సదా మీ సేవలో
సదా మీ సేవలో
కథ పేరు :- సదా మీ సేవలో 🌤🌤
💐💐💐
"ఏమిరా వెంకటేసూ! అప్పు తీసుకున్న రోజు ఇనయంగా వచ్చి నిల్చుంతావ్.నెలా నెలా వడ్డీ కడతాను మావా సమయానికి అనినావు.ఇప్పుడు మనిషి వే పత్తా లేవు.
ఇంటికొత్తే లేవంతారు. లేదా తాళం ఏసి ఉంతాది.ఎన్ని సార్లు తిరగాలి.తిరిగీ తిరిగీ నా కాళ్లు అరిగి పోతున్నాయి.
ఇట్టా అయితే కుదురదు రా ఓ రెండు నెలల్లో నా అసలూ, వడ్డీ రెండూ కట్టేయ్యాలా.
లేదంటే నాకు హామీ కింద పెట్టిన ఇంటి పత్రాలు, పామిసరీ నోటూ బట్టీ నీ ఇంటిని నా సొంతం సేసేసుకుంటా!" అంటూ ఇంటి ముందు వీరంగం చేస్తున్నాడు వడ్డీ వ్యాపారి ఓబులేసు.
అతనంత అరుస్తున్నా బయటకు రాకుండా ఇంట్లో నే కుమిలి పోతున్నాడు వెంకటేసు.అతను తమ ఇంటికి వస్తున్నాడని తెలిసి ఇంటి ముందు తాళం వేసి వెనుక దారి గుండా ఇంట్లో కి వెళ్ళి లోపల గడియ పెట్టుకుని ఉన్నారు వెంకటేసు,అతని భార్య గంగ.
సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన వారి కూతురు తలుపుకి తాళం వేసి ఉండటంతో అందరినీ అడిగింది
"ఏమోనమ్మా ఎటెల్లారో మాకు తెల్వదు.ఉదయం ఓబులేసు వచ్చి ఇంటి ముందు అరుస్తున్నా ఎవరూ బయటకు రాలేదు,ఇదెప్పుడూ జరిగే తంతే కదా అనుకొని మా పని లో మేం పడిపోయాము " అంది పక్కింటి పంకజం.
యామిని వెనుక ఉన్న ద్వారం దగ్గరకు వెళ్లింది.అదీ వేసే ఉంది.
"నాన్నా , అమ్మా తలుపు తీయండి..." అంటూ ఏడుస్తూ ఇంటి ముందు తలుపు కొడుతుంది యామిని.
ఆమె ఏడుపుతో చుట్టు పక్కల వారు చేరి... తలుపులు కొట్టడం మొదలు పెట్టారు.పొలం కి వెళ్లారేమో అని ఒకర్ని పంపారు. అక్కడా లేరు. ఇంటి నుంచి బయటకు రావడం మేము చూడలేదని చెప్పారు కొందరు.
ఇంక మరో ఆలోచన లేకుండా గునపాలతో తలుపులు బ్రద్దలు కొట్టారు. అలా బ్రద్దలైన తలుపుల గుండా లోపలికి వెళితే వారికి దర్శనం ఇచ్చాయి వెంకటేసూ, గంగ శవాలు ఉరి కి వేలాడుతూ.
వెంకటేసు చేతిలో చిన్న కాగితం.
"తల్లీ .. మమ్మల్ని మన్నించు తల్లీ.నిన్ను వదిలి పోతున్నాము. భూమి ని నమ్ముకున్నోడిని ఆ తల్లి ఒదులు కోదు అనుకున్నాం.
కానీ ఆ భూమి తల్లి కి నా మీద ఎందుకో కోపమొచ్చినాది తల్లీ. అందుకే ప్రతీ ఏడూ నష్టమే వస్తుండాది. ఈ ఇంటి మీద కూడా అప్పుసేసి నీకు ఉండనీకి నీడ కూడా లేకుండా చేసినా. నన్ను క్షమించు తల్లీ... " అంటూ ఉంది.
