శ్రమజీవులం మేం✊
శ్రమజీవులం మేం✊
శ్రమ జీవులం మేం✊
.......................
శ్రమ జీవుల మేం శ్రమ జీవులం
భగ భగ మండే ఎండలకు
గజగజ లాడే చలి గాలులకు
టప టప కురిసే వాన జల్లులకు
నక నకలాడే ఆకలి కడుపులకు
దోస్తులం మేము శ్రమ జీవులమ్
గటగట తాగే గొంతులకు
గబగబ నడిచే పాదాలకు
జలజల జారే కన్నీళ్లకు
బొటబొట కార్చే రక్తపు బొట్టు లకు
చిరునామాలు మేం.. శ్రమ జీవులం మేం
కుత కుత ఉడికే బియ్యాలకు
తళతళ మెరిసే ఇత్తడి పాత్రలకు
గల గల పారే సెలయేళ్లకు
కిలకిలమనే పక్షుల పలకరింపులకు
పుట్టినిల్లు మేం శ్రమ జీవులం మేం
పెళ పెళ లాడే కరెన్సీ నోట్లకు
ధగధగ మెరిసే బంగారాలకు
మిసమిస లాడే సౌందర్యాలకు
మిలమిల మెరిసే కాంతి కళ్
ళకు
చాలా దూరం మేం..శ్రమ జీవులం మేం
పొగలు చిమ్మే యంత్రాల్లో మేం
సెగలు కక్కే వంటశాలల్లో మేం
ఎత్తుకు ఎదిగే భవనాల్లో మేం
లోతుకు తవ్వే భూ గనుల్లో మేం
కడుపు నింపే క్షేత్రాల్లో మేం
బతుకునీడ్చే బండి చక్రాల్లో మేం
అనంతమైన కడలి లో మేం
అవాంతరాలు ఎన్నున్నా..అన్నింటా మేమే
శ్రమ జీవులం మేం
కష్టానికి కదిలిపోము..కన్నీళ్లకు బెదిరిపోము
కరములు కరుకేమో..గుండెలు కమలము
పేరుకు తక్కువేమో..ప్రేమకు యెక్కువే
మనసంటే ఎక్కడంటామెమో..
మానవత్వం అంటే ముందుంటాము
శ్రమ జీవులం మేం..
కలిసి మెలిసి గడిపే ఆత్మీయులం మేం
...రాజ్ తొర్లపాటి...