మాకు సేతనైన సాయం మేము సేత్తాము. తవరికి తోసింది తవరు సెయ్యండి" చెప్పారు మిగిలిన వాళ్ళు. తనవలన ఊరంతా ఒక్కటైనందుకు, అందరూ ఒక్కమాట మీద నిలబడినందుకు రాములమ్మ ఆత్మ సంతృప్తిగా అక్కడినుండి నిష్క్రమించింది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy