తనలో నేను
తనలో నేను
అదే నేను
అదే నీవు
ఇలా అనుకోవడం బాగానే ఉంది
కానీ నిజం అందంగా ఉంటుందని భావించే శక్తే లేదు
గీతాలు పాడుకున్నాం
చేతి గీతలు నమ్ముకున్నాం
కానీ చివరికి ఏమైంది
వద్దులే
ఈ చివరికి ఏమైంది అని అడగడం కూడా విచిత్రమే
చివర అంటే దేని చివర
వర్షాకాలం జలుబులా నువ్వు గుర్తొస్తూ ఉంటే
ఏదో అయిపోతుంది అని పరుగెట్టమంటావా
ఆ చివరను అనుభవించి
మిగిలేది ఇదే అని రంకెలు వేయమంటావా
గొప్ప తపస్వి నేనని నటించలేని నేను
కోరికల కుహరాల్ని ఆఘ్రాణిస్తూ సంతృప్తి పడే నీవు
ఒకటి కాలేము
అయినా నాకు తెలీక అడుగుతా
ఇద్దరు ఒకటి కాకుండా ఒకటిగా ఉండలేరా
ఇదే ప్రశ్న ఎవర్నో అడిగితే నవ్వారు
ఎందుకు ఉండలేరూ అంటూ
కొన్ని దాంపత్యాల కథలు చెప్పాడు
వాటిలో వెతుక్కున్నా చివరికి అంటే ఏమిటని
అది మనం వేరు అనుకునే అబద్ధమని తెలిసింది
నీకెప్పుడు తెలుస్తుంది సఖీ..
