gopal krishna

Comedy Classics Children

4.5  

gopal krishna

Comedy Classics Children

అమ్మమ్మ

అమ్మమ్మ

3 mins
384


    అమ్మమ్మ వంటగది మాకు ఎప్పుడూ వింతగా ఉండేది. అది అమ్మమ్మ ప్రపంచం. అమ్మ, పిన్ని తప్ప వేరే ఎవరికీ అక్కడ ప్రవేశం ఉండేది కాదు. అమ్మమ్మ, తాతయ్య ఉండేది శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూళ్ళో. అమ్మ కాకుండా ఒక పిన్నీ, ఇంకో ముగ్గురు మామయ్యలు ఉండేవాళ్ళు నాకు. అందరూ వాళ్ళ కుటుంబాలతో సెలవుల్లో తాతగారి ఊరు చేరుకునేవాళ్ళం. ఇంతేకాకుండ ఇంకా మిగిలిన చుట్టాలు కూడా చేరేవాళ్ళు మాతో.

    మొత్తం ఒక నలభైమంది పిల్లలు, ఇరవైమంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళమేమో. తాతగారిల్లు సెలవుల్లో కళకళ లాడేది. అయినా ఇంకా కొంతమంది ఆ ఇంట్లో ఉండడానికి బోలెడు ఖాళీ ఉండేది అంటే ఆ ఇల్లు ఎంతపెద్దదో మీరు ఊహించుకోవచ్చు. అమ్మమ్మకి వంటపనిలో సాయంగా అమ్మా, పిన్నీ ఉండేవాళ్ళు. మిగిలిన ఆడవాళ్ళకీ మగవాళ్ళకి ఎవరికీ ఆ గదిలో ప్రవేశం ఉండేది కాదు. కారణం పూర్వం నుండి ఉన్న మడీ ఆచారాలు కారణం.

   ప్రధానంగా వ్యవసాయ కుటుంబం కావడంతో పనిచేసే మనుషులు కూడా సుమారు పది పదిహేను మంది ఉండేవాళ్ళు. వీళ్ళే కాకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళూ తాతయ్య గారింట్లో పని చేసేవారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.....

  ఉదయం కోడి కూసే వేళకి అమ్మమ్మ నిద్రలేచేది. దేవునికి దణ్ణం పెట్టుకొని, కాలకృత్యాలు ముగించుకొని వంట గదిలోకి వెళ్ళి వంటగదిలో ఉన్న కట్టెల పొయ్యిని పేడతో శుభ్రంగా అలికేది . ఆ పని ఇంట్లో ఉన్న కోడళ్ళ చేత చేయించొచ్చు.కానీ ఎందుకో కోడళ్లతో ఆవిడకి సఖ్యత ఉండేది కాదు. పేడతో కట్టెల పొయ్యిని అలికి ముగ్గులు పెట్టి, స్నానం చేసి వచ్చి, పూజ గదిలో దీపారాధన చేసేది. అప్పటికి అమ్మా, పిన్నీ తమ పనులు పూర్తిచేసుకొని వంటగదిలోకి వెళ్ళి పెద్దవాళ్ళకి కాఫీ ఏర్పాట్లు చేసేవారు. పిల్లలకు ఉదయం గ్లాసు పాలు ఇచ్చేవారు.

