STORYMIRROR

kamala sri

Drama Tragedy Others

4  

kamala sri

Drama Tragedy Others

భరణం

భరణం

5 mins
396

            //భరణం//


"శ్రీమతి వసుధా చంద్రమౌళీ... శ్రీమతి వసుధా చంద్రమౌళీ... శ్రీమతి వసుధా చంద్రమౌళీ..." అని బంట్రోతు పిలవడంతో అంతవరకూ ఓ మూలన కూర్చున్న వసుధ తలవంచుకుని, చీరను భుజంపై వేసుకుని కోర్టులో అడుగు పెట్టింది. ఆమె మోము వాడిపోయింది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. భూభారాన్ని మోసే ధరిత్రి లా ఆమె గుండె భారంగా ఉంది. 


బోనులో నిలబడిన ఆమె వద్దకు వెళ్లిన ఆమె అపోనెంట్ లాయర్ మీ "పేరేంటమ్మా?." అని ప్రశ్నించాడు. 


"వసుధా చంద్రమౌళి."


"ఈ చంద్రమౌళి ఎవరూ?." 


"మా ఆయన పేరు సర్. పెళ్లయ్యాక అది నా పేరులో సగ భాగం అయ్యింది మా ఆయనతో పాటే."


"బోనులో ఉన్న ఈయన మీకు తెలుసా..."


"తెలుసు..."


"ఎలా తెలుసు?." 


"నా భర్త తను."


"అంటే చంద్రమౌళి గారు ఈయనేనా?."అవునన్నట్లు సమాధానమిచ్చింది వసుధ.


"మీ ఆయన గారు మీ నుంచి విడాకులు కోరుతూ అర్జీ పెట్టుకున్నారు. ఈ విడాకులు మీకిష్టమేనా?."


"ఇష్టమే సర్, కానీ..."


"కానీ ఏంటమ్మా?. భరణం ఏమైనా ఎక్సెపెక్ట్ చేస్తున్నారా?!."


"అవును యువరానర్."



"మరి కౌంటర్ లో భరణం ఏమీ వద్దని ఉంది. అలా చెప్పింది మీరేనా?!."



"నేనే సర్."


"అందులో వద్దని చెప్పి, ఇప్పుడు కావాలని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా?!."



"తెలుసు సర్. కానీ అడగక తప్పడం లేదు."



"సరే భరణం కోరడం భార్య హక్కు. చెప్పండి మీకేం కావాలో. మా క్లైంట్ ని ఎలా అయినా ఒప్పించి మీకు భరణం వచ్చేలా చూస్తాను. అతనికి కావాల్సిన విడాకులు ఇస్తారు కాబట్టి భరణం తప్పక ఇస్తారు. మీరు కోరిన భరణం ఇస్తే ఈ విడాకులు మీకు అంగీకారమేనా?!."



"అంగీకారమే సర్."



"అయితే చెప్పండి మీకేం కావాలో?!."



"అడుగుతాను సర్. కానీ నేను అడిగినాక కాదనకుండా ఆయన్ని అడిగి ఇప్పించాలి." 



ఆమె అలా అంటుంటే వసుధ తరుపు న్యాయవాది కోమలి కోపంగా ఆమె వైపే చూస్తూ , 'ముందు భరణం వద్దని ఇప్పుడు కావాలంటుందేంటీ?. కోర్టులో అందరి ముందూ నన్ను ఫూల్ ని చేసింది. ఛా చాలా మంచిది అనుకున్నా. కానీ ఇలా చేస్తుంది అని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎంతలా నటించింది. "నా నుంచి విడిపోతే ఆయన సంతోషంగా ఉంటారనుకుంటే విడాకులు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు మేడమ్" అంది.భరణం ఏమైనా కావాలని అడగాలా అంటే వద్దంది.ఆమె అలా అంటుంటే ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పదని అనుకున్నా.కానీ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది ఈ వసుధ. అనలసరంగా ఈ కేసు ఒప్పుకున్నా." అని తనని తాను నిందించుకుంది.



