స్వాగతం..
స్వాగతం..
ఆశించను నేను
శిశిరంలో వసంతం రావాలని
కోరుకోను నేను
కోకిల సమూహాల పాటలు వినాలని
మనసు పడను నేను
మయూర నర్తనాలు చూడాలని
హితం లేదు నాకు
నే చూడని హంసలు
నా భుజంపై వాలాలని
ఇవ్వగలిగితే నువ్వు...
చాలు చాలు నాకు
చాటైన మానవత్వం
నింపగలిగితే మనిషిలో
చాలు చాలు నాకు
మరుగౌతున్న స్త్రీత్వం
మగువలో చూపగలిగితే
అమ్మత్వాన్ని అమ్ముకోకుండా
రెమ్మలా పచ్చగా ఉంచ గలిగితే
చాలు చాలు నాకు
చీకటి చాటున మూల్గుతున్న
అంగడిబొమ్మల గదులలొ
దీపం వెలిగించ గలిగితే
చాలు చాలు నాకు
ఆకలి చావుల అంకెలు తగ్గించ గలిగితే
చాలు చాలు నాకు
సామాన్యుని వంటగదిలో
గ్యాస్ స్టవ్వు వెలిగించ గలిగితే
కులాలు పోవు
మతాలు మరుగు కావు
కుల మత నాయకుల
రెచ్చగొట్టే వాచాలాన్ని తగ్గించ గలిగితే
చాలు చాలు నాకు
చేయగలవా చెప్పు
తప్పక నిన్ను స్వాగతిస్తా
నూతన వర్షమా
చిరునవ్వుతో
చేతులు జోడించి!
... సిరి ✍️
