27.అమ్మా నాన్న - ఓ లెక్కల పుస్
27.అమ్మా నాన్న - ఓ లెక్కల పుస్


తల్లీ తండ్రీ....అనే బంధం బిడ్డలకు జన్మనిస్తే వచ్చేది. ఆ సంతోషం అంతా ఇంతా కాదు. బిడ్డల వల్ల కలిగిన ఆ ఆనందం ...ఆ బిడ్డల వల్లే వృద్దాప్యాన్న కోల్పోతామెందుకో అర్థంకాదెప్పటికీ...!!
ఆకాష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు....!
అలసటగా కుర్చీలో కూర్చున్న భర్తకు మంచి నీళ్ల గ్లాసు నందించి తానూ ఆ పక్కనే కూర్చుంది భూమిక.
పర్సు లోంచి ఆ నెల జీతమందుకున్న నోట్ల కట్టను తీసి భార్యకు అందిస్తూ...ఇదిగో ఎప్పట్లా నీ చేతిలో పెడుతున్నా... ఈనెల ఖర్చులు పోను మిగిలిన డబ్బును ఏ విధంగా ఆదా చేస్తావో చేయమంటూ ఆనెల తన బాధ్యతను నెరవేర్చాడు ఆకాష్.
భూమిక ఆడబ్బునందుకుని... చిన్నగా నవ్వింది. "మీరు అంతగా నాకు చెప్పాలటండీ..మీరు జీతం తెచ్చి నా చేతిలో పెడుతూ పదేళ్లుగా ఇదే మాట అంటున్నారు .ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసండీ." ఆ డబ్బును బీరువాలో భద్రపరుస్తూ చెప్పింది .
ఏ నెలకానెల సంపాదించే ఆకాష్ సంపాదన ఆ కుటుంబానికి ప్లస్(+) అనే అనుకోవాలి.
** ** **
"అమ్మగారూ... ఓ అయిదు వేలు అప్పివ్వరూ...? ఎప్పటిలాగే మళ్లీ అప్పు అడిగాడు పాలు పోసే రాముడు.
కాదనలేదు - తీసుకొన్న అప్పుకు ప్రతిఫలంగా వడ్డీతో సహా ఎప్పటికప్పుడు తీర్చేసే ఆరాముడంటే అభిమానం భూమికకు.
ఆపదలో ఆదుకునే భూమికకు దండం పెడుతూ ఆ డబ్బు తీసుకుని...సంతోషంగా వెళ్ళిపోయాడు రాముడు.
ఇలా ఆ రాముడు ఒక్కడే కాదు. చాలామంది భూమిక దగ్గరకొచ్చి అప్పు తీసుకుంటూనే ఉంటారు. సకాలంలో వడ్డీలు చెల్లిస్తూనే ఉంటారు. ఎంతో చాకచక్యంగా ఆమె వడ్డీ వ్యాపారం చేయగలుగుతుందంటే... ఆమె యందు అందరికీ భయభక్తులుండబట్టే.
నిజానికి ఆకాష్ కి అంతగా తెలివితేటలు లేవు . ఏదో చేతిలో ఉద్యోగం ఉండబట్టి ఆ నాలుగు రాళ్ళూ సంపాదించ గలుగుతున్నాడు. భూమిక తెలివైనది కాబట్టే పొదుపుగా ఖర్చు చేస్తూ ఏ నెలకానెల డబ్బును సేవ్ చేస్తుంది. ఈ విధంగా వ్యాపారం చేయబట్టి ... ఉండడానికి ఇల్లు.. బ్యాంకుల్లో డిపాజిట్లు...ఇళ్ల స్థలాలు... ఇలా కొంత ఆస్తి నంటూ సంపాదించ కలిగిన ఘనత ఆమెకే దక్కింది. భూమిక తెలివితేటల వల్ల సంపాదించిన ఆస్తి ఇంటూ(×) అనే చెప్పుకోవాలి.
** ** **
అమ్మాయికి - అబ్బాయి నచ్చాడు.
అబ్బాయికి - అమ్మాయి నచ్చింది.
ఎటొచ్చీ కట్నాల దగ్గర కూడా ఒప్పందం అయిపోతే వాళ్ళిద్దరి పెళ్లి జరిగి పోవచ్చు.
తమకున్న ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అబ్బాయిలు తర్వాత పుట్టిన ఓకే ఒక ఆడపిల్ల యైన శ్రీజకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ కన్నవాళ్ళ ఆత్రం.
అందుకే...ఏరికోరి ఆ సంబంధాన్ని ఎంచుకున్నారు.
మగ పెళ్ళి వారు కట్నం కొంచెం ఎక్కువే అడుగుతున్నారు . అయినా వాళ్ళు అడిగిన కట్నాన్ని ఇవ్వడానికే నిశ్చయించుకుని... తాంబూలాలు మార్చుకున్నారు.
ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసిన కూతురు మరో ఇంటికి కోడలై పుట్టింటికి దూరమైపోతుందంటే అంటే ఏ తల్లిదండ్రుల కైనా మనో క్షోభే. అత్తవారింట తమ కూతురు ఏ విధంగాను కష్టపడకూడదన్న ప్రేమ ఉండబట్టే ...వారడిగిన కట్నానికి లోబడిపోయి...మగపెళ్లి వారిని సంతోషపెట్టడానికే చూస్తున్నారు పిల్ల తల్లిదండ్రులు.
ఎలాగైతే ఆకాష్ మంచి ఉద్యోగస్థుడికే ఇచ్చి కూతురి పెళ్లి ఘనంగా జరిపించారు .
వారు సంపాదించుకున్న ఆస్తిలో కూతురు శ్రీజ పెళ్లి నిమ్మిత్తం మైనస్(౼) అనే చెప్పుకోవాలి.
** ** **
కొడుకులిద్దరికీ కూడా పెళ్లిళ్లయిపోయాయి. ఎవరి కట్నాలు వాళ్ళు దాచుకోవడమే కాదు...ఎవరి జీతాలు వాళ్ళు బ్యాంకుల్లో వేసుకుంటూ..పెళ్ళాం పిల్లలతో ఉమ్మట్లోనే జీవనం సాగించేస్తున్నారు.
ఇంటి ఖర్చులకు ఒక పైసా ఇవ్వకపోయినా..కొడుకులు కోడళ్ళు, మనుమలు మధ్య తమ జీవితం సాఫీగా సాగిపోతున్నందుకు సంతోషించారు.
ఆకాష్ రిటైరవ్వడంతో పాటూ...మనుషులు కూడా పెరగడంతో రాను రాను కలతలు ఆరంభమయ్యాయి. కొడుకుల మధ్య మనస్పర్థలు, తోటికోడళ్ల మధ్య కీచులాటలు మనుమల మధ్య కొట్లాటలు. ఆ ఇంట్లో ఇమడలేక ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టాలని నిశ్చయించుకుని ...తల్లి దండ్రులకు చెప్పుకున్నారు.
వారి నిర్ణయం తల్లిదండ్రులకు భాదనిపించినా...వారున్న ఆపరిస్థితిలో అదే మంచిదనిపించింది. వారికంటూ ఓ బాధ్యత తెలిసొస్తుందని "మీ ఇష్టం" అని అనగలిగారెలాగో మనసుని చంపుకుని.
అయితే మాకు ఆస్తి వాటాలు పంచమంటూ...చెరొక పక్కా కూర్చున్నారు కొడుకులిద్దరూ. వారు సంపాదించే దానితో.. కన్నవాళ్లను పోషించాల్సింది పోయి..తాము బ్రతికుండగానే...ఉన్న కాస్త ఆస్తినీ పంచుకోవాలనుకుంటున్న కొడుకులకు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.
తల్లిదండ్రులనుంచి ఏ సమాధానం రాకపోయేసరికి... నాకిది అంటూ ఉన్న ఆస్తిని చిటికెలో పంచేసుకున్నారు.
ఆకాష్ - భూమికలు కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులెంతో తెలివిగా డివైడిడ్బై(÷) చేశారనే చెప్పుకోవాలి.
** ** **
వ్యాపారం అన్నాకా లాభనష్టాలు తప్పవు .
జీవితమన్నాకా సుఖదుఃఖాలు తప్పవు.
ఈ జీవిత సత్యానికే రాజీ పడిపోయారిద్దరూ.
ఆస్తిని కొడుకులిద్దరూ పంచుకోగా...తమకంటూ శేషం సున్నా(0)గా మిగలడంతో తమకొచ్చే పెన్షన్తో ఓ చిన్న అద్దె ఇంట్లో వారి శేషజీవితాన్ని గడుపుతూ..తమ కుటుంబ గణితాన్ని లెక్కలేసుకుంటున్నారు ...ఆకాష్ దంపతులు.
భర్త సంపాదన ప్లస్ (+) అయితే...భార్య సమర్థత ఇంటూ(×). కూతురు పెళ్లి మైనస్ (౼) అయితే...కొడుకుల స్వార్థం డివైడిడ్బై (÷).
కుటుంబ గణితం అంటే ఇదేనేమో...అమ్మా నాన్నలైనందుకు ఓ లెక్కల పుస్తకమయ్యారు.
**** ****** *****
( విశాఖపట్నం AU ఆవుల జయప్రదాభవనమందు విక్రమ నామ సంవత్సర ఉగాది 2000 కథలపోటీలో బహుమతి పొందిన కథ. ) 09.9.2019.