"తోడు..!"
"తోడు..!"


"నేలకు నింగే రక్షణగా నిలుస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
నింగికి నేలకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
మబ్బును గాలే మోసుకెళ్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
గాలికి మబ్బుకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
నిప్పును నీరే చల్లారుస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
నీటికి నిప్పుకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
పిట్టకు చెట్టే నీడనిస్తున్నందుకు ఏర్పడిందో బంధం..!
చెట్టుకి పిట్టకి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
చీకటిని వెన్నెలే తొలగిస్తున్నందుకు ఏర్పడిందో బంధం...!
వెన్నలకి చీకటికి మధ్యనున్న ఆ అనుబంధం ప్రేమేనేమో..?
నేలకు నింగి తోడు,
మబ్బుకి గాలి తో
డు,
నిప్పుకి నీరు తోడు,
పిట్టకి చెట్టు తోడు,
చీకటికి వెన్నెలే తోడు.
నీకు తోడెవరు ..?
నీకా ప్రేమను పంచేదెవరు..?"
అంటూ నా మది నా ఎదను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే,
"తనవారు కాకపోయినా...
తనను నమ్ముకుని, తన ఒడికి చేరువైన వాటికే, ఈ ప్రకృతి తన తోడును పంచుతూ ఇంత ప్రేమను అందిస్తుంటే,
తనతోనే మమేకమై, తన నుండే జాలువారి, తన ఒడిలోనే సేదతీరుతున్న నాకు...
నా తల్లే ఆ ప్రకృతిలా
తన తోడును పంచదా?
తన ప్రేమను అందించదా?"
అంటూ నా ఎద నా మదికి బదులిచ్చింది.
- ఓ "అమ్మ"ర ప్రేమికుడు
- Satya Pavan Writings ✍️✍️✍️