"అరేయ్ వెంకటేసూ ఎందుకింత పనిసేసినావురా. ముందే సెప్పినాము మా మాట వినినావా.ఇప్పుడు సూడు ఏటైనాదో. చిన్న బిడ్డ రా . ఎట్టా బ్రతుకుతది అని కూడా ఆలోచన సేయ లేదు రా.నీ బిడ్డ కి ఏది దిక్కురా. అదెట్టా బతుకుతదిప్పుడు" అంటూ అతని స్నేహితులు ఆ పాపని పట్టుకుని ఏడ్చారు.
కానీ ఆ చిన్న పాప కి ఎందుకో ఏడుపు రావడం లేదు."ఇంటి కి వచ్చిన వెంటనే నవ్వుతూ ఎదురోచ్చే అమ్మా... నా తల్లీ... నా బంగారం అని ముద్దు చేసే నాన్న తనని వదిలేసి ఎటుపోతారు.వారికి నేనంటే ప్రాణం. నన్ను విడిచి పోరు. వీల్లెందుకు ఏడుస్తున్నారు?" అని అందర్నీ వింతగా చూస్తూ కూర్చుంది.
"బిడ్డా... మీ అమ్మా, నాయనా నిన్ను ఒగ్గేసి ఆ దేవుని కాడికి పోయినారే.ఇంక నీకు దిక్కెవరే" అంటూ చుట్టూ ఉన్న ఆడవాళ్లు ఏడుస్తున్నారు.
ఆ సాయంత్రానికి ఆ ఇద్దరి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
అప్పటి నుంచి ఆ అమ్మాయి ఒక్కర్తే ఉంటుంది ఆ ఇంట్లో. చుట్టుపక్కల వారు ఆమె చిన్న చిన్న అవసరాలు తీర్చేవారు.
ఓబులేసు తో మాట్లాడి ఆ ఇంటి ని పిల్లకే ఉంచమని... కొంత భూమి అమ్మి అతని అప్పు తీర్చారు వెంకటేసు స్నేహితులు.
౦౦౦
ఇలాంటి రైతులెందరో తమ పంట లు పండక,చేసిన అప్పులు తీర్చలేక,అప్పుల వాడు అనే మాటలు భరించలేక,తమనితాముఅంతమొందించుకుంటున్నారు
వారి కష్టాలను తీర్చే మార్గమే లేదా. అలా వారు తమ జీవితాలను అంతమొందించుకున్నారు సరే. మరి తమ వారి సంగతి. వారిని ఎవరు చూస్తారు.
వారి కష్టాలను తీర్చడానికి.... వారికి ఆర్థిక భరోసాను,పంట దిగుబడి సలహాను అందివ్వడానికి భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తే బాగుండేమో కదా.
ప్రభుత్వం కూడా ఆ వైపుగా యోచన చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఓ మంచి పథకం వస్తే బాగుండు.
సరిగ్గా అలాంటి ఆలోచనలతోనే 20 సంవత్సరాల తర్వాత మొదలైంది ఓ సంస్థ.
20 సంవత్సరాల తర్వాత :-
ఓ ఆఫీసు ముందు చాలా ముంది లైన్ కట్టి ఉన్నారు.ఆ ఆఫీసు లోపల ఇంజనీరింగ్, MBA చేసిన వారు వర్క్ చేస్తున్నారు. వారంతా తమ తమ వర్క్ లో బిజీ గా ఉన్నారు.
అసలక్కడ ఏం జరుగుతుందంటే... భూమి ని సాగు చేసే సన్నకారు రైతులకు తక్కువ వడ్డీకే రుణ మంజూరు. గవర్నమెంట్ బాంకుల కంటే వడ్డీ తక్కువ, లోన్ ప్రోసెస్ కూడా చాలా తక్కువ టైం లో జరుగుతుండటం తో చాలా మంది రైతులు ఆ ఆఫీసు ముందు క్యూ కట్టారు.
ఆ ఆఫీసు పేరు..... సదా మీ సేవలో వ్యవసాయం చేసే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసి.... పంట ఎక్కువగా దిగుబడి రావాలంటే ఏం చేయాలో సలహాలు కూడా ఇస్తుంది ఆ ఆఫీసు వ్యవస్థాపకురాలు యామిని.
