అర్థరాత్రి వేళ
అర్థరాత్రి వేళ
నిశ్శబ్దపు గదిలో వినిపించే నీ అడుగుల చప్పుడు
ఎవరూ లేని చోట ఎవరో ఉన్నారన్న భ్రమ కాదు..
నా కడుపులోని ఆకలిని కనిపెట్టిన నీ అక్షయ పాత్ర!
పంచప్రాణాలు గాలిలో కలిసిపోయినా
పంచభూతాల్లో నీ రూపం కరిగిపోయినా
"అమ్మా" అన్న నా పిలుపులోని తడిని ఆరనివ్వలేదు
నువ్వు లేని శూన్యాన్ని భరించలేక నేను ఏడిస్తే
నా కన్నీటి చుక్కను తుడుస్తూ...
గాలిలో కలిసివచ్చావు ఓ మమతల సుగంధమై!
లోకమంతా నిద్రపోతున్నా...
నీ బిడ్డ ఆకలిని భరించలేక
కట్టెల పొయ్యి లేకపోయినా.. కంటికి కనిపించే రూపం లేకపోయినా..
నీ జ్ఞాపకాల వెచ్చదనంతో నా ఆకలిని చల్లార్చావు.
అమ్మ అంటే ప్రాణం పోసేది మాత్రమే కాదు..
ప్రాణం పోయాక కూడా బిడ్డ ప్రాణాన్ని కాపాడే "దైవం" అని
నీ ఆత్మ రూపంతో నిరూపించావు.
ముద్ద ముద్దకీ నీ ముద్దుల ముద్ర..
తల్లి లేని బిడ్డవు కావురా నువ్వు - నేను లేని చోటే లేదంటూ
నా బువ్వ గిన్నెలో.. నీ ప్రేమను వడ్డించి వెళ్ళావు!
అమ్మూ... నీ ప్రేమకు మరణం లేదమ్మా!
