kamala sri

Inspirational Others

4  

kamala sri

Inspirational Others

గుర్తింపు

గుర్తింపు

5 mins
396



            //గుర్తింపు//

రామనాథం మనసంతా అదోలా ఉంది. కారణం ఉదయం తను క్యాంటిన్ లో విన్న విషయం. తను ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ప్రోమోషన్ ఇప్పుడు తనకంటే జూనియర్ అయిన రాజారాం కి వస్తుందన్న విషయం తెలిసి మనసంతా కకావికలం అయిపోయింది.

న్యాయంగా ఆ ప్రొమోషన్ రామనాథానికే రావాలి. కానీ మేనేజర్ నారాయణ , రాజారాం ఇచ్చే పైసలకు కక్కుర్తి పడి రామనాథం ఫైల్ ని కాకుండా , రాజారాం ఫైల్ ని పై‌ ఆఫీసరు కి సిఫారసు చేశాడు ప్రొమోషన్ కోసం.

ఇన్నేళ్లుగా ఆ ప్రొమోషన్ కోసమే ఎన్నో ఆశలు పెట్టుకున్న రామనాథానికి, మేనేజర్ తన ఫైల్ ని కాకుండా రాజారాం ఫైల్ ని పంపడం చాలా బాధ కలిగించింది. నిజాయితీ గా ఉద్యోగం చేస్తున్న తనని మాని ఆఫీసులో ఓ గంట పాటు కూడా కూర్చోని రాజారాం కి వస్తుందని తెలిసినప్పటి నుంచీ అతని మనసంతా అల్లకల్లోలం లా ఉంది. 

తనకి ప్రొమోషన్ వస్తే పెరిగే జీతంతో తన కష్టాలు కొన్నైనా తగ్గుతాయని అనుకున్నాడు. 

ఇంటికి వచ్చి కూర్చున్న పెద్ద కూతురు లత ని ఆమె భర్త ఈ పండక్కైనా బండి కొనకపోతే ఇంటికి రావొద్దని అనేశాడట. అనడా మరీ పెళ్లప్పుడు ఇస్తానన్న కట్నం లో సగం పెళ్లిలో ఇచ్చి మిగిలింది ఓ మూడు సంవత్సరాలలో కొంచెం కొంచెంగా ఇచ్చాడు. బండి ఇస్తానని ఒప్పుకున్నా డబ్బులు సర్దుబాటు కాక ఇప్పటి వరకూ ఇవ్వలేకపోయాడు.ఇప్పుడు కూడా ఇవ్వకపోతే దాని కాపురాన్ని చేతులారా నాశనం చేసేది తనే అవుతాడు.

రెండో కూతురు చైత్ర కాలేజీ ఫీజు గురించి చాలా రోజులుగా అడుగుతోంది. ఆమెకీ ఇవ్వలేకపోయాడు.

ఎలా కుదురుతుంది. తనకి వచ్చే జీతం వేలల్లో అయితే ధరలేమో ఆకాశాన్ని అందడం, వచ్చింది ఇంటి బాడుగకీ, ఖర్చులకే సరిపోవడం తో ఎవరికీ ఏ అవసరం తీర్చలేకపోతున్నాడు.


పెద్ద కూతురు భర్త కి బండీ, చిన్న కూతురు చైత్ర ఫీజు కీ  పోగా ఓ ఐదువేలు వరకూ మిగులుతుంది అని బడ్జెట్ కూడా రెడీ చేసుకున్నాడు. ఓ రెండు నెలల్లో తన అవసరాలన్నీ తీరిపోతాయని ఎన్నో కలలు కన్న రామనాథం ఆశలు మీద ఆవిరి చల్లినట్టుగా అయ్యింది పొద్దున్న క్యాంటీన్లో టీ త్రాగేటప్పుడు రాజారాం, రవీ మాట్లాడుతున్న మాటలు వినిపించగానే.

"ఏంటయ్యా! రాజారాం, మేనేజర్ నీకంటే సీనియర్ అయిన రామనాథం ఫైల్ ని పక్కన పెట్టిన నీ ఫైల్ ని ప్రొమోషన్ కోసం పంపిస్తున్నారు. ఏంటి కథ?." అన్నాడు.