30 ఏళ్ల ప్రాయం. ఒద్దికగా కాటన్ సారీ ని కట్టుకుని... ఓ చేతికి ఒక గాజు.. ఇంకో చేతికి వాచ్ పెట్టుకుని.... జడని లూజ్ గా అల్లి.. చివర ఓ బాండ్ పెట్టి... నుదుట చిన్న బొట్టు... పాపిట కుంకుమ తో.... ఎల్లప్పుడూ ముఖం పై చిరు నవ్వు చెదిరిపోకుండా,వీసమెత్తైనా గర్వం లేనివ్యక్తి.
అగ్రికల్చర్ యూనివర్సిటీ లో పీజీ పట్టా పొంది పెద్ద కాలేజీల్లో టీచింగ్ అసిస్టెంట్ గా అవకాశం వచ్చినా కాదనుకుని తన లాంటి ఆలోచన కలిగిన కొంత మంది తో తమ సొంత పెట్టుబడి తో సదా మీ సేవలో అనే ఓ వ్యవసాయ సహకార బాంక్ మరియూ కౌన్సిలింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది.
ఆ బాంకు సేవలు బాగుండటం తో చాలా గ్రామాలనుంచి రైతులు వచ్చి లోన్ తీసుకుంటూ,పంట మెరుగుపడటానికి మెలుకువలూ, సేంద్రీయవిధానం లో పంట ని పండించడం ఎలా సేంద్రీయ ఎరువులు తయారు చేయాలో చెప్పేది.
ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఓపికగా చెప్పేది. ఇంత పెద్ద బాంకు ని మెయిన్ టెయిన్ చేస్తూ ఇసుమంతైనా గర్వం కానీ.... పని బడలిక కానీ ఆమె ముఖం లో కనపడదు.
"యామినమ్మా!ఈ పాలి నా పొలంలో ఏ ఎరువు వేయాలి.పట్నం లో బోలేడు మందులు దొరుకుతాండాయట మా అల్లుడు సెప్పి అవే ఏయమంటుండు పొలానికి.నే వినిపించుకోలా.మా యామినీ తల్లైతే మంచి ఎరువు సెప్తాది.అదేత్తే పంట దిగుబడి బాగా వత్తాది అని సెప్పినా.నువ్వు సెప్పు తల్లీ ఏ మందు ఏయాలో మన పొలం లో" అన్నాడు ఓ రైతు.
ఆ తాత కి ఏం చేయాలో ఓపికగా చెప్తున్న ఆమె ని చూసి ఓ రైతు ఇంకో రైతు తో "ఇంత పెద్ద బాంకు ని నడుపుతూ ఆ యమ్మ ఎంత ఓపికగా అన్ని పశ్నలకి సమాధానం ఇత్తాందో.అప్పు అవసరం అయిన వారందరికీ అప్పు ఇచ్చి ఆదుకుంటుంది ఆ మహాతల్లి. అటువంటి ఈమె ని కన్న తల్లీ దండ్రులు ఎంత గొప్పవారో "అని.
"ఆమె కూడా మీలాంటి ఓ రైతు బిడ్డే తాతా.తన తల్లిదండ్రులు వ్యవసాయం కోసం చేసిన అప్పు తీర్చలేక చనిపోతే,తన తల్లిదండ్రుల లాంటి ఏ రైతూ ఆత్మహత్య చేసుకోకూడనీ....
భూమి పండించే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే వారు పంట పండించుకుంటారనీ, సేంద్రియ వ్యవసాయం చేస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆలోచన తో..
అసలు రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడనీ... అలాంటి రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చలించిపోయి,ఇక మీదట అలాంటి చావులు లేకుండా ఉండాలని తను మొదలుపెట్టిన చిన్న ప్రయత్నమే ఈ సదా మీ సేవలో .
