Venkata Rama Seshu Nandagiri

Comedy

4.2  

Venkata Rama Seshu Nandagiri

Comedy

అరటి పూలు

అరటి పూలు

2 mins
926


శ్రీనివాస్ బజార్ నుండి కూరగాయల సంచితో వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టాడు. చెల్లి గీత ఎదురెళ్ళి సంచీ అందుకుంది. సంచీ లోంచి కూరలన్నీ ఒక్కొక్కటిగా బైటికి తీస్తోంది.

ఇంతలో పక్క వీథిలోనే ఉంటున్న అక్క రాధ వచ్చింది.

" బజారుకెళ్ళావా వాసూ. అయ్యో, తెలిస్తే

నేను కూడా కావల్సినవి తెప్పించుకొనే దానిని కదా!" అంది రాధ.

"ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళమ్మా." అందా తల్లి సుశీల.

గీత బైట పెడుతున్న వస్తువులను చూస్తూ " అన్నీ కూరగాయలేనా, పళ్ళు, పూలు ఏమైనా తెచ్చావా." అడిగింది రాధ వాసుని.

"కూరలే తెచ్చానే. పళ్ళు చెపితే తెస్తాను. అమ్మ చెప్పలేదు. పూలంటావా. నేనెప్పుడూ తేను. డబ్బు దండగ. ఇలా పెట్టుకుంటారు. అలా వాడిపోతాయి.

మీ ఆడాళ్ళకి పనీ - పాటూ ఉండదు. డబ్బులిలాగే

తగలేస్తారు.".చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు వాసు

"ఒరేయ్, తప్పురా. పూలు‌, పళ్లు వాటి గురించి అలా మాట్లాడకూడదు." తల్లి కేకలేసింది.

"పూలు, పళ్ళూ సరే. బైటికెళ్తాడా. తినడానికి కూడా ఏం తేడక్కా. ఉద్యోగం వచ్చాక మరీ పిసినారి అయిపోయాడే." అంది గీత ఫిర్యాదు చేస్తున్నట్లు.

"ఏంటీ, అక్కా చెల్లెళ్ళిద్దరూ వాడినలా ఆడి పోసు కుంటున్నారు! రేపు రాధక్క కడుపుతో ఉంటే తీసుకొచ్చి ముచ్చట్లు జరిపించాల్సింది వాడే. గీతా! నీ పెళ్ళి చేయడం కూడా వాడి బాధ్యతే. మరి ఆ మాత్రం పొదుపు ఉండక్కర్లేదా." తల్లి సుశీల కొడుకుని వెనకేసుకొచ్చింది.

"అబ్బో, కొడుకు మీద ఈగ వాలనివ్వదక్కా. ఈ మధ్య మరీను." నవ్వుతూ అంది గీత.

"ఎన్నాళ్ళే. ఆ కోడలు రానీ. ఆవిడగారి కోసం, ఈయన గారు, రోజూ పూలు, పళ్ళూ‌, స్వీట్లు తేక పోతాడా, మనం చూడక పోతామా." వెటకరించింది అక్క రాధ.

"అంతలేదమ్మా. నాకెవరైనా ఒకటే. పళ్ళూ, స్వీట్లు జాన్తా నై. పూలడిగితే, పెట్టుకోడానికి, ఒకే ఒక పువ్వు , అరటి పువ్వు కొనిస్తా. మరి జన్మలో అడగదు." అన్నాడు గట్టిగా నవ్వుతూ.

"పోరా. వచ్చే నెలేగా పెళ్ళి. ఆ భాగోతం చూడక పోతామా." అంటూ గీత , రాధ ఆట పట్టించారు.

మరుసటి నెల పెళ్ళి సందడి సర్దుమణిగాక, ఒకరోజు

వాళ్ళాయన ఊరెళ్ళడంతో ఆ రాత్రి పుట్టింట ఉండడానికి వచ్చింది రాధ. అత్తా, కోడలు, అక్కా చెల్లెళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు.

ఇంతలో వాసు ఆఫీసు నుండి వచ్చాడు. అందరినీ చూసి పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళి పోయాడు. మరదలు రాణి కూడా అతని వెనకే వెళ్ళి అయిదు నిమిషాల్లో వదినగారికి, మరదలికి చేతుల్లో మల్లెపూల దండలు పెట్టింది. వెనకాతలే వాసు బట్టలు మార్చుకుని వచ్చి కూర్చోడం, తల్లి కాఫీ తెచ్చి ఇవ్వడం జరిగింది.

"ఏరా వాసూ, ఇవేనా అరటిపూలు." అడిగింది అక్క రాధ మల్లెచెండుని చేతిలో పట్టుకుని సుతారంగా ఊగిస్తూ. గీత నవ్వుని బిగపెట్టి వాసుని చూస్తోంది.

"అరటిపూలు ఏంటి? " ఆశ్చర్యంగా అడిగింది రాణి.

నవ్వుతూ ఆరోజు జరిగిన సంభాషణను వివరించింది గీత. రాణి కూడా నవ్వాపుకోలేక పోయింది. ఆ ముగ్గురితో పాటు తల్లీ కొడుకు కూడా శృతి కలిపారు.


Rate this content
Log in

Similar telugu story from Comedy