    మా ఇళ్ళల్లో మొదటినుండి క్రమశిక్షణ అలవాటు. మొదట పనిలోకి వెళ్ళే పాలేర్లకి టీ లు భోజనాలు సిద్ధం చేసి, ఉదయం తొమ్మిదో గంటకి వాళ్ళని పొలం పనులకి పంపించాలి. ఆ టైం లోగా పాలేర్ల పిల్లలకి భోజనాలు పెట్టి పంపిస్తే వాళ్ళు బళ్ళోకి వెళ్లడమో, ఆడుకోడానికి వెళ్లిపోడమో జరిగేది. తరువాత సెలవులు కోసం వెళ్ళిన మమ్మల్ని ఇంకో గదిలో కూర్చోపెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ లో రాగి జావ తప్పనిసరిగా ఉండేది. నాకేమో ఆరోగ్య సమస్యలుండేవేమో, ఉదయాన్నే పెట్టిన రాగిజావ లేదా అన్నం పడేది కాదు. అందరిలోకి ప్రత్యేకంగా పెడితే మిగిలిన పిల్లలతో ఇబ్బంది అవుతుందని అమ్మమ్మ కోప్పడి అదే తినమనేది.

    నాకు మొదటినుండి అమ్మదగ్గర చేరిక ఎక్కువ. అమ్మ వంటగదిలోనుండి బయటికి వచ్చేది కాదు. నేనేమో వంటగది కి ఉన్న ఒక కిటికీ దగ్గర అమ్మకోసం ఎదురుచూస్తూ గడిపేవాణ్ణి. పెద్దవాళ్ళు టిఫిన్ చేసేటప్పుడు అమ్మ నాకు ఒక ఇడ్లి తినిపించేది. నాకేమో అంతకంటే ఎక్కువ తింటే అసలు పడేది కాదు. మళ్ళీ పదకొండు గంటలయ్యేసరికి పనివాళ్ళకోసం వంటలు చెయ్యాలి. వాళ్లంతా కారం బాగా తింటారేమో, ప్రత్యేకంగా కూరలు చెయ్యాల్సి వచ్చేది. అప్పటికే వాళ్ళకి భోజనాలు తీసుకెళ్లడానికి వచ్చే మనిషి వందసార్లు అరిచి గోల పెట్టేవాడు టైం అయిపోతోంది తొందరగా గిన్నెల్లో పెట్టేసి ఇస్తే తీసుకెళ్తా అంటూ కంగారు పెట్టేవాడు.

   ఆ టైం కి మా పిల్ల బ్యాచ్ ఆటలు ఆడి , మళ్ళీ ఆకలి అంటూ వంటగది చుట్టూ తిరిగేవాళ్లు. నేను ఎప్పుడో కానీ, వాళ్ళతో ఆటలకి వెళ్ళేవాడిని కాదు. స్వతహాగా నెమ్మదిగా ఉండే నేను నా జోలికి వచ్చేవాళ్ళని పెద్దా చిన్నా తేడాలేకుండా నా పద్ధతిలో కొట్టేవాణ్ణేమో, నన్ను ఆటల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. 

    అమ్మమ్మ వంటగదిలో వచ్చే సువాసనలు అందరిలో ఆకలి పుట్టించేవి. రోజూ లంచ్ కి కనీసం రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, పులుసు అప్పడాలు వడియాలు, గడ్డపెరుగు ఇది కాకుండా ఒకటో రెండో స్వీట్ లు ఉండవలసిందే. నాకు ఇప్పటికీ ఆ అలవాటు పోలేదు. లంచ్ టైం లో తప్పకుండ స్వీట్ ఉండవలసిందే. లేకపోతె భోజనం చేసినట్లు అనిపించదు.

  మధ్యాహ్నం కాసేపు వంటగదికి విరామం ఉండేది. ఆ టైం లో అమ్మమ్మ నిద్రపోతుందన్నమాట. అప్పుడు మనలో ఆకలి విజృంభిస్తుంది. నెమ్మదిగా అమ్మ పక్కన చేరి, అమ్మకి కాళ్ళు నొక్కుతూ, కబుర్లలో దించేవాణ్ణి. వంటగదిలో ఏమైనా తినడానికి ఉన్నాయేమో వాకబు చేసేవాణ్ణి. పాపం పిచ్చి అమ్మ. మన ప్లాన్ తనకి తెలీదు కదా. చేగోడీలు, జంతికలు, కాజాలు, అరిసెలు, సున్నుండలు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేది. ఉదయం నుండి అలిసిపోయిన అమ్మ ని చిన్న పిల్లని చేసి సులభంగా మోసం చేసేసేవాణ్ని.