"అలాగేనమ్మా. అడుగుతాను. చెప్పండి మీకు భరణంగా ఏం కావాలి?. డబ్బా!, ఆస్తులా!, ఏం కావాలన్నా నేను అడిగి ఇప్పిస్తాను." అని ఓసారి చంద్రమౌళి వైపు చూశాడు ఆయన లాయర్ శరత్... "ఇస్తే విడాకులు ఇచ్చేస్తుంది గా. ఆ భరణమేదో ఇచ్చేసి ఆమెని వదిలించుకో." అన్నట్టుగా.



"నాకు నేను ఆయన చేతిలో కోల్పోయిన శీలాన్ని భరణం గా ఇప్పించండి చాలు." అంది వసుధ తలదించుకునే.



ఆ మాటకి అవాక్కయ్యారు కోర్టులో ఉన్నవారంతా. కోమలి ఆశ్చర్యంగా చూసింది వసుధ. 




"ఏమంటున్నావమ్మా... శీ...శీలమా...అదెలా ఇవ్వగలరు. మీకు కావాలంటే డబ్బు, ఆస్తులు ఇస్తారు." విసుగ్గా అన్నాడు శరత్.



"వాటితో నేనేం చేసుకుంటాను సర్. అయినా నేనేమడిగినా ఇప్పిస్తానని మీరేగా అన్నారు. నాకు నా శీలాన్ని భరణం గా ఇప్పించండి చాలు." 



యువరానర్ ఈమె కోరినదాంట్లో ఏమైనా అర్థం ఉందా?. శీలాన్ని ఎలా ఇవ్వగలరు. అది సాధ్యమేనా. విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా. ఆఖరి వరకూ తెచ్చి ఇప్పుడు ఇలా అడిగి కేస్ ని కొట్టించేయాలన్నది ఆమె ఉద్దేశ్యం. అందుకే ఇలా అడుగుతోంది. ఇదంతా చూస్తుంటే ఈమె మానసిక స్థితి స్థిమితంగా ఉన్నట్టు లేదనిపిస్తోంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుతోంది." తన అక్కసు వెళ్లగక్కాడు శరత్. 



"ఐ అబ్జక్షన్ యువరానర్. నా క్లైంట్ మానసిక స్థితి స్థిమితంగా లేదని హక్కు వీరికి ఎవరిచ్చారు?. ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది యువరానర్. భర్త వల్ల కోల్పోయిన శీలం భరణం గా ఇప్పిస్తే తను విడాకులు ఇచ్చేస్తానని అంది కదా. లాయర్ గారు కూడా ఆమె ఏమడిగినా ఇప్పిస్తానని అన్నారు. ఇప్పించమని చెప్పండి యువరానర్." అంది కోమలి కాస్త ఆవేశంగానే... వసుధ ఆలోచన సూచాయగా అర్థం అవ్వడంతో. 



"అబ్జక్షన్ సస్టైన్డ్. శరత్ గారు మీకు ఆమె మానసిక స్థితి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసుకి అవసరమైనవే మాట్లాడండి."అంది జడ్జి జయంతి. 



"కానీ యువరానర్ శీలాన్ని భరణం గా ఎలా ఇవ్వగలరు?. ఈమె కావాలనే ఇలా అడిగింది. ఏమ్మా అది కాక ఇంకేదైనా అడగండి." 



"వద్దు సర్. నాకు నా శీలం కావాలి. ప్రతీ ఆడది పెళ్లికి ముందు శీలాన్నీ, పెళ్లైయ్యాక సౌభాగ్యాన్నీ ప్రాణంగా భావిస్తుంది. ఇప్పుడు ఈయన విడాకులు ఇస్తే సౌభాగ్యం ఎలాగూ నాకు దూరం అవుతుంది. కనీసం పెళ్లికి ముందు నన్నంటిపెట్టుకుని ఉన్న శీలం నాతో ఉన్నా ఈయన నాతో లేరన్న భాదని తట్టుకో గలుగుతాను. అందుకే నాకు శీలాన్ని భరణంగా ఇప్పించండి." 



"వీలు కాదమ్మా! అదేమన్నా సంతలో దొరికే వస్తువా తెచ్చి ఇచ్చేయడానికి. శీలం. అది పోవడమే కానీ మళ్లీ రాదు." శరత్ గొంతులో కోపం ధ్వనించింది.



