STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children

ఆదిలోనే హంసపాదు

ఆదిలోనే హంసపాదు

2 mins
21


ఆది లోనే హంసపాదు(జాతీయం కథ)

*****************************************


రుద్రకు మినపసున్ని అంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళమ్మ మినపసున్ని చేద్దామని వస్తువులన్నీ సిద్ధం చేసుకుని, ఉండలు చెయ్యడానికి కూర్చుంది. పెరట్లో నుంచి “అమ్మా అమ్మా” అని పిలుపు వినిపించింది. ‘వీడు ఏ పాడు పని చేశాడో, ఏమయ్యిందోనని,’ పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళింది సౌమ్య. తీరా చూస్తే గోలెం లో ఉన్న నీళ్లన్నీ ఒంపుకుని స్నానం చేస్తున్నాడు. ఇంతలో వాడికి కప్ప కనిపించింది. దానిని చూపించడానికి “అమ్మా” అని పిలిచాడు. సౌమ్యకు చాలా కోపం వచ్చింది. రెక్కపట్టుకుని ఈడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చి వొళ్ళంతా తుడిచింది.


“రుద్రా! ఇవాళ నువ్వు నన్ను ఏ పనీ చెయ్యనివ్వడం లేదు. పాడు పనులు చేస్తున్నావు ఆదిలోనే హంసపాదు.”

అంది సౌమ్య. 


“పాడు పనులంటే ఏంటమ్మా?” అని దీర్ఘం తీస్తూ అడిగాడు రుద్ర.


“నువ్వు చేసే పనులే” అని జవాబిచ్చింది సౌమ్య. 


“మరి హంసపాదు అంటే…?” నసుగుతూ అడిగాడు రుద్ర. 


“నేను చెప్పను ఫో! ఎప్పుడూ ప్రశ్నలు వెయ్యడమే కానీ బుద్ధిగా ఉండడం లేదు” అని కసిరింది.


ఏడ్చుకుంటూ మునిమామ్మ దగ్గరికి వెళ్లాడు.

ఇది చూసిన మునిమామ్మగారు “పిల్లాడిని కసురుకోకు సౌమ్యా! ప్రశ్నించే తత్వం లేకపోతే ఆలోచన మరుగున పడిపోతుంది. కొత్త విషయాలు వాళ్ళకి ప్రశ్నిస్తేనే తెలుస్తాయి. వాళ్లు అడిగిన విషయాన్ని తెలుసుకునైనా చెప్పాలి కానీ ప్రశ్నలు వె

య్యొద్దని చెప్పకూడదు.” అని సౌమ్యని మందలించి రుద్రని దగ్గరికి తీసుకుంది. 


“నీ సందేహం నేను తీరుస్తాను.”అంటూ చెప్పడం ప్రారంభించింది మునిమామ్మ.


“పూర్వకాలంలో మహారాణిని పల్లకిలో బోయిలు మోసుకువెళ్ళేవారు. కొంతదూరం ప్రయాణం చేసాక బోయీల భుజాలు నొప్పి అనిపించేవి. అలాంటి సమయంలో నలుగురు బోయీలు నాలుగు వైపులా Y ఆకారం లో ఉండే పంగల కర్రలమీద పల్లకిని ఉంచి కాస్త ఊపిరి పీల్చుకుని మరల ప్రయాణం కొనసాగించేవారు. ఆ కర్ర హంసపాదంలా ఉంటుందని అలా అనేవారు. అలాగే ఎడ్లబండ్లకు కూడా ముందున ఒకటి, వెనుకన ఒకటి గట్టి కర్రలను కట్టి ఉంచుతారు. దూరపు ప్రయాణం చేసేటప్పుడు ఎద్దులకు విశ్రాంతి, ఆహారం, నీరు అవసరం. ఆ సమయంలో బండికి ఇరువైపులా కర్రలను దన్నుగా ఉంచి ఎద్దులను దూరంగా చెట్టుకు కట్టి ఆహారం, నీరు పెడతారు. 


అలాగే మనం ఏదైనా రాసేటప్పుడు వాక్యం మధ్యలో చిన్న పదం మర్చిపోతే ఆ రెండు పదాల దిగువ ^ గుర్తును పెట్టి మర్చిపోయిన పదాన్ని రాస్తాము. ఆ గుర్తునే హంస పాదం అంటాము. అది కాస్త వాడుకలో హంసపాదు అయ్యింది.

ఇలా ఏ పనైనా ప్రారంభించిన కొద్దిసేపటికే అవాంతరాలు ఏర్పడితే దానిని అది లోనే హంసపాదు అంటాము. ఈ పలుకుబడి అప్పటినుంచి వాడుకలోకి వచ్చింది.” అని ఓపికగా వివరించింది ముని మామ్మ. 


“భలేగా ఉంది మామ్మగారు” అని చప్పట్లు కొట్టాడు రుద్ర. ఇద్దరికీ చెరొక మినప సున్నుండ ఇచ్చింది సౌమ్య.


(తపస్వి మనోహరం అంతర్జాల వార పత్రికలో 18-5-2024 న ప్రచురితమైంది,)


Rate this content
Log in

Similar telugu story from Children