ఆమె తల్లీ తండ్రీ చనిపోయే నాటికి ఆమె వయసు పది సంవత్సరాలు.అంత చిన్న వయసులో వారిద్దరూ చనిపోయినా ఒంటరి తనమే తన స్నేహితురాలు గా చేసుకుని..... ఆత్మ విశ్వాసమే ఆలంబనగా... రేపటి తరం లో ఏ రైతూ తన అప్పు తీర్చులేక చనిపోకూడదని. పంట పొలాలను అమ్ముకుని పట్నం లో పనులు చేసే పరిస్థితి రాకూడదు అనీ మొదలు పెట్టారు ఆమె ఈ సంస్థ" అన్నాడు ఒకతను.
"ఇన్ని ఇసయాలు చెప్తుండావు.... నువ్వెవరు బాబూ?" అన్నాడు ఆ తాత.
"నేను ఆమె భర్త .... విక్రాంత్ ని" అంటూ ముందుకు కదిలాడు అతను.
అలా వెళుతున్న అతన్నే చూస్తూ "ఆ మహా తల్లి కి సరియైన జోడీ.... అనుకోకుండా ఉండలేక పోయారు" ఆ రైతులిద్దరూ.
అసలు యామిని కి ఇలాంటి ఓ సంస్థ ను నిర్వహించాలనే ఆలోచన ఎందుకు కలిగిందో తెలుసుకోవాలంటే .... ఆమె నేపథ్యాన్ని ఓ సారి తెలుసుకోవాలి.... తెలుసుకుంటే, ఆమెకి ఇంత మంచి ఆలోచన ఎందుకు కలిగిందో అర్థం అవుతుంది.
☀☀☀
యామిని నేపధ్యం :-
యామిని.... మనం కథ మొదట్లో చదివిన వెంకటేసూ, గంగ ల ఒక్క గా నొక్క కుమార్తె.
వెంకటేసు వంశ పారంపర్యంగా వస్తున్న భూమి ని సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించే ఓ సన్నకారు రైతు.అతనూ, అతని భార్య గంగ,కూతురు యామిని చిన్న కుటుంబం.
వెంకటేసు రోజూ పెందలాడే నిద్ర లేచి దంత ధావనం ముగించి,రాత్రి మిగిలిన సద్దన్నాన్ని, మిరప కాయ నంచుకుని తిని ఓ కర్ర, పార పట్టుకుని తన పొలానికి వెళతాడు.
గంగ,వెంకటేసు పొలంకి పోయినాక ఇంటి కాడ పనులు పూర్తి చేసుకుని,యామిని కి బడి కి తయారు చేసి ఆమె మధ్యాహ్నం భోజనం పట్టుకుని భర్త దగ్గరకు వెళుతుంది. ఇద్దరూ కలిసి పని చేసి పొద్దు గుంకే వేలకి ఇంటికి తిరిగి వస్తారు.
అలా తాతలనాటి వ్యవసాయ భూమిని ఎకరం ఉన్నది కాస్తా నాలుగు ఎకరాలు చేశాడు వెంకటేసం తన కష్టంతోనే.
కానీ వ్యవసాయ పెట్టుబడికి తగిన లాభం లేకపోవడం అతివృష్టి,అనావృష్టి వల్ల పంట దిగుబడి లేకపోవడంతో
వెంకటేసు అప్పులు పాలయ్యాడు.
అయితే చాలామంది తమ భూములు అమ్ముకుని వేరే ప్రాంతాల్లో నివసించడానికి వెళ్ళిపోయినా వెంకటేష్ మాత్రం తన తల్లి లాంటి భూమి అమ్ముకో దలచుకోలేదు.
"భూమి మన అమ్మలాంటిది.తల్లిపాలు ఇవ్వట్లేదని రొమ్ము కొరికినట్టు,భూమి పంట ఇవ్వడం లేదని అనుకుంటారా!" అనేవాడు.
"నీది పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో వ్యవసాయం చేసి ఎవరు లాభపడ్డారు.అందరూ భూమి అమ్ముకుని బాగు పడుతుంటే నువ్వేమో వ్యవసాయం,వ్యవసాయం అంటూ అప్పులపాలవుతున్నావు.