"ఏంటి కథా అంటే అదే కథా.... ఇప్పటి రోజుల్లో జరుగుతున్న కథ. తాయిలం ఇస్తే పనులు చకచకా జరిగిపోతాయి తెలిసినవాడిని కాబట్టి మేనేజర్ కి కాస్త ఆశ చూపి రాజారాం ఫైల్ కాకుండా నా ఫైల్ పంపించేలా చేశాను." అంటూ అసలు విషయం చెప్పి ఓ నవ్వు నవ్వాడు రాజారాం.


అది విన్నప్పటి నుంచీ మనసు మనసు లో లేదు. సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. నిజాయితీకి ఇదేనా పట్టాభిషేకం. పోనీ మేనేజర్ ని అడిగితే, వద్దులే డబ్బుకి ఆశపడి నా ఫైల్ కాక రాజారాం ఫైల్ పంపిన వాడు ఇప్పుడు తను అడిగితే తన తప్పుని ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు, అతనే కాదు తప్పు చేసిన వాళ్లెవరూ వాళ్ల తప్పులు ఒప్పుకోరు. ఆలోచించీ ఆలోచించీ బాగా తలనొప్పిగా అనిపిస్తుంది. పని కూడా చేయబుద్ధి కావడం లేదు. ఇంక పని చేయలేక పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు.

"ఏంటయ్యా! ఇంత పెందలాడే వచ్చేశావు ఇంటికి. ఒంట్లో ఏమైనా బాలేదా?!." అడిగింది ఇంట్లోకి వస్తున్న రామనాథాన్ని అతని భార్య శ్యామల.

"కాస్త తలనొప్పిగా ఉందే. అందుకే వచ్చేశాను." అని లంచ్ బ్యాగు ఆమెకి ఇచ్చి "కాస్త కాఫీ ఇవ్వు శ్యామా.." అని బట్టలు మార్చి మంచం పై చేరగిలపడ్డాడు.

కాఫీ చేసి అతనికి ఇచ్చి "ఏమయ్యా!ఈ మధ్య తలనొప్పి ఎక్కువగా వస్తోంది కదా. ఓసారి హాస్పిటల్ కి వెళ్లరాదూ?." అంది అతని కాళ్ల దగ్గర కూర్చుని.

"అంత ఎక్కువేమీ లేదులేవే. మళ్లీ హాస్పిటల్ కి వెళితే ఆ టెస్టు లూ, ఈ టెస్టులూ చేయించి ఆఖరికి ఏమీ లేదని ఓ నాలుగు రకాల మందులు రాసి పంపించేస్తారు. కాస్త జండూ బామ్ రాస్తే తగ్గిపోతుంది లే." అని తాగిన కాఫీ కప్పు ఆమెకిచ్చి టేబుల్ మీదున్న జండూ బామ్ సీసా తీసుకుని నుదుటికి రాసుకున్నాడు.

“మీరిలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. వెళ్తే డబ్బులు ఖర్చనే కదా. ఇలా అన్నిటికీ ఆలోచిస్తే ఎలాగయ్యా. నీ వైద్యానికి పెట్టే ఆ కాస్త డబ్బే ఎక్కువ అయిపోతుందా ఏమిటి?. ఓసారి వెళ్లి చూపించుకో.” అంది శ్యామల.

“అదికాదే ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమీ కాలేదు లేవే. ఏదో చిన్న తలనొప్పి ఆ పాటి దానికే ఎందుకు హాస్పిటల్ వరకూ వెళ్లడం అనీ. నేను కాసేపు పడుకుంటాను. నువ్వేళ్లి వంటపని చూసుకో.” అని కళ్లు మూసుకున్నాడు రామనాథం.

"లత చూస్తుంది లెండి. నేను ఇక్కడే కాసేపు కూర్చుంటాను.” అని కూర్చోబోతుంటే,


"కన్నవారింటికి వచ్చిన ఆడపిల్ల తో పనులు చేయించుకుంటే ఎలానే. దాని మనసు అసలే బాగులేదు. నేను బండి కొనివ్వకపోతే ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందేమో అని బెంగపెట్టుకుంటుంది. అలా భాదలో ఉన్న పి‌ల్లతో పని చేయిస్తాను అంటావెంటీ. వెళ్లి నువ్వు వంటపని చూడు. నాకేమీ కాలేదులే.” అని కళ్ళు మూసుకునే చెప్పేసరికి తప్పక అక్కడనుంచి కదిలి వంట గదిలోకి వెళ్లింది శ్యామల.