"మరి విడాకులేమన్నా విస్తరాకులా సర్ అడగ్గానే ఇచ్చేయడానికి. అంతవరకూ ముక్కూ ముఖమూ తెలియని వాడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని, ఏడడుగులూ నడిచి, ఏడు సంవత్సరాలు కలిసి కాపురం చేసి, కష్టసుఖాల్లో తోడూ నీడలా ఉంటాడనుకున్న మనిషి విడాకులు అనే ఒకే ఒక్క పదాన్ని తెల్లకాగితం మీద రాసిచ్చేస్తే మా ఇద్దరి మధ్యా బంధం పోయింది అంటే ఎలా సర్. అలా పోయిందే అనుకుందాం అప్పుడు ఆయన తన కొత్త జీవితాన్ని మరో వ్యక్తి తో సంతోషంగా గడుపుతారు. మరి నా సంగతేంటి యువరానర్. 



రెండేళ్ల కాలంలో అతనికి నాపై ప్రేమ కలిగిన ప్రతీసారీ నా శరీరాన్ని వడ్డించిన విస్తరి చేసి ఆయన ప్రేమాకలి తీర్చాను. ఇప్పుడు నేనో ఎంగిలి విస్తరిని. ఎంగిలాకులో భోజనాన్ని ఎవరైనా చేస్తారా?. ఒకడు వాడి వదిలేసిన వాళ్లని ఇంకొకరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా?. ఒకవేళ అంగీకరించినా ఒక్కసారైనా అనకమానడు నువ్వు శీలం కోల్పోయావు అనీ. ఇన్నాళ్లూ నా భర్తకే ఇచ్చాను అనుకున్నా. ఈ విడాకులు అయిన మరుక్షణం ఆయన నా భర్త కారు. అలాంటప్పుడు ఆయనకి ఇచ్చిన నా శీలాన్ని తిరిగి తీసుకోవడంలో తప్పు లేదుగా." అంది వసుధ గుండెల్లోని బాధని అదిమిపెట్టి.



"మీరు ఇప్పిస్తానని మాటిచ్చారు కదా శరత్ గారూ. తనకి కావాల్సింది మీ క్లైంట్ ని అడిగి ఇప్పించండి." జడ్జి జయంతి కూడా సూటిగా ప్రశ్నించారు.



"మేడమ్ మీరు కూడానా?!." 



"నేనే కాదు ఇక్కడున్న ఆడవాళ్లందరి మనసులో అదే ఉంది. ఆమె అడిగింది ఆమెకి భరణంగా ఇస్తానంటే విడాకులు మంజూరు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను." అన్నారు జడ్జి జయంతి.



"మేడమ్ గారు చెప్పారు కదా సర్. ఇప్పించండి సర్. మీరు చాలా పెద్ద లాయర్ కదా. సో మీరు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు. అలాగే వసుధ అడిగిన భరణం కూడా ఇప్పించండి. మీ క్లైంట్ కి విడాకులు మంజూరు అయ్యేలా చూడండి." ఉంది కోమలి కూడా.



"కోమలి గారూ మీ క్లైంట్ అడిగిన దానిలో అర్థం ఉందంటారా?.భరణం క్రింద ఇవ్వగలిగేవి అడగాలి కానీ. ఇలా తలాతోకా లేనివి అడుగుతారా ఎవరైనా?!." 



"తలాతోకా లేనిదేదీ నేను అడగలేదు సర్. నాకెంతో ముఖ్యమైనది తిరిగివ్వమని అంటున్నా." 



"అదెలా వీలౌతుందమ్మా?!." 