   పిల్లలంతా పొలం వైపు ఆటలకి వెళ్తే, నేను మాత్రం ఇంట్లోనే పుస్తకం చదువుకుంటూ, అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న టైం లో కిచెన్ లోకి వెళ్ళి ఒక సున్నుండ నోట్లో పెట్టుకొని, ఒకటో రెండో స్వీట్లు, చేగోడీలు, జంతికలు నిక్కర్ జేబుల్లో నింపుకొని అంతే నిశ్శబ్దంగా వంటగది తలుపు మూసేసి బయటికి వెళ్లిపోయేవాడిని. విచిత్రం ఏమిటంటే అమ్మమ్మ ఎలా కనిపెట్టేదో ఏయే తినుబండారాలు తగ్గాయో లెక్క చెప్పేసేది. నేను చేసిన పని అమ్మకి నాకు తప్ప మూడో కంటికి కూడా తెలిసేది కాదు. ఇద్దరం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్ళం.

   సాయంత్రం అమ్మకి, పిన్ని కి కిచెన్ లో పనేమీ ఉండేది కాదు. కేవలం కోడళ్లతో పనిచేయిస్తూ అమ్మమ్మ అజమాయిషీ చేసేది. అప్పుడు అమ్మా, నేను చేసే అల్లరికి అస్సలు హద్దుండేది కాదు. జామచెట్లకు మిగిలిన ఒకటీ అరా కాయలు కోసుకునేవాళ్ళం. లేదా కబడ్డీ, బాడ్మింటన్ లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళం. మా ఇద్దరి మధ్యలోకి రావడానికి ఎవరూ సాహసించేవాళ్ళు కాదంటే నమ్మండి. మా ఆటల్లో రూల్స్ అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అదీ మాకు నచ్చినట్లు. అందువలన మా ప్రపంచంలోకి ఇంకెవరికీ ప్రవేశం ఉండేది కాదన్నమాట. 

     రాత్రి డిన్నర్ అయ్యాకా అమ్మమ్మ పిల్లలందరిని కూర్చోపెట్టి మంచి మంచి కథలు చెప్పేది. ఆ కథలు కూడా రామాయణం, భారతం లాంటివి మాత్రమే కాదు.. విలియంటెల్, కౌంట్ అఫ్ మాంటెక్రిస్టో, అరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్, ఆలివర్ ట్విస్ట్ లాంటి కథలు అక్షరం పొల్లుపోకుండా చెప్పేది. అమ్మమ్మ ఏం చదివిందో మాకు తెలిసేది కాదు. సెలవులకు వెళ్ళినప్పుడు మొదలు పెట్టిన నవల కథని, మేము తిరిగి మా ఇళ్ళకి చేరే రోజు సరికి పూర్తి చేసేది.

   సెలవులు చక్కగా గడిపేసి ఇంటికి తిరుగు ముఖం పట్టిన మాకు, చక్కని అనుభూతిని మిగిల్చేది అమ్మమ్మ. అప్పుడప్పుడు కోప్పడ్డం, విసుక్కోడం లాంటివి ఉన్నా ఎప్పుడూ ఎవరిమీద చెయ్యి చేసుకోడం మాకు కనిపించేది కాదు. పిల్లలూ, వాళ్ళ పిల్లలూ, వాళ్ళ కుటుంబాలను అందరిని సమానంగా ప్రేమించే అమ్మమ్మ పూర్ణాయుష్షు పూర్తి చేసుకుని దేవుడి పిలుపు అందుకుని వెళ్లిపోయిన ధన్యజీవి.

                             (నా చిన్న నాటి జ్ఞాపకాలనుండి)



Rate this content
Log in

Similar telugu story from Comedy