“అమ్మా! నాన్న గారేంటి ఇంత తొందరగా వచ్చేశారు?.” కంగారుగా అడిగింది లత.

“కాస్త తలనొప్పిగా ఉందటలే. నువ్వేమి కంగారు పడకులే. కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది.” అని కూరగాయలు తరుగుతూ అంది శ్యామల.

“నా వల్లే నాన్నగారికి తల నొప్పి వచ్చింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపినా కూడా మీకు నా భాద్యత తీరలేదమ్మా.నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది.” అంది లత కల్లోత్తుకుంటు.

“చా చా నీ వల్ల తలనొప్పి రావడం ఏమిటే. ఏదో పని ఒత్తిడి లో వచ్చింది అంతే. అయినా ఆడపిల్ల కి కష్టం వస్తే కన్నవారింటికి కాక ఇంకెక్కడికి వెళుతుంది. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు. మీ నాన్నగారు వింటే భాదపడతారు. నువ్వెల్లి ఆరబెట్టిన బట్టలు తియ్యి నేను వంట పని చూసుకుంటాలే.” అని లత ని అక్కడి నుంచి పంపించి “వీళ్ళాయనకు బండి ఎలా కోనాలో, చిన్నదాని ఫీజు ఎలా కట్టాలో తేలికే ఆయనకి తలనొప్పి వచ్చుంటుంది. ఇన్నాళ్లుగా పని చేస్తున్నా సొంత ఇల్లు కట్టుకోలేకపోయాం, పిల్లల అవసరాలు తీర్చలేకపోతున్నాం. ఈయనకంటే వెనుక చేరినవాళ్లు బంగ్లాలూ, కార్లూ కొనుక్కుంటున్నారు. వాళ్ళాంతా బల్ల కింద చేయిపెట్టి సంపాదిస్తే ఈయనేమో నీతి, నిజాయితీ అంటూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోయారు. మా బతుకులెప్పుడు తెల్లారుతాయో, ఈ కష్టాలెప్పుడు కడతేరుతాయో" అనుకుంటూ కూరగాయలు తరిగి వంటపనిలో మునిగిపోయింది.

********

రోజులు గడుస్తున్నాయి. రామనాథం రోజూ ఆఫీస్ కి వెళ్తునాడు , వస్తున్నాడు. రాజారాం అయితే హుషారుగా ఉన్నాడు ప్రోమోషన్ వస్తుంది అన్న ఆనందం లో.

ఓ రోజు ఉదయాన్నే మెయిల్ వచ్చింది... దాని సారాంశం మేనేజర్ కి హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ ఫర్ అయ్యిందనీ, మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి జాయిన్ అవ్వాలని. కొత్త మేనేజర్ ఆరోజు సాయంత్రానికే వచ్చేశాడు. అతని కి చార్జ్ అప్పగించి రిలీవ్ అయ్యి వెళ్లిపోయాడు మేనేజర్.

రెండు రోజులు మాములుగానే గడిచింది.

మూడో రోజు "సర్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు.” అని ప్యూన్ చెప్పడం తో అతని ఛాంబర్ కి వెళ్ళాడు రామనాథం.


“సర్ రమ్మన్నారటా?!.” కంగారుగా అడిగాడు రామనాథం.

"రామనాథం గారు. రండి కూర్చోండి. ఇది మీ ఫైలే. సీనియర్ అయిన మిమ్మల్ని కాదని మీకంటే జూనియర్ అయిన రాజారం ఫైల్ ప్రొమోషన్ కోసం పంపించారని ఈ రోజే తెలిసింది. మీకూ ఆ విషయం తెలుసనీ, అయినా మేనేజర్ ని ఓ మాట కూడా ఆగడలేదని తెలిసింది. అలా మీకు రావాల్సిన దానిని వేరొకరు అడ్డగోలుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎలా ఊరుకున్నారు?. వారిని ప్రశ్నించాల్సింది కదా?.” అన్నాడు మేనేజర్ విశ్వం.