ఈసారైనా మా మాట విను మీ పక్క పొలం లో ఉన్న శంకర్ తన పొలాన్ని ఎక్కువ రేట్ కి అమ్ముతున్నాడు. నువ్వు కూడా అమ్ము మంచి లాభం వస్తుంది దానితో మీ అప్పులు తీరుతాయి.ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని సంసారాన్ని నెట్టుకు రావచ్చు" అని చాలామంది సలహా ఇచ్చారు.
వెంకటేసు ఎవరి మాటా వినలేదు "నేను బ్రతికి ఉండే వరకు వ్యవసాయం చేస్తూనే ఉంటాను. భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోను" అని బదులిచ్చి తన పని తాను చేసుకునేవాడు.
"ఒరేయ్ బాగు పడే వాడికి ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు.కానీ ఇలా కోరి కష్టాలు తెచ్చుకుంటాను అనుకునేవారికి ఎన్ని సలహాలు ఇచ్చినా లాభం లేదు వాడిని వదిలేయండి" అని స్నేహితులు అతనికి సలహా ఇవ్వడం కూడా మానేశారు.
యామిని ప్రస్తుతం ఐదో తరగతి చదువుతుంది ఆ వూరి గవర్నమెంట్ స్కూల్లో.
"అందరు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే తను మాత్రం ఎందుకు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాను" అని తండ్రికి చాలా సార్లు అడిగింది.
"అమ్మా!మన తాహతు ఇంతే అంతకుమించి ఎక్కువ కోరికలు ఉండకూడదు.నువ్వు కూడా అత్యాశకు పోకుండా దొరికిన దానితో సర్దుకుపోవాలి.ఉన్న దాంట్లో అవసరమైన వారికి సాయపడాలి" అని కూతురికి సలహా ఇచ్చేవాడు.
"సరే నాన్న గారు నేను బుద్ధిగా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకుంటాను.మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తాను" అని అనేది బుల్లి యామిని.
తన కూతురు అలా చెప్తుంటే తల్లీ ,తండ్రీ ఇద్దరు మురిసిపోయేవారు.
"నా బిడ్డకి అన్నీ మంచి గుణాలే ఉన్నాయి. చెప్పగానే వింటుంది. నా బంగారు తల్లి" అనేవాడు వెంకటేసు.
"ఇది బంగారుతల్లి కాదండీ,మా అమ్మ కూడా. నేను కాస్త బాలేదని పడుకున్నా తల్లడిల్లి పోతుంది. అమ్మ డాక్టర్ ని పిలుచుకుని రావాలా, మందులు తేవాలా, రొట్టె తింటావా అంటూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. మళ్లీ నేను మామూలు మనిషిని అయ్యేదాకా దానికి నిద్ర అన్నదే ఉండదు నా బంగారు తల్లి" అని కూతురు నుదుటున ముద్దు పెట్టుకుంది గంగ.
౦౦౦
రోజులు అన్ని ఒకేలా ఉండవు కదా. అదేవిధంగా వెంకటేసుకి వ్యవసాయంలో నష్టం వచ్చింది. పెట్టుబడికి సరిపోయిన దిగుబడి రాలేదు.పంట కోసం తెచ్చిన బ్యాంకు అప్పు తీర్చే మార్గం లేక ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారి ఓబులేసు దగ్గర రెండు లక్షలు అప్పు చేశాడు.
ఆ డబ్బుతో బ్యాంకు అప్పు తీర్చి మిగిలిన సొమ్ము తో విత్తనాలు,ఎరువులు కొని పంట వేశాడు.పైరు ఏపుగా పెరిగింది.మంచి రాబడి వస్తుందేమో ఈ సంవత్సరం అని సంతోషం పడే లోపే వర్షాలు అతని ఆశల్ని ఆవిరి చేశాయి.
పుట్టిన పంట కాస్తా నీట మునిగి కుళ్లిపోయింది. వెంకటేసు కి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయ్యింది. అప్పు ఇచ్చినప్పుడే చెప్పాడు ఓబులేసు నెలనెలా వడ్డీ జమ చేయాలని, పంట సేతికందాక అసలు లో కొంత మొత్తం జమ చేయమని.