"ఎందుకు వీలవ్వదు సర్. ఆయన నాకు విడాకులు ఇచ్చినా బయట మామూలుగానే తిరగగలుగుతారు. కానీ నాకు రేపట్నించీ నరకమే కనిపిస్తుంది. బయటకు అడుగుపెడితే చాలు ఆబగా చూసే చూపులు, వెనకనుంచి ఆడే సూటిపోటి మాటలు, అవమానాలూ, అవహేళనలూ, ఒకటా రెండా ఎన్నో. మొగుడుతో మోజు తీరేదాకా కులికి అతనికి విడాకులిచ్చి వదిలించుకుంది. ఇది మహా ముదురు. ఇలాంటి ఆడవాళ్లతో మాట్లాడినా, వాళ్ల ముఖం చూసినా పాపమే అంటారు. అవన్నీ భరించే శక్తి నా గుండెకి లేదు. అలాంటి నిందలేవీ పడకుండా ఉండాలంటే పెళ్లికి ముందు నన్ను వదిలిపెట్టకుండా ఉన్న నా ఆభరణమైన నా ప్రియమైన శీలాన్ని నాకు తిరిగి ఇప్పించండి. అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తాను ఆయన కోరుకున్న విడాకులు ఇచ్చేస్తాను... ఆనందంగా ఇచ్చేస్తాను." అంటూ బోనులో కూలబడి ఏడుస్తున్న వసుధని చూస్తుంటే కన్నీరాగలేదు అందరికీ. ఆఖరికి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన చంద్రమౌళి కి కూడా.



కాసేపటికి తేరుకున్న శరత్ ఇంకేం అడగాల్సింది లేదని కూర్చున్నాడు. 



ఇంక తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. అందరూ జడ్జి గారు ఏం చెప్తారా అనే చూస్తున్నారు. 



"వాదోపవాదాలు విన్న తర్వాత వసుధ గారి వాదనలో నిజం ఉందనిపిస్తుంది. ఆమె కోరినది చంద్రమౌళి గారు భరణంగా ఇచ్చిన నాడు వారిద్దరికీ విడాకులు మంజూరు చేయబడును. అప్పటివరకూ వసుధ, చంద్రమౌళీ ఒకే ఇంట్లో ఉండాలనీ, ఆమె ఆలనా పాలనా చూసుకునే బాధ్యత అంతా చంద్రమౌళిదే ననీ తీర్పు ఇవ్వడమైనది. 



ఈ రోజు ఈ కేసు ద్వారా ఓ కొత్త అంశం తెరమీదకి వచ్చింది. విడాకులు తీసుకోవాలని కోరిన భర్త ఆమె నగలూ, డబ్బూ, ఆస్తులూ కార్లూ ఇల్లూ ఏవైనా భరణం గా ఇవ్వగలడు. కానీ స్త్రీ తన సౌభాగ్యం గా భావించే "శీలం" ని భరణం గా ఇవ్వగలడా. అదే కావాలని వసుధ ఎందుకు పట్టుబడిందో ఓ మహిళగా నాకు అర్థం అయింది. ఇక్కడున్న ఆడవాళ్లందరికీ అర్థం అయ్యింది. చంద్రమౌళి గారికి అర్థమైన రోజు ఈ విడాకుల ఆలోచన ఆ మనసులోనుంచి సమూలంగా తొలగిపోతుంది. ఆయనకే కాదు ఇంకే మగవాడికీ విడాకుల ఆలోచన ఉండదు. అప్పుడు ఓ జంట ని విడాకుల పత్రం అనే చిన్న కాగితం ముక్కతో విడదీస్తున్నామన్నా బాధా మా కోర్టులకు ఉండదు." అని కాసేపు ఆగి... 



"చంద్రమౌళి గారు భరణం గా వసుధ గారు కోరింది ఇచ్చిన నాడు వారిరువురికీ విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. అంతవరకూ వారిరువురూ ఒకే ఇంట్లో ఉండవచ్చు. నౌ ద కోర్ట్ ఈజ్ ఎడ్జర్నడ్." అని పైకి లేచారు జడ్జి జయంతి గారు. 



అందరూ పైకి లేచారు విషణ్ణ వదనాలతో. ఆలోచనలు నిండిన మనసుతో బయటకు వచ్చిన చంద్రమౌళి కి దూరంగా వెళ్లిపోతూ కనపడింది వసుధ... గుప్పెడంత గుండెలో కొండంత భారం మోసుకుంటూ.



             (( సమాప్తం))


కమల'శ్రీ'✍️.
































Rate this content
Log in

Similar telugu story from Drama