“సర్ అడుగుదామనే అనుకున్నా. కానీ ఆ మేనేజర్, రాజారం దగ్గర డబ్బులు తీసుకుని పంపించారని తెలిసింది. లంచం ఇచ్చి ప్రోమోషన్ తీసుకునే స్థాయికి నేను దిగజారనే లేదు. నాకు ఏదైనా న్యాయం గా వచ్చిందే కావాలి సర్.అన్యాయానికి నేను పోనూ, నా నీతి, నిజాయితీ లను వదులుకోను.” అని సమాధానం చెప్పాడు రామనాథం.

“హుమ్ మీ నుంచి ఇదే సమాధానం వస్తుంది ఎక్స్ పెక్ట్ చేశాను రామనాథం గారూ. నిజానికి పాత మేనేజర్ పై కొన్ని కంప్లైంట్స్ వెళ్లాయి హెడ్ ఆఫీస్ కి. ఆఫీస్ డబ్బులు మిస్ యూజ్ అవుతున్నాయనీ, ఆఫీస్ టైమింగ్స్ లో బయట పనులంటూ తిరగడం ఇలాంటివన్నీ వారి దృష్టి కి వచ్చాయి. దాంతో ఆయన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ చేశారు. అలాగే ఆ ప్రోమోషన్ ఫైల్ ని కూడా ఓ సారి వేరిఫై చేయమని చెప్పారు.


అది చేస్తున్నప్పుడే మీరు సీనియర్ అయినా మిమ్మల్ని కాదని రాజారాం ఫైల్ ని పంపించారని తెలిసింది. దీని గురించే ఇప్పుడే పై ఆఫీసర్ లకు కప్లైంట్ చేశాను. రాజారాం ఫైల్ ని బ్యాక్ చేశారు. మీ ఫైల్ ని పంపించమని చెప్పారు. నేను ఈ రోజే దాన్ని మీకు పంపిస్తున్నాను. మీ నిజాయితీకి సరైన గుర్తింపు మీ ప్రోమోషన్. అది అతి త్వరలో మీకు వస్తుంది. వస్తుంది అనుకున్న ప్రమోషన్ రాదని తెలిసే సరికి ఎంత భాదపడ్డారో నాకు తెలుసు. ఇంక భాదపడకండి. వెళ్లండి హాయిగా ఉద్యోగం చేసుకోండి.” అని తన పని లో తలదూర్చాడు విశ్వ.

రాదు అనుకున్న ప్రమోషన్ వస్తుంది అని తెలిసే సరికి మనసులో చెప్పలేని ఆనందం. ఇన్నాళ్ల తన వేదన అంతా క్షణాల్లో పోయినట్టుగా అనిపించింది. తన సీట్ లోకి వచ్చి కూర్చున్నాడే కానీ సంతోషం లో సరిగ్గా పని చేయలేకపోయాడు.ఆఖర్లో మేనేజర్ అన్న మాటలు మరోసారి గుర్తుకు వస్తున్నాయి "మీ నిజాయితీ కి సరైన గుర్తింపు మీ ప్రమోషన్..." అవును నిజమే నిజాయితీ కి గుర్తింపు లబిస్తుంది. అది కాస్త ఆలస్యం అయినా కూడా తప్పక లభిస్తుంది.” అని అనుకుంటూ ప్రమోషన్ వస్తే మారబోయే తన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుని దేవుడా నువ్వున్నావయ్యా. నాకు సరైన సమయం లో దారి చూపావు.” అని మనసులో అనుకుని తన పనిలో మునిగాడు రామనాథం.

కొద్దిరోజులకు రామనాథానికి ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్ లో లంచాలు తీసుకుంటున్నాడని రాజారాం ని సస్పెండ్ చేశారు, అలాగే పాత మేనేజర్ ని కూడా.

రెండు నెలల్లో పెద్దల్లుడికి బండి, చిన్న కూతురి ఫీజ్ కట్టేశాడు రామనాథం. ఎప్పటి నుంచో కోనాలి అనుకుంటున్న పట్టుచీరని కొన్నాడు తన భార్య శ్యామల కి.

                   ...కమల’శ్రీ’✍️.

                   



Rate this content
Log in

Similar telugu story from Inspirational