"ఇప్పుడు పంటేమో నీట మునిగింది.ఉన్న కాస్త డబ్బు ఇల్లు గడవటానికే సరిపోవు.మరి ఓబులేసు కి అప్పెట్టా కట్టేది" అనే దిగులు పట్టుకుంది వెంకటేసుకి.
"ఏం మావా... ఎందుకట్టా విచారిస్తున్నావు"అంది గంగ.
"విచారం కాక ఇంకేం సేసేదే.అందరూ భూములమ్ముకుని మారాజుల్లెక్క ఉంటుంటే నేనేమో నేలతల్లి ని అమ్మ బోనని అప్పుసేసి పంటేసినా. అదిప్పుడు వర్షానికి నీట మునిగింది.
ఆ ఓబులేసు అప్పు ఇచ్చినప్పుడే సెప్పినాడు.నెలా నెలా వడ్డీ జమచేయమని.ఉన్న కాస్త డబ్బు మన తిండికే సరిపోదు.ఇంక అప్పెట్టా తీర్చేదే"అంటూ తల పట్టుకున్నాడు ఓబులేసు.
"ఊరుకో మావా!ఆ దేవుడు నమ్మినోలను మోసం చేయడు.మనకూ మంచి రోజులొత్తాయి.నువ్విట్టా విచారంగా కూర్చుంతే నీ కూతురు బడికి పోనంటుంది" అంది గంగ.
వెంటనే కళ్లు తుడుచుకొని.... " ఏటి నా బంగారు తల్లి బడి ఎల్లదా.అమ్మా బంగారం ఏమి రా బడికి పోనంటివంటా!" అన్నాడు యామిని పక్కన కూర్చుని.
"నువ్వు విచారంగా కూర్చున్నావు కదనాన్నా. మరి నేనెట్టా బడికి పోయేది.ఎప్పుడూ ఉదయాన్నే పొలంకి పోయేటోడివి.ఇప్పుడేమో పోవడం లే.పొద్దు గాల లేచిన సంది ఆలోచిస్తా ఉంటావు.తినమన్నా తినడం లేదు. నాతో ఆడుకోవడం లేదు. నువ్వు మారిపోయావు నాన్నా" అంది యామిని బాధగా.
"అయ్యో!తల్లీ అదేం లేదు రా.పొలం కాడ పని లేదు అందుకే పోవట్లా. ఒంట్లో కాస్త నలతగా ఉంటే ఇంటికాడే ఉండిపోతున్నాను. అందుకే నీతో ఆడుకోవడం లేదు" అన్నాడు వెంకటేసు కూతుర్ని ఒడిలోకి తీసుకుంటూ.
"అవునా నాన్నా! బాలేదా.జ్వరం వచ్చిందా"అంటూ తలపైన చేయిపెట్టి... "అవును నాన్నా జ్వరం వచ్చింది.ఒళ్లు కాలిపోతుంది. ఉండు నేను డాక్టర్ ని తీసుకుని వస్తా!" అంటూ తండ్రి ఒడిలో నుంచి లేచింది యామిని.
"అదేం లేదు లే తల్లి చిన్న జొరమే.ఓ రోజు ఇంట్లో ఉంటే తగ్గిపోతాది.నువ్వు బడి పో తల్లీ" అన్నాడు వెంకటేసు.
"చిన్న జ్వరం అయితే నువ్వు ఇంటిదగ్గర ఉండవు ఈ పాటికి పొలం కి పోతావు జ్వరం ఎక్కువ ఉన్నట్లు ఉంది అందుకే ఇంట్లో ఉండి పోయావు.నేను ఇప్పుడే వెళ్లి డాక్టర్ ని తీసుకొని వస్తా నువ్వుండు" అంటూ పరుగున ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళింది.
"డాక్టర్ గారు నాన్నకి జ్వరం వచ్చింది ఓసారి రండి తినకుండా పడుకోకుండా అలా ఉంటున్నాడు.ఒకసారి చూసి మందులు ఇవ్వండి" అంది యామిని.
"వస్తాను కానీ కొంచెం టైం పడుతుంది అమ్మా.పేషెంట్లు ఎక్కువమంది ఉన్నారు"అన్నాడు డాక్టర్ తన పని చేసుకుంటూనే.
"పర్లేదు డాక్టర్ గారు ఎంతసేపైనా ఉంటా, మీతోనే ఇంటికి వెళ్తా, మా నాన్నని చూడండి" అంటూ అక్కడే నిలబడింది.
పేషెంట్లను చూస్తూ యమినీనే గమనిస్తున్నారు డాక్టర్ గారు.
"ఇంత చిన్న పిల్ల ఇంత చిన్న పిల్ల తన తండ్రికి బాగు లేదని ఎంత తల్లిడిల్లిపోతుంది అనుకుంటూ పేషెంట్ల ని చూడటం పూర్తి చేసి యామినీ తో బయలుదేరాడు.
వెంకటేసు కి ఒక ఇంజక్షన్ వేసి, కొన్ని గోళీలు ఇచ్చాడు రెండు పూట్లా వేసుకోమని. వెళుతూ వెళుతూ
"వెంకటేసూ నీ కూతురికి నువ్వంటే ప్రాణం రా.నేను తర్వాత వస్తాను ఇంటికి వెళ్లమ్మా అంటే మీరు వచ్చేదాకా నేను వెళ్లను అని అందర్నీ చూసేదాకా నిలబడే ఉంది"అంటూ బయటకు వెళ్లాడు డాక్టర్.
ఆ మాట వినగానే... వెంకటేసు యామిని ని దగ్గరకు తీసుకుని "నా తల్లి కి నేనంటే... ఎంత ప్రేమో!" అని నుదుట ముద్దు పెట్టుకున్నాడు.
౦౦౦
తల్లిదండ్రులకు చిన్న సుస్తి చేస్తే కంగారు పడే యామిని కి వారిద్దరి మరణం..... తన జీవితాన్ని ఇంకోలా మార్చింది. ఏ రైతు కు కూడా తన తల్లీ తండ్రి లాంటి పరిస్థితి రాకూడదు అని.... ఓ రైతు బిడ్డగా రైతులకు ఓ బాసటగా నిలబడాలని తన టీచర్ ల సహాయం తో ఏ చదువు చదివితే వ్యవసాయానికి ఉపయోగ పడుతుందో తెలుసుకుని కష్టపడి చదివి ఈ స్థాయికి చేరింది.
Note :- ఈ రోజుల్లో వ్యవసాయం చేసే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే మార్గం చూపకపోయినా వారికి మాట సాయం చేసినా చాలు.
ఎందుకంటే రైతే లేకుంటే మనకి తినడానికి తిండి దొరుకుతుందా. కానీ అలాంటి రైతులు ఆకలితో పస్తులుండి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య లు చేసుకుంటుంటే చూస్తూ ఉంటామే కానీ చేయూత నివ్వం.
అలాంటి ఓ రైతు బిడ్డ ... తన తండ్రి లాంటి రైతులకు సహాయం చేసి.... వారి కి ఓ దిక్సూచి గా నిలబడితే అనే ఆలోచనే..... నా ఈ సదా మీ సేవలో .
అప్పట్లో రైతులంటే చాలా భూమి ఉండేది. వారిని మోతుబరి రైతు అనే వారు. కానీ పంట దిగుబడి లేక పంట సాగు కై చేసే అప్పు తీర్చడానికి ప్రతీ ఏటా కొంత భూమి ని అమ్మి అప్పులు తీరుస్తూ... మోతుబరి రైతులు కాస్తా సన్నకారు రైతుల్లా మిగిలారు.
అన్నదాతా సుఖీభవా.... జై కిసాన్....అన్నం పెట్టిన రైతుని ఆదుకుందాం.
💐💐💐
చదివి మీ విలువైన సలహాలు సూచనలు సమీక్ష రూపంలో ఇస్తారని కోరుతూ
మీ 🤗
కమల'శ్రీ